Previous Page Next Page 
చీఫ్ మినిస్టర్ పేజి 18

 

అతను రాజకీయ నాయకుడు. అవతలి మనిషి తో పని లేదనుకున్నప్పుడు ఎంత తేలిగ్గా, చులకన గా  చూడగలడో...అవసరం ఉందనుకున్నప్పుడు అంతే ఈజీగా కాళ్ళు పట్టుకోవటానికి కూడా వెనుకాడని రకం. ఒక మనిషి జీవితాన్ని చిద్రం చేసి అది ఆ వ్యక్తి మంచి కోసమే చేశానని లోకం తో పాటు, నష్టపోయిన వ్యక్తిని కూడా నమ్మించగలిగే వ్యక్తి.

ఇన్నేళ్లుగా అతను ఆ ఊరికే రాలేదు. సీఎం హోదా లో ఉండి కూడా చిన్నప్పుడు పెరిగిన ఊరుని బాగు చేయించాలనుకోలేదు. 

నిజం చెప్పాలంటే బృంద కి ఒక చెల్లెలు ఉందన్న విషయమే అతనికి గుర్తులేదు. బృంద కి తనకీ ఉన్న గొడవలు ఆమె చెల్లెలికి తెలిసే అవకాశం ఉండొచ్చని అనిపించినా  అతను కొంచెం కూడా జంకలేదు.

నవ్వుతూ అన్నాడు సుధీర్.
"గుర్తు పట్టావా?" 

"ఆ మాట నేననాలి." అందామె. అంతలోనే సర్దుకుని 

"రా సుధీర్. కూర్చో. ఇలా వచ్చావేమిటి? ఏదైనా పనా? అక్క రాలేదా?"  మామూలుగా పలకరించింది.

"అవును లతా. చిన్న పని మీదొచ్చాను. బాగున్నావా? మా ఇంటి కీస్ ఇస్తావా?" డొంక తిరుగుడు లేకుండా అడిగేశాడు.

కీస్ తెచ్చింది ఆమె.

"కాఫీ తాగి వెళ్లు" అంది.

"నేనిక్కడ కొన్నాళ్ళు ఉండబోతున్నాను. కాఫీ ఏం ఖర్మ, రోజూ భోజనం కూడా నువ్వే పంపాల్సి ఉంటుంది. ఇప్పుడు మాత్రం అర్జంట్ గా వెళ్లాలి."

తలుపు వరకూ వెళ్లి ఏదో గుర్తొచ్చినట్లు ఆగి వెనక్కి తిరిగాడు.

" ఒక ముఖ్యమైన విషయం. నేనిక్కడ ఉన్న సంగతి ఎవరికీ తెలియకూడదు. సెక్యూరిటీ సమస్య అవుతుంది" అనేసి పక్కనే ఉన్న ఇంటికి వెళ్ళిపోయాడు.

తర్వాత డ్రైవర్ ని పిలిచి కార్ తీసుకుని వెళ్ళిపొమ్మన్నాడు. తనక్కడ ఉన్న సంగతి ఎవరికీ చెప్పవద్దనీ, మళ్లీ తన నుంచి ఫోన్ వచ్చేవరకూ ఇంట్లోనే వెయిట్ చెయ్యమని చెప్పి పంపేశాడు.

***

తలుపులు గడి పెట్టుకున్నాక  లైట్లు వేసి ఇల్లంతా ఒకసారి కలియతిరిగాడు. 

Not bad...మరీ అంత పెద్ద ఇల్లేమీ కాదు కాని బాగానే ఉంది. ఒకప్పుడు ఈ ఇల్లు చూస్తే తనకి రాజప్రాసాదం లా అనిపించేది. ఇప్పుడు మామూలుగా అనిపిస్తోంది. తన ప్రస్తుత హోదా, ఆర్థిక పరిస్థితి అలాంటిది.

అక్క ఇల్లు చూసుకునే బాధ్యతని చెల్లెలు బాగానే నిర్వరిస్తోంది. ఇంట్లో మనుషులు ఉండని ఇంటిలా లేదు. నీట్  గా ఉంది.

తనకు తమ్ముడు ఉన్నాడన్న మాటే గాని ఇట్లా తనకు సహకరించడు. ప్రతి దానిలో తనకి పోటీ. తను తట్టుకోలేనంత గా…

గతం గుర్తొచ్చింది అతనికి.
 
***

అప్పటికి తమ్ముడి మీద పెద్దగా వ్యతిరేకత లేదతనిలో.  అన్ని కుటుంబాల్లో కుటుంబసభ్యుల్లాగే ఉండే వాళ్లు ఇద్దరూ.

మొదటినుంచీ తనకి పెద్దగా ఎమోషన్స్, సెంటిమెంట్లు ఉండేవి కాదు. సినిమాల్లో ఎమోషనల్ సీన్స్ చూసి కదిలిపోవటం, అమ్మానాన్నల కష్టం చూసి చలించి పోవటం ఇలాంటివి తనకి దూరం.

కార్తీక్ అలా కాదు. తల్లి వంట చేస్తుంటే సహాయం చేయటం, తండ్రి ఏదైనా పని చెప్తే బయటికి వెళ్లి చేసుకురావటం ఒక డ్యూటీ లా చేస్తుండేవాడు. ఇలాంటివి చేసి వాళ్ళని మెప్పించతానికి ప్రయత్నిస్తున్నాడనిపించేది తనకు. ఆ అవసరం ఏమిటో అర్ధం అయ్యేది కాదు.

ఇవన్నీ చేయకపోతే తల్లిదండ్రులకు తమ మీద ప్రేమ ఉండకుండా పోతుందా? సుధీర్ అదే అడిగాడు ఒకసారి కార్తీక్ ని.

"ఎందుకురా ఎప్పుడూ అమ్మానాన్నలను అట్లా మస్కా కొడుతుంటావు? అదంతా అవసరమా?"

"అదేం మాట అన్నయ్యా? వాళ్ళు కష్టపడుతున్నప్పుడు మనం హెల్ప్ చేయాలి కదా. చేతనైన సహాయం చేయాలి కదా!" వింతగా చూస్తూ జవాబిచ్చాడు కార్తీక్.

చదువు లో తను పూర్. తరచుగా తల్లిదండ్రులు తనని కార్తీక్ తో పోలుస్తుండే వాళ్ళు తను వాడికంటే తక్కువవాడినన్నట్లుగా. సుధీర్ కి ఇబ్బందిగా, కంటగింపుగానూ ఉండేది.

ఇది నాణానికి ఒక వెపయితే నాణానికి రెండో వేపున...బృంద.

బృంద అతనికో పెద్ద అబ్సెషన్! 

ఆమె రూపం, ఆస్తి, తెలివితేటలు, పలుకుబడి గల ఆమె బాక్ గ్రౌండ్ అన్నీ తనకు చాలా గొప్పగా అనిపించేవి. ఆమెకి ఏ సహాయం అవసరం అయినా క్షణాల్లో రెక్కలు కట్టుకుని చేసేవాడు. ఆమె చుట్టూ ప్రదక్షిణాలు చేసేవాడు. 

ఎంత పద్ధతి కలదైనా, తెలివైనది అయినా బృంద అక్కడే బోల్తా పడింది. చిన్న కుగ్రామం లో పెరగటం, పెద్దగా ఇటువంటి విషయాల్లో ఎక్స్ పోషర్ లేకపోవటంతో ఆమె అతనిది నిజమైన ప్రేమ అనుకుంది.

బృంద కి కూడా తనంటే ఇష్టమని కనిపెట్టడానికి సుధీర్ కి ఎక్కువ కాలం పట్టలేదు.

లత, బృంద, కార్తీక్, సుధీర్ చిన్నప్పటి నుంచి పక్క పక్క ఇళ్లల్లోనే పెరగటం, అంతా స్నేహితులు అవటంతో వాళ్ళు  కారమ్ బోర్డ్, చెస్ లాంటివి కలిసి ఆడుకోవటం, బయట బృంద వాళ్ల పెరట్లో కూర్చుని కబుర్లు చెప్పుకోవడం వంటి వాటి మీద రెండిళ్లలోనూ ఎవరికీ అభ్యంతరాలు ఉండేవి కాదు.

రోజులు అలా హాయిగా నడిచిపోతున్న టైమ్ లో...ఒకసారి తాము అంతా కూర్చుని కబుర్లు చెప్పుకొంటున్నప్పుడు లత కెమెరా పట్టుకొచ్చింది. వాళ్ళ చుట్టాలెవరో బహుమతిగా ఇచ్చారట. 

చాలా ఫొటోస్ తీసుకున్నారు నలుగురూ. కెమెరా తనది అవటం తో  ఆ రోజు అంతా ఆమే పెత్తనం చేసింది . 
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS