Previous Page Next Page 
చక్రవ్యూహం పేజి 18

    ఎన్నో శవాలను  చూసిన బెనర్జీ,  డాబర్ మేన్ చచ్చిపడి వుండడాన్ని చూడలేకపోయాడు.
    "ఇన్ స్పెక్టర్...  దానికి వున్నపాటి కృతజ్ఞత   నాకు లేదు.  తనని చంపుతాడని కాదు,  నన్ను ఆ హంతకుడు ఏమైనా చేస్తాడేమోనని భయపడి..  తన భాషలోEdit చెప్పాలని ప్రయత్నించింది.  నేనే స్టుపిడ్ ని... దాని బాధ..భాష అర్ధం కాని ఇడియట్ ని.. పోల్ కు కట్టేసాను.
    అది నన్ను కాపాడే ప్రయత్నంలోనే తన ప్రాణాలను కోల్పోయింది"  బాధగా అన్నాడు ఫెడ్రిక్.
    ఇన్ స్పెక్టర్ బెనర్జీ పిడికెళ్ళు బిగుసుకున్నాయి.
    హంతకుడు చాలా తెలివిగా ప్లాన్ చేసాడు.  ముందు డాబర్ మేన్ ను చంపాలని చూసాడు. ఆ తర్వాత ఫెడ్రిక్ ని టార్గెట్ గా పెట్టుకున్నాడు.
    ఫెడ్రిక్  బయటకు రావడంతో ప్లాన్ బెడిసికొట్టి పారిపోయి వుంటాడు.
    పిల్లిలా అరిచింది కూడా ఆ ఆగంతకుడే అని అర్ధమైంది.
    "మీరు చాలా కేర్ పుల్  వుండాలి.  హంతకుడు చాలా తేలివైనవాడు. ఎప్పుడు  ఎలా ఎటాక్ చేస్తాడో తెలియదు.  అన్నట్టు మీ దగ్గర రివాల్వర్ వుందిగా."
    "ఉంది..లైసెన్స్ కూడా వుంది.  నాగురించి నాకు బాధ లేదు...కానీ,  నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఒకటే...నామీద ఎవరు కక్ష కట్టారు. ప్రొఫెషనల్ రైవల్స్ ఎవరూ లేరు,  దాయాదులూ లేరు.  ఎవరిదంతా చేస్తున్నట్టు...డాబర్ మేన్  ఇన్నాళ్లు నన్ను కనిపెట్టుకుని వుంది.  మీకు తెలుసా ఇన్ స్పెక్టర్..  నాకు హెల్త్ బాగోలేకపోతే తను కూడా ఆహారం ముట్టేదికాదు...అలాంటి నా షిన్నీని చంపిన  వాళ్ళను వదలొద్దు"  అన్నాడు ఫెడ్రిక్.
    "తప్పకుండా"  అన్నాడు బెనర్జీ.
                        *          *         *
    బెనర్జీ వైర్ లెస్ లో తనకు బాగా పరిచయం వున్న డిటెక్టివ్ ఏజెన్సీకి ఫోన్ చేసాడు.  మంచి ఎఫిషియంట్ ని  పంపించమని  చెప్పాడు.
    ఇరవై నాలుగ్గంటలు ఫెడ్రిక్ ను కనిపెట్టివుండే బాధ్యత ఆ వ్యక్తికి అప్పగించాడు.  ఆ వ్యక్తి పేరు జోషి.  ఎక్స్ సర్విస్ మేన్.
    ఈ విషయం ఫెడ్రిక్ కు కూడా తెలియనివ్వలేదు బెనర్జీ.
     ఉదయం పదిగంటలు
    మాస్టర్ అండ్ మాస్టర్ ఎక్స్ పోర్ట్స్ లో హడావుడి మొదలైంది.  సరిగ్గా గోడ గడియారంలో పదిగంటలు కొడుతుండగా,  అవని ఆఫీసులోకి అడుగు పెట్టింది.
    మొదటగా షాక్ తింది వసుధే.
    అవని చాలా క్యాజువల్ గా  లోపలికి వచ్చి,  అటెండెన్సీ  రిజిష్టర్ సంతకం చేసి,తన సీటులో కూచుంది.
    వసుధ మెదడు మొద్దుబారిపోయింది.
    వెంటనే తేరుకుని అవన్ని టేబుల్ దగ్గరికి వచ్చింది.
    "హే.. అవనీ..  వాటే సర్ ప్రయిజ్.. నువ్విక రావేమోననుకున్నాను" అంది మొహం పై నవ్వు పులుముకొని.
    "అవును వసుధా... నేను అదే అనుకున్నాను. కానీ నిన్న మన బాస్ మా ఇంటికి వచ్చి,  ఎట్ లీస్ట్ ఒకనెల రోజులైన పనిచేయమని చెప్పాడు. మా నాన్నతో కూడా మాట్లాడాడు."
     ఒక నెల  రోజులా?  ఎందుకు?"  అనుమానంగా అడిగింది.  అవని మొహంలోకి పరిశీలనగా చూస్తూ.
    "రహస్యం.. మళ్ళీ ఎవరితోనూ అనకు."
    "ఏంటది?  ఎవరితోనూ చెప్పను"  అంది చాలా ఆసక్తిగా.
    "బాస్ కొత్తగా సురుచి పచ్చళ్ళని ఎక్స్ పోర్ట్ చేస్తున్నాడట..  దానికి సంబంధించిన డీల్ ఎవరికీ చెప్పొద్ధన్నాడు...అంతేకాదు మరో ప్రపోజల్ కూడా చెప్పాడు."
    "ఏంటది?"
    "వద్దు వసుధా...ఇలాంటి విషయాలు బయట పెడితే నా ప్రాణాలకే ప్రమాదం...  అసలు నాకు ఇష్టం లేదు.  కానీ డబ్బుతో మా నాన్నని కోనేసాడు.  లక్ష రూపాయలు ఇస్తానన్నాడు."
    "లక్ష రూపాయలా?"
    "అవును.. కానీ నాకిష్టం లేదు"  మెల్లగా అంది.
    "ఇంతకి ఆ డీల్ ఏమిటి?"
    "అది..  వద్దులే..."  అంది.
    "అదేంటి అవనీ...నన్ను అనుమానిస్తున్నావా ?"
    "అదేంకాదు... నిన్ననే మరో విషయం కూడా తెలిసింది."
    "మరో విషయమా?  ఏమిటిది?"
    "నన్ను ఇన్నాళ్ళు చంపుతానని బ్లాక్ మెయిల్  చేసి బెదిరించింది ఎవరో తెలుసా?"
    "ఎవరు?"  తత్తరపాటుతో అడిగింది.
    "మన బాసే..  బెదిరించాడట...  తనే చెప్పాడు."
    "నిజమా?"  వొత్తి పలుకుతూ అడిగింది.
    "బాస్ చెప్పాడని చెప్పాగా నమ్మట్లేదా?"  వసుధ కళ్ళలోకి సూటిగా చూసి అడిగింది.
    "నమ్ముతాను.  బాస్ ఎలాంటివాడో తెలిసిందిగా అనవసరంగా పని చేస్తున్నానిక్కడ...దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపో."
    "ఆ పని చేస్తే...నన్ను చంపేస్తాడట."
    "పోనీ...ఓ పని చెయ్... పోలీస్ స్టేషన్ లో  కంప్లయింట్ ఇవ్వు."
    "వద్దు... ఈ నెల రోజులు బాస్ చెప్పినట్టు చేస్తాను. ఆ తర్వాత నా దారి నాది.  అతని దారి అతనిది."
    "నీ ఇష్టం..."  అతి కష్టమ్మీద అని వెళ్ళి తన సీటులో కూచుంది.
    వసుధకు మనసులో మనసు లేదు.  అవని మాటలు నమ్మాలనిపించడం లేదు.  అలా అని అవని అబద్దం  ఆడుతుందని కూడా అనిపించడంలేదు.
    అవనికి ఇలాంటి అబద్ధాలు ఆడే తెలివితేటలు లేవు.
    మరి ఇది ఎలా సాధ్యం?
    అవనిని బెదిరించింది ధీరజ్.
    ఆ పని చేయమని చెప్పింది కూడా తనే.   అలాంటప్పుడు ఆ పని చేసింది తానేనని బాస్ ఎలా చెప్పాడు!  బాస్ కానీ డబుల్  గేమ్ ఆడుతున్నాడా?
    అలా ఆలోచిస్తుండగానే,  ఫెడ్రిక్ ఆఫీసులోకి ఎంటరయ్యాడు.
    బాస్ ని చూసి,  పైల్ లో తల పెట్టింది వసుధ.
    ఫెడ్రిక్ లోపలికి వెళ్ళబోతూ... అవనివైపు తిరిగి "మిస్ అవనీ...  ఓసారి నాఛాంబర్ లోకి రండి"  అన్నాడు.
    అవని ఫైల్ తీసుకుని లోపలికి నడిచింది.
    శేషశాయి గుర్రుగా చూసాడు.
    అవని రిజైన్ చేసి వెళ్ళిపోతుందని  సంతోషపడ్డాడు.  కానీ,  తీరా ఇవ్వాళ ఆఫీసుకు వచ్చేసరికి ఖంగు తిన్నాడు.  ఎందుకు మళ్ళీ వచ్చిందో కనుక్కునే అవకాశం కూడా లేదు.
    "సార్...  మిమ్మల్ని బాస్ పిలుస్తున్నారు"  హానుమంతు శేషశాయిని పిలిచాడు.
    'నన్నా...కొంపదీసి క్లాసు పీకడు కదా,  మనసులో అనుకొని,  మెల్లగా లేచి ఛాంబర్ లోకి వెళ్ళాడు.
    ఫెడ్రిక్ సీరియస్ గా ఏదో మ్యాటర్ అవని తో డిస్కస్ చేస్తున్నాడు.
    "సార్"  పిలిచాడు శేషశాయి.
    "చూడండి..  మొత్తం అకౌంట్స్ సాయంత్రంలోగా అప్ టు డేటుగా నా టేబుల్ మీద వుండాలి."
    "య..యస్సార్."
    "మరో విషయం... ఇక నుంచీ ఫైనాన్షియాల్ మ్యాటర్స్ అన్నీ అవని గారితో చర్చించండి.  అవనిగారు పర్మిషన్ లేకుండా,  సింగల్ పైసా కూడా ఖర్చు చేయకూడదు.  అంతేకాదు...  మీరు లీవ్,  పర్మిషన్ తీసుకోవాలన్నా... నౌ యూ కెన్ గో."
    "సార్.."
    "చెప్పానుగా వెళ్ళండి."
    "అలాగే సార్"  మాడిపోయిన మొహంలో బయటకు నడిచాడు శేషశాయి.
    "బాస్ ఎందుకు పిలిచాడు?"  అడిగింది,  ఛాంబర్ లో నుంచి   మాడిపోయిన మొహంతో బయటకు వచ్చిన శేషశాయిని వసుధ.
    "ఏం చెప్పమంటారు మేడం...  ఈ మాయలేడి లేదూ.."
    "మాయ లేడీనా?ఎవరు?"
    "ఇంకెవరు? అవని...ఇవ్వాళ్టి నుంచి నేను లెక్కలన్నీ ఆవిడ గారితోనే చెప్పాలట... సెలవు కావాలన్నా ఆవిడ పర్మిషన్ తీసుకోవాలట...  ఏం చూపించిందో ... బాస్ ఏం చూసారో"  అక్కసు గా అన్నాడు శేషశాయి.
    అతనికి  లోలోపల కుతకుత లాడిపోతూంది.
    అయినా ఏం చేయలేని నిస్సహాయత.
    ఈ వయసులో ఇంత మంచి జీతం వచ్చే ఉద్యోగం ఇంకెక్కడా దొరకదు.
      వసుధ ఆలోచనలో పడింది.  అవని చెప్పిందాంట్లో నిజం ఎంత?  బాస్ నిజంగానే ఆవిడ ట్రాప్ లో పడ్డాడా?  రకరకాల ఆలోచనలతో ఆమె మెదడు వేడెక్కిపోయింది.
    తనని ఎవరూ గమనించడం లేదని కన్ ఫర్మ్ చేసుకుని బయటకు నడిచింది.
    సరాసరి టెలిఫోన్ బూత్ లోపలికి వెళ్ళింది.  ఆమె టెలిపోన్ బూత్ లోపలికి వెళ్ళగానే అప్పటివరకు ఆ ఆఫీసు ముందు కాపు కాసిన జోషి వసుధను వెంబడించాడు.

                   *            *            *
    "అకౌంట్స్  అన్నీ క్లియర్ గా వున్నాయా?"   తన టేబుల్ ముందు వున్న పైల్స్ ని చూస్తూ అడిగింది శేషశాయిని అవని.
    "పైల్స్ తిరగేస్తే తెలుస్తుంది"  గుర్రగా అన్నాడు శేషశాయి.
    "నేను అడిగిన దానికి సమాధానం చెబితే చాలు,  అనవసరమైన సమాధానాలు నాకు ఇష్టం వుండవు"  కటువుగా అంది అవని.
    "అది.. అది కాదు అవనీ.
    "ఏంటో..!  ని పై ఆఫీషియల్స్ ని గౌరవించడం నేర్చుకో"  అంది కోపంగా.
    "సారి..మేడమ్"  అన్నాడు మింగలేక కక్కలేక.
    అరగంటపాటు శేషశాయిని ప్రశ్నలతో  తికమక పెట్టింది.
    అవని లోసుగులన్నీ ఆరా తీసింది.  ఏ చిన్న లెక్క తేడా వచ్చినా,  గట్టిగా మందలించింది.
    రేపట్నుంచి,  పైల్స్ క్లియర్ గా వుండాలని,  అప్ టు డేట్ గా మెయింటెస్ చేయాలని వార్నింగిచ్చింది.
    అన్నింటికీ, 'జీ హుజూర్ '   లా   తలూపాడు,  కుక్కిన పేనులా.
    ఇక అతను భవిష్యత్తులో అమ్మాయిలను ట్రాప్ చేసే ప్రయత్నం చేయాడు.
                *               *              *                
    అవని వసుధ సీటు వైపు చూసింది.  అది ఖాళీగా వుంది.  అవనికి అర్ధమైంది  వసుధ ఎక్కడికి వెళ్ళిందో...
    క్రితం రోజు రాత్రే ఇన్ స్పెక్టర్ బెనర్జీ  ఫోన్ చేసి,  తను ఏం చేయాలో క్లియర్ గా చెప్పాడు.
    అతను చెప్పినట్టే చేసింది.
                       *              *                *
    వసుధ బయటకు వచ్చింది.   చేతిలో వున్న   డబ్బులు టెలిఫోన్  బూత్  అతనికిచ్చి ఆఫీసువైపు నడిచింది.
`    వసుధ  బయటకు  రాగానే జోషి బూత్  లోకి వెళ్ళిరీ డయల్  నొక్కాడు.   ఆ నెంబర్ నోట్ చేసుకొని,  కట్ చేసాడు.
    అది వసుధ ఇందాక ఫోన్ చేసిన నంబర్.
                           *         *         *
    టైం   చూసుకుంది వసుధ.   ఒంటిగంట కావస్తోంది.  ధీరజ్ కు ఫోన్  చేసింది.  సాయంత్రం కలుసుకోవాలని చెప్పింది.
    రాత్రి ఫెడ్రిక్ ను  చంపడానికి వెళ్ళాడు ధీరజ్.  కానీ,  చివరి క్షణంలో అది మిస్సయింది.
    ఫెడ్రిక్ ను చంపడానికి  వెళ్ళి అతని  పెంపుడు కుక్కను మాత్రమే చంపగాలిగాడు ధీరజ్.
    ఫెడ్రిక్ డబుల్ గేమ్ ఆడుతున్నాడన్న డౌట్ క్షణ క్షణానికి ఎక్కవవుతోంది.
    అవనిని ఎంతవరకు నమ్మాలో కూడా అర్ధం కావడంలేదు.
    క్యాంటీన్ లోకి వెళ్ళింది వసుధ.  అప్పడే అవని కూడా వచ్చింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS