అ మధురమయిన కంఠస్వరంలో కరుణా రాహీత్యమూ అధికాధికంగా తొంగి చూస్తున్నాయి.
జ్యోతి మనో నిబ్బరాన్ని సమీకంరించుకుంది. తానంటే ఆమెకు తెలియ చెప్పాలని సమకట్టిందామె.
"నీవు ఎవరో నాకు తెలియదు కాని తొలినాడే "సోదరి" అని సంభిధించినావు. అందునించి నీ మీద గౌరవమే కలుగుతోంది నాకు.
నాకు వంశ పారంపర్యంగా సంప్రాప్తమయిన కర్తవ్యం నించి దూరం చేయాలని నీవెందుకు ప్రయత్నిస్తావు? ఈ శరీరం కాలి గాయమయింది. అది నీ శక్తి సంపన్నత వల్లనే అయితే అయివుండవచ్చు. అంతమాత్రం చేత బెదిరిపోయి నా ప్రయత్నం విరమిస్తానని నీవు ఆశించకు. ఈ శరీరం కాలి భస్మరాశిగా మారినప్పుడే ఈ ప్రయత్నాన్ని విరమించటం. నీవి ఇలాగే ఎన్ని మారులయినా రావచ్చు. కాని నానించి వచ్చే సమాధానం ఇది కాకా మరొకటి కాజాలడు" అని బదులు చెప్పింది జ్యోతి.
ఆ కంఠంలో పలుకుతున్న దృడ నిశ్చయాన్ని అర్ధం చేసుకుంది ఆమె. ముందు రవంత నిరుత్సాహపడినట్లు అనిపించినా వెంటనే ఆమె ఈ దిక్కార నేరాన్ని సాహిన్చలేనట్లు కోపగించుకుంది.
కనులు అరుణరుణం అయినాయి. ముఖం చెక్కిన కందగడ్డలా రక్తం చిమ్ముతున్నట్లుగా అయిపొయింది.
"జ్యోతి! ఎంత అమాయకురాలివి నీవు. అగ్నిజ్వాలను మిణుగురులు ఎదిరించగలవా? కొండను పొట్టేలు డీ కొట్టగాలదా? సముద్రాన్ని గులక రాళ్ళపై గింగిరులు తిరిగే పిల్ల సెలయేళ్ళు తమలో ఇముడ్చుకో గలవా? కేవలం మానవ మాత్రురాలివయిన నీవు నా శక్తిని ఎదురించగలవా?" అని కఠినమయిన కంఠస్వరంతో అడిగిందామె.
ఆ మాటలు కొరడా కొసలు శరీరాన్ని తాకితే బాధించినట్టు జ్యోతి మనసుని తాకి బాధించినాయి. బాధను మించి అవధులు లేని ఆశ్చర్యం తో మునిగి ఊపిరి సలుపనట్లు ఉక్కిరిబిక్కిరి అయిపొయింది.
"కేవలం మానవమాత్రురాలనా నేను? అంటే నీ వెవరు?" అని ప్రశ్నించింది సంశయస్పదమయిన చూపులు చూస్తూ.
శ్వేతకి నవ్వింది. హిమగిరి శిఖరాగ్రం నించి జారిపడిన మంచు పలకలు కఠిన శిలల్ని తాకి భళ్ళున బ్రద్దమయినట్లుగా నవ్విందామే.
"రావలసిన స్థితి కి వచ్చావు. పొందవలసిన సందేహాన్ని పొందావు. నేనెవరో ఈ ప్రయత్నాన్ని నేనింకా కొనసాగించి నప్పుడు తెలుస్తుంది. ఇప్పటికి సెలవు" అని చెప్పేసి వెళ్ళి పోయిందామే.
రెండడుగులు వెనక్కి వేయగానే ఆ ధవళ కాంతులు చీకటిలో మటుమాయమయినాయి. లైట్లు వెలిగాయి. చివాలున వెళ్ళి వరండాలోనూ, మెయిన్ గెట్ దగ్గరా కరెంటు దీపాలు వెలిగించి ఆ పరిసర ప్రాంతాలన్నీ కలియ చూచింది జ్యోతి. ఎక్కడా మనుషులున్న జాడ కన్పించలేదు.
ప్రొఫెసర్ శ్రద్దాదేవి చీకటి వల్ల నిలిచిన చోటు నించి కదలి వచ్చేందుకు అవరోధం కాగా వున్న చోటునే వుండిపోయింది. దీపాలు రాగానే వరండాలోకి వచ్చిందామే.
జ్యోతి ముఖంలో యింకా అదృశ్యం కాని తాలుకూ నీడలు చూచి "ఏం జరిగింది?" అని ప్రశ్నించింది.
"శ్వేతకి" అన్న మూడక్షరాలు జ్యోతి నోటినించి వెలువడ్డాయే కాని మిగిలిన సంగతిని ఆమె చెప్పలేక వూరుకుండిపోయింది. ఆమె స్థితిని గమనించి శ్వేతకి వచ్చి వెళ్ళిందని , మళ్ళీ జ్యోతిని భయ బ్రాంతురాలిని చేసేందుకు ఏదో చెప్పి వుంటుందనీ భావించింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి .
ఒక్క నిట్టుర్పూ విడిచి తలుపులు బిగించి తిరిగి వెళ్ళిపోయింది జ్యోతి. ఆమె సరాసరి రీడింగ్ రూమ్ లోకి వెళ్ళింది. ప్రొఫెసర్ శ్రద్దాదేవి కూడా ఆమెను అనుసరించిపోయింది. జ్యోతి పెదవులు పట్టుదలగా బిగుసుకున్నాయి.
ఆమె ముఖంలో ఉజ్వలమయిన స్పూర్తి కన్పిస్తోంది.
"అమ్మా! ఆత్మ రూపాలు చర్మ నేత్రాలకు కన్పించటం సాధ్యమేనా? ఆ శ్వేతకి ఆత్మరూపం ఇలా పదే పదే కన్పించి ఈ ప్రయత్నం నుంచి విరమించమని నన్ను బెదిరించటంలో అర్ధమేమిటి?" అని అడిగింది.
ప్రొఫెసర్ శ్రద్దాదేవి రవంత సేపు మౌనం వహించింది. ఆ తరువాత గతంలో తనకు ఎదురయిన ఒక అనుభవాన్ని చెప్పసాగింది.
"డియర్ జ్యోతి! ఇటువంటి విషయాలలో తొందరపడి ఒక నిర్ణయానికి రాకూడదు. ఏదో ఒకటి అనుకుని ఆ ఆలోచనల్ని అంతటితో వోదిలించుకుని మర్చిపొదలుచుకుంటే అవుననుకున్నా, కాదనుకున్నా వొరిగేది , జరిగేది ఏమీలేదు.
కాని ఈ సమస్యను అలోచించి నిగ్గుతేల్చి నిజం తెలుసుకోవాలనుకున్నప్పుడు ఒక నిర్ణయానికి రావటం అంత తేలిక కాదు.
ఈ సమస్యతో నీకు తరతరాల అనుబంధముంది. ముఖ్యంగా ఈ తరంలో నీమీద బృహత్తరమయిన బాధ్యతగా అది కన్పిస్తోంది. అందునించి మిగిలినవారిలా త్వరపడి నీవు ఒక నిర్ణయానికి రాకు.
గతంలో ఈ విషయమై నేను చాల చదివాను ------
"ఈజిప్టు పిరమిడ్లలోని మమ్మీల తాలుకూ వస్తువులు దొంగలించిన వారికి, మమ్మీలను సమాదుల నించి తొలగించిన వారికి అనేక రకాల అనర్ధాలు జరిగినాయని మనం చదువుకున్నాం.
సరిగ్గా ఈజిప్ట్ పిరమిడ్లలోని ,మమ్మీలను పోలినవే రాకాసి గుహల లోని మానవ కంకాళాలు.
పిరమిడ్లను పోలినవే రాక్షసిగుడులు.
తేడా ఒక్కటి మాత్రమే కనిపిస్తుంది. పిరమిడ్లు భూమి మీద ఎత్తుగా గోపురాల్లా కనిపిస్తాయి. సమాధి గుహలు భూమి అంతర్భాగంలో నిక్షిప్తమయి వుంటాయి.
ఈ ఒక్క తేడా వల్లనే పిరమిడ్లు త్వరగా ప్రపంచం దృష్టిని ఆకర్షించగలగటమూ, సమాధి గుహలు రహస్య సమాచారంగానే మిగిలి పోవటమూ జరిగింది.
అసలు అనాది నుంచీ భారతీయ సంప్రదాయమే అలాంటిది. అనర్హులయిన వారికి అద్భుత విషయాలు తెలిస్తే అనర్ధాలు వస్తాయన్నది మన ప్రాచీన మేధావుల నమ్మకం.
అందునించి గొప్ప గొప్ప రహస్యాలను అర్ధం కాకుండా అందరికీ అందుబాటులో లేకుండా దాచారు. అది మంచి పని అవునో, కాదో ఈనాడు మనం నిర్ణయించలేం.
ఎందుకంటే ఆనాటి స్థితిగతులను అనుసరించి వారు ఆ నిర్ణయానికి వచ్చారు. అలా చేశారు. కనుక ఆధునిక దృష్టితో ఆ విషయాలను గురించి ఆలోచించకూడదు.
ఆ సంగతి అలా వుంచు. ఈ ప్రేతాత్మలు చర్మ నేత్రాలకు కన్పిస్తాయా అన్న అంశం మీద నాకు ప్రత్యేక్షమయిన అనుభవం ఒకటి వున్నది. అది విన్న తరువాతనే అన్వేషణకు ఒక మార్గం దొరకగలదని నేను అనుకుంటున్నాను" అన్నది శ్రద్దాదేవి.
అడుగడుగునా తన అనుభవాలను అందించి, భుజం తట్టి, ముందుకు నడిపిస్తున్న ప్రొఫెసర్ శ్రద్దాదేవి ని ఆరాధనాభావంతో చూచింది జ్యోతి.
ఆమె చెప్తున్న అనుభవాన్ని శ్రద్దాభావంతో మనసు నిలిపి వినసాగింది. తనకు గతంలో ఎదురు అయిన ఒక భయంకర అనుభవాన్ని వివరించసాగింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి .
అది ప్రేతాత్మల గురించిన ఒక భీభత్సకర సంఘటన.
'అమ్మా జ్యోతి ! అప్పట్లో నావయసు ఇరవై నాలుగు సంవత్సరాలు జూనియర్ లెక్చరర్ గా అపాయింట్ అయాను. అయితే అంధ్ర దేశం లోని మారుమూలకు పోవలసి వచ్చింది. శ్రీకాకుళానికి ఈశాన్యంగా వంశధారకు అవతల వున్న పలాసకు పోవాలి.
