Previous Page Next Page 
విష్ణు విలాసిని పేజి 19

    "నువ్వు ఆ తండ్రికి తగిన బిడ్డవి. అంతేకాదు. తండ్రిని మించిన దానివి"    
    ".........."    
    "మీ అమ్మా నాన్నల సుఖం గురించి ఆలోచించు వాళ్ళని సంతోషపెట్టు."    
    "........."    
    "మీ నాన్నని చూశావా, ఎంత దిగులుగా ఉన్నాడో?"    
    వెంకమాంబ కళ్ళలో తండ్రి దీనవదనం కదలాడింది. జాలి, బాధ కలిగాయి. తననెంతో ప్రేమగా చూసే తండ్రి తన కారణంగా బాధపడటం కష్టంగా తోచింది. ఇంకపైన తండ్రిని, తల్లిని కష్టపెట్టకూడదు అనుకుంది. అన్ని ప్రాణులలోనూ దైవం ఉన్నప్పుడు, తన తల్లితండ్రుల రూపంలో ఉన్న దేవుణ్ణి బాధ పెట్టడం తప్పుకదా! ఇంకమీద వాళ్ళ మాట కాదనకూడదు. వాళ్ళకి కష్టం కలిగించకూడదు అనుకుంది.    
    చేతివేళ్ళ కదలిక తాతగారికి సందేశాన్నందించింది.   
                                                          * * *    
    "చౌడేశ్వరీదేవి వారి కులదైవంట." వెంకమాంబ రావటం చూసిన తాతగారు గొంతు కొంచెం పెంచి చెప్పారు.    
    "ఆ దేవి ఎక్కడ ఉంది?" మంగమాంబ భక్తిగా అడిగింది.    
    "వారి పూర్వులు కాశీయాత్ర చేసి వస్తున్నప్పుడు, వారి భక్తి ప్రపత్తులకు మెచ్చి వెన్నంటి వచ్చి వారింట కొలువై ఉందట."    
    "ఆహాఁ! ఎంతటి అదృష్టవంతులు! సాక్షాత్ జగన్మాత వారిని మెచ్చి వెంట వచ్చిందంటే!"    
    "ఆ ఇంట్లో ఆడవారినందరినీ అమ్మవారుగా, పిల్లలందరినీ బాలస్వరూపిణులుగా గౌరవిస్తారుట."    
    "అంటే వారూ బాలాజీ భక్తులేనన్నమాట." వెంకమాంబ అంది తాతగారి పక్కన కూర్చుంటా.    
    "అంతేకాదు మగవారంతా బాలాజీ స్వరూపులు అందరూ వెంకన్న భక్తులేకాదు. స్వయంగా వేంకటాచలపతులే అబ్బాయి పేరు కూడా అదే."    
    "మీరు మెచ్చారంటే వారు చాలా మంచి వారై ఉండాలి." అంది మంగమాంబ.    
    "నా మెప్పు సరిపోదు. నా మనుమరాలు మెచ్చాలి."    
    వెంకమాంబకి మాటల ధోరణి ఎటు సాగుతోందో అర్ధమయ్యింది. హఠాత్తుగా తానొక వలలో చిక్కుకు పోయినట్టనిపించింది. కంగారు, భయం కలిగాయి. తండ్రి దీనవదనం, తల్లి ముఖంలో కనపడే వేదన కళ్ళముందు నిలిచాయి. భీజం తట్టినట్టయితే పక్కకి తిరిగి చూసింది. తన ప్రాణ మిత్రుడు అలవోకగా చిరునవ్వు వెన్నెలలు ప్రసరిస్తూ కొంటెగా నవ్వుతూ, కనుసైగ చేశాడు. సరే అన్నట్టు దానర్ధం ఏమిటి? అంగీకారం దేనికి? గుచ్చి గుచ్చి చూసింది.    
    "కల్యాణ ఘడియ సమీపించింది" అన్నాడు పెదవులు విడివడకుండానే ఆ మాటలు చెవుల నుండి కాక నేరుగా గుండెల్లో ప్రతిధ్వనించాయి.    
    అర్థమయినట్లు తలూపింది. తాతగారది తనమాటలకి అనుకున్నారు.
    "అయితే వేంకటాచలపతితో నీ వివాహం నిశ్చయం చెయ్యమంటావా? అడిగారు తాతగారు.
    తన మిత్రుడు తల ఊపమంటున్నాడు. సరేననమంటున్నాడు. వెంకమాంబ
    "సరే!" అంటూ తల ఊపింది.
    తాతగారి ఆనందానికి అవధుల్లేవు.
    మంగమాంబకి గుండెలమీద పెట్టిన బరువు తీసేసినట్టుగా ఉంది.
    కృష్ణయార్యుని ముఖంలో చాలా కాలం తర్వాత చిరునవ్వు కనిపించింది.
    వెంకమాంబ ముఖంలో మాత్రం ఎటువంటి మార్పూ లేదు. నిత్యకృత్యాలు యథాప్రకారం.
                                                         * * *
    "ఇదుగో రామక్కా విన్నావా?"
    "నువ్వు చెప్పందే?"
    "మంగమాంబ కూతురికి పెళ్ళికుదిరిందిట!"
    "దెయ్యప్పిల్ల ఒప్పుకుందా పారిజాతా?"
    "మహచక్కగా ఒప్పుకుందిట"
    "ఏఊరుట?"
    "చిత్తూరు దగ్గరి నారగుంట పాళెంట"
    "అవునులే! దగ్గర ఊళ్ళలో వాళ్ళు చేసుకోరుగా! అందుకే సమ్మంధం అంత దూరం నుండి తెచ్చుకున్నారు"        
    "వాళ్ళకి తెలియదా పిల్లపిచ్చి గురించి"
    "వాళ్ళకి తెలియకుండా ఏమీ ఉండదు."
    "ఒక వేళ తెలియపోయినా మన సోమయాజిగారూ వారి అనుయాయులూ ముందుగానే చెప్పేస్తారుగా!"
    "అయ్యో వదినా! నీ పిచ్చిగాని వాళ్ళపని వాళ్ళు చెయ్యనే చేశారు. అన్ని సమ్మంధాల్లాగానే దీన్నీ శాయశక్తులా చెడగొట్టే ప్రయత్నం చేశారు."
    "మరి?"
    "వాళ్ళు వినలేదుట."
    "పైగా అంతభక్తి ఉంటే మాకు ఇంకా మంచిది. మా ఇంట్లో ఉన్న పూజాపునస్కారాలకి సరిపోతుంది అన్నారుట" పారిజాత ముక్కుమూతి విరుస్తూ చెప్పింది.
    "పిల్ల అందం చూసి మురిసిపోయారేమో!" రావక్క అంది.
    "అందం దేనికి? కొరుక్కు తింటామా?" లక్షిందేవి ఈసడింపుగా అంది తన ఇద్దరు కూతుళ్ళరూపు రేఖలు గుర్తుకొచ్చి.
    "అదికాదుట. వారి కులదైవం చౌడేశ్వరీదేవి ఆదేశంట."
    "ఆ దైవానికి ఈ దెయ్యం ఎలా నచ్చిందో?" చంకన బిందెతో వస్తున్న నాంచారిని చూసి అందరూ మాటలాపారు.
    "ఏమో పారిజాతా! వెంకమాంబ పెళ్ళి కుదిరిందిట నీకింకా తెలియదా?" ఆవిడే అడిగింది.
    "తెలుసత్తా! అదే చెపుతున్నాను వీళ్ళకి"
    "అదెలా కుదిరిందే? మీరు, మీ మగవాళ్ళూ ఉండగా?"
    "అదేంటత్తా అట్లా అంటావు?"
    "అదేనే దాని అందం, దైవభక్తి తెలివితేటలు చూసి అసూయతో మీరంతా ఎన్నో సమ్మంధాలు చెడగొట్టారుగా. ఇదెందుకు చెడగొట్టలేదూ? అని"
    "ఊరుకో అత్తా! అట్లా మాట్లాడతావేంటి? వెంకు మన పిల్లకాదూ! దానికి సమ్మంధం కుదిరితే మా అందరికీ సంతోషమే!"
    "అంతేలే సంతోషించండి మరి" రేవులో దిగింది నాంచారమ్మ.
    అందరూ తలొంచుకుని ఇళ్లముఖం పట్టారు.
                                   * * *

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS