ఆ పెద్దమనిషి నావంక తెల్లబోయి చూచి, ఒక్క క్షణం ఆలోచించి "బాబూ, చూశారూ, ఇదీ కారణం అంటూ చెప్పలేనండీ. అసలు ఒక కారణం అంటూ ఉందండీ! ఉత్తినే, జై మంటూ లేస్తుందండీ. నేను అవును అన్న దానికల్లా ఆమెగారు కాదు అంటుంది ఎట్లాగండీ!" అంటూ ఆయన చిట్లించుకొన్నాడు.
"అల్లా అయినట్లయితే మీరే ముందుగా కాదూ అనండీ" అని అన్నాను నేను వేళాకోళంగా.
ఈ మాట పాపం, ఆయనను కష్ట పెట్టింది. దీనంగా చూస్తూ అన్నాడు ఆయనా_"తమరు అల్లాగ సెలవిస్తే కాదు. సిన్ సియర్ గా చెపుతున్నాను. ఈ దిక్కుమాలిన పోట్లాటకు అంతు లేకుండా ఉంది. తమరు...ఏదో...తరణోపాయం చెప్పాలే" అని.
ఆయన్ను చూస్తే నాకు జాలేసింది. కాసేపు ఆలోచించి చివరకు అన్నాను_"అయితే సరే, ఒక చిన్న రహస్యము చెబుతాను వినండి. దాంతో మీకూ...మీకూ...పోట్లాటలు లేకుండా పోతవీ" అని.
ఆయన, పాపం, ముఖం చేటంత చేసుకొని, "అదేనండీ, అల్లాంటి చిట్కా రహస్యాలు చెబుతారనే...తమ దర్శనానికి వెళ్ళిపోవచ్చానండీ" అన్నాడు. "నేను చెప్పేదయినా అంత గొప్ప విషయం కాదు. స్వల్ప విషయమే అనుకోండి" అంటూ నేను ప్రారంభించాను, తమరు చెప్పే విషయమున్నది చూశారూ అది ఎప్పటికీ స్వల్ప విషయం కాదనుకోండీ! సెలవియ్యండి" అంటూ ఆయన కుర్చీని నాకు దగ్గరగా లాక్కొని అత్యంత శ్రద్ధతో వింటానికి తయారైనాడు.
నన్ను ఆరాధించే భక్తుడు ఇన్నాళ్ళకు దొరికినందున నేనూ సంతోషిస్తూ గొప్ప స్త్రీ వశీకరణ మంత్రాన్ని ఉపదేశిస్తున్న వాడిలాగ చూడండీ, మీ విషయంలో చెప్పదగిన రహస్యం ఏమిటీ అంటే...ఆవిడగారు అవును అన్న దానికి మీరెప్పుడూ కాదనబోకండి. మీ భార్యగారు ఇది బాగుందీ అంటే _మీరు బాగుంది, బాగుంది అని తాళం వెయ్యండి. ఆమెగారు దేన్ని చూచి అయినా బాగుండ లేదూ అన్నదా మీరు ఛీ, ఛీ ఏమీ బాగుండ లేదూ అనండి. సంసార స్వర్గ ధామానికి ఇది ప్రథమ సోపానం. తెలిసిందా అండీ?" అన్నాను.
పాపం, ఆయన తలఊపి చిత్తం, చిత్తం. అయితే బాబూ, కొన్ని విషయాల్లో చూడండీ. డబ్బూగట్రా వాడే విషయాల్లో ఆమెగారు చెప్పినదానికల్లా తలఊపితే సంసారము గడవదు. ఏమంటారు?" అన్నాను.
"అవునండీ, ఆ సంగతి నాకు తెలుసు మరీ..."
"అఁహహహ. తమకు తెలియదని గాదు. ఉట్టినే మనవి చేశాను" అన్నాడు ఆయన యెంతో నొచ్చుకుంటూ.
"ఇప్పుడు పండగా పబ్బం వచ్చిందా అంటే, మన తాహతు తెలుసుకోకుండానే అవి కావాలె. ఇవి కావాలె అంటారు ఆడవాళ్ళు వాళ్ళు చెప్పిందానికల్లా మనం సరే అన్నామా అంటే అప్పుల పాలు కావలసిందే. అదే కదూ మీరనటం?" అన్నాను నేను.
ఆ బ్రాహ్మడు మరింత దగ్గరగా లాక్కుంటూ 'అద్గది బాబూ, అదీ అసలు సంగతి, వేధించుకు తింటూన్నదంటే నమ్మండీ! ఏం జేయమని సెలవు?' అన్నాడు.
'ఇప్పుడేం జేస్తున్నారూ?' అన్నా నేను.
'ఏం జేస్తున్నానూ, నా దగ్గర మదువు లేదూ_నేను తీసుకురా లేనూ అని బుర్రనొక్కుకుంటాను బాబూ, మరేమిటి చేసేది. అని జవాబిచ్చాడు.
'అదే తప్పుపని' అన్నా నేను ఠీవిగా, అధికారిలాగ "మరేం జేయమని సెలవు" అంటూ ఆయన నమస్కరించాడు. ఆయన అల్లాంటి భక్తి విశ్వాసాలు చూపటం మూలాన, నాకు తెలియకుండానే నాలో ఒక గర్వంతో కూడిన భావం పరుగెత్తింది.
ఇహ నేనూ మొదలు పెట్టాను భార్యా వశీకరణ సూత్రాన్ని "చూశారూ, అల్లాంటి సమయాల్లో, భార్య కావాలన్న వస్తువులను తీసుకురానూ అని మీరెప్పుడూ అనకండి. విషయాన్ని మీకు ఇప్పుడు సూత్రప్రాయంగా చెప్పానన్నమాట అంటే, తెస్తానూ తెస్తానూ అంటూనే మనం ఆడవాళ్ళను బురిడీ కొట్టించాలె. ఈ వ్యాఖ్యానంతో తమకు బోధపడిందనుకుంటా ఏమంటారు?"
ఈ మాటలు ఆయన శ్రద్ధగా విని తన జన్మ తరించిందన్నంత సంతోషాన్ని పొందినట్లు చూశాడు. "అదీగాక_
ఆమెను లొంగతీసుకొంటే ఆమె ఎప్పుడూ మీ ఇష్టానికి వ్యతిరేకమైన కోరికలు కోరనే కోరదు!" అని మరొక మహత్తరమైన గుప్తరహస్యాన్ని గూడా బయటపెట్టేశాను.
"అదే! అదేనండీ! ఆ లొంగదీసుకొనేది ఎల్లాగో తెలియకే! దాని కేదైనా మార్గం సెలవియ్యాలే" అని మళ్ళీ ఆయన ప్రాధేయపడ్డాడు.
రెండు కళ్ళనూ వేళ్ళతో నొక్కుకొన్నాను, ఒక్కక్షణం తళుక్కున నా కళ్ళ ముందేదో మెరసినట్లు తోచింది. దీర్ఘతపోదీక్షానంతరం జ్ఞానసంపన్నుడైన తథాగతునిలాగ చూస్తూ అన్నాను, "అట్లా అయితేనే చెప్పినట్లు చేయండి. రోజుకు మూడుసార్లు...."
"ఏదైనా క్రియా అండీ?" అన్నాడాయన గుడ్లు పత్తి కాయలంత చేసి ఆశ్చర్యంగా చూస్తూ.
"చెబుతా...రోజుకు మూడుసార్లు అయినా భార్యను ముద్దు పెట్టుకోవాలె" అన్నాను నిమీలిత నేత్రాలతో,
ఈ మాటలు విని ఆయన అరఔన్సు ఆముదం గుటుక్కున మింగినవాడిలాగా వికారంగా చూస్తూ "నాకు నలభై ఎనిమిదో ఏడండి! మా ఆవిడకు నలభై దాటి వుంటై! చికిత్సకు ఇల్లాంటిది కాక మరోరకం అనుపాతం చెప్పటానికి_" అని ఏమో అనబోతుంటే, ఆయనను పూర్తిగా మాట్లాడకుండానే నేనన్నానూ_"ఇటువంటి విషయాల్లో, చూశారూ, వయస్సులో నిమిత్తం లేదు" అని.
"చిత్తం, సరే, అల్లాగే అనుకోండి ఐతే_మా ముసలిదాన్ని రోజుకు మూడుసార్లు_అంటే_త్రికాలముల యందూ ముద్దు పెట్టుకోమని సెలవాండీ?" అన్నాడు. నేను తప్పదన్నట్లుగా తల ఊపాను.
కొంచెం సేపు తలవంచుకొని ఊరుకొని తరువాత మళ్ళీ అన్నాడూ_"చిత్తం. ఇంకా, ఎల్లాంటి ఎల్లాంటి పనులు చెయ్యాలో సెలవిచ్చె సెయ్యండీ" అని నిస్పృహతో.
"ముద్దు పెట్టుకోవటం మొదటి విషయం. అది చెప్పానాండీ! ఇక రెండోది. అధమ పక్షం రోజుకు నాలుగైదు సార్లయినా, నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ భర్త భార్యకు తెలియజెప్పాలె" అన్నాను.
"నేనెప్పుడూ, నాజన్మలో అల్లాంటి మాటలు అని ఎరగనండీ" అని దీనంగా అంటూ ఆయన నా వంక చూశాడు.
జాలి లేకుండా కఠినపథ్యం చెప్పే వైద్యుడి ధోరణిలో "తప్పదండి, నిష్కామకర్మ చెయ్యాలె. పోనీ, పాఠంలాగ ఒప్పజెప్పే సెయ్యండి" అంటూ పెదవి విరిచాను.
ఆయన కళ్ళు మూసుకొని, ధ్యానం చేసుకొని "అల్లాగే ఇంకా"అన్నాడు.
అంతవరకూ తలొంచుకొని ఆలోచిస్తున్న నేను తలెత్తి "ఇంకా ఏమిటి అంటే, ఆమె సుగుణాలను ఎక్కువగా పొగడండి, ఇల్లాంటిదీ అల్లాంటిదీ అంటూ" అన్నాను.
మెదలకుండా కూర్చున్నాడాయన మరోనిమిషం అయింది. "ఇంకా దేముడు మేలుచేస్తే ఆమె సౌదర్యాన్ని గురించి కూడా ఎక్కువగా మెచ్చుకోండి...ఉఁ...అంతే...మరేం లేదు" అని చెప్పాల్సిన విషయాన్ని పూర్తిచేసినట్లుగా తల ఊపాను.
