Previous Page Next Page 
యువత నవత పేజి 17

 

    తిట్టేందుకు అక్కడేముంటుదో తెలియలేదు సుధకు.

    "మళ్లీ మహిళా సమాజంలో జేరితే మిషనిప్పిస్తవా?" అని ఒకామె అడిగింది.

    "అడిగిన వాళ్లందరికీ మిషన్లివ్వడానికి నాకు మిషన్ల  ఫ్యాక్టరీ లేదు! ఎన్ని అడిగితే అన్ని ఇచ్చేందుకు గౌవర్నమెంటులో  నాకు చుట్టమూ లేడు.  మహిళాసంక్షేమం కోసం గవర్నమెంట్ ఎన్ని సంక్షేమ పధకాలు చేపట్టినా, ఫండ్స్ మాత్రం చాలా కొద్దిగా,  బొటాబొటి అన్నట్లుగా వుంటాయి ఆవిషయం మీరు గుర్తుపెట్టుకోవాలి! నాకున్న తాహతులో ప్రయత్నించి ఇక్కడ ఒక కుట్టు సెంటరు పెట్టివ్వగలను! ఒకటి రెండు మిషన్ల తోపాటు కుట్టు నేర్పడానికి ఒక టీచరుని ఇస్తారు.  వెల్ ఫేర్ తో కాంటాక్ట్ చేసి ఒకటి రెండు మిషన్లిప్పించగలను!

    "అయితే ఇలా కుట్టుమిషన్లకోసమో, కోళ్లఫారం కోసమో ఈ మహిళా సమాజాలు కాదని మీరు గుర్తుపెట్టుకోవాలి!  మీరు ఎలాగూ ఇరుగూపొరుగూ కలిసి ఏవో  కబుర్లు చెప్పుకుంటూనే వుంటారుకదా? ఆ చెప్పుకొనేది ఏదో మహిళా సమాజం అని ఒకటి ఏర్పాటు చేసుకొని వారానికి ఒకటి రెండు సార్లు మీటింగ్ అయి చెప్పుకోవచ్చు. కష్టసుఖాలు చెప్పుకోవడంలో తప్పేమీలేదు! కాని, "పుల్లిమీద ఎల్లి, ఎల్లిమీద పుల్లి" అన్న చాడీలుమాత్రం వద్దు. మీ బ్రతుకు  తెరువుకు ఉపయోగపడేవి చెప్పుకోండి. ఇంతకంటే మెరుగ్గా జీవించడానికి ఏంచేస్తే బాగుంటుందో మాట్లాడుకోండి. విజ్ఞానం కలుగజేసే కబుర్లు చెప్పుకోండి. మీకున్న సమస్య లేమిటి? ఆ సమస్యలనుండి  బయట పడడానికిమీరేం చేయాలి? మీలో విజ్ఞానం, చైతన్యం కలిగించే మంచి మంచి పుస్తకాలు, పత్రికలు నేను తెప్పించి పెడతాను. మీరు చందా వేసుకొని ఆడబ్బు ఇచ్చినాసరే, లేకపోతే నీ జీతంనుండి కొంత ఖర్చుపెట్టి తెప్పించి ఇస్తాను. చదువొచ్చిన వాళ్లు చదువు రానివాళ్లకు చదివి వినిపించండి. వాళ్లని మీతోపాటు విజ్ఞానవంతుల్ని చేయండి."

    రెండు మూడు నెలల శ్రమ ఫలంగా ముప్పైమంది సభ్యులతో ఒక మహిళా మండలి ప్రారంబోత్సవం చేసేరోజు వచ్చింది.

    మహిళా మండలి మీటింగులు జరుపుకోవడానికి ఆ ఊరి పెద్దరెడ్డి గారి కోడలు తన లంకంత ఇంట్లో ఓ గది కేటాయించింది. ఆవిడే మహిళా మండలి ప్రెసిడెంట్ గా ఉండటానికినిర్ణయమైంది. ఆవిడపేరు సత్యవతి అయిదోతరగతి వరకు చదువుకుంది. చిక్కిన పుస్తకమల్లా తెగ  చదివేస్తూ వుంటుంది.

     పల్లె టూళ్లలో సాధారణంగా డిటెక్టివ్ పుస్తకాలంటే మోజెక్కువ. అక్షర జ్ఞానం వుండి కాస్త తెల్లబట్టలేసుకున్న ఏ మగవాడి చేతిలో చూసినా ఏ డిటెక్టివ్ పుస్తకమో దర్శనమిస్తూ వుంటుంది. ఊళ్ళో అవే ఎక్కువ దొరుకుతాయి. కనుక కాస్త చదవగలిగిన ఆడవాళ్లు అవే చదివేస్తూ వుంటారు.    
   
    సుధ ఎప్పుడు వచ్చినా సత్యవతి చేతిలో డిటెక్టివ్ పుస్తకం పట్టుకు కనిపిస్తుంది.

     "అరే! ఎప్పుడు వచ్చినా మీ చేతిలో ఆ డిటెక్టివ్ పుస్తకం వుంటుంది. లక్ష్మీదేవి చేతిలో కమలం పువ్వు వున్నట్టుగా , సరస్వతి చేతిలో వీణ వున్నట్లుగా పార్వతి చేతిలో త్రిశూలం వున్నట్లుగా మీ చేతిలో అహర్నిశలూ ఆ డిటెక్టివ్ పుస్తకం వుండేట్టుంది" అందిసుధ ఒకరోజు  ఛలోక్తిగా.

     "పొద్దుపోదు! ఏం జెయ్యాలి మళ్లీ?"

    పది పన్నెండు గెడాలున్న  పెద్దకాపులు వాళ్లు. నీళ్లు తేవడం, వంట చేయటం జీతగాళ్లే చేస్తారు.  అజమాయిషీకి అత్తగారుంది. సత్యవతికి పనేం వుండదుమరి. పెద్దకాపులు గనుక ఎవరిళ్లకూ వెళ్లి కబుర్లు చెప్పుకోడానికి లేదు. అందరూ వీళ్లింటికే వచ్చి కబుర్లు చెప్పాలి మరి.

     "ప్రొద్దుపోకపోతే మీ పెరడు చాలా పెద్దదిగా వుంటుందికదా?"పెరటి తోట పెంచితే ఏమౌతుంది? మీపెరట్లో చేదుడుబావి వుండనే వుంది చిన్న మోటారు బావికిపెట్టేస్తే బోలెడన్ని నీళ్లు తోటకు. చెట్లు పెంచడంలో ఆనందం ఒకసారి రుచిచూస్తే మరి వదలరు?"

    "ఎద్దులొచ్చి పడతాయి! ప్రక్కనే ఎద్దుల మాలె వుంది"

     "తోట పెంచాలని అభిలాష ఏర్పడితే కట్టుదిట్టాలు చేసుకోవడం ఎంతపని?"

    "పసులు రాకుండా కట్టుదిట్టంచేస్తే కోళ్లు కెలుకుతయి.వాటినేం చేస్తం?"

    "తోట పెంచాలని అనుకొంటే కోళ్లు కెలక్కుండా జాగ్రత్త తీసుకోలేరా? మీకు కావలసిన విత్తనాలను మా సమితినుండి సప్లయ్ చేస్తాం! జామ, మునగ,బొప్పాయి, కరివేపాకు - ఇవి వున్న ఇంట్లో అనారోగ్యం వుండదు."

    "రెండు ఆనపతీగలు మిద్దెకు పాకించాలని విత్తనాలు వేస్తేనే కోళ్లు వాటిని వుంచవు! పాదు కెలికి పెట్టేస్తాయి! పాదులువేసి, విత్తనాలువేసి నీళ్లు పెట్టి, అంత శ్రమపడి చేస్తే తీరా కోళ్లు కెలికేస్తేనో , పశువులు మేసేస్తేనో ఎంత బాధ ప్రాణం వుసూరుమంటుంది."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS