Previous Page Next Page 
నా కథవింటావా పేజి 17


    "బాబూ ! చెల్లెల్ని  జాగ్రత్తగా  చూసుకో  నాయనా! ఈ వెధవ లోకం మంచివాళ్ళని  బతకబియ్యదు! అయిందేదో  అయిపోయింది  కానీ  మరోసారి  ఏ అఘాయిత్యానికీ  పాల్పడకుండా  చూడు  బాబూ! సమయానికి పనిమనిషి  చూసి  నా బిడ్డని రక్షించింది. లేకపోతే....నా గుండె  ముక్కలు ముక్కలై  పోయేది" వెక్కి వెక్కి ఏడుస్తున్న  తల్లిని  ఎలా ఓదార్చాలో తెలీక, అలా  ఆమె ఏడవడం  ఆ స్థితిలో  ఎంత  ప్రమాదమో  తెలిసి, విలవిల్లాడిపోతూ, "అమ్మా! ఊరుకో  అమ్మా! నాకే ప్రమాదమూ  రాలేదు. నేను బాగానే వున్నాను. నువ్వేడిస్తే  నామీదొట్టు!" అంటూ తల్లి పక్కన  కూర్చుని  ఆమె చేతిని  తనచేతిలోకి  తీసుకుంది  కావ్య!
    కావ్య చేతిని  గట్టిగా  పట్టుకుని  "కావ్యా! ఎటువంటి పరిస్థితిలోనూ  ప్రాణాలు తీసుకోనని నాకు మాటివ్వమ్మా! నా చేతిలో  చెయ్యేసి  నామీద  ఒట్టేసి  చెప్పమ్మా"! అంది.
    "అమ్మా!"....అరిచింది  కావ్య!
    "కావ్యా! ఒట్టేసి చెప్పమ్మా. అమ్మని అలసట  పెట్టకు!" బుజ్జగిస్తూ  బతిమాలాడు, ఏడుస్తున్న కావ్యని ఊరుకోబెడుతూ  క్రాంతి.
    కావ్య తలెత్తి  అతని కళ్ళలోకి  చూసింది. వాడిపోయిన  పువ్వులా వుంది అతని మొహం. ఈ పదిరోజుల్లోనూ, ఎంతో చిక్కిపోయి, నల్లబడిపోయాడు! ఒక పక్క కన్నతల్లి గుండెపోటుతో, మృత్యువుతో పోట్లాడుతూంటే, మరోపక్క  తోబుట్టువు  ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేసి మృత్యువుతో  పోట్లాడుతూ వుంది. ఇరువురినీ  దక్కించుకోవడం  కోసం ఒంటరిగా, ఎడారిలో నీటికోసం  వెతికినట్టు, ఆరాటపడిపోయిన  క్రాంతిని చూస్తే హృదయం ద్రవించి పోయింది. జన్మ జమలకి నీకు చెల్లెలిగా పుట్టే వరాన్ని కోరుకుంటాను, దేముడు  ప్రత్యక్షమై  నీకేం కావాలీ అని అడిగితే, అనుకుంటూ  తల్లి చేతిలో  చెయ్యి  వేసింది  కావ్య. మరెప్పుడూ  ప్రాణాలు తీసుకునే పని చెయ్యనని  తల్లికి  ప్రమాణం చేస్తూ!
    కావ్య కౌగిలించుకుని  తృప్తిగా  నిట్టూర్చింది  సీతాదేవి!
    "అమ్మా! అన్నం   చల్లారిపోకుండా  రెండు  ముద్దలు తిను" అన్నాడు క్రాంతి.
    కావ్య టిఫిన్  కారియర్  తెరిచి, మెత్తగా  కలిపిన  చారు  అన్నాన్ని  కొంచెం కొంచెం చెంచాతో  తినిపించింది.
    కడుపు  నిండిపోయింది  సీతాదేవికి!
    కావ్య అందించిన  మందులు  వేసుకుని, పిల్లలిద్దరూ  చెరో పక్కా కూర్చొని  కబుర్లు  చెబుతూ  వుంటే, నిద్రలోకి జారుకుంది  మెల్లగా!
                                                                   *    *    *
    వీథి వీధంతా అట్టుడికినట్టు  ఉడికి పోయింది కావ్య పెళ్ళి వార్త. ముక్కూ మొహం తెలీని ప్రతీవారూ  ఒచ్చి  పలకరించి వెళ్ళారు. ఏదో పరామర్శకు  వొచ్చినట్టుగా. వాళ్ళ ప్రశ్నలకి  సమాధానం చెప్పలేక ఉక్కిరి బిక్కిరై పోతున్నారు క్రాంతీ, కావ్య!
    "ఇన్ని అభాండాలు  పడి, పీటలమీద  దాకా  వొచ్చిన  పెళ్ళి కాన్సలయిపోతే, ఇంక ఈ అమ్మాయికి   పెళ్ళవుతుందా? ఆ తల్లి  కోలుకుని  ప్రాణాలతో ఇల్లు  చేరుకుంటుందా?" కొన్ని కంఠాల ప్రశ్నలు.
    "ఆఁ....ఏదీకాదు. ఈ పిల్లకి  పెళ్ళీకాదు. ఆ తల్లి  కోలుకోదు. రెండూ కష్టమే!" కొన్ని కంఠాల తీర్పులు.
    క్రాంతీ  కావ్యలు  ఈ మాటలు  వినలేకపోతున్నారు.
    "అన్నయ్యా! అమ్మను డిస్ చార్జ్ చేసేనాటికి మనమీ ఇల్లు  మారిపోవాలన్నయ్యా! ఈ ఇల్లూ, ఈ పరిసరాలూ  చూస్తే, అమ్మ మళ్ళీ జరిగినవన్నీ తలుచుకుని  మరీ బాధపడుతుంది. పైగా  ఈ పరామర్శలకి  వచ్చే వాళ్ళకి సమాధానం చెప్పలేక సతమతమయిపోతుంది. ఆమెని ఈ మనుష్యులు ప్రశాంతంగా బ్రతకనివ్వరన్నయ్యా! పీక్కుతింటారు  ప్రశ్నలతో! వెంటనే  ఎక్కడైనా  ఊరికి  దూరంగా  వుండేచోటు ఇల్లు చూడు అన్నయ్యా!" అంది కావ్య.
    "నువ్వు చ్పెప్పినది నిజమేనమ్మా! సున్నాలూ, రంగులూ వేసిన ఈ ఇంట్లో ఇక్కడి మనుష్యులమధ్య  మనం వుండలేం! హైదరాబాదుకి వెళ్ళి, అక్కడా  తిరిగి మొహం చూపించలేము. ఇక్కడే ఎక్కడన్నా  ఎవ్వరూ తెలీని చోటుకి వెళ్లిపోదాం" అన్నాడు క్రాంతి. కావ్య ఒక్క నిమిషం ఆలోచించింది! "అన్నయ్యా! నీకింకా  ఆర్నెల్ల చదువుంది. మేమిద్దరమూ బిక్కు బిక్కు మంటూ  ఊరుకాని ఊర్లో  ఎక్కడో పడి వుండడం. నువ్వేమో హైదరాబాద్ లో హోటలు భోజనం. మఠం నిద్రాలాగా  వుండడం, ఇలా తలోరకం  తలోచోటూ  వుండి బాధలు పడలేం అన్నయ్యా!" "కావ్య నేను చదవను! నాకు చదువుకోవాలని లేదు. అందరం ఇక్కడే వుందాం. నేనేదైనా  చిన్న ఉద్యోగం  చూసుకుంటాను." క్రాంతి మాటలకి మతి పోయింది కావ్యకి.
    "అన్నయ్యా! ఇన్నేళ్లూ  ఎన్నో కష్టనష్టాలకి  ఓర్చి, అమ్మ నిన్ను చదివించింది, ఇందుకేనా? నువ్వు ఇంజనీరువి కావాలనీ, నాన్నగారి పేరు నిలబెట్టే ప్రయోజకుడివి కావాలనీ  కోరుతుంది అమ్మ. అంతేకానీ  ఎక్కడో చిన్న ఉద్యోగం చేసుకుంటూ  అనామకంగా  పడివుండడంకాదు" అంది కావ్య.
    "కావ్యా! నేనింక  చదువుకోలేను. నావల్లకాదు. అమ్మనీ, నిన్నూ సుఖపెట్టాలి. నీకు...."
    "అన్నయ్యా! నాకు తెలుసు నీకు మనసు విరిగిపోయిందని! అందుకు కారణం నేనే! నీకు జీవితం మీద విరక్తి పుట్టడానికి, అమ్మా ఈ రోజున  ఆసుపత్రిలో ఈ విధంగా  పడుండడానికీ, నేనేనన్నయ్యా కారణం. నాది దురదృష్టం జాతకం. నాన్న లేకపోయినా, కంటికి రెప్పలా  కాపాడే అమ్మకి సంతోషాన్నివ్వలేకపోతున్నాను. ప్రాణాలు తీసుకుందామన్నా, అదీచాతకాని అసమర్ధురాలిగా  మిగిలిపోయాను."
    "కావ్యా...."
    "మరణానికి  కూడా నామీద కరుణ  కలగలేదన్నయ్యా!"
    "కావ్యా! మరణానికి  కాదమ్మా! జీవితానికి నువ్వంటే కరుణ, మానవత్వానికి  నువ్వంటే మక్కువ. బ్రతుకుకి నువ్వంటే ప్రాణం! నీలాంటి ఆడపిల్లలు, ధైర్యశాలులు దేనికీ జంక కుండా ముందుకు సాగాలి! నువ్వు గొప్పత్యాగశీలివి కావ్యా! పరోపకారం  కోసం నీ పరువును పోగొట్టుకుని, నీ జీవితాన్నీ, భవిష్యత్తునీ, చీకటిచేసుకున్న త్యాగమయివి. నిన్ను హర్షించీ, గౌరవించేబదులు, దూషించి దోషిలా  నిలబెడుతోందమ్మా  సమాజం! సమాజానికి కళ్ళు లేవు. ఒక్క నోరే వుంది. ఆ నోటికీ హద్దులేదు. వాగే ధోరణి ఒక్కటే  వుంది. మన గోడువినే  చెవులులేని  ఈ సమాజం కోసం, మనం చావాలనుకోవడం  అవివేకం. "అన్నయ్యా!" అంటూ అతణ్ణి పట్టుకుని  బావురుమంది కావ్య!
    "కన్నతండ్రికూడా  ఇంతగా అర్ధంచేసుకుని, ఆదరించి  అభిమానించడేమోననిపిస్తుంది  అన్నయ్యా! నిన్ను  చూస్తూ వుంటే, నువ్వు నాకు అన్నయ్యవికాదు, నన్ను లాలించే తండ్రివి అనిపిస్తుంది. నన్ను పాలించే దేముడివనిపిస్తుంది." క్రాంతి చేతులలో మొహం  పెట్టుకుని  ఏడ్చింది.
    "ఊరుకో కావ్యా! మనం ఇలా ఏడుస్తూ కూర్చుంటే  అమ్మ సంగతేమిటి? ఆమె ముందు మనం కన్నీరు పెట్టకూడదు! విచారంగా  కనిపించకూడదు! అప్పుడే ఆమె కోలుకోగలుగుతుంది". కావ్యని ఓదారుస్తూ  అన్నాడు క్రాంతి.
    "కరెక్ట్! ఇంకెప్పుడూ  కన్నీరు పెట్టను. అయితే ఒక్క షరతు!"
    "ఏమిటదీ ?"
    "మనం హైదరాబాదుకే  వెళ్ళిపోతున్నాం! అయితే ఇదివరకు వున్న చోటికి కాదు. వేరే ఎక్కడికైనా, కొంచెం దూరంగా! నువ్వు నీ చదువు పూర్తిచేసి ఫస్టుగా పాసవుతావు! ఈ రెండు విషయాలూ, నాకు హామీ ఇస్తే, ఇంకెప్పుడూ  కన్నీళ్ళు నాకంట్లోకి రానివ్వను."
    "కావ్యా!"
    "నిజం అన్నయ్యా! మా అన్నయ్య మంచి ఇంజనీరు కావాలి! అమ్మకన్న కలలు ఫలించాలి! ఆమె పడ్డ కష్టాలని  మనం, ఆమెని పువ్వుల్లో పెట్టి  పూజించాలి. మనం చూసి ఆమె ఉప్పొంగిపోవాలి! అదే నేను కోరుకునేది అన్నయ్యా!"
    "కావ్యా ! అలాగే చేస్తాను. నా ఫ్రెండుకి  టెలిగ్రామ్  పంపించి హైదరాబాదులో మంచి చోట అద్దె ఎక్కువయినా సరే, మంచి ఇల్లు చూసి పెట్టమని  చెబుతాను. అమ్మని సరాసరి ఫ్లయిట్ లో అక్కడికే తీసుకెళదాం. కొత్త వాతావరణంలో, కొత్త ఇంట్లో కొత్త ఊపిరి పోసుకుని, కొత్త జీవితం కోసం పాటుపడదాం. ఒకే!" అన్నాడు పిడికిలి మూసి బొటనవేలుని  నిలబెట్టి చెయ్యి ఊపుతూ  క్రాంతి.
    కావ్య కూడా అలాగే బొటనవేలుతో  ఓకే....డన్...." అంది. రెండు హృదయాలూ తేలిక పడ్డాయి. కొత్త ఊహలలో  గతంమరుగున పడిపోయింది. బాధలు కరిగిపోయినట్టనిపించింది.
    అన్నా చెల్లెళ్ళిద్దరూ  తృప్తిగా  శ్వాస పీల్చుకున్నారు. తన స్నేహితుడికి, టెలిగ్రామివ్వటానికి  పోస్టాఫీసుకి వెళ్ళాడు క్రాంతి!
                                  12
    రోడ్ నెంబర్ త్రీ, బంజారాహిల్స్, హైదరాబాదులో ఇంటి నెంబరు నూటపది, డాష్ ఆరూ, డాష్ రెండు వందలా ముప్పై నంబరు ఇల్లు ఖాళీగా వుందని, రెండు గదులూ, డ్రాయింగు రూమూ, డైనింగు రూమూ, కిచనూ, పూజ గదీ, స్టోర్ రూమూ, చిన్న కాంపౌండూ, ఇల్లు ఎంతో బాగుందనీ, అద్దె నెలకి రెండువేలనీ, నచ్చినట్టయితే  అడ్వాన్స్ ఇస్తాననీ టెలిగ్రాం పంపించాడు వినోద్  క్రాంతికి!
    "నెలకి  రెండువేలే!" అంది కావ్య!
    "అయితే అయింది. ఇంకొక్క ఆరు నెలల్లో నాకు ఉద్యోగం వస్తుంది కదా! ఏం ఫరవాలేదు. అక్కడయితే, గాలీ వెలుతురూ బాగుంటుంది. అమ్మ మనసుకి  ప్రశాంతత  కలిగించే  వాతావరణం అది. ఆరోగ్యం తొందరగా  కోలుకొంటుంది. అదీకాక  అందరూ  పెద్ద పెద్ద ఉద్యోగస్థులూ, వాళ్లూ వుంటారక్కడ  బాగుంటుంది. అడ్వాన్స్ ఇచ్చెయ్యమని టెలిగ్రాం ఇచ్చేస్తున్నాను." అన్నాడు క్రాంతి.
    "అలాగే" అంది కావ్య!
    వినోద్ ఏర్ పోర్టు  కొచ్చాడు. టాక్సీ తీసుకుని  బయలుదేరారు బంజారాహిల్స్ కి.
    ఇల్లు చూసి ఎంతో మురిసిపోయింది సీతాదేవి! అదొక ఆర్మీ మేజర్ ఇల్లవడం వల్ల అతను  ట్రాన్స్ ఫర్ మీద  వెళ్ళిపోతూ  కొంత ఫర్నిచర్ ని కూడా వొదిలేశాడు. ఫ్రిజ్, రెండు మంచాలూ, డైనింగ్ టేబులూ, అల్మారా మొదలైనవి.
    తల్లికీ తనకీ  మంచాలు ఒక గదిలో సర్దింది  కావ్య! మరోగది క్రాంతిది. అతని టేబులూ పుస్తకాలూ, అతని మంచం వగైరా. డ్రాయింగు రూములో కుర్చీలను అమర్చింది. వంట ఇంట్లోకెళ్ళి చిటికెలో  వంటచేసి తయారయింది. ఆ పూట వినోద్ కూడా అక్కడే భోంచేశాడు.
    కొత్త ఇల్లు కొత్త వాతావరణం ,ప్రశాంతమైన స్థలం  సంతోషంగా వుంది సీతాదేవికి. ఇరుగూ, పొరుగూ వున్నారు. ఒకవైపు ఎవరో  కన్నడంవాళ్ళు, మరోవైపున సిందీవాళ్ళు. రెండిళ్ళవతల  టి.యస్.రావుగారని ఎవరో తెలుగువాళ్ళున్నారు. అందరూ  ఒక్కసారొచ్చి పలకరించి  వెళ్ళారు కానీ, అక్కడలాగా  స్వంత విషయాలు గుచ్చి గుచ్చి అడగడం అవీ లేవు. ఎప్పుడైనా ఎదురుపడితే 'సీతమ్మా' అని పిలిచి మాట్లాడేవారు లేకపోతే లేదు. సీతమ్మ ఆరోగ్యం బాగా మెరుగయింది. మెల్ల మెల్లగా ఇంట్లో పన్లు కూడా చేస్తోంది. ఎప్పుడైనా  జ్ఞాపకమొచ్చి పాతవిషయాలేమైనా  మాట్లాడడానికి  ప్రయత్నిస్తే, ఆమెని మాట్లాడనివ్వడంలేదు క్రాంతీ, కావ్యా!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS