దాని పైన మరొక పెద్ద రాతి పలకతో మూసివేస్తారు. అప్పుడు అది ఒక గుహలా తయారవుతుంది. యు అనే అక్షరం మూడు వంకల మూసి ఉండి మరొక వంక ఖాళీగా ఉంటుంది.
ఆ గుహలోకి వెళ్లేందుకు అదే ప్రవేశ ద్వారం, పైన కూడా రాతి పలక ఉంటుంది కాబట్టి ఆ ప్రవేశ ద్వారం గుండా లోపలకు పోతేనే అక్కడ ఏమి ఉన్నదో కన్పిస్తుంది.
లోపల శిధిలమయిపోయిన మానవ కంకాళం కన్పిస్తుంది. దాని ప్రక్కన ఆ మానవ ప్రాణి సజీవంగా ఉండిన రోజుల్లో వాడిన బండ పూసలూ, వస్త్రాలూ, ఒక కుండలో భద్రపరచి కన్పిస్తాయి. మరొక మట్టి పాత్రలో ఉంచిన ఆహారం జీర్ణమయి మట్టిలా మారిపోయి కన్పిస్తుంది.
ఈ మొత్తం రాకాసి గుడి పైని అసలు ఆనవాలు కన్పించకుండా భూస్థాపితమయి వుంటుంది. పైన రెండు మూడు టన్నుల రాతి గోలీలు ఆధారంగా లోపల రాకాసి గుహ వున్నదని పోల్చుకోవాలి. రాతి గొలీల వలయాలు ఒక్కొక్కచోట వందల సంఖ్యలో వుంటాయి. కనుక అది ప్రేతభూమి.
అన్న మహనీయుడేవడో కాని యా పృధువి యావత్తూ ఒక సువిశాలమయిన స్మశాన వాటిక " అన్నమాట చారిత్రిక దృష్టితో చూస్తె యదార్ధమే అనిపిస్తుంది.
రాకాసి గుహల సమాచారం తెలుసుకున్న కొలదీ జ్యోతికీ మరింత ఆసక్తి కలుగుతోంది. సమాధి గుహలలో నిక్షిప్తమయి వున్న ఆరడుగుల పొడవు కలిగిన మానవ కంకాళాలు ఈజిప్ట్ పిరమిడ్లలోని మమ్మీలను జ్ఞాపకం తెస్తాయి. మమ్మీలను గురించి కధలన్నీ సేకరించి చదువుకుంది జ్యోతి. వాటికీ, ఈ సమాధి గుహల లోని నిర్జీవ మానవ కంకాళాలకూ కావలసినంత చరిత్రకమయిన , ఆత్మ శక్తి సంబంధమయిన సారూప్యత ఉన్నదని తెలుసుకుందామె.
అప్పుడు కాని తాను పరిశోధించదలచిన విషయం ఎంత అద్భుతమయినదో ఆమెకు అర్ధం కాలేదు.
దాని ప్రాధాన్యత గుర్తించాక పరిశోధనలో ఆమెకు మరింత పట్టుదల కలుగుతోంది. అది తన వ్యక్తిగతమయిన విషయమే కాక పదుగురికీ పనికివచ్చే ఆసక్తి కరమయిన అంశమని గుర్తించినదామే. పట్టుదల మరింత అయింది.
ప్రకృతి అంతా పరచుకుపోయిన అర్దారాత్రి గుబులు పుట్టిస్తున్న ఈ సమయంలో కూడా ఈ విషయాలు పరిశోధనలోనే లీనమయి రీడింగ్ రూంలో కూర్చుని వుంది జ్యోతి.
శ్వేతకి రూపం ఆమె మనసు మీద పరచిన ముద్ర ఇంకా మాయం కాలేదు. గుబులేత్తించే ఆ సంఘటన ఇంకా జ్ఞాపకం వస్తూ ఉంది. గడియారం పన్నెండు గంటలు కొట్టి నోరు మూసుకుంది. ఆ నిశ్శబ్ద చీకటి తరంగాల మధ్య భయం గొలుపుతోంది ఒంటరితనం. మధ్యమధ్య ఎవరో గుండె తలుపులు కొడుతున్నట్టు నాడీ తంత్రులను మీటుతున్నట్లు గడియారం టక్కు టక్కు మంటూ లయబద్దమయిన శబ్దం.
చీకట్లు గుంపులు గుంపులుగా అడవిలో పచ్చిక కోసం పరుగెత్తే గుర్రాల మందలా పరుగెత్తి వస్తున్నాయి. ఉన్నట్లుండి గదిలో దీపం మలిగిపోయింది.
కరెంటు పోయింది కాబోలు అనుకుంది జ్యోతి.
వంటగదిలో కాండిల్స్ ఉన్నాయి. అలవాటయిన చోటు కావటం నించి లీలగా దారి గుర్తిస్తూ వంటగదిలోకి వెళ్ళిందామె. కాండిల్స్ పట్టుకుని అగ్గి పెట్టె కోసం అరుగు మీద వెతుకుతోంది.
ఖస్సు'మంటూ శబ్దమయింది. గాస్ సిలిండర్ స్విచ్ అన్ అయింది. ఆ గాలి గది అంతా నిండి ఏదో వెగటు వాసన కొట్టింది. అగ్గిపెట్టె కోసం ఆత్రంగా వెతుకుతున్న జ్యోతి అదేమీ గమనించలేదు. అగ్గిపెట్టెను వెతికి పట్టుకుని రెండడుగులు ఇవతలకు వచ్చింది. కాండిల్ వెలిగించటం కోసం అగ్గిపుల్లను గీచిందామే. తక్షణమే గది అంతా ఒక్కసారి భగ్గున మండినట్లు అయింది. కెవ్వున అరిచి విరుచుకుని పడిపోయింది జ్యోతి. ఆమె పెట్టిన కేకతో ప్రక్క మీది నుంచి త్రుళ్ళి పడి లేచింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి. కప్పుకున్న రగ్గుని జారవిడవటం మరచి అలాగే పరుగు తీసింది కోచేన్ లోకి.
అప్పటికి జ్యోతి శరీరం మీద చీర అంటుకుంది. ప్రొఫెసర్ ఆలోచనలు మెరుపులా పనిచేశాయి.
ఆమె తన మీది రగ్గు తో జ్యోతి శరీరాన్ని చుట్ట చుట్టింది.
పెద్ద ప్రమాదం జరగలేదు. కాని అక్కడక్కడ బొబ్బలు లేచినాయి. అవి మంట పెడుతూ సలుపుతున్నాయి.
"ఇప్పుడు స్టవ్ ఎందుకు వెలిగించావు " అని అడిగింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి ఆశ్చర్యంగా.
అప్పుడే తలుపు తట్టిన చప్పుడు అయింది. వెళ్ళి తలుపు తీసింది జ్యోతి. ఎదురుగా విభ్రాంతి గొలుపుతూ అదే దూపం.
చీకటిని దిక్కరించే ధవళకాంతిమాయమయిన స్త్రీ రూపం.
"ఇప్పటికయినా నీ ప్రయత్నాలు మానుకోగలవా?" అని వెక్కిరింపుగా అడిగింది ఆ రూపం , ఆ ధవళమూర్తి ఆనాడు కన్పించిన శ్వేతకి!!
6
సూర్యకిరణాలను రాశి పోసినట్లున్న ఆ సౌందర్యమూ, జలతరంగిణులు మ్రోగించినట్లున్న కంఠ మాధుర్యమూ , ధవళ కాంతులతో తరళిస్తున్న నేత్రాలూ రవంత అయినా మార్పులేదు.
కాని ప్రధమ సమావేశంలో కనిపించినప్పటి సౌజన్యం మాత్రం ఆమెలో నిలుప్తమయిపోయింది. భీకరమయిన ధోరణి కన్పిస్తోంది. ఏదో శక్తి రూపుదాల్చినట్లుగా అన్పిస్తుంది.
శక్తి అనేది రెండు విధాలుగా రూపుదాల్చుతుంది. సజ్జనులయిన వారి శక్తి నిర్మాణాత్మకంగా రూపొందుతుంది. మరొక తరహ వ్యక్తులకున్న శక్తి యుక్తులు విధ్వంసకంగా రూపొందుతాయి.
ఇప్పటి ఈ శ్వేతకి రూపం విధ్వంసకారమయిన ధోరణిలో కన్పిస్తోంది . గుండెలు దడదడలాదినాయి.
ఎలాగో మన్హశక్తులను సమీకరించుకుని కాలు నిలువరించుకుంది. ఆమె చూపులు సమ్మొహనకరమయిన తూణీరాల్లాగ మనసుని పట్టిపట్టి లాగివేస్తున్నాయి. నిగ్రహాన్ని సడలిస్తున్నాయి.
"ఇప్పుడెం జరిగిందని నా ప్రయత్నాలు మానుకోవాలి. కృష్ణవేణీ సలిల ధారాలపై తెలుయాడే నావ ఏ క్షణాన మునుగుతుందో తెలియదు. అలాంటి స్తితిలో కూడా నేను భయపడలేదు. ఇప్పుడు భయపడవలసిన అగత్యం ఏమిటో నాకు అర్ధం కావటల్లేదు.
కృష్ణ నీరు త్రాగి పెరుగుతున్న కన్నెపిల్లను నేను.
పట్టిన పట్టు అంత తేలికగా విడిచిపుచ్చుతానని నీవెందుకు అనుకున్నావు." అని ఎదురు తిరిగి అడిగింది జ్యోతి.
ఉబికి వచ్చే భయవిహ్వలతను మనసు పొరల మాటున అణచుకుంది. తెగింపుని ఆధారంగా తన వ్యక్తిత్వాన్ని నిలుపుకో ప్రయత్నించిందామె.
"ఆనాడు ఇలాగే మొండిగా మాట్లాడి మట్టికరిచావు. మృత కళేబరం లాగా నేలమీదికి పడిపోయినావు. తిరిగి అదే ప్రయత్నాన్ని ప్రారంభించి ఈనాడు శరీరమంతా మండించుకున్నావు. ఇంటలేని తామ్రపత్రాలు కోసం ఎందుకీ వెంపరలాడటం సోదరీ!
నీవు వూ అంటే నీకు కావలసిన సుఖ శాంతులు వచ్చి నీ ముంగిట వాలుతాయి. తల వొంచుకుని సాటి ఆడపిల్లలందరిలాగే బ్రతకటం నేర్చుకో! కాదంటే ఇకముందు ఇంకా భయంకరమయిన పరిస్థితులు అవుతాయి. పాపం ఒళ్ళంతా కాలి బొబ్బలు లేచినాయి కాబోలు మంటలయినా నీకు మంచి గుణపాఠం నేర్పలేదా?" అని అడిగింది.
