కాని, కొన్న సంఘటనలు అట్టడుగు పొరల్లో పాతిపెట్టిన భయాన్ని వెలికితీస్తూ ఉంటాయి.
ఒకరోజు సీత వంటింట్లోపని చేసుకుంటున్న మంగమాంబ దగ్గరకి పరుగు పరుగున ఒగరుస్తూ.
"అత్తా! అత్తా!" అంటూ వచ్చింది.
"ఏమిటే, అలా ఆయాస పడుతున్నావ్? కాసేపు కూర్చుని చెప్పు" అంది మంగమాంబ నవ్వుతూ.
"అత్తా! వెంకూ చెపుతోంది... ... ..." ఆగింది ఆయాసంతో.
ఏమిటి అన్నట్టు చూసింది మంగమాంబ.
"తిరుపతి తన అత్తారిల్లట ఎంకన్నసామి వచ్చితనని తీసుకెడతాడుట. తనకి సామితో పెళ్ళయిందిట..."
మంగమాంబ గుండెల్లో అప్పటికే పడి ఉన్నరాయి బరువు పెరిగింది. పైకిమాత్రం నవ్వుతూ.
"అది సరదాగా అట్లా మాట్లాడుతుంది అంతే! పట్టించుకోకు" అంది.
"కాదత్తా! నిజ్జంగా అని చెప్పింది దేవుడిమీద ఒట్టుకూడ పెట్టింది."
"పోవే పిచ్చిమాటలు మాట్లాడకుండా! అప్పుడే పెళ్ళిమాటలేమిటి? ఒక్కొక్కళ్ళకి అయిదేళ్ళు లేవు, పెళ్ళికావాల్సి వచ్చిందామీకు?" అని గట్టిగా మాట్లాడి పంపింది. ఆ పిల్లని పంపిందికాని, తన మనసుకేం చెపుతుంది?
* * *
సుమారుగా ఒక ఏడాది క్రితం తానే విన్నది. సావిత్రమ్మగారి కూతురి పెళ్ళిలో ఎవరో "నీ పెళ్ళెప్పుడే?" అని అడిగారు, ముద్దు ముద్దుగా అటూ ఇటూ తిరుగుతూ ఉన్న వెంకమాంబని చూసి.
"ఎప్పుడో అయిపోయిందిగా!" అంది చెయ్యి వెనక్కి చూపిస్తూ.
"మాకు తెలియకుండా ఎప్పుడయ్యిందే?" ఇంకొకావిడ అడిగింది.
"అబ్బో! చాలా రోజులైంది"
"అయితే నీ మొగుడెవరే?" -మరొక ఆవిడ ముచ్చటగా అడిగింది.
"ఈయనే!" అంటూ వెంకటేశ్వరుడి చిత్రపటాన్ని చూపించింది.
మంగమాంబ గుండెల్లో రాయి బరువు ఎన్నో మణుగులు పెరిగింది. కూతురు రెక్క పట్టుకుని అంది.
"ఈ ముది కబుర్లుమాని రా! మంగళహారతి పాడాలిట. నీకోసం అక్కడ ఎదురు చూస్తున్నారు" అని.
మంగమాంబ గుండెల్లో రాయి బరువు పెంచే సంఘటనలు ఒక ఏడాదిగా కోకొల్లలు. పెళ్ళీడు సమీపిస్తున్నకొద్దీ పెళ్ళిమాటలు రావటం, వెంకమాంబ మాటలు వినే వాళ్ళకి తలతిక్కగా తోచటం మంగమాంబకి దిగులెక్కువ కావటం - ఇదీ తంతు.
* * *
కృష్ణయార్యుడు కొద్దికాలంగా దిగులుగా ఉంటున్నాడు. అదే మంగమాంబ ముఖంలో కూడా కనపడుతోంది. పూర్వపు ఉత్సాహం లేదు. అన్యమనస్కంగా ఏదో ఆలోచిస్తున్నట్టుగా కనపడుతున్నాడు. ముఖం కాస్త వడిలింది. తండ్రితో కూడా ముభావంగా ఉంటున్నాడు. మనసు విప్పి మాట్లాడం లేదు! వెంకమాంబని అంతకు ముందులాగా ముద్దు చేయటంలేదు. మనసారా మాట్లాడటంలేదు. నవ్వటం అన్నది మరిచి పోయినట్టుగా కనపడుతున్నాడు. అతడి ప్రవర్తనలో కొట్టవచ్చినట్టు కనపడుతున్న తేడాని అందరూ గమనించారు. కారణం అందరికీ తెలుసు. ఊళ్ళో వాళ్ళందరికీ ఏదో సాధించామన్న ఆనందం. ఇంట్లో వాళ్ళకి అసలే లోపల ఉన్న బాధకి ఇది తోడు. కన్న తండ్రి మనసు తట్టుకోలేకపోయింది. అందుకే మనుమరాలితో మాట్లాడాలనుకున్నాడు. రాత్రి భోజనాల తర్వాత పిలిచి దగ్గర కూర్చోపెట్టుకున్నాడు. ప్రతిరోజులాగానే భాగవత కథలు చెపుతున్నాడు. ఆరోజు కుచేలుడి కథ చెప్పాడు. కృష్ణుడి భక్త వాత్సల్యం ఎటువంటిదో, ఆయన ఎంతటి కరుణామయుడో, దయామయుడో చెప్పాడు. వెంకమాంబ యాంత్రికంగా తాతగారి కాళ్ళు నొక్కుతూ తన్మయత్వంతో చెప్పాడు. వెంకమాంబ యాంత్రికంగా తాతగారి కాళ్ళు నొక్కుతూ తన్మయత్వంతో వింటూ ఉంది. కథ పూర్తి అయినాక ఇంకా తన్మయత్వం నుండి తేరుకోని మనుమారాలిని చూచి.
"చూశావా తల్లీ! శ్రీకృష్ణ పరమాత్మ దీనవత్సలత. ఎవరు బాధలోవున్నా చూడలేడమ్మా!"
"కష్టాలనుండి గట్టెక్కిస్తాడు తాతగారూ! గజేంద్రుడిని కూడా కాపాడాడు, ఎంతటి దయామయుడో కదా!"
"మరి, ఆయన భక్తులం మనం కూడా ఎదుటివారు బాధ పడుతుంటే ఊరుకోకూడదు కదా! ఏమంటావ్?"
"అవును తాతగారూ! వాళ్ళ బాధ పోగొట్టాలి."
"చేతకాదనుకో! కనీసం వాళ్ళ బాధకి మనం కారణం కాకూడదు. ఔనా?"
"అవును మనవల్ల ఇంకొకరు బాధపడకూడదు."
"ఆ మాట నీ మిత్రుడు నీకెప్పుడూ చెప్పలేదా?"
మిత్రుడి ప్రసక్తి రాగానే వెంకమాంబ ముఖం మరింత ప్రసన్నంగా మారింది. ఆ గుడ్డి వెలుగులో కూడా కళ్ళలో కాంతి కొట్టవచ్చినట్టు కనపడింది.
"అతడు చేసేది అదేగా!"
"అతడికి మిత్రమవై ఉండి, భక్తురాలివై ఉండి నువ్వు మరొకరిని బాధించవచ్చా? బాధిస్తే ఊరుకుంటాడా?"
వెంకమాంబ తల అడ్డంగా ఊపింది. మాట్లాడటం అనవసర మనిపించింది కాబోలు.
"ఇంట్లో వాళ్ళని, ముఖ్యంగా కన్న తండ్రిని కష్టపెడితే, దేవుడు మెచ్చడు కదా!"
అవునన్నట్టు తల ఊపింది.
"ఒక కృష్ణ భక్తురాలిగా తండ్రిని కష్టపెట్టడం భావ్యమా?"
".........."
"కృష్ణుడు కూడా తండ్రిని సుఖపెట్టాడు. రాముడి సంగతి ముందే తెలుసుకదా!"
విషయం ఏమిటో అర్ధమవుతోంది వెంకమాంబకి. ఆ సంగతి కాలు నొక్కే తీరులో అర్ధం అవుతోంది తాతగారికి. అందుకే ఒక్కొక్క వాక్యం తర్వాత కాసేపు ఆగుతున్నారు.
"తల్లిదండ్రులు ప్రత్యక్షదైవాలు. శరీరం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞులమై ఉండాలి. వారి ఋణం తీర్చుకోవాలి. వారిని సంతోషపెట్టాలి. వారి మాట వినాలి."
"..........."
"మీ నాన్నని చూడు! నా మాట మీ నాయనమ్మ మాట జవదాటతాడేమో!"
