Previous Page Next Page 
తరిగొండ వెంగమాంబ పేజి 18


    ప్రాతఃకాలాన్నే లేచి తులసివనాన్ని శుభ్రం చేసి, కళ్ళాపి  చల్లి ముగ్గులు పెట్టింది. దేవాలయంలో అర్చకుల సందడి వినిపిస్తోంది. స్వామివారికి కర్పూర హారతినివ్వాలని, హారతి పళ్లెన్ని చేతపట్టుకుని కోవెలలో ప్రవేశించింది. ఆ స్వామి సుందర రూపాన్ని తనివితీరా దర్శించుకుంది. నవరత్నాభరణాలతో, కస్తూరి, గంధ, కుంకుమ, పూల పరిమళాలతో, దివ్య పుష్పరాశితో అలంకృతుడై, పట్టుపీతాంబరాలతో, వజ్ర హస్తంతో, అభయమిస్తున్న స్వామి విగ్రహాన్ని చూస్తూ మైమరచిపోయింది వెంగమాంబ.
    దయాసముద్రుడైన ఆ పరబ్రహ్మమూర్తిని ఆపాదమస్తకం దర్శించుకుని పులకించిపోయింది. ఆ దివ్య మంగళ విగ్రహాన్ని వదలి రాలేక, బ్రహ్మానందంలో మునిగిపోయిన వెంగమాంబ అలాగే ఉండిపోయింది. ఆ మహాభక్తురాలిని ఎవరు అడ్డగిస్తారు? నిత్యం స్వామికి కర్పూర హారతిని సమర్పిస్తూ, ఎక్కువ సమయాన్ని స్వామి సన్నిధిలోనే గడుపుతుండేది వెంగమాంబ.
    ఎంతోమంది భక్తులు ఆమె ఇచ్చే హారతిని కళ్ళకు అద్దుకుంటుండేవారు.
    కర్పూర హారతులిస్తూ మంగళహారతులను పాడుతుండేది. ఆ మంగళ హారతులను వినేందుకు ఎంతోమంది భక్తులు తరలి వచ్చేవారు. కొంతమంది అర్చకులకు, ఆమె కర్పూర హారతి ఇవ్వడం, భక్తులంతా ఆమెచుట్టూ మూగడం నచ్చలేదు. ఎలాంటి సాకుతో వెంగమాంబ కర్పూర హారతిని మానిపించుదామా అన్న ఆలోచనలతో, అందుకు తగ్గ ప్రయత్నాలు చేయసాగారు.
    "ఆమె ఏమైనా మహాభక్తురాలా ఏమిటి? ఆ హారతిని మనం ఎందుకు అనుమతించాలి?" అన్నారొకరు.
    "అయినా ఓ వితంతువు స్వామికి హారతి ఇస్తే కీడు కదా!" అన్నారొకరు.
    ఆమెకి ఎంత స్వాతంత్య్రం? గుడే తనదైపోయినట్లు గర్వం. "ఆ స్వామీ నా స్వామీ" అంటూ గంతులేస్తోంది. ఛీ" అన్నారు మరొకరు.
    "నేనొక ఉపాయం చెప్తా. ఆమె గుళ్ళోకి హారతి ఫట్టుకొస్తుందిగా. అప్పుడు చెప్తా"నని ఓ అర్చకుడు కోపంగా చెబుతుండగానే, వెంగమాంబ కర్పూర హారతి పట్టుకొచ్చేసింది. అక్కడివారంతా ఒకరిముఖాలొకరు చూసుకున్నారు. " ఈ రోజుకి ఊరుకో. రేపు చూద్దాం" అన్నారొకరు. వెంగమాంబ కర్పూర హారతినిచ్చి, కీర్తనలు పాడి వెళ్ళిపోయింది.
    ఆరోజు స్వామికి సమస్త అలంకారాలు పూర్తిచేశారు. పూలమాల వేస్తుండగా, హారతి పళ్లెంతో వెంగమాంబ గబగబా లోపలికి వచ్చేసింది. కొంతమంది తమలో తాము, "స్వామీ! ఈ వితంతువు హారతి ఇవ్వడమా! ఈ  అపచారాన్ని క్షమించండి స్వామీ" అని అనుకోవడం వెంగమాంబకు అర్థమవుతూనే ఉంది. తరువాత తాను కోవెలలో హారతి ఇవ్వాలా ఏమిటి? తన గుండె దీపంగా, భక్తి హారతిగా సమర్పిస్తే స్వామి స్వీకరించడా? అనుకుంటూ గుడికి హారతిని తీసుకురావడం మానేసింది.
    వెంగమాంబ, కోవెలకు హారతి తీసుకురాకపోవడం తమ విజయంగా భావించారు కొంతమంది అర్చకులు. స్వామికి ఇంట్లోనే హారతినిస్తోంది వెంగమాంబ. ఎందరో భక్తులు ఆమె ఇంటికొచ్చి స్వామికి దణ్ణం పెట్టుకుని వెళుతున్నారు. భక్తులతో వెంగమాంబ ఇల్లు సందడిగా ఉంది. గుడిలో అర్చకులు వితంతువు గొడవ తొలగిపోవడంతో, స్వామి తమను కారునిస్తాడని అనుకుంటున్నారు.
    ఆరోజు స్వామికి రథోత్సవం. అర్చకులు మహాభాక్తి శ్రద్ధలతో నవరత్నఖచిత కాంచన దివ్యరథాన్ని సిద్ధంచేసారు. కల్పవృక్ష వాహనంలో స్వామిని ఆరూఢుని చేసారు. మంగళవాద్యాలతో తిరువీథి చుట్టుకొస్తున్నారు. రథం సాగుతోంది. అశేష జనం స్వామిని తనివితీరా దర్శించుకుంటున్నారు. రథం వెంట పరుగులు తీస్తున్నారు. చేత్తో రథాన్ని తాకుతూ జన్మధన్యమైందని భావిస్తున్నారు. స్వామి రథం వేగంగా కదులుతోంది. ఉత్తరమాడ వీథిలోని వెంగమాంబ ఇంటి ముందుకు రథం వచ్చింది.
    వెంగమాంబ ఇంటిముందు నుంచి స్వామి రథం అటుఇటు కదలకుండా ఆగిపోయింది. రథాన్ని లాగుతున్న వారంతా మరింత బలంగా లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. మేరు పర్వతంలా స్థిరంగా కదలకుండా నిలిచిపోయింది స్వామి రథం. అర్చకులంతా కలసి తమ భుజ బలాన్నంతా ఉపయోగించి రథాన్ని లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. రథం ఒక్క అంగుళం కూడా  ముందుకు కదల్లేదు. సమయం రాత్రి రెండు గంటలు దాటింది. రథం అక్కడే నిలబడిపోయింది. తప్ప, ముందు కదల్లేదు. జనం, అర్చకులంతా అక్కడే ఉన్నారు. శ్రీ వేంకటేశ్వరుని తిరిగి కోవెలకు తీసుకెళ్ళడం ఎవ్వరికీ సాధ్యపడలేదు.
    అర్చుకులలో  ఆందోళన మొదలైంది. స్వామి రథం వెంగమాంబ ఇంటి ముందు నుంచి కదలకపోవడానికి కారణం, ఆమె హారతిని తిరస్కరించడం వల్ల స్వామికి కోపమొచ్చిందా! అని అనుకోసాగారు. అర్చకులు ఒకరి ముఖాన్నొకరు చూసుకోసాగారు.
    అర్చకులలో వెంగమాంబ ఇంటికెళ్ళి ఆమె పాదాలపై సాష్టాంగపడ్డారు. తమను క్షమించమని వేడుకున్నారు.
    "అమ్మ నీ భక్తిని గుర్తించలేకపోయాం. స్వామికి మీపై గల కరుణను గుర్తించలేకపోయాం. మా తప్పులను మన్నించి,స్వామివారి రథాన్ని ఆలయానికి పంపించు తల్లీ. ఇంత పొద్దుపోయినప్పటికీ, స్వామి దేవాలయానికి రాకపోవడం ఏనాడూ జరగలేదు" అంటూ అర్చకులు పలువిధాల వెంగమాంబను ప్రార్థించారు.
    వెంగమాంబ చిరునవ్వు నవ్వింది. 
    "నేనొస్తాను. కానీ, శ్రీనివాసుని రథం కదలి ఆలయంలోకి వస్తుందా?" అంది. అర్చకులు తలలూపుతూ , అంతకు ముందు వెంగమాంబ వితంతువని ఆక్షేపించినందుకు సిగ్గుపడ్డారు.
    వెంగమాంబ భక్తి శ్రద్ధలతో కర్పూర హారతి తెచ్చి స్వామి వారికి నివేదించింది. అర్చకుల ముఖాల వికసించాయి. స్వామి వారి రథం పూలబంతిలా క్షణాలలో కదలి ఆలయం చేరింది.
    వెంగమాంబ భక్తి అర్చకులకు అర్థమైంది.
    వెంగమాంబను రోజూ కర్పూరహారతి తీసుకురమ్మని వేడుకున్నారు. వెంగమాంబ ఆలయంలోకి అడుగుపెట్టగానే, అరచకులంతా ఆమెకు ఎదురెళ్ళి ఉపచారాలు చేస్తూ, తమ భక్తిని ప్రకటించుకున్నారు.
    వెంగమాంబ భక్తితత్పరత రోజురోజుకీ  పెరుగుతోంది. ఆమెకు భగవన్నామస్మరణ తప్ప మరే విషయం పట్ల  ఆసక్తి లేదు నిత్యం ఆ భగవానుని లీలా విశేషాలను కీర్తన చేయడమే ఆమెకు నచ్చిన విషయం.
    ఒకరోజు తెల్లవారుఝామున వెంగమాంబ ఉలిక్కిపడి లేచింది. ఎవరో తనను లేపుతున్నట్లుగా అనిపించి, కళ్ళు నలుపుకుంటూ అటు ఇటు చూసింది. ఎవరో నవ్వుతున్నారు. ఎక్కడో అడుగుల సవ్వడి, కాలి గజ్జెల రవళులు.
    ఆ లీలా మానుష విగ్రహకుడు ఎక్కడ?
    వెంగమాంబ తన గదిని వదిలి బయటకొచ్చింది.
    వేంకటాచలం!
    ఆహా!!
    వెంగమాంబ కళ్ళముందు స్వామి!
    చిరునవ్వులు చిందిస్తూ స్వామి!!
    "నా గొప్పలు చెప్పవూ?!" వెంగమాంబ అటునుంచి చూస్తోంది.
    "గొప్పలా..... మహాత్మ్యాలా?"
    ఎవరో తన ఒళ్ళంతా నిమిరారు. ఆ స్పర్శకి ఒళ్ళు జలదరించింది. కళ్ళు మెరిసాయి.
    "నా స్వామీ..... నా స్వామీ" వెంగమాంబ కళ్ళవెంబడి నీళ్ళు జలజలా రాలాయి. వెంగమాంబ అతి ఇటు చూస్తోంది. ఎవరిదో అడుగుల సవ్వడి.
    "స్వామీ! వెళ్ళిపోతున్నావా?" వెంగమాంబ పరుగెత్తింది. ఓ మెరుపు మెరిసి మాయమైంది.
    వెంగమాంబ గుమ్మం ముందు స్పృహ తప్పి పడిపోయింది.
    ఆవుదూడ "అంబా" అంటోంది. వెంగమాంబకు స్పృహ వచ్చింది. ఆవుదూడ అంబా అంటోంది. దూడను, తల్లి ఆవు దగ్గర వదలాలి. వెంగమాంబ ఈలోకంలోకి వచ్చింది. అంతా కొత్తదనంగా కొత్తదనంగా వుంది. ఏదో ఒక కొత్త ఆనందం మది నిండా నిండుకొన్నట్లు!!
    గుడిలో గంటలు మోగుతున్నాయి.
    వెంగమాంబ మనసు స్వామివారి లీలా విశేషాలవైపు మరలింది.
    ఈ తిరుపతి క్షేత్రం ఎంత పుణ్యాలరాశి
    తనను కడుపులో దాచుకున్న బంగారు తల్లి!!
    శ్రీకారంతో శ్లోకాన్ని మొదలుపెట్టి ఆగకుండా పూర్తిచేసింది. వెంగమాంబ మనసు తిరుపతి క్షేత్రాన్నంతా చుట్టి వస్తోంది. తిరుపతి క్షేత్రంలోని ప్రాకారమండపాలు, పుణ్యతీర్థాలు, పవిత్ర దేవాలయాలు, బంగారు శిఖరాలు, వివిధ మఠాలు, వేగంగా పరుగెత్తే గుర్రాలు, మదపుటేనుగులు, స్వామివారి ఉద్యానవనంలో నున్న నెమళ్ళు, చిలుకలు, తులసివనం - ఆహా ఎంత అద్భుత దృశ్యాలూ! ఆ దృశ్యాలన్నీ వెంకమ్మ కళ్ళెదుట సాక్షాత్కరించాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS