Previous Page Next Page 
గెస్ట్ హౌస్ పేజి 17

"వా...ట్"
"యస్...అసంతృప్తుడైన బిత్రోచి అసంపూర్ణమైన నిద్రావస్థలో వున్నాడు. అతని తాలూకు శక్తులు కోపంతో వున్నాయి. ఆ గెస్ట్ హౌస్ తలుపులు తెరిచి మరుక్షణం ఆ శక్తులు గెస్ట్ హౌస్ తలుపు తెరిచిన వ్యక్తిని పీక్కు తింటాయి. చాలా ఘోరమైన మరణయాతన అనుభవిస్తాడు. బిత్రోచిని సంతృప్తి పర్చాలంటే ముందుగా ఎవరినైనా పంపించాలి..."
"అంటే?"
"ఆ గెస్ట్ హౌస్ తలుపులు తెరిచే 'గట్స్' ఉన్న వ్యక్తి కావాలి..."
"ఎవరైనా అమాయకుడ్ని అక్కడకి పంపిస్తే సరిపోతుంది?"
"తెలివి, ధైర్యం, ఆత్మ విశ్వాసం ఉన్న వ్యక్తి కావాలి...తెగింపుతో అడవిదాటి, గెస్ట్ హౌస్ చేరుకునే వ్యక్తి ఎవరుంటారు? చిత్రావతి సమీపంలో ఉన్న ఆ అడవి క్రూర జంతువులతో నిండివుంది.
గెస్ట్ హౌస్ పరిసర ప్రాంతంలో బిత్రోచి అనుచర క్షుద్ర శక్తులు పహారా కాస్తాయి. వాటిని దాటుకొని గెస్ట్ హౌస్ తలుపులు తెరిచిన మరుక్షణం...గెస్ట్ హౌస్ లోపల అసంతృప్తితో క్షుద్ర శక్తులు విరుచుకుపడతాయి.
గెస్ట్ హౌస్ తలుపులు తెరిచిన వ్యక్తిని ఆహారంగా స్వీకరిస్తాయి. బిత్రోచి కోపాగ్ని చల్లారిపోతుంది. అప్పుడు మనం ఆ గెస్ట్ హౌస్ లోకి అడుగు పెట్టగలుగుతాం..." చెప్పాడు పీటర్సన్.
"ఇంత పెద్ద ప్రాసెస్ వుందా?" డేనియల్ అడిగాడు.
"అవును"
"అయితే ఇప్పుడేం చేద్దాం?"
"మనమో ప్రకటన ఇవ్వబోతున్నాం..." అన్నాడు పీటర్సన్.
"ప్రకటనా? ఏమని?"
"చెబుతాను...పెన్ను, పేపర్ పట్రా..."
డేనియల్ పెన్నూ..పేపర్ తీసుకు వచ్చాడు. పదిహేను నిమిషాల తర్వాత పేపర్ డేనియల్ కు ఇచ్చి "ఈ ప్రకటన ఓ ప్రముఖ పత్రికలో బాక్స్ ఐటమ్ వచ్చేలా చూడు...ఇంటర్ వ్యూ హోటల్ స్టార్ నైట్ లో...రూమ్ నెంబర్ పదమూడులో..." అని ఆగి...      
"ఎందుకంటే పదమూడు...థర్టీన్ వెరీ బ్యాడ్ నెంబర్... ఆ నెంబర్ గదిలో ఇంటర్ వ్యూని క్షుద్ర ప్రేతాత్మలు కూడా తిలకిస్తాయి..." నవ్వి చెప్పాడు పీటర్సన్.

                                                * * *
హోటల్ చోళా రెసిడెన్సీ...
కాన్సరెన్స్ హాలు ఎగ్జిబిషన్ హాలుగా మారింది. దేశంలోని ప్రముఖ చిత్రకారుల చిత్రాలు, వర్ధమాన పెయింటర్స్ పెయింటింగులు...ఆ హాలుని చిత్రాల మయం చేసి కనువిందు చేస్తున్నాయి.
నచికేత, సూరజ్, సూర్యనారాయణ, ప్రభు, విలియమ్స్ ఆ హాలులో నిలబడి వున్నారు.
ఆ హాలు కళా హృదయంతో నిండిపోయింది. పెయింటింగ్స్ కొనడం హాబీగా ఉన్నవాళ్ళు అందమైన పెయింటింగ్స్ ని తమ ఇంటికి అలంకారంగా మార్చుకోవాలనునేవాళ్ళు...చాలామందే వున్నారు.
తను వేసిన పెయింటింగ్ ని ఆ ఎగ్జిబిషన్ లో పెట్టాడు నచికేత..హాలులో ఎటుచూసినా పెయింటింగ్సే...
"ప్రభూ...ఈ పెయింటింగ్ చూస్తుంటే వండర్ గా వుంది. మామూలుగా కనిపించే చేతివేళ్ళు, ఎన్ని అందాలను ఆవిష్కరిస్తాయో కదా...అలా అలవోకగా కదులుతూ, అధ్బుతాలను సృష్టిస్తాయి..." తనదైన ప్రపంచంలోకి వెళ్తూ అన్నాడు నచికేత.
"నిజమే...ఓ విధంగా మేము అదృష్టవంతులం...ఎందుకంటే నీలాంటి జీనియస్ పెయింటర్ మాకు ప్రెండ్స్ కావడంవల్ల..." ప్రభుతో అన్నాడు.
"అద్సరేగానీ...ఇంతకీ మీ ప్రొఫెసర్ పరమహింస...సారీ సారి...పరమహంస గారెక్కడ?" అడిగాడు ప్రభుని విలియమ్స్.
"వస్తారు...ఈ పాటికే వస్తూ వుండాలి. ఎవరో గెస్ట్ వచ్చారట. గెస్ట్ ని తీసుకుని మరీ వస్తానన్నారు..." అన్నాడు ప్రభు.
వరుసగా ఉన్న పెయింటింగ్స్ ని చూస్తూ పోతున్నారు. ప్రకృతిలోని అందాలను చిత్రకారుల వూహ మాత్రం నుంచి అద్భుత వైచిత్రిగా స్పృశించి సృష్టించారు.
అందరూ ఆ హాలులోని కార్నర్ ప్లేస్ కు వచ్చారు. అక్కడ నచికేత వేసిన పెయింటింగ్ ని గోడకు హేంగ్ చేసారు.

                                        * * *
"నచీ...పెయింటింగ్ చాలా బావుంది..ఎగ్జిబిషన్ లో ఇన్ని పెయింటింగ్ ల మధ్య పెట్టడవల్ల మరింత కళ వచ్చింది" చెప్పాడు విలియమ్స్.
నచికేత నవ్వి ఊర్కున్నాడు.
సరిగ్గా అప్పుడే...ప్రొఫెసర్ పరమహంస అక్కడికి వచ్చాడు.
"హాయ్...ఎవ్రిబడీ...ఆలస్యం చేసానా? సారీ...నాతోపాటు ఓ గెస్ట్ కూడా వచ్చారు. నేను కాస్త స్పీడ్ కదా...నా వెనకే గెస్ట్ వస్తున్నారు. అన్నట్టు వెరీజ్ యువర్ పెయింటింగ్ మిస్టర్ నచీ..." అన్నాడు హాలులో వేలాడేసి ఉన్న పెయింటింగ్స్ వంక చూస్తూ పరమహంస.
"ఇదిగోండి ప్రొఫెసర్" అంటూ తను వేసిన పెయింట్స్ ని చూపించాడు నచికేత.
"వాహ్...వండర్ ఫుల్..." అంటూ ఆ పెయింటింగ్ కు దగ్గరగా వెళ్లి రెండు  నిమిషాలు పరీక్షగా చూసి...చిన్న ఉలికిపాటుతో...
"మిస్టర్ నచీ...వాటీజ్ దిస్...ఆ అడవి...సెలయేరు...నీకు నీకు తెలుసా..." అడిగాడు విస్మయంగా నచికేత వంక చూస్తూ...
"ఏంటి ప్రొఫెసర్ మీరంటున్నది?" అర్ధంకాక అడిగాడు నచికేత. మిగతా నలుగురూ ఆశ్చర్యంగా చూస్తుండిపోయేరు.
"యస్...మిస్టర్ నచీ...ఈ ప్రాంతం పేరేమిటో తెలుసా..." చి..త్రా..వ..తి..ప్రపంచంలో చాలా కొందిమందికి మాత్రమే తెలిసిన చిత్రావతి చెప్పాడు..ఒక విధమైన ఉద్వేగానికి లోనవుతూ...

                                        11
"చిత్రావతా?" అయోమయంగా అడిగాడు నచికేత.
"అవును మైడియర్ యంగ్ బోయ్..." ఒక విధమైన ఉద్వేగానికి లోనవుతూ అన్నాడు.      "నేను ఎన్నో  అడవులు మీద పరిశోధన చేశాను. చాలా కష్టమైన చిత్రావతి అడవిలోకి కూడా వెళ్లాను. కానీ లోపలికంటా వెళ్లే వచ్చాను. బట్...ఒక్కవిషయం నాకు బాగా గుర్తుంది...అది...అది..ఈ అడవి ప్రాంతం...ఈ సెలయేరు..." తనలో గొణుక్కుంటున్నట్టు  అన్నాడు ప్రొఫెసర్.
"ఇది...ఇదెలా సాధ్యం ప్రొఫెసర్?" నాకు ఆ అడవి గురించి మీరు చెప్పేంత వరకూ తెలియదు?" నచికేత అన్నాడు.
"అదే నేనూ ఆలోచిస్తున్నాను...కరెక్ట్ పిక్చర్ వేశావు....చాలా చిత్రంగా వుంది. అసలు ఈ అడవి గురించి తెలిసిన వాళ్ళు ఇండియాలోనే చాలా తక్కువ. అలాంటిది అంత కరెక్టుగా నువ్వెలా ఊహించావు?"
ప్రభు విస్మయంగా చూస్తున్నాడు.
"మిస్టర్ నచికేత...నువ్వు తరచూ నీ కలలోకి అడవి వస్తుందన్నావు కదూ...అందులో ఓ గెస్ట్ హౌస్ కూడా వుందన్నావు గుర్తుందా?" అడిగాడు ప్రొఫెసర్.
"అవును ప్రొఫెసర్"
"ఓసారి బాగా గుర్తుచేసుకో...ఆ అడవి అచ్చం ఇలానేవుందా?
నచికేత ఆ దృశ్యాన్ని విజువలైజ్ చేసుకోవడానికి ప్రయత్నించసాగాడు.
అతని మెదడు ఆలోచనలతో వేడెక్కిపోతోంది.
స్పష్టా స్పష్టంగా దృశ్యం కనిపిస్తోంది...ని..జ..మే తన కలలో కనిపించిన అ..డ..వే...
రెండు చేతులతో కణతలు నొక్కుకున్నాడు నచికేత.
ప్రొఫెసర్ పరమహంస్ నచికేత వేసిన పెయింటింగ్ వైపే చూస్తున్నాడు. క్షణక్షణానికి అతని కళ్ళు పెద్దవవుతున్నాయి.
"హాయ్. మిస్టర్ నచికేత...వాటే వండర్...వాటే వండర్..." అన్నాడు కళ్ళు పెద్దవి చేసి ఆ పెయింటింగ్ వైపు చూస్తూ...
"ఏంటి ప్రొఫెసర్?" అర్ధంగాక అయోమయంగా అడిగాడు ప్రభు.
"ఈ పెయింటింగ్ లో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా? చాలా యాగ్జయిటింగ్ గా అన్నాడు పరమహంస.
"ఈ పెయింటింగ్ లో ఉన్నమ్మాయా? జస్ట్ నా ఊహమాత్రమే ప్రొఫెసర్" అన్నాడు నచికేత.
"న్నో..న్నో..న్నో...మై బోయ్..ఈ పెయింటింగ్ లో ఉన్న అమ్మాయి ఎవరంటే?" అంటూ ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ వైపు చూసేడు.
అప్పుడే ఓ అమ్మాయి నడుచుకుంటూ వస్తూంది.
ఆ అమ్మాయిని చూసిన నచికేతతో పాటు మిగతా నలుగురు ఫ్రెండ్స్ షాక్ కు గురయ్యారు.
ఆ అమ్మాయి నచికేత వేసిన పెయింటింగ్ లో ఉన్న అమ్మాయి పోలికలతోనే వుంది. అదే ముక్కు, అదే మొహం, అవే వేళ్ళు..
"లుక్...లుక్ మిస్టర్ నచికేత...ఇప్పటికైనా ఒప్పుకుంటావా? ఆ అమ్మాయి పోలికలు, నీ పెయింటింగ్స్ లో వున్న అమ్మాయి పోలికలతో ఎలా సరిపోయాయో?" అన్నాడు ప్రొఫెసర్.
"యస్...సార్...బట్...ఎలా...హౌ...హౌ...ఇటీజ్ పాజిబుల్...?" నచికేత గొంతులో చెప్పలేనంత ఆశ్చర్యం.
అప్పటికే ఆ అమ్మాయి ప్రొఫెసర్ దగ్గరకి వచ్చింది.
ప్రొఫెసర్ ఆ అమ్మాయిని నచికేతకు, అతని ఫ్రెండ్స్ కు పరిచయం చేస్తూ..."మీట్ తరళ...
మిస్ తరళ...నా బాల్యస్నేహితుడి కూతురు...మొన్నటిదాకా సింగపూర్ లో వుండొచ్చింది..."
అప్రయత్నంగా చేతులు జోడించి "నమస్తే" అన్నాడు నచికేత
మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? ప్రభు అడిగాడు.
"వాడు చనిపోయాడు" ఆ అమ్మాయి చెప్పేలోపునే ప్రొఫెసర్ భారమైన గొంతుతో చెప్పాడు.
"ఓహ్...సారీ..." అన్నాడు ప్రభు నొచ్చుకుంటున్నట్టు..
ప్రొఫెసర్ తరళవైపు చూసి అందర్నీ పరిచయం చేశాడు.
తరళ నచికేత వేసిన పెయింటింగ్ చూస్తోంది...ఆ పెయింటింగ్ లో ఉన్న అమ్మాయికి, తనకు పోలికలు వున్నాయి.
"ప్రొఫెసర్ ఇదెలా సాధ్యం?" అడిగింది ఆశ్చర్యంగా తరళ.
"దీన్ని కో-ఇన్సిడెన్స్ అనొచ్చు...అతీత శక్తి ప్రభావం అనొచ్చు...చెప్పుకోవాలంటే రకరకాల విశ్లేషణలున్నాయి. దాదాపు యాభైయ్యేళ్ల క్రితం అనుకుంటాను...అమెరికాలో జాన్ స్మిత్ అనే వ్యక్తికి రోజూ నిద్రలో ఓ కల వచ్చేది. ఆ కలలో ఓ అందమైన అమ్మాయి 'ఐ లవ్ యు' అనేదట.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS