డాక్టర్ ని కలిసిన తరువాత శివరావు తన భార్యని బెడ్ మీదకు రమ్మని ఎప్పుడూ పిలవలేదు. రహస్యంగా కొంతమంది వ్యభిచారుల వద్దకు వెళ్ళాడు. వారి నుండి శారీరక సుఖం పొందడం అటుంచి ముందుగా వాళ్ళ ప్రవర్తన వెగటు పుట్టించింది స్నేహితులతో కలిసి అమ్మాయిల్ని తీసుకుని బయటి ప్రదేశాలకు వెళ్ళసాగేడు.
ఎంతమంది అమ్మాయిలతో తిరిగినా సెక్స్ పరంగా ఏర్పడిన అసంతృప్తి అలాగే ఉండిపోయింది. దానిని అధిగమించడానికి అతను చేసిన ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇవ్వలేదు. అసలు తనకి కావాల్సిందేమిటో తెలుసుకోలేకపోయాడు. ఇంటి అరుగుపైన కూర్చుని ఎదురింట్లో నివసించే భార్యాభర్తలను కొంతకాలం గమనించాడు. భర్త ఇంటికి రాక ముందే ఆమె స్నానం చేసి, ఉతికిన చీర కట్టుకుని, తలనిండా పూలు పెట్టుకుని అప్పుడే వికసించిన కమలంలా గుమ్మంలో నిలబడి భర్తకోసం చూసేది. అతను వచ్చిన తరువాత ఇద్దరూ లోపలకు వెళ్ళేవారు. హైదరాబాదు నుండి బదిలీ కావడం వల్ల డిగ్రీ చదువుతున్న పిల్లల్ని వదిలి వచ్చారు. సెక్స్ కోసం ఆరాటపడే వయసు కూడా కాదు వాళ్ళది. ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు కనిపించేవారు. చాలా రోజులు వాళ్ళని గమనించిన తరువాత తనకు ఏం కావాలో శివరావుకి తెలిసింది.
తనని అభిమానించే స్త్రీ కావాలి. అటువంటి స్త్రీ దొరికితే తన సమస్యలు చాలావరకు తీరుతాయి. ఆలోచన పుట్టిన తరువాత స్నేహితునితో కలిసి శకుంతల ఇంటికి వెళ్ళాడు. పోలీసులు తీసుకెళుతున్న అర్చనని చూశాడు. ఆ రోజు రాత్రి ఇంటికెళ్లకుండా కాంప్లెక్స్ లో ఓ బెంచిపైన కూర్చుని ఆలోచించాడు. అర్చనని విడిపించి ఆమెతో తన సమస్య చెప్పి ఆమె అంగీకారం పొందాలని నిర్ణయించుకున్నాడు. బీచ్ లో అర్చన చెప్పిన విషయాలు విన్న తరువాత అతని మనసు వికలమైంది. ఆ కారణంగా తన మనసులోని మాట ఆమెకు చెప్పలేకపోయాడు.
* * * *
శివరావు చెప్పడం ముగించిన తరువాత అర్చన చాలాసేపు మాట్లాడ లేదు. ఆమెకు ఏం మాట్లాడాలో తోచలేదు.
తనకి జీవించాలనే కోరిక నశించిన విషయం అతనికి తెలియదు. అవినాష్ మరణం వల్ల కలిగిన దుఃఖం నుండి తేరుకోకముందే పోలీసుకేసులో ఇరుక్కుంది. దాని నుండి బయటపడేసరికి శివరావు తారసపడ్డాడు. తన గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి ఏ మాత్రం ఆవకాశం చిక్కకుండా సమస్యలు వచ్చాయి. తన జీవితాన్ని తీరిగ్గా సమీక్షించుకుంటే మరణం వల్ల మాత్రమే ప్రశాంతత దొరుకుతుందని అనుకునేది.
అలాంటి పరిస్థితిలో ఉన్న తనని జీవితాంతం తోడుండమని అడుగుతున్నాడు. నిర్మొహమాటంగా చెప్పాలంటే అతను తన శరీరాన్ని కోరుతున్నాడు. తన నిర్ణయం పైన అతని జీవితం ఆధారపడి ఉందని అంటున్నాడు. తను కాదంటే ఏం చేస్తాడు? తనలాగే ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడా? ఏమో? తనని ఒప్పించడానికి ఆ మాట అన్నాడేమో? ఆలోచనల నుండి బయటపడి శివరావు మొహంలోకి చూసింది. అతను తన వంకే చూస్తున్నాడు. అతని కళ్ళల్లో ఎటువంటి కల్మషం కనిపించడం లేదు. తన జవాబుకోసం ఆందోళనగా చూస్తున్నట్టుంది మొహం ఆమెకు విపరీతమైన జాలి కలిగింది. జీవితంలో మొదటిసారి ఓ వ్యక్తి తన నిర్ణయం కోసం చూస్తున్నాడనే ఆలోచన ఆమె మనసును కదిలించింది.
"నిన్నటి వరకూ మీరెవరో నాకు తెలియదు. మన పరిచయం అయిన ఈ కొద్దిపాటి వ్యవధిలో నా సమాదానంపైన మీ జీవితం ఆధారపడి ఉందని అంటున్నారు. నేను సమాధానం చెప్పేముందు మీరు నాకో విషయం స్పష్టం చెయ్యాలి...." అంది.
"ఏమిటది?"
"బాగా అలోచించి చెప్పండి. నిన్నటి వరకూ మీ కుటుంబానికి మీవల్ల ఎటువంటి సహాయ సహకారాలు అందించారో, మన పరిచయం తరువాత కూడా ఎలాంటి తేడా లేకుండా వాటిని అందించగలరా?"
రెండు క్షణాలు ఆలోచించి సమాధానం చెప్పాడతను.
"అందించగలను..."
"ఆలోచించి చెప్పండి."
"ఇందులో ఆలోచించడానికి ఏముంది? నా కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చెయ్యాలని నేను అనుకోవటం లేదు."
చిన్నగా నవ్వింది అర్చన.
"అలా అయితే నా పోషణ ఎలా జరుగుతుంది?" అడిగింది.
అర్చన కళ్ళల్లోకి రెండు క్షణాలు చూశాడు శివరావు.
"పరిస్థితులు అర్ధం చేసుకుని, వాటికి తగినట్టు నడవడానికి నాకు కొన్నిరోజులు పడుతుంది. ఆ వ్యవధి నువ్వు నాకివ్వాలి..."
అర్చనకి ఆశ్చర్యం కలిగింది. అతని ధైర్యం చూస్తుంటే, అతను ఏం చేస్తాడో ఆమెకు అర్ధం కాలేదు.
ఆ సంభాషణ అనంతరం శివరావు స్నానం చేసి, అన్నంతిన్నాడు. సిగరెట్ కాల్చిన తరువాత అర్చనతో అన్నాడు.
"నీ రూమ్ కి వెళ్ళి బట్టలు తీసుకొద్దాం...."
"ఇప్పుడా? అంది అర్చన. అప్పటికే తొమ్మిది దాటింది.
"ఇప్పుడయితే మనల్ని ఎవరూ గమనించరు. రాత్రి పదకొండు వరకూ సిటీ బస్సులు తిరుగుతాయి. కాబట్టి వెంటనే వచ్చేయవచ్చు." అన్నాడు.
పది నిముషాల తరువాత ఇంటికి తాళం పెట్టి ఇద్దరూ బయలుదేరారు. శివరావు ఇల్లు కొత్త రోడ్డు దగ్గర కొండ మీద ఉంది. ఇంటి నుంచి బస్ స్టాఫ్ చేరుకోవాలంటే కొంత దూరం నడవాలి. వాళ్ళు కొండ దిగుతుంటే గాజువాకలోని పరిశ్రమల తాలూకు విద్యుద్దీపాల కాంతి స్పష్టంగా కనిపిస్తోంది.
బస్ స్టాఫ్యాభై గజాల దూరంలో ఉండగా వాళ్ళ ప్రక్కన ఒక ఆటో ఆగింది. శివరావు తల తిప్పి చూశాడు. ఆటో నుండి ఒకతను క్రిందకు దిగి అర్చన చెయ్యి పట్టుకుని ఆటోవైపు లాగాడు. అర్చన విస్తుపోయింది. శివరావుకి షాక్ తగిలినట్టయింది. రెండు క్షణాల్లో తేరుకుని ఆ వ్యక్తి వైపు కదిలాడు. మరుక్షణం బరువైన వస్తువు ఒకటి అతని తలను తాకింది.
"అమ్మా...." అంటూ తల పట్టుకుని నేలమీద కూలిపోయాడు.
శివరావుని కొట్టిన వ్యక్తి కూడా అర్చన వైపు వచ్చి బలవంతంగా ఆటో ఎక్కించాడు. అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి, చేతులు తాడుతో కట్టేశారు. క్రిందపడిన శివరావు వైపు ఆందోళనగా చూస్తోంది అర్చన, ఎటువంటి ప్రతిఘటన చెయ్యకుండా. ఆటో అక్కడ నుంచి కదిలింది.
రెండు నిమిషాల్లో శివరావు తేరుకుని లేచి నిలబడ్డాడు. తలపైన దెబ్బ తగిలిన చోటునుండి రక్తం కారుతోంది. తలంతా దిమ్మెక్కినట్టుగా కదుపుతుంటే నరాలు జివ్వుమంటున్నాయి. కర్చీఫ్ తీసి గాయం నుండి కారుతున్న రక్తాన్ని తుడిచాడు.
వాళ్ళు అర్చనని ఎందుకు తీసుకెళ్ళారో అతనికి అర్ధం కాలేదు. ముందే ఆలోచించి పెట్టుకుని దాడి చేసినట్టు కనిపిస్తోంది. అటువంటి సంఘటన తన జీవితంలో ఎదురవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. ఆమెను వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళారు? జవాబు లేని ప్రశ్న మెదడుకి ఆక్రమించింది.
దిక్కుతోచనట్టు కొన్ని క్షణాలు అక్కడే నిలబడ్డాడు.
క్రమంగా అతని బుర్రలో చలనం మొదలయింది. అర్చన గురించి పట్టించుకునే వాళ్ళు ఈ నగరంలో ఎవరున్నారు? రాజమ్మ కంపెనీ గుర్తొచ్చింది. రాజమ్మ కంపెనీ నుండి అర్చన తప్పించుకుంది. అందుచేత వాళ్ళు రాజమ్మ మనుషులే అయి వుంటారు. మనుషుల్ని పురమాయించి బలవంతంగా అమ్మాయిల్ని తెప్పించుకునే స్తోమతు శకుంతలకి లేదు, అలా ఆనుకున తరువాత అంచనా నిజమని అనుకున్నాడు.
ఇప్పుడెలా?
అర్చనని విడిపించాలంటే రాజమ్మ కంపెనీ ఆమె చేరకముందే విడిపించాలి. కొత్త రోడ్ నుండి రాజమ్మ కంపెనీ పదికిలోమీటర్లదూరంలో ఉంది. ఆటో అక్కడికి చేరాలంటే అరగంట పైనే పడుతుంది. అంటే ఇప్పుడు ఆటో మర్రిపాలెం చేరుతుంది. ఏం చెయ్యాలి? తల విదిలించాడు. నరాలు జివ్వుమన్నాయి. అప్పుడే గమనించాడు దూరంగా లైట్లు వెలిగి ఆరడం.
పరీక్షగా చూశాడు.
క్రొత్తగా ప్రారంభించిన బార్ అండ్ రెస్టారెంట్ దీపాలవి. ఆ దీపాలు రంగు రంగుల్లో వెలిగి ఆరుతున్నాయి. అదికాదు అతన్ని ఆకర్షించింది. దీపాలు బార్ పేరు సూచించడం వల్ల దూరానికి కూడా ఆ పేరు స్పష్టంగా కనిపిస్తోంది.
ఆలస్యం చెయ్యకుండా సెంటర్ వైపు పరిగెత్తాడు.
6
ఉదయం తొమ్మిది గంటలకు గాజువాకలో బస్సు దిగాడు రామకృష్ణ.
