Previous Page
చక్రవ్యూహం పేజి 20

    "థేంక్యూ డాక్టర్.."  అని లేచాడు  బెనర్జీ.
    బెనర్జీ మనసులో వున్న ఒక్కో అనుమానంపోర విడిపోతున్నాది.  వసుధ చనిపోయింది.
    వసుధతో పాటు దిగిన మాయ ఫోటో వైపు చూసాడు.  వసుధ పోలికలు కొన్ని మాయలో కనిపిస్తున్నాయి.
   బస్ స్టాప్ లో  నిలబడి వుంది వసుధ.
    ధీరజ్ వెళ్ళిపోయాక,  ఆటో కోసం చూసింది.
    ధీరజ్ తనని స్కూటర్ మిద దిగబెడతానన్నా  తనే వద్దంది. ఆటోలు రావడంలేదు.  స్ట్రయికని తెలిసింది.
    బస్సులు రావడం లేదు.  రాత్రి కావడం వల్ల,  అందులోనూ చలికాలం కావడంవల్ల బస్టాప్ నిర్మానుష్యంగా వుంది.
    ఇంతలో ఓ దృఢకాయుడు  అక్కడికి వచ్చాడు.  తాగి వున్నట్టుంది అతని వాలకం.
    "ఏయ్ పిల్లా వస్తావా?"  అడిగాడు వసుధని.
    వసుధ మొహం కోపంతో ఎర్రబడింది.
    "ఏయ్..  వళ్ళు ఎలా వుంది?"  తన కాలికి వున్న చెప్పు తియబోతూ అడిగింది.
    "ఏంటే... తెగ రెచ్చిపోతున్నావు?"   అంటూ  ఠకీమని  బొడ్లో నుంచి కత్తి తీసాడు.
    వసుధ భయపడిపోయింది.  తను బెదిరిస్తే బెదిరిపోతాడేమోననుకుంది. చుట్టూ చూసింది. జనం కూడా ఎక్కువగా లేరు.
    "ఏయ్...  ఏం చేస్తావు?  అరుస్తాను...  అరిచానంటే జనం వచ్చి నిన్ను తుక్కు కింద కొట్టేస్తారు తెలుసా" పైకి   గాంభీర్యం నటిస్తూ అంది లోపల భయపడుతూనే.
    "ఏదీ అరువు చూద్దాం..."  అంటూ చేతిలో వున్న కత్తితో వసుధ చేతి మీద గాయం చేసాడు.  గట్టిగా అరిచింది వసుధ.
    జనం గుమిగూడడంతో  ఆ దృఢకాయుడు జారుకున్నాడు.
    "ఏమైందమ్మా..."  అంటూ జనం వచ్చేసారు.  చేయి గీరుకుపోయి రక్తం కారుతుంది.
    "ఎవడో బెదిరించాడు"  అంది బాధను పళ్ళు బిగువున భరిస్తూ...
    జనం ఎంత వెతికినా కనిపించలేదు.
    ఆ దృఢకాయుడు- జోషి.
    వసుధ,  కర్చీఫ్ ని  చేతికి కట్టుకుంది.
   "సార్...  బ్లడ్ రిపోర్ట్ వచ్చింది.  రౌడీలా వెళ్ళి బెదిరించాను.  ఏ మాత్రం అనుమానం రాలేదు.  కత్తితో మెల్లిగా చిన్న గాయం చేసాను...  పెద్ద ప్రమాదం ఏమీ వుండదు.  కత్తికి అంటిన రక్తాన్ని లాబ్ కు పంపించాను.
    ఆమె రక్తం గ్రూప్ 'బి'."  అంటూ బ్లడ్ రిపోర్ట్ ఇచ్చాడు జోషి.
    బెనర్జీ అభినందన పూర్వకంగా చూసాడు జోషివైపు.
    "వెరీ గుడ్... చెప్పిన  పని...  చాలా పర్ ఫెక్ట్ గా చేసారు."
    "థేంక్యూ సార్... ఇట్స్ మై డ్యూటీ"  అన్నాడు వినయంగా జోషి.
    బెనర్జీ వెంటనే వసుధ బ్లడ్ రిపోర్ట్ తీసి చూసాడు.  వసుధ ది 'ఏ' గ్రూప్.
    మిస్టరీ మెల్ల మెల్లగా విడిపోతున్నట్టు  అనిపించింది. ఇప్పుడున్న అమ్మాయి వసుధ కాదు.  ఆ పేరు పెట్టుకున్న మాయ.
   అవని పేపరు చదువుకుంటున్నది.
    అప్పటికే అందరూ అన్నాలు తిని పడుకున్నారు,  డుంబు హాయిగా నిద్రపోతున్నాడు.
    సరిగ్గా అప్పుడు ఫోన్ మోగింది.
    అవని ఫోన్ ఎత్తింది.
    "డబుల్ గేమ్ ఆడుతున్నావా?  మర్యాదగా ఈ ఊరు వదిలి వెళ్ళిపో...  లేదంటే నీ కుటుంబం మొత్తం  బాంబు పేలుడులో చనిపోతుంది"  అటువైపు నుంచి అదే బొంగురు గొంతు.
    "చాలా సంతోషం...  ఆ పని చెయ్... నీ గురించి మొత్తం తెలిసిపోయింది.  నువ్వు ఫెడ్రిక్ వని తెలిసాక కూడా ఇంకా నాటకాలెందుకు?"  కావాలనే అంది అవని.
    "నేను......నేను ఫిడ్రిక్ నా?"
    "కాదా......మరి......ఇందాకే ఫోన్ చేసి అంతా మరిచిపో.....అవనీ....అన్నావు.....మరిప్పుడు ఇదేంటి? ఇలా చేస్తే మీరు చెప్పిన నాటకం ఆడను" బింకంగా అంది అవని.
    వెంటనే ఫోన్ డిస్ కనెక్ట్ అయింది.
    అబ్జర్వేషన్ లో ఉంచబడ్డ ఆ ఫోను.......ద్వారా చకచకా వివరాలు బయటకు వచ్చాయి.
    ఆ ఫోన్ యం.యస్. నగర్ నుంచి అని, ఆ ఫోన్ ఓనర్ మణిసింగ్ అని, డోర్ నెంబర్ ఫిప్టీసిక్స్ అని తెలిసింది. బెనర్జీ రంగాన్ని సిద్ధం చేసాడు.
    "యస్......ఇన్ స్పెక్టర్.....ఈ అమ్మాయికి ప్లాస్టిక్ సర్జరీ చేసింది నేనే..... బట్......ఈ కేసు విషయంలో నన్ను కోర్టుల చుట్టూ తిప్పొద్దు. డబ్బు ఆశపడి, ఈ కేసును అనఫీషియాల్ డీల్ చేసాను. ఈ అమ్మాయితో పాటు మరో వ్యక్తి కూడా వచ్చాడు" చెప్పాడు ఆ సర్జన్.
    ఇన్ స్పెక్టర్ బెనర్జీ, సిటీలో ప్లాస్టిక్ సర్జరీ చేసే డాక్టర్స్ లిస్ట్ తయారుచేసి విడివిడిగా బెదిరించి కొందరిని పోలయిట్ గా మరికొందర్ని ఇంటరాగేట్ చేశాడు.
    చివరికి ఓ సర్జన్ అసలు విషయం చెప్పాడు. మాయకు తనే ప్లాస్టిక్సర్జరీ చేసినట్టు ఒప్పుకున్నాడు.
    వసుధ తీవ్రంగా ఆలోచిస్తోంది.
    ఆమెకు ధీరజ్ మీద అనుమానం క్షణ క్షణానికి పెరిగిపోతుంది.తనకు తెలియకుండా అవనితో అతను బ్లాంక్ పేపర్స్ మీద సంతకం పెట్టించుకున్నాడు.
    తనని కూడా మోసం చేస్తాడా.
    తనతోపాటు, మోసాలు, దొంగతనాలు చేసిన ధీరజ్ లో మార్పు కనిపిస్తోంది. అతనికి డబ్బు మీద ఆశ పెరిగిపోతున్నది.
    పోలీసులు తనని వెంటాడుతున్నారన్న విషయం తెలుసుకొని తను వసుధ ఇంట్లో తల దాచుకుంది.
    కానీ వసుధకు కూడా అనుమానం వచ్చింది. అప్పుడే తను తప్పించుకుంది. ఆ తర్వాత వసుధ చనిపోయిందని తెలుసుకుంది. 'నా' వాళ్ళు అనే వాళ్ళేవరూ లేని వసుధ రూపంలోకి తను మారింది.
    తను ఫోటోలు అన్నీ పోలీస్ స్టేషన్స్ కి పంపించబడ్డాయి. తను రూపురేఖలు శాశ్వతంగా మార్చేసుకుంటే  తప్ప లాభం లేదు.
    తనకూ వసుధకు రూపు రేఖలు కలుస్తాయి. తను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని.....వసుధ చనిపోయాక తను వసుధ అవతారం ఎత్తింది.
    మాయ నుంచి వసుధగా మారింది. చిల్లర దొంగతనాలు, మోసాలుకన్నా ,ఫెడ్రిక్ ఆస్తికే కన్నం వేయాలని ప్రయత్నించింది.
    తనే వసుధ అని చెప్పి ఫెడ్రిక్ ని నమ్మించాలనుకుంది. అలాకాదు మొత్తానికే ఫెడ్రిక్ ని లేపేసి ఆ ఆస్తి దక్కించుకుందామన ధీరజ్ చెప్పాడు.
    తీరా, అతడ్ని చంపాలనుకున్న సమయంలో ఫెడ్రిక్ ఆస్తి అవని పేరు మీద రాయబోతున్నట్టు తెలిసింది.
    మాయ ఆలోచనలో పడిపోయింది.
    ధీరజ్ ఎంతవరకు నమ్మొచ్చు.
    ఫెడ్రిక్ చంపేస్తే ఆస్తి మొత్తం తమదవుతుందని చెప్పాడు ధీరజ్. కాని ఎలా?
    సరిగ్గా.....అప్పుడే ఫోన్ మోగింది.
    "హలో" అంది రిసీవర్ ఎత్తి.
    "హలో మిస్ మాయా....."
    ఉలిక్కిపడింది వసుధలా అప్పటివరకు అందర్నీ నమ్మించిన మాయ.
    "భయపడకు.....నేనూ నీలా ఒకప్పుడు పెద్ద ఛీట్ ని. నువ్వు ధీరజ్ ని నమ్మి నిండా మునిగిపోతున్నావు. పిచ్చి మాయా వసుధ వేషం వేసిన నువ్వు నేనే వసుధను అని ఫెడ్రిక్ తో చెబితే ఆస్తిలో సగం దక్కేది. ధీరజ్ మాటలు విని భ్రమలో వున్నావు.
    నీకో విషయం తెలుసా మిస్ మాయా, ధీరజ్ ఫెడ్రిక్ ను చంపితే, నీకేంటి లాభం? ఫెడ్రిక్ ఆస్తి మొత్తం నీకెలా వస్తుంది?
    ఆలోచించు మాయా......నీకో షాకింగ్ విషయం చెప్పనా? ఫెడ్రిక్ తన ఆస్తిలో కొంత భాగాన్ని రెండు నెలల క్రితమే ఓ ఆశమానికి రాసేసాడు.
    ఆ ఆశ్రమం ఎవరిదో తెలుసా......కృ....ష్ణ.....శ....ర్మ."
    మాయ చేతిలోని  రిసీవర్ కిందికి జారిపోయింది.
    "హ..లో..హ..లో.. హ.. లో..."
     మాయ ఆలోచిస్తోంది.
    ఫెడ్రిక్ తన చెల్లెలు చనిపోవడం తో   డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన విషయం నిజమే.
    అప్పడే అతను ఆశ్రమాల వెంట తిరిగాడు.
    అలాంటి సమయంలోనే అతను తన ఆస్తిని ఆశ్రమానికి రాసి వుండొచ్చు. అది కాదు ఆమె ఆలోచిస్తోన్న విషయం.
    ఆ ఆస్తిని  కృష్ణశర్మ ఆశ్రమానికి  రాయడం,  ఆ కృష్టశర్మే  ధీరజ్.
    అంటే...తనతో ధీరజ్ డబుల్ గేమ్  ఆడుతున్నాడు.  అందుకే,  ఫెడ్రిక్ ను చంపాలని తోందరపడుతున్నాడు.
     ఫెడ్రిక్ చంపితే కృష్ణశర్మ  ఆశ్రమానికి అతని ఆస్తి మొత్తం  లభిస్తుంది.
    ఆ విషయం కృష్ణశర్మ తన నుంచి దాచి,  మోసం చేసాడు.  ఆశ్రమాన్ని మూసేస్తున్నట్టు చెప్పాడు.  ఆశ్రమం నష్టాల్లో వుందని చెప్పాడు.  అప్పటికే ఆ ఆశ్రమం మీద పొలీసు రెయిడింగ్ జరగడంతో,  కృష్ణశర్మ తన గెటప్ మార్చి ప్లాస్టిక్ సర్జరీతో రూపాన్ని మార్చుకొని ధీరజ్ గా మారాడు.
    తనతో చేతులు కలిపినట్టు  నాటకమాడి తననే మోసం చేయాలని చూసాడు.
    మాయ ఓ నిర్ణయానికి వచ్చింది
     "మీరు చెప్పేది నిజమా?  వణుకుతోన్న గొంతుతో అడుగాడు ఫెడ్రిక్.
    "నిజమే...  మీ నాన్నకు ఇద్దరు భార్యలున్న విషయం మీక్కూడా తెలియకపోవచ్చు.  మిమ్మల్ని కలుసుకోవాలని  ఎంతో తపన పడింది.  అసలే మీరు మీ చెల్లెలు చనిపోయిన విషాదంలో వున్నారు.  తనని కబళిస్తోన్న   క్యాన్సర్ ముందు ఓడిపోయింది.
    మీకు నుజం చెప్పకుండానే చనిపోయింది."  బాధగా చెప్పాడు బెనర్జీ.
    "చూశారా ఇన్ స్పెక్టర్...  విధి నాతో ఎలా ఆడుకుంటుందో...ఓ చెల్లెల్ని ప్రమాదంతో దూరం చేస్తే,  మరో చెల్లెల్ని అనారోగ్యంతో దూరం చేసాడు" అన్నాడు ఫెడ్రిక్.
    "మీ చెల్లెలులా  ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న వసుధ అసలు పేరు మాయ.  క్రిమినల్స్ లిస్ట్ లో ఆమె పేరు ముందే వుంటుంది.  మీ ఆస్తిని కాజేయడానికి,  మాయ,  ధీరజ్ తో చేతులు కలిపింది"  అన్నాడు బెనర్జీ.
    "ధీరజ్?!  ధీరజ్ ఎవరు?"
    "మీరు మీ చెల్లెలు చనిపోయినప్పుడు కొన్నాళ్ళు డిప్రెషన్ లోకి  వెళ్ళిపోయారు.  ఆ విషయం మరిచిపోయారా?"
    "అవును...  గుళ్ళు..  గోపురాలు...  ఆశ్రమాలు కూడా తిరిగాను."
    "కృష్ణశర్మ   ఆశ్రమంలో కూడా కొన్నాళ్ళున్నారు కదూ."
    "అవునవును."
    "ఆ విషయం మరిచిపోయారా?  నాతో చెప్పనేలేదు."
    "అది అంత ఇంపార్టెంట్ అనుకోలేదు.  ఆ ఆశ్రమంలో మనశ్శాంతిగా వున్నట్టనిపించింది. ఆ ఆశ్రమానికి నా ఆస్తిలో కొంత భాగాన్ని రాసాను. కానీ, ఆ తర్వాత ఆ ఆశ్రమం మీద పోలీసులు రైడింగ్  చేసారని తెలిసాక...  మా లాయర్ తో ఈ విషయం కూడా చెప్పాను."
    "కానీ,  ఇంకా మీ ఆస్తిలో కొంత భాగం కృష్ణశర్మ ఆశ్రమం పేరుతోనే వుంది కాదూ."
    "ఉంది...కానీ దాన్ని వెంటనే మార్చేస్తున్నాను."
    "అక్కడే మీ మీద హత్యా ప్రయత్నానికి పునాది పడింది."
    "ఏంటి మీరనేది?"
    "మీరెప్పుడైతే   మీ ఆస్తిని కృష్ణశర్మ ఆశ్రమానికి రాసారో...  అప్పడే కృష్ణశర్మ  తన ఆశ్రమాన్ని ఎత్తేద్దామనుకున్నాడు.  ఈలోగా ఆ ఆశ్రమం మీద పోలీసులు రెయిడింగ్ జరిగింది.  కృష్ణశర్మ ధీరజ్ గా మారాడు.
    కానీ మీర్రాసిన ఆస్తి మాత్రం ఇంకా ఆ ఆశ్రమం పేరు మీదే వుంది.  మీరు మనసు మార్చుకొని,  ఆస్తిని ఆశ్రమం పేరు నుంచి మార్చేస్తారని భయపడ్డాడు ధీరజ్.  ఈలోగా మిమ్మల్ని చంపాలని నిర్ణయించుకున్నాడు.
    "మైగాడ్...  నా వెనుక ఇంత కుట్ర జరిగిందా?"
    "అవును... ఆ తర్వాత మీరు మీ ఆస్తిని అవని పేరు మీద రాయాలని నిర్ణయించుకున్నారని తెలిసినప్పుడు,  ఆమెను హత్య చేస్తానని బెదిరించి మీ నుంచి దూరం చేయాలనుకున్నాడు."
    "ఇన్  స్పెక్టర్  ఈ డబ్బు ఎంత పాపిష్టిదో చూసారా?"  బాధగా అన్నాడు ఫెడ్రిక్.
    "డబ్బు పాపిష్టిది కాదు సార్.  ఈ మనుష్యుల మనసులే పాపిష్టివి...  డబ్బుకోసం ఎంతటి ఘాతుకానికైనా వెనుకాడరు. మనం సృష్టించిన డబ్బే,  మనల్ని,  ఒకరినొకరు చంపుకునేలా చేస్తుంది."
    "ఇప్పుడు నన్నేం చేయమంటారు ఇన్ స్పెక్టర్?"
    "మిమ్మల్ని  హత్య చేయడానికి ధీరజ్ ప్రయత్నిస్తున్నాడని సృష్టమైంది. ధీరజ్ 'మణిసింగ్' పేరుతో మధ్యప్రదేశ్ లో నేరాలు చేసాడు. ఆ తర్వాత తన రూపు రేఖలు మార్చుకుని కృష్ణశర్మ పేరుతో ఆశ్రమం నడిపించాడు.
    ఆ తర్వాత ధీరజ్ పేరుతో మరో అవతారం ఎత్తాడు.  ఇన్ని అవతారాలు ఎత్తింది కేవలం డబ్బుకోసమే."
    "ఇన్ స్పెక్టర్... హాయిగా ఏ అరణ్యాలకో వెళ్ళి బ్రతకాలనిపిస్తోంది" అన్నాడు ఫెడ్రిక్.
    "అలా డీలా పడిపోకండి.  ఇవాళ్టితో  మీ సమస్యలు తీరిపోతాయి" చెప్పాడు బెనర్జీ.
    "థేంక్యూ ఇన్ స్పెక్టర్"  అన్నాడు సిన్సియర్ గా ఫెడ్రిక్.
    ఈలోగా జోషి వచ్చి,
    "సార్... మాయ,  ధీరజ్ దగ్గరికి బయల్దేరింది"  చెప్పాడు.
    "దట్స్ గుడ్.  మీరా ఇంటిని వాచ్ చేయండి.  ఈలోగా నేను పోలీసులతో ఆ ఇంటికి చుట్టుముడతాను"  చెప్పాడు బెనర్జీ.
     "హలో ధీరజ్.."
    తలుపు తోసుకుని వచ్చిన మాయని చూసి షాక్ తిన్నాడు ధీరజ్.
    "అదేంటి ధీరజ్ ఆశ్చర్యపోతావు...  నేనేమైనా రాకూడని సమయంలో వచ్చానా?"  అంది మాయ.
    "ఛ..  ఛ...  అదేంటి మాయా.. అలాగంటావు...  ఫెడ్రిక్ ఎలా చంపాలా?  అని ప్లాన్ వేస్తున్నాను. అవని చాలా కన్ ప్యూజింగ్ గా మాట్లాడింది.  వెంటనే ఎంక్వయిరీ మొదలెట్టాను.  అవని డబుల్ గేమ్ ఆడుతున్నదని అర్ధమైంది.  ఫెడ్రిక్ ను చంపడమే మిగిలింది.
    "అవనిని,  ఫెడ్రిక్ ని ఒకేసారి చంపడానికి ప్లాన్ వేసాను.  ఇవ్వాళ రాత్రే ముహూర్తం"  అన్నాడు ధీరజ్ ఉరఫ్ కృష్ణశర్మ,  ఉరఫ్ మణిసింగ్.
    "వెల్ సెడ్... వెల్ సెడ్ ధీరజ్..  ఈ హేపీ అకేషన్ ని ఈ విస్కీతో ఎంజాయ్ చేద్దాం."
    "విస్కీనా?"
    "అవును ఫ్రెండ్...  చాలా రోజులైంది కాదూ...  మనం మందు ముట్టుకోక.. అఫ్ కోర్స్... నువ్వు అప్పడప్పడు  టచ్ చేస్తున్నావనుకో"  అంటూ తన హ్యండ్ బ్యాగ్ లో నుంచి విస్కీ బాటిల్ తీసింది.
    టీపాయ్  మీద వున్న రెండు గ్లాసుల్లోకి విస్కీని వొంపింది.
    "రా అయితే బావోదు...నేను సోడా తెస్తానుండు"  అంటూ లోపలి గదిలోకి వెళ్ళాడు.
    ధీరజ్ అటు వెళ్ళగానే తన హ్యండ్ బ్యాగ్ లో వున్న పాయిజన్ సీసా తీసి,  అందులోని విషాన్ని ధీరజ్ గ్లాసులోకి ఒంపింది.
    ధీరజ్ ఫ్రిజ్  ఓపెన్ చేసి,  అందులో నుంచి రెండు బిస్లరీ సోడాలు  తీసాడు.  ఓపెనర్ తో ఓపెన్ చేసాడు.
    ఫ్రిజ్ కు పక్కనే వున్న ఓ చిన్న ప్యాకెట్ తీసుకున్నాడు.
    అతని పెదవుల మీద క్రూరమైన నవ్వు.
    'మాయా...  ఈ రోజుతో నువ్వు ఫినిష్.  ఈ పాయిజన్ ని సోడాలో కలిపి,  విస్కీలో కలిపితే,  నీ గొంతులోకి దిగిన విస్కీ,  నీ ప్రాణాలనే తీస్తుంది. గుడ్ బై .. గుడ్ బై మై ఫ్రెండ్...  ఫర్ ఎవర్'  మనసులో అనుకొని ఓ బిస్లరీ సోడా బాటిల్ లో పాయిజన్ ఒంపాడు.
    హాలులోకి వచ్చి,  విషం కలిపిన బిస్లరీ సోడాని మాయ విస్కీ గ్లాసులో పోసాడు.
    "తీసుకో ఫ్రెండ్...  ఛీర్స్..."   అంది మాయ అదోలా మత్తుగా చూస్తూ...
    "ఛీర్స్"  అన్నాడు ధీరజ్.
    "నువ్వు చాలా తెలివైన  వాడివి ధీరజ్.  ఫెడ్రిక్ నీ ఆశ్రమానికి ఆస్తి రాసిచ్చాడట కదా"  మూడో రౌండ్ పూర్తి అవుతుండగా అంది మాయ.
    ఒక్కక్షణం గతుక్కుమన్నాడు.
    "ఏంటి ధీరజ్...  నన్నే మోసం చేస్తావా?  తప్పు కదూ!"  అంది హస్కీగా.
    "మోసమేంటి ఫ్రెండ్...  ఈ ప్రపంచమే పెద్ధమోసం"  ధీరజ్ అన్నాడు.  అతను తూలుతూనే వున్నాడు.
    "యూ..  ఛీట్..  నన్ను మోసం చేసావు కదూ"  సడన్ గా గొంతు పెంచి అంది మాయ
    "ఏయ్..ఏంటే వాగుతున్నావు?"  ధీరజ్ గొంతు పెరిగింది.
    "హుష్... అరవకు.. నన్నే మోసం చేస్తావా? నీపని ఫినిష్... నిన్ను చంపి ఆ తర్వాత ఫెడ్రిక్ దగ్గరికి వెళ్ళి నేనే నీ చెల్లెలు వసుధనని చెప్పి ఆస్తినంతా నేనే అనుభవిస్తాను.  గుడ్ బై మై ఫ్రెండ్.. సారీ...  గుడ్ బై మై డియర్ ఎనిమీ"  అంది మాయ.
    "నాకు నువ్వు గుడ్ బై చెప్పడం కాదు.  నీకు నేను గుడ్ బై చెబుతున్నాను. నీకు తెలుసా...  నువ్విప్పుడు తాగింది మామూలు విస్కీ అనుకుంటున్నావా?  కాదు.. విషం కలిపినా విస్కీ" అన్నాడు.
    "వి..ష..మా?"  మాయ గొంతులో భయం.
    "యస్..  పా.. యి..జ..న్... పాయిజన్ కలిపినా విస్కీ."
    "యూ.. డర్టీ రోగ్ ... నన్ను చంపాలని ప్రయత్నిస్తావా? నా కన్నా ముందు నువ్వె ఛ..స్తా..వు..  నీ గొంతులో దిగిన విస్కీలో కూడా విషం వుంది"  అంది.
    అప్పటికే విషం ధీరజ్ శరీరంలో ప్రవేశించింది.
    నురగలు కక్కుతోంది మాయ
    కొద్ది క్షణాల్లో ఇద్దరూ నురగలు కక్కుకున్నారు.
    వాళ్ల ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి.
     ఇన్ స్పెక్టర్ బెనర్జీ ధీరజ్ ఇంటి తలుపు తట్టాడు.  లోపల్నుంచి  గొళ్ళెం పెట్టివుంది.
    "మిష్టర్ ధీరజ్ ఓపెన్ ద డోర్"  అరిచాడు బెనర్జీ.
    లోపల్నుంచి సమాధానం రాలేదు.  మళ్ళీ అరిచాడు బెనర్జీ.  నో రెస్పాన్స్.
    "సమ్  ధింగ్ రాంగ్!   తలుపుల్ని బాధ్ధలుకొట్టండి"  ఆదేశించాడు కానిస్టేబుళ్ళని బెనర్జీ.
    కానిస్టేబుళ్ళు తలుపులు విరగ్గొట్టి లోపలికి అడుగు పెట్టారు.
    నురగలు కక్కుకొని నేలమీద పడి వున్న మాయ,  ధీరజ్ మృత కళేబరాలు కనిపించాయి.
"సారి...ఇన్స్పెక్టర్... వాళ్ళు చనిపోయారు.  విస్కిలో కలిపిన  విషం తాగారు"  చెప్పాడు డాక్టర్ ధీరజ్ ని,  మాయని పరిక్షించి.
    "ట్రాజెడీ.. డబ్బుకోసం ఇద్దరూ చేతులు కలిపి,  చెడు మార్గంలో ప్రయాణించి,  చివరకి ఒకరిని మరొకరు అనుమానించుకొని, ఒకరినొకరు మోసం చేసుకొని చచ్చారు" అన్నాడు బెనర్జీ.
     అంగరంగ వైభావంగా అవని,  అనిరుద్రల పెళ్ళి జరిగింది.
    రిసెప్షన్ కు ఛీప్ గెస్ట్ ఇన్ స్పెక్టర్ బెనర్జీ. ప్రత్యేక అతిథి జోషి.  రిసెప్షన్ పెద్ద ఫెడ్రిక్.
    రమేష్ అందర్నీ పేరు పేరునా పలకరిస్తున్నాడు.
    "ఆపరేషన్ మర్డర్ ముగిసింది.  ఆపరేషన్ హనీమూన్ కు నూతన దంపతులను పంపించడమే మా డ్యూటీ"  అన్నాడు బెనర్జీ ఫెడ్రిక్ తో.
    "వాళ్ళ హనీమూన్  స్విట్జర్లాండులో    ఏమంటావమ్మా"  అడిగాడు ఫెడ్రిక్.
    "మీ ఇష్టం అన్నయ్యా"  అంది అవని సిగ్గుగా.
    డుంబు చప్పట్లు కొట్టాడు.
    ఆ దృశ్యాన్ని సూర్యనారాయణ,  మహాలక్ష్మి ఆనందంగా చూస్తున్నారు.
    ఇప్పడా ఇంట్లో పెద్దకొడుకు ఫెడ్రికే.
    అనిరుద్ర,  అవని భుజం చుట్టూ చేయేసి దగ్గరగా తీసుకున్నాడు.  ఆ దృశ్యం అబ్బురంగా వుంది.


 Previous Page

WRITERS
PUBLICATIONS