Previous Page Next Page 
చక్రవ్యూహం పేజి 19

    ఓ వెర్రి నవ్వింది అవనిని చూసి వసుధ.
    "ఏయ్...  ఎక్కడికెళ్ళావు?  నీ కోసం చూస్తే సీటులో లేవు"  అంది అవని.
    "హెడ్డేక్ గా వుంటే టాబ్లెట్  తెచ్చుకుందామని వెళ్ళాను.  ఇంతకీ బాస్ ఎందుకు పిలిచాడు?"   అడిగింది వసుధ.
    "ఆఫీసు ఇన్ ఛార్జీగా  నిన్ను నియమిస్తున్నాను.   ఈ నెల రోజులు నేను చెప్పినట్టు చేయమని అన్నాడు"  చెప్పింది అవని.
    "ఇదంతా ఎందుకు చేస్తున్నాట్టు?"  తనలో తాను గొణుక్కుంటున్నట్టు అంది వసుధ.
    "అదే నాకు అర్ధం కావడం లేదు"  మొహం అమాయకంగా పెట్టి అంది అవని.
    సరిగ్గా అదే సమయంలో ...
    ఇన్ స్పెక్టర్  బెనర్జీ,  వసుధ గదిలోకి ప్రవేశించాడు మారు తాళం చెవులతో.
     అతని దృష్టి ఆ గదిలో  ఓ మూలన వున్న పాత ట్రంకు పెట్టె మీద పడింది.  
    బెనర్జీ చేతులు చకచక కదులుతున్నాయి.  వసుధ బీరువా,  సూట్ కేసు  అన్నీ చూసాడు.
    అతనికి కావల్సిన  వివరాలు దొరకలేదు.
    చివరి ప్రయత్నంగా ఆ ట్రంకు పెట్టె  ఓపెన్ చేసాడు.  పైన  పాతకాలం పట్టుచీరలు,  వెండి వస్తువులు...  అడుగున ఓ ఫోటో వుంది.
    ఆ ఫోటో వంక పరిశీలనగా చూసాడు బెనర్జీ.   ఆ  పోటోలో ఏదో మిస్టరీ వున్నట్టు అనిపించింది.
    ఫోటోను  అటూ ఇటూ తిప్పి చూసాడు.  ఫ్రేమ్  కట్టబడి వున్న ఫోటో.
    ట్రంక్  పెట్టెలో  వున్న వస్తువులన్నీ కింద పేర్చాడు.  ట్రంకు పెట్టె అడుగు భాగంలో ఓ కవరుంది.
    కవర్ విప్పాడు.  అందులో మెడికల్ రిపోర్ట్స్ వున్నాయి.  ఓ చిన్న డైరి కూడా వుంది.
    ఆ కవర్ నీ తీసుకొని,  మిగతా వస్తువులు యాజ్ టీజ్  గా  సర్ది ట్రంక్ పెట్టె యథావిధిగా పెట్టి పైకి  లేచాడు బెనర్జీ.
    తర్వాత,  బయటకు వచ్చి తాళం వేసి కామ్ గా బయటపడ్డాడు.   తననెవరూ చూడలేదని  నిర్ధారించుకున్నాక.
    "సార్...  నేను జోషిని   మాట్లాడుతున్నాను."  ఇన్ స్పెక్టర్ బెనర్జీ పోలీస్ స్టేషన్ కు వచ్చాక,  జోషి ఫోన్ చేశాడు.
    "చెప్పండి జోషీ..  ఎనీ ప్రోగ్రెస్?"  అడిగాడు బెనర్జీ.
    "వసుధ మధ్యాహ్నం టెలిఫోన్ బూత్ లోకి వెళ్ళి ఎవరికో ఫోన్ చేసింది?"
    "ఆ  నెంబర్ నోట్ చేసారా?"
    "చేసాను సార్!"  అంటూ ఆ నెంబర్ చెప్పాడు.
    "వెరీగుడ్...  మీరు ఫెడ్రిక్ గారిని జాగ్రత్తగా  ఫాలో అవ్వండి.   అతనికేమైన  ప్రమాదం తలపెట్టే అవకాశం వుంది."
    "అలాగే సార్..."   అంటూ ఫోన్ పెట్టేసాడు జోషి.
    ఇన్ స్పెక్టర్ బెనర్జీ జోషి చెప్పిన  నంబర్ ఎవరిదో కనుక్కోమని కాని స్టేబుల్ కు  చెప్పాడు.
    పది నిముషాల్లో  ఆ నెంబర్ ఎవరిదో కనుక్కొని వచ్చాడు కానిస్టేబుల్.
    "సార్...ఆ నంబర్  మణిసింగ్ ది"  చెప్పాడు.
    "మణిసింగా?  అడ్రస్ కనుక్కున్నావా?"
    "కనుక్కున్నాను సార్.  డోర్ నంబర్ ఫిఫ్టీసిక్స్,  యం. ఎస్.  నగర..."  చెప్పాడు కానిస్టేబుల్.
    ఆ అడ్రస్ బెనర్జీ  మెదడులో   రికార్డయింది.
    "నీకస్సలు  బుద్ది వుందా?"  వసుధతో కోపంగా అన్నాడు ధీరజ్.
    "నేనేం చేసాను?"  మరింత కోపంగా అంది వసుధ.
    "కొంపలు  మునిగిపోయినట్టు ఫోనెందుకు చేసావు?  నిన్నెవరైనా వాచ్ చేస్తే?"
    "నన్నెవరు వాచ్ చేయలేదు"  ఉక్రోషంగా అంది.
    సాయంత్రం వసుధ,    ధీరజ్ లు  ఎవెన్యూ రెస్టారెంట్ లో  కలుసుకున్నారు.
    "పరిస్ధితులు మనకు ప్రతికూలంగా వున్నాయి.   మనం వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి" అన్నాడు.
    "అందుకే నిన్ను అర్జంటుగా రమ్మని ఫోన్ చేసాను.  అవని మీద కూడా నాకు డౌట్ వుంది.  తను డబుల్ గేమ్ ప్లే చేస్తున్నాదేమో"  అన్నది వసుధ...
    "నువ్వునుకున్నది నిజమైనా ఆశ్చర్యం లేదు.  ఎందుకైనా మంచిది మనం అవనిని కూడా హత్య చేయడం మినహా గత్యంతరం లేదు"  అన్నాడు ధీరజ్.
    "హత్య!?"
    "అవును...  ఫెడ్రిక్ ని చంపేయడానికి ముందు అవనిని కూడా హత్య చేయాలి.  నా అనుమానం నిజమైతే ఫెడ్రిక్ చనిపోతే,  మనకు కలిగే లాభం కన్నా,  అవని చనిపోతేనే మనకు లాభం ఎక్కవ."
    "అదెలా?"
    "ఫెడ్రిక్ తన ఆస్తిలో ముప్పావు వంతు భాగాన్ని అవని పేరు మీద రాయబోతున్నాడు.
    "నిజమా!"
    "ఫెడ్రిక్  లాయర్ కు ఇరవైవేలు ఆశ చూపితే చూచాయగా చెప్పాడు."
    "ఇప్పుడెలా?"
    "నీకు గుర్తుందా?  గొడౌన్ లో సరుకును డెలివరీ చేసేటప్పుడు నువ్వు కొన్ని పేపర్స్ అవనికి ఇచ్చి వాటి మీద డెలివరీ  అయినట్టు సంతకం పెట్టమన్నావు.
    వాటి మధ్య,  కొన్ని బ్లాంక్ పేపర్స్ వుంచాను.  అవని,  పేపర్ చివరలో గబగబ సంతకాలు  చేసుకుంటూ వెళ్ళింది.
    ఆ బ్లాంక్  పేపర్స్ తో  మనం ఏమైనా చేయొచ్చు."
    "నాకు తెలియకుండా ఈ పని ఎప్పుడు చేసావు?  నీతో  జాగ్రత్తగా వుండాలి"  నవ్వుతూ అంది వసుధ.
    లోలోపల  కోపంగా వుంది ఈ విషయం తనకు ఇప్పటి వరకూ చెప్పనందుకు.
    "మనం చేయాల్సిన పనులు రెండు.
    ఒకటి...  ఫెడ్రిక్ ఇంకా ఆస్తిని ఆవని పేరు మీద ట్రాన్స్ ఫర్ చేయకపోతే,  అతడ్ని చంపేయడం...
    ఆల్రెడీ ట్రాన్స్ ఫర్ అయివుంటే అవనిని హత్య చేయడం...విషయాలన్నీ నేను చూసుకుంటాను.  నువ్వు నిశ్చింతగా వుండు అన్నాడు.
    "అలాగే"  అంది ముక్తసరిగా వసుధ.
    ఫెడ్రిక్ ని  హత్య చేస్తే ఆ ఆస్తి తమకెలా లభిస్తుందని వసుధ ధీరజ్ ని  అడిగివుంటే కథ మరోలా మారి వుండేది.
   బెనర్జీ వసుధ ఇంట్లో ట్రంక్ పెట్టెలో దొరికిన కవరును టేబుల్ మీద పెట్టి,  అందులోని డైరీ  తీసాడు.
    ముత్యాల్లాంటి అక్షరాలు.
    డైరీ మొత్తం లో  కొన్ని పేజీలు , మాత్రమే రాసి వున్నాయి.
    డిసెంబర్ 1.
    నేను చాలా దురదృష్టవంతురాలిని.  ఆనందం,  విషాదం రెండు ఒకేసారి నా దగ్గరికి వచ్చి చేరాయి.  ఇన్నాళ్ళు నేను ఒంటరిదాన్ని,  నాకెవరూ లేరు అనుకునేదానిని.  నిన్ననే జార్జి అంకుల్ వచ్చారు.  నాకో అన్నయ్య వున్నాడట. మా నాన్నకు ఇద్దరు భార్యలట.  మొదటి  భార్య కు  ఓ కొడుకు,  ఓ కూతురు వున్నారట.
    రెండో భార్య కూతుర్ని నేనట.  అమ్మ చనిపోయాక నాకోసం వెతికాడట. ఈ విషయం   మా నాన్న మొదటి భార్య పిల్లలకు కూడా తెలియదట.
   జార్జి అంకుల్ ఈ విషయం చెప్పగానే ఎంత సంతోషం కలిగిందో... అమ్మ ఆయాగా పనిచేసి నన్ను పెద్దచేసి, చివరి క్షణాల్లో కూడా నాకీ నిజం చెప్పలేదు.  నాన్న గురించి ఎప్పుడు అడిగినా నవ్వి వూర్కునేది.
    జార్జి అంకుల్ మొత్తం చెప్పారు.  అమ్మను నాన్న ప్రేమించి,  రెండో పెళ్ళి చేసుకున్నా,  లోకానికి భయపడి దూరంగా వుంచారు.
    ఆత్మాభిమానం గల అమ్మ ఈ విషయాన్ని భరించలేక,  నాన్నకు దూరంగా నన్ను తీసుకెళ్ళి పెంచింది.  ఇప్పుడు అమ్మా, నాన్న లేరు.
    కానీ అన్నయ్య వున్నాడు.  ఆ అన్నయ్య పేరు ఫెడ్రిక్.
    బెనర్జీ కళ్ళు ఆశ్చర్యంతో మెరిసాయి.  అతని కళ్ళు అక్షరాల వెంట పరుగెత్తాయి.
    తీరా,  అన్నయ్యను  కలుసుకుందామని వెళ్ళేసరికి అన్నయ్య విషాదంలో నిండా మునిగిపోయి కనిపించాడు. అన్నయ్య చెల్లెలు (నాకూ  చెల్లెలవుతుంది)  రోజా చనిపోయింది.  ఎంత విషాదం.
    ఈ సమయంలో అన్నయ్యను ఎలా పలకరించను.
    జనవరి18
    అన్నయ్యను రోజూ చూసుకునేదానిని.  ఒక్కోసారి వెళ్ళి   ఓదార్చాలని  అనిపించేది.  ఇప్పుడు ఒంటరిదాన్ని.
    ఫిబ్రవరి 24
    ఈ రోజే ఓ విషాదకరమైన వార్త తెలిసింది.
    నాకు క్యాన్సర్ అని తెలిసింది.
    మార్చి 5   
    నేను ఎక్కవ రోజులు బ్రతకను. నా చివరి క్షణాల్లో అన్నయ్య దగ్గర వుండాలన్న కోరిక.  కానీ, మనసు ఒప్పుకోలేదు.  నీ చెల్లెలినే అన్నయ్యా అని చెప్పి సంతోష పెట్టి,  అంతలోనే నేను క్యాన్సర్ తో చనిపోతే...  ఎలాగూ పండుటాకులా రాలిపోయే నేను అన్నయ్యను ఎందుకు బాధపెట్టాలి.
    ఏప్రిల్9
    రోజు రోజుకి నా ఆరోగ్యం  క్షీణిస్తుంది.
    మాయా అనే అమ్మాయితో పరిచయం అయింది.
    నాతో పాటే నా రూంలో  వుంది.  అద్దె కడతానంది.  నాకు వెసులుబాటుగా వుంటుందని ఒప్పుకున్నాను.  నన్ను స్వంత సోదరిలా చూసుకుంది.
    మే1.
    నేను ఎక్కువకాలం  బ్రతకను.  మాయ ఉదయం వెళ్ళి ఏ అర్ధరాత్రో వస్తుంది.  వచ్చేటప్పుడు బోల్డు డబ్బుతో వస్తుంది.  బంగారం,  నోట్ల కట్టలు,  ఆమె సంపాదన చూస్తే నాకు ఆశ్చర్యమేస్తుంది.  ఇంత డబ్బు వుండి,  నాతో పాటు చిన్న గదిలో వుండడం  ఎందుకో...
    మే5,
    అన్నయ్యను చూడాలనిపించింది.  కానీ,  నా బాధ ఎవరితో చెప్పుకోను.   అందుకే  మాయితో  చెప్పుకున్నాను.    తను  ఆశ్చర్యపోయింది.'మీ   అన్నయ్యతో నేను మాట్లాడతాను'  అంది.  వద్దన్నాను. నేను మాయ కలిసి ఫోటో దిగాము.
    మే10.
    ఓ రోజు పోలీసులు మాయ కోసం వచ్చి వెళ్ళారు.  నాకు అనుమానం వచ్చి మాయని నిలదీసాను.  తను ఏ సమాధానం చెప్పకుండా వెళ్ళింది. మాయ మీద నాకు అనుమానం కలుగుతోంది.
    మే11.
    మాయ ఈరోజు  కూడా రాలేదు.  ప్రభూ...  వచ్చే జన్మలో నన్ను సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా ఫెడ్రిక్ అన్నయ్యకు చెల్లెలుగా పుట్టించు... నేను ఎక్కువ రోజులు...ఉహూ...గంటలు కూడా బ్రతక్కపోవచ్చు.  ఇదే నా చివరి పేజి కావచ్చు.
    అన్నట్టుగా ఆ పేజి తర్వాత ఏమీలేదు.
    ఇన్ స్పెక్టర్  బెనర్జీ మెదడు తీవ్రంగా ఆలోచిస్తుంది.  ఆ ట్రంక్ పెట్టె వసుధ అనే అమ్మయిదని తెలిసింది.  అంటే ఇప్పడున్న వసుధ...
    ఆ కవర్ లో వున్న రిపోర్టు చూసాడు.
    రిపోర్ట్ రాసిన డాక్టర్ పేరు చూసాడు.
    రంగనాధం,  థర్డ్ క్రాస్ రోడ్ అని వుంది.
   "ఓహ్... వసుధ... ఐనోహర్ వెరివెల్.   ఇన్ స్పెక్టర్... తను చనిపోయే వరకూ నా పెషేంటే.  చాలా అందంగా వుండేది.  ఆ దేవుడు త్వరగా తన దగ్గరకు రప్పించుకున్నాడు.  తను నా క్లినిక్ లోనే చనిపోయింది"  చెప్పాడు డాక్టర్ రంగనాధం.
    "ఎప్పుడో చెప్పగలారా  డాక్టర్?"  బెనర్జీ అడిగాడు.
    డాక్టర్ పాత రిపోర్ట్స్ తెప్పించాడు.
    "మే థర్టిన్  త్...
    ఆ రోజు  తను అతి కష్టమ్మీద  నా క్లినిక్ కు వచ్చింది.  తను సామాన్లు అన్నీ అమ్మేసిందట.  ఒక ట్రంక్ పెట్టె తప్ప,  తన ఆస్తి ఏమి లేదని,  నాచేతిలో కొద్దిపాటి డబ్బు పెట్టింది.  మీరు నమ్మరుగానీ, నాకు ఏడుపు వచ్చేసింది. చనిపోయే ముందు కూడా ఎంత గుండె నిబ్బరమో...  ఆ రోజు తన ప్యూనరల్ కు నాకిచ్చిన  డబ్బు ఇంకా నా దగ్గరే వుంది.  మధ్యాహ్నం మూడు గంటలకు... షి వాజ్ నో మోర్"  డాక్టర్ కంఠం రుద్ధమైంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS