మీ భరణి."
ఉత్తరం చదువుతూన్న రామానుజంగారి కళ్ళు నీటి కుండలయ్యాయి. 'భరణి బంగారుతల్లిరా' అన్నారు. ఉత్తరం సరోజినికి చదివి వినిపించారు. సరోజిని మాట్లాడలేదు. చీర కొంగుతో కళ్ళద్దుకుంది.
ఈమధ్య పని మనిషి వీరమ్మ వంటచేసి పెడుతోంది. నాలుగిళ్ళలో పని చేసుకునే దానిని నాలుగిళ్ళూ మానిపించేసి, ఆ జీతం మొత్తం వీళ్ళే ఇచ్చేలాగా మాట్లాడిపెట్టింది కోటయ్యగారి భార్య సూర్యకుమారి. వీరమ్మ అందించిన కాఫీ తాగి మొహం కడుక్కుని సిగ చుట్టుకుని, బట్టలు మార్చుకుని కూర్చుంది సరోజిని.
కోటయ్య, రామానుజంగారు కలిసి బ్యాంకుకెళ్లారు. డ్రాఫ్టు పని చూసుకుని, పాస్ పోర్ట్ ఆఫీసుకీ, భరణి స్పాన్సర్ చేసిన ఉత్తరం తీసుకొని హెల్తు సెక్రటరీ దగ్గరికీ వెళ్ళి మొత్తానికి ప్రయాణ కార్యక్రమం ప్రారంభించారు.
నాలుగు రోజుల్లో పాస్ పోర్ట్ లు వచ్చేస్తాయి. ఆ ట్రావెల్ ఏజంటే, వీసా కూడా తొందరగా రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే వీసాకోసం, రామానుజంగారు, సరోజినీ తప్పనిసరిగా మద్రాసు వెళ్లవలసొచ్చింది. రామానుజంగారు కోటయ్యగారినీ, ఆ ట్రావెల్ ఏజంట్ ని కూడా రమ్మన్నారు. పన్లు తొందరగా కావాలని, నలుగురూ ఫ్లయిట్ లోనే వెళ్ళారు.
సరోజిని బాధ చూడలేక ఆమె మాట కాదనలేక, మనసు చంపుకుని రాగిణిని చూడ్డానికి బయలుదేరారు. రాగిణీ, భార్గవులు ఇంట్లో లేరు. ఆ రోజు ఎక్కడో పార్టీ వుందని, వాళ్ళు ఇంటికొచ్చేసరికి దాదాపు రాత్రి తొమ్మిది కావొచ్చుననీ...... నౌకరెవరో చెప్పారు. హైదరాబాద్ నుంచి మీ అమ్మా, నాన్న వచ్చారని చెప్పమంది సరోజిని. హోటల్ వుడ్ ల్యాండ్స్ లో దిగామని కూడా చెప్పమన్నారు కోటయ్యగారు.
తొమ్మిదిన్నర దాటుతున్నా రాగిణి రావడంగాని, ఫోను కాని రాకపోయేసరికి, సరోజిని ఆందోళనను గ్రహించిన కోటయ్యగారే సలహా ఇచ్చారు. "మనమే వెళదాం రండి" అని.
"కోటయ్యగారూ! రాగిణి ఎలాగైనా ఈ సినిమా ఫీల్డు ఒదిలేసి వచ్చేలా చూడండి. కాపురం ఎలాగూ కూలిపోయింది. కనీసం, బిడ్డతోపాటు తనూ అక్కడే ఊటీలో వుండమని చెప్పండి. మేమిద్దరం అమెరికా వెళ్ళిపోతే, అదొక్కర్తీ హైదరాబాదులో వుండిమాత్రం ఏం చేస్తుంది? శిల్పకిప్పుడు తల్లెవరో తెలిసిపోయింది! శిల్ప బాగోగులు చూసుకుంటూ ఊటీలో వుండడమే శ్రేయస్కరం! రాజేష్ ఇండియాలోనేలేడని తెలిసింది. మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడని కూడా అన్నారు. ఒకవేళ రాగిణి ఎవరినైనా వెళ్ళి చేసుకోవాలనుకుంటే, పెళ్ళయి భార్యాబిడ్డలున్న వాళ్లనీ, సినిమా వాళ్ళనీకాక, శిల్ప బాధ్యతలు కూడా స్వీకరించగల వాడిని చూసి పెళ్ళి చేసుకోమని చెప్పండి." కళ్ళనిండా నీళ్ళునిండి, దుఃఖంతో గొంతు పూడుకుపోయింది. ఒక్క నిమిషం మాట్లాడలేకపోయింది.
"నువ్వెక్కువగా ఆవేశపడిపోయి మాట్లాడకు" అన్నాడు రామానుజంగారు మంచి నీళ్లందిస్తూ.
సరోజిని వినిపించుకోలేదు. మనసులో వున్నదంతా కోటయ్య గారితో చెప్పుకుంటే తప్ప. హృదయం తేలికపడేలా లేదు.
"కోటయ్యగారూ! కన్నతల్లిగా దాన్ని సరైన తోవలో పెట్టలేకపోయాను. ఆ రోజే దాని ఆట కట్టించి, రాజేష్ తో కాపురానికి పంపించి వుంటే ఈనాడు దాని బ్రతుకిలా బుగ్గిపాలయ్యేది కాదు! ఒక విధంగా నేనే బాధ్యురాలిని! ఈ సినిమా వేషాల గురించి కూడా నేనే ప్రోత్సహించాను. నేను ఒకే దృక్పథంతో ఆలోచించాను కానీ, సమస్యని అన్ని కోణాల నుంచీ ఆలోచించి చూడలేకపోయాను. రాతా గీతా ఎలా వున్నా...... కన్నతల్లిలా కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వహించలేకపోయాను."
"సరోజినిగారూ! అయిపోయినదాన్ని గురించి విచారించడం కన్నా, అవబోయేదాన్ని గురించి ఆలోచించడం మిన్న! రాగిణికి మీరు చెప్పిన మాటలన్నీ చెబుతాను. ఊటీలో సెటిలయ్యేలా చూస్తాను, సరేనా? మీరు బాదపడకండి! ఆ...... పదండి పోదాం" అంటూ లేచారు కోటయ్యగారు!
రామానుజంగారు కూడా లేచారు. కారు దగ్గరికి నడిచారు.
పన్లన్నీ గబగబా అవ్వడానికి, వీలుగా వుంటుందని వచ్చినప్పటి నుంచీ ఒక టూరిస్టు టాక్సీని మాట్లాడి పెట్టుకున్నారు.
టాక్సీ ఇంటి ముందు ఆగింది. "ఇంకా రాలేదమ్మా! వచ్చే టైమయింది" అంటూ లోపలికి తీసికెళ్ళి కూర్చోబెట్టాడు నౌకరు. ఆ గది నిండా రకాల ఫోజుల్లో, రాగిణి ఫోటోలు! కొన్ని ఫోటోలు అర్థ నగ్నంగా కూడా వున్నాయి. కోటయ్యగారూ, రామానుజంగారు వాటిని చూడలేక తల దించుకున్నారు. సరోజినికి కూడా వంటిమీద జిల్లపురుగో, గొంగళిపురుగో పాకినట్టనిపించింది. అందరూ మౌనంగా కూర్చున్నారు.
ఒక అరగంట దాటిపోయింది. రాగిణి, భార్గవలు కారు దిగి ఒకరి భుజాల మీద ఒకరు వాలిపోతూ, లోపలికొచ్చారు. వారిని చూడగానే అర్థమయిపోయింది అందరికీ...... వాళ్లు తాగొచ్చారని! వీళ్ళందరినీ చూడగానే గతుక్కుమన్నారిద్దరూ. "అమ్మా! ఎప్పుడొచ్చారు" అంది రాగిణి హాండ్ బాగ్ టీ పాయ్ మీద పెడుతూ.
సరోజినికి ఆ వాలకం ఆ వేషం అసహ్యం వేసింది. సమాధానం చెప్పలేదు.
బొడ్డుకిందకి కట్టుకున్న సన్నటి షిఫాన్ చీరా, బాబ్డ్ జుట్టు. జానెడు గుడ్డతో కుట్టించుకు తొడుక్కున్న జాకెట్టు, ముదురు రంగు లిప్ స్టిక్ - ఆ తీరు అసహ్యాన్నే కలిగించింది. భార్గవా, రాగిణి భార్యాభర్తలు లాగే మసులుతున్నారు.
"నాన్నగారూ! బాగున్నారా? కోటయ్యగారూ! నమస్కారం" అంది నిషాతో తడబడుతూ.
అందరూ తలదించుకున్నారు. రాగిణిని ఈ విధంగా చూస్తానని కలలో కూడా అనుకోలేదు సరోజిని. "అమ్మా! నేను తాగానని అనుకుంటున్నావు కదూ! కొంచెం తాగాను. భార్గవ ఫ్రెండ్ పార్టీకి పిలిచారు. కొంచమైనా తాగకపోతే సభ్యత కాదు. అందుకని......."
"ఇంక చెప్పకు. కళ్లారా నిన్ను చూసినందుకు చాలా సంతోషంగా వుంది. భరణికి పెళ్ళయితే రాలేదు. శిల్ప సెలవుల్లో వస్తే రాలేదు. సినిమా, షూటింగూ అంటూ తాగి తందనాలాడుతున్నావు, సిగ్గులేదూ?" కోపాన్నంతా వెళ్ళబోసుకుంది సరోజిని.
రాగిణి మాట్లాడలేదు.
ఇంతలో టెలిఫోన్ మ్రోగింది. నౌకరు ఫోన్ తీశాడు. "ట్రంకాల్ త్రివేండ్రం నుంచి" ఫోన్ భార్గవకందించాడు. ఫోన్ లోపలికి తీసికెళ్ళి మాట్లాడాడు భార్గవ. అతని కేకలను బట్టి, మాటలను బట్టి ఆ ఫోన్ అతని భార్య దగ్గరనుంచే అని అర్థమయింది. అరగంట సేపు టెలిఫోన్ లోనే దెబ్బలాడుకున్నారు. అతని మాటలన్నీ స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఆ దెబ్పలాటకు మూలకారణం రాగిణి అని కూడా ఆ మాటలు వింటున్న వాళ్ళకి అర్థమయిపోయింది.
ఆ వాతావరణంలో ఇంక వుండలేకపోయారు సరోజినీ, రామానుజంగారు. తొందరగా వెళ్ళిపోవాలనే ఉద్దేశ్యంతో అసలు పాయింటుకొచ్చేసింది సరోజిని. "నాన్నగారూ, నేనూ, భరణి దగ్గరికి...... అమెరికా వెళ్ళిపోతున్నాం. వీసాకోసం వచ్చాం ఇక్కడికి!" అంది.
"ఓ.... భరణి బాగుందా?"
రాగిణికి కళ్ళు మూసుకుపోతున్నాయి. తనేం వింటుందో, తనేం మాట్లాడుతుందో అర్థం కావడంలేదు. కాళ్ళు తూలిపోతున్నాయి.
పరిస్థితిని అర్థం చేసుకున్న రామానుజంగారు "ఇక పోదాం పద." అన్నారు సరోజిని కేసి చూసి.
సరోజిని లేచి నుంచుంది.
