"మా దగ్గరికి తీసుకొచ్చి మంచిపని చేశారు. ఇంకా ఎర్లీస్టేజేస్ లోనే వుంది. మేము ఈ కేసులు బాగు చేయలేం మా ఫ్రెండ్ సై కాలజిస్ట్ వున్నారు రాస్తాం. ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి" అనేసి ప్రిస్కిప్షన్ పేడ్ తీసుకొని ఏదో గీకేసి ఇచ్చారు. "ఇదుగో అడ్రస్" అని అడ్రస్ కూడా రాశారు.
హాల్లోంచి బయటికి వచ్చారు ప్రొఫెసర్ గారు. ఏదో అడగబోతున్న మోహన్ ని వారించి ఆయన ఎదుట ఏం మాట్లాడవద్దని సైగచేశారు అరవిందగారు.
"డాక్టర్ గారూ! ఏమిటి మరి! ఏమీ చెప్పలేదు మీరు అన్నారు పృద్వీ.
"ఇతనితో అన్నీ వివరంగా చెప్పాను. ఈ అబ్బాయి వెంట వెళ్ళండి మీరు" అన్నారు డాక్టరుగారు.
"మరి నేను గోయి తవ్వుకోవచ్చా?" అడిగారు పృధ్వి చిన్నగా నవ్వారు డాక్టర్ గారు "ఓ! అలాగే. దానికేం భాగ్యం ముందు నేను చెప్పిన చోటికి వెళ్ళిరండి ఆ తర్వాత ఆపరేషన్ థియేటర్ లో ఏం ఖర్మ? నా బెడ్ రూమ్ లో గుంట తవ్వుకుందురుగానీ వెళ్ళిరండి" అన్నారు.
ఇక క్షణం ఆలస్యం చేయకుండా ప్రొఫెసర్ గారి చెయ్యిపట్టుకుని రోడ్డుమీదకి వచ్చేశాడు మోహన్.
వాళ్ళు వెళ్ళినవైపు చూసి జాలిగా నవ్వుకున్నారు డాక్టర్లు.
"ఏమిటి మోహన్! ఏం చెప్పారు డాక్టర్ గారు?" ఆత్రంగా అడిగాడు పృధ్వి.
"సైకియాట్రిస్టు దగ్గరికి తీసికెళ్ళమన్నారు!"
ఆ సమాధానం విన్న ప్రొఫెసర్ గారికి చాలా కోపం వచ్చేసింది. "ఈయన్ని చూసి ఏదో మర్యాదస్తుడుకదా అని ఆశపడ్డాను, ఈయనా అందరిలాటివాడే. కానీయ్ చూస్తాను ఇలా జనం నన్ను హేళన చెయ్యడం నాకు కొత్తేంకాదు వీళ్ళు ఎగతాళి చేసినంతమాత్రాన నేను ఊరుకుంటానా? నా పరిశోధన ముగిసి గమ్యం చేరేవరకూ ఆగను" అన్నారు ఆవేశంగా.
పలకరిస్తే తన్నేలా వున్న ఆయన్ని చూసి తను ఆడగాలనుకున్న ప్రశ్న అడక్కుండానే ఆగిపోయాడు మోహన్.
ఇంటికి వెళ్ళాక అప్పుడడిగాడు. అప్పటికి పృధ్విగారుకూడా చల్లబడ్డారు.
"సార్! మనం నిన్నా ఇవాళా అక్కడికి ఎందుకు వెళ్ళాం? దీపిక గారి పని అన్నారు ఏమిటది? అసలు మీరు చేస్తున్న రీసెర్చ్ ఏమిటి?
ఎంతో కుతూహలంతో అడుగుతున్న మోహన్ వంక ఆదరంగా చూశారు పృధ్వి.
"చెప్తాను తలుపులు వేసిరా! ఈ పూట దీపికని రావద్దని చెప్తాను. పద లోపలికి వెళ్దాం. ఇక్కడ చెప్పను. గోడలకు చేవులుంటాయి" అంటూ లోపలి గది దాటి మరో పెద్ద గదిలోకి తీసుకెళ్ళారు.
కిటికీలు మూసేసీ వున్నాయి ఆ గదిలో. అది ప్రొఫెసర్ గారి లేబొరేటరీ. గోడలనిండా మేవులు. ప్రపంచపటాలు కానీ వాటిల్లో ఏదో కొత్తదనం. మామూలు వాటిలా లేవు. వింతగా తమాషాగా వున్నాయి.
మామూలు మెప్స్ లో కిందనుండే ఆఫ్రికా ఈ మేప్ లో పైన వుంది. ఆస్టేలియా కుడిప్రక్కన పైవేపుకు వుంది. అమెరికాలు రెండూ మేవుకి చెరో వయవునా వున్నాయి. చూస్తుంటే ఆశ్చర్యం వేసింది మోహన్ కి.
"సార్ ఈ మేప్స్!" ప్రశ్నార్థకంగా చూశాడు.
చిన్నగా నవ్వేరు పృధ్వి. ఆ నవ్వులో గర్వం కనిపించకనే కనిపిస్తోంది.
"మోహన్ నీ ఆత్రుత, నీ కుతూహలం గమనించాను.
ఈ విజ్ఞానం వుందే. అది అఘాతమైనది. ఆకాశంలో చుక్కలని లెక్క పెట్టొచ్చు. సముద్రంలోని నీటిని కొలవచ్చు కానీ ఈ విజ్ఞానానకి అంతం మాత్రం కనిపెట్టలేము. మనిషి పుట్టాక ఇప్పటి వరకూ ఎన్నో యంత్రాలు కనిపెట్టాడు. ఎంతోమంది సైంటిస్ట్స్ అహొరాత్రులూ తిండీ నీళ్ళూ మర్చిపోయి శ్రమించారు. ఎన్నో కొత్తవిషయాలను కనుగొన్నారు.
ఇంకా ఎన్నో వింతలూ విచిత్రాలూ వున్నాయని నిరూపిస్తారు. వారిలో నేనూ ఒకడిని.
నేను గొప్ప నిజాన్ని బయట పెట్టబోతున్నాను. దాదాపు ముప్ఫై అయిదు సంవత్సారాలుగా పరిశోధించి ప్రపంచంలో ఎవరూ కనిపెట్టలేని నిజాన్ని కనిపెట్టాను. నా నిరంతకృషి ఫలించే సమయం దగ్గర పడింది. మరికొన్ని సందేహాలున్నాయి. ఆ సందేహ నివృత్తి కాగానే ప్రపంచానికి చాటి చెప్తాను నాకూ, నాతో పాటు మనదేశానికీ పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి."
నిశ్శబ్దంగా వున్న ఆ గదిలో గంభీరంగా వినిపిస్తోంది ప్రొఫెసర్ గారి కంఠం మోహన్ కళ్ళు పెద్దవి అయ్యాయి. నుదట చెమటపట్టింది. ఒళ్ళంతా చెవులు చేసుకుని వింటున్నాడు
ఆయన ఆపగానే "ఏమిటిసార్? ఏమిటా సత్యం?" అన్నాడు ఉత్కంఠ భరించలేక.
మోహన్ వంక వాత్సల్యంగా చూశారాయన! "చెప్తాను నాయనా! నిన్ను నా స్వంత మనిషిగా భావించి నా రహస్యం చెప్పేస్తున్నాను. ఎవరితోనూ చెప్పకు.
ప్రపంచం అంతా అనుకునేలా భూమి గుండ్రంగా లేదు. బల్ల పరుపుగానే వుంది.
ఈ విషయం నేను ఖచ్చితంగా చెప్పగలను" అంటూ తన పరిశోధనా రహస్యాన్ని బయట పెట్టేశారు. అందరూ అపోహపడేలా మహాసముద్రాలు అయిదులేవన్నారు. అంతా కలిసి ఒకటే అన్నారు. ఆ ఏకైక మహా సముద్రంలో భూమి తేలుతూ వుంటుందన్నారు నదిలో బల్ల చెక్కలా, వైన్ గ్లాసులో ఐస్ ముక్కలా తేలుతూ వుంటుందని సోదాహరణంగా వివరించారు. దిక్కులు కూడా నాలాగులేవన్నారు రెండే దిక్కులున్నాయి. వాటికి పేర్లు తానింక నిర్ణయించలేదని తెలియజేశారు.
ఇంకా ఏమిటో చెప్పబోతూ మోహన్ వంక చూసి ఠక్కున ఆపేశారు నిలబడిన చోటనే కూలబడి పోయి పిచ్చి చూపులు చూస్తున్నాడు మోహన్. అతన్ని ఆ స్థితిలో చూసిన పృధ్వి గారికి మరింత ప్రేమ పెల్లుబికింది దగ్గరగా వచ్చి భుజంమీద చెయ్యివేశారు. "మోహన్ రిలాక్స్ ఏదైనా అద్భుతమైన విషయం వినగానే యిలాగే నిర్ఘాంతపోతాం" అన్నారు ఆదరంగా అంతేకాదు చల్లటి నీళ్ళు కూడా తెచ్చి ఇచ్చారు అవి తాగి కొంచెం తేరుకున్నాడు మోహన్.
మళ్ళీ తన ఉపన్యాసం ప్రారంభించారు పృధ్వి. భూమి తన చుట్టూ తిరగడం శుద్ధ అబద్దం అన్నారు. ఆ సముద్రంలో తేలుతూ ఆ చివర్నించి ఈ చివరికి, ఈ చివర్నించి మళ్ళీ ఆ చివరికి తిరుగుతుంది అన్నారు. అలా తిరిగి నప్పుడల్లా సంవత్సరం మారిపోతుందన్నారు.
చెవులప్పగించి వినడం తప్ప నోరెత్తలేదు మోహన్. అలా చెప్పి చెప్పి యిక ఈ పూటకి చాల్లే నాకు టైం అయింది. మిగిలిన విషయాలు రేపోసారి మళ్ళీ మాట్లాడుకుందాం అన్నారు. అన్నదే ఆలస్యం నాలుగు అంగల్లో బయటపడ్డాడు.
ప్రొఫెసర్ గారి మాటలు, ఆయన గోల అనుమాన స్పదంగా తోచాయి తలోంచుకు నడుస్తూ అదే ఆలోచించసాగాడు. ఆరోడ్ చివర పోస్ట్ డబ్బా, దాదాపు అరవై ఏళ్ళ వయసుగల ఒకాయన ఉత్తరం పోస్టు చెయ్యడానికి వచ్చాడు. ఆయన్ని చూసి హఠాత్తుగా ఏదో ఐడియా తట్టింది మోహన్ కి.
దగ్గరకు వెళ్ళి "చూడండి! మీరు చాలా కాలంగా ఇక్కడే వుంటున్నారా!" అని అడిగాడు.
మీకు ప్రొఫెసర్ గారితో పరిచయం వుందా?" అడిగాడు.
"ఏ ప్రొఫెసర్ గారూ?" అడిగాడాయన.
"ఆయనేనండి, ప్రొఫెసర్ పృధ్వి చెప్పాడు మోహన్.
చిన్నగా నవ్వేడు ఆయన. "ఆయనా తెలియకేం బాగా తెలుసు ఒకరకంగా చెప్పాలంటే వేపకాయంత వెర్రి వుందాయనకి."
"మరి ఆయనకీ ఉద్యోగం సద్యోగం లేదా?"
"జేరిన కొత్తలో బాస్ తో దెబ్బలాట పెట్టుకుని రిజైన్ చేసేశాడు మళ్ళీ ఉద్యోగం మాటే ఎత్తలేదు" చెప్పాడాయన.
