Previous Page Next Page 
చక్రవ్యూహం పేజి 17

    "లేదు...నాకూ ఉత్సాహంగానే  వుంది.   జీవితంలో ఏదో ఓ థ్రిల్ వుండాలి.  అదీగాక,  నాకు కావాల్సిన వ్యక్తి ఆపదలో వున్నప్పుడు కాపాడుకోవడం  నా బాధ్యత.  ఆ రోజు యమధర్మరాజు వెంటపడి సావిత్రి తన మొగుడి ప్రాణాలు దక్కించుకుందిట. ఈ రోజు  ఈ బ్లాక్ మెయిలర్స్ పని పట్టి నాక్కాబోయే భార్యను రక్షించుకుంటాను"  అన్నాడు.
    "ఇప్పుడు నాకు రిలీఫ్ గా వుంది.  మామయ్యా ప్రాబ్లం సాల్వ్ అయింది.  బ్లాక్ మెయిలర్ గురించి ముందే నీకు చెబుదామనకున్నాను.  కానీ అతని డిమాండ్ ఏమిటో...అసలు విషయం  ఏమిటో నాకు తెలియకుండా నీకు చెప్పలేకపోయాను.
    డుంబుని యాక్సిడెంట్ చేయబోయినప్పాడు భయమేసింది.  కావాలని డుంబుకు ఇష్టమైన పిల్లిని చంపినప్పుడు గుండె ఆగినంత పనయింది.  అయినా నీకు చెప్పాలంటే,  సందిగ్ధం... నువ్వు ఎలా రియాక్ట్ అవుతావోనని భయం...సారీ"  అంది మనస్పూర్తిగా అవని.
    "పర్లేదు అవనీ... మనకు ఇష్టమైన వ్యక్తి మనకోసం ఏదైనా చేస్తాడనే నమ్మకం  వుండాలి.   జరిగిందేదో జరిగింది. ఇప్పుడు నువ్వు చాలా కేర్ పుల్  గా    వుండాలి.  సాధ్యమైనంత వరకూ ఒంటరిగా ఎక్కడికీ వెళ్ళకు. డుంబును కూడా జాగ్రత్తగా వుండమని చెప్ప... వసుధతో చాలా జాగ్రత్త"  అన్నాడు అనిరుద్ర.
    ఈలోగా టిఫిన్ వచ్చింది.  టిఫిన్ చేసి కాఫీ  తాగి,  బయటకు వచ్చారు.
    "నిన్ను ఇంటి దగ్గర డ్రాప్  చేసి వెళ్ళనా?"   అడిగాడు అనిరుద్ర ఆటోని పిలుస్తూ.
    "వద్దు...  నువ్వెళ్లు..  ఇంకా చీకటి కూడా పడలేదుగా ...నేను వెళ్ళగలను"  అంది.
    "బై.." చెప్పాడు అనిరుద్ర.
    అవని ఆటోలో కూచుంది.
    ఆటో కనుమరుగయ్యే వరకూ చూస్తుండిపోయాడు అనిరుద్ర.
                                                                                                      *         *           *
    "ఏంటమ్మా... హడావుడిగా వెళ్ళవు... ఏమైంది?"   తండ్రి అడిగాడు అవని ఇంట్లోకి రావడంతోనే కంగారుగా.
    అవని తండ్రికి జరిగినందంతా చెప్పింది.
    "నీ వెనక ఇంత జరిగిందా?  పిచ్చి తల్లీ...  నాతో ఒక్కమాటయినా చెప్పలేకపోయావా?  పోనీలే..  జాగ్రత్తగా వుండమ్మా...  నేను మీ అమ్మను ఒప్పించాను.  అనిరుద్రతో నీ పెళ్ళి ఖాయం...  ఇందాక మీ మామయ్యా కూడా మాట్లాడి అవనిని చేసుకోవడం ఇష్టం లేదక్కా... అవనికి నచ్చిన వాడికి ఇచ్చి పెళ్ళి చేయమని చెప్పాడట.  దాంతో మీ అమ్మ కూడా ఆలోచనలోపడింది.  సొ...  అమ్మవైపు  నుంచి నీకు లైను క్లియర్..  సంతోషమేనా?"  అన్నాడు కూతురి తల ప్రేమతో నిమురుతూ.
    సంతోషమే అన్నట్టు తలూపింది అవని.
                                     *         *         *
    రాత్రి పదకొండు దాటింది.
    చలికాలం కావడంవల్ల,  జనం ఎప్పుడో ముసుగు తన్నేసారు.  ఆ బిల్డింగ్ ముందున్న స్ట్రీట్  లైట్ పెద్ద శబ్దంతో పగిలిపోయింది.
    ఆ బిల్డింగ్ కు  కాపలా విన్న వాచ్ మెన్  నిద్రలో వున్నాడు.  బిల్డింగ్ ముందు చీకటి పరుచుకుంది.
    ఆ చీకట్లోకి ఓ ఆగంతకుడు వచ్చి చేరాడు.
    జన సంచారం లేదు.  పోష్ లొకాల్టీలో వున్న ఆ ఏరియా ఎప్పడూ నిర్మానుష్యంగానే వుంటుంది.  కాంపౌండ్ వాల్ మీదికి ఎక్కి లోపలికి దూకాడు.
    చిన్న శబ్దం...
    వాచ్ మెన్  ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు.
    స్ట్రీట్ లైట్  వెలుతురు లేదు.  చీకటి పరుచుకుంది.  బిల్డింగ్ ముందు వుండే లైటు వెలుతురులో చుట్టూ చూశాడు. ఎవరూ కనిపించలేదు.
    "హమ్మయ్య"   అని నిట్టూర్చి...మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు.
    ఈలోగా డాబర్ మెన్  భయంకరంగా అరిచింది.  వాచ్ మెన్  ఉలికిపాటుతో కళ్ళు తెరిచి లేచాడు.
    డాబర్ మెన్  అరిచిందంటే   ఖచ్చితంగా ఎవరో ఒకరు లోపలికి వచ్చి వుండాలి.  అనుకుంటూ 'ఎవరూ'  అని అరిచి కర్రను నేలకు తాటిస్తూ ముందుకు కదిలాడు.
    వెంటనే 'మ్యావ్' అన్న అరువు   వినిపించింది.
    "పిల్లా...  పిల్లిని చూసి కుక్క అరిచివుంటుందనుకొని,  మళ్ళీ వెనక్కి వచ్చి స్టూల్  మీద కూచున్నాడు.
    కానీ,  డాబర్ మెన్ ఊరుకోలేదు.  పరిగెత్తుకెళ్ళింది.  ఆ ఆగంతకుడు మృత్యువులా పరుగెత్తుకోస్తున్న  డాబర్ మేన్ నీ చూసి భయంతో  వణికిపోయాడు.
    వెంటనే కాంపౌండ్ వాల్ ఎక్కి బయటకు దూకేసాడు.
    డాబర్ మేన్  కాంపౌండ్ వాల్ వైపు చూస్తు అరుస్తూనే వుంది.
    వాచ్ మెన్ కోపంగా కళ్ళు తెరిచి డాబర్ మేన్ వంక  చూశాడు.  తన నిద్రచెడగొట్టినందుకు కోపంగా వుంది అనికి.
    "ఏయ్....ఎందుకలా అరుస్తావు వూర్కే నువ్వు నిద్రపోవు నన్ను నిదపోనివవ్వు" కోపంగా కుక్కను కసిరాడు.
    మళ్ళీ  'మ్యావ్ మ్యావ్ '    అన్న పిల్లి అరుపు వినిపించింది.
    "చూసావా...పిల్లి అరుస్తుంది.  నువ్వు ఈమాత్రానికే అరుస్తావేంటి?  రేపు రెండు పిల్లులను తీసుకోస్తాన్లే.  బాగా తిందువుగానీ"  అంటూ డాబర్ మేన్ మెడకున్న గొలుసును పట్టి తీసుకెళ్లబోతుంటే,
    డాబర్ మేన్ అతడ్ని వదిలించుకొని కాంపౌండ్  వాల్ దగ్గరికి వచ్చి అరవసాగింది.
    ఈ అరుపులు విని,  ఆ బిల్డింగ్ యాజమాని  " దాసూ.. ఏంటా  గొడవ?"  అని బయటకు వచ్చాడు.
    "ఏం లేదు సాబ్... పిల్లి లోపలికి వచ్చినట్టుంది.  పిల్లిని చూసి అరుస్తుంది"  చెప్పాడు వినయంగా.
    "షిన్నీ...అవునా? "  అడిగాడు డాబర్ మేన్ ని యజమాని.
    ఆ డాబర్ మేన్  ముద్దు పేరు షిన్నీ..
    అదికాదన్నట్టు తలూపి,  మళ్ళీ అరిచింది.
    "ష్...అరవకు"  అన్నాడు.  ఆ బిల్డింగ్ కు ,   ఆ డాబర్ మేన్ కు   యజమాని అయిన ఆ వ్యక్తి.
    ఆ బిల్డింగ్ యాజమానే ఫెడ్రిక్.
         షిన్నీ... ఫెడ్రిక్ పెంపుడు జంతువు.  దానికి పర ఫెక్టుగా ట్రైయినింగ్ ఇచ్చాడు. రాత్రి పూట అలా వదిలేస్తారు.
    "కిప్ క్వయిట్ "   అని  షిన్నీని వెళ్ళిపొమ్మన్నాడు ఫెడ్రిక్.  అయినా షిన్ని యాజమాని మాట కూడా వినలేదు.
    "ఇవ్వాళ   దానికేమైంది?"  కోపంగా అని దాని మేడకున్న గొలుసును పట్టుకొని,   పోల్ దగ్గరికి తీసుకెళ్ళి,  దానికి కట్టేసాడు.
    "ఇవ్వాళ  ఇన్ స్పెక్టర్ సాబ్,  మేడమ్,  మరో సార్ వచ్చారుగా..  అందరూ షిన్నీని తెగ మెచ్చేసుకున్నారు.  వాళ్ళ దిష్టి తగిలి వుంటుంది సాబ్"    అన్నాడు దాసు వినయంగా.
    "నోర్ముయ్... ఇలాంటి పిచ్చి నమ్మకాలు నా దగ్గర చెప్పకు.  అయినా మంచివాళ్ళ దిష్టి   ఎప్పడూ తగలదు"  అన్నాడు.
    దాసు నోరు మూసుకున్నాడు.
    ఫెడ్రిక్ లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నాడు.
    షిన్నీ గింజుకుంటోంది.
    "బుద్దొచ్చిందా?  లేకపోతే అరుస్తావా?  నాకైతే వినేదానివా?  ఎగిరి నన్నే కరిచి చంపేద్ధువు"  అని షిన్నీని అంటూ వెళ్ళి పడుకున్నాడు.
    సరిగ్గా అప్పుడు మళ్ళీ కాంపౌండ్ వాల్ ఎక్కి లోపలికి దూకి,  పోల్ కు  కట్టేసిన  డాబర్ మేన్ షిన్నీ వంక క్రూరంగా చూసి నవ్వాడు ఆ ఆగంతకుడు.
    ఆ ఆగంతకుదని చూసి మరింత మొరగడం ప్రారంభించింది షిన్నీ.
    ఆ  ఆగంతకుడి చేతిలో పదును తేలిన కత్తి వుంది.  డాబర్ మేన్ వైపు వచ్చాడు.  పోల్ కు కట్టివున్న గొలుసును తెంపుకోవాలని విశ్వ ప్రయత్నం చేసింది షిన్నీ.  ఆగంతకుడు దగ్గరికి వచ్చాడు.  అతడి చేతిలో వున్న పదునైన కత్తి గాల్లోకి లేచింది.
    మరుక్షణం అంతకన్నా వేగంగా డాబర్ మేన్ ని  ముద్దాడింది.  ఒకటి..  రెండు..మూడు..
    డాబర్ మేన్ కిందికి ఒరిగిపోయింది.
                        *        *         *
    ఫెడ్రిక్ హాలులో అటు,  ఇటూ పచార్లు చేస్తున్నాడు.  అతని మనసు ప్రశాంతంగా వుంది.  ముఖ్యంగా అవని తనని అర్ధం చేసుకోవడం వల్ల.
    సాధ్యమైనంత త్వరలో తన సమస్యలు అన్నీ పరిష్కారం కావాలని కోరుకుంటున్నాడు.
    నిద్రపోవడానికి బెడ్ రూమ్ లోకి వెళ్ళబోయిన ఫెడ్రిక్ లో చిన్న అనుమానం.
    షిన్నీ ఎప్పుడూ అనవసరంగా మొరగదు.  అలాంటిది అదే పనిగా మొరగడం.....ఇంతలో షిన్నీ మొరగడం  ఆపేసింది.
    ఏదో అనుమానం.
    చిన్న చిన్నగా ప్రారంభమై,  వటవృక్షంలా పెరిగిపోసాగింది.  వెంటనే తలుపు తెరిచి 'షిన్నీ'  అని కేకేసాడు.
    తను అలా పిలిచినప్పుడు బదులుగా మొరుగుతుంది షిన్నీ.
    షిన్నీ నుంచి బదుల్లేదు.
    "షి..న్నీ.."  ఈ సారి గట్టిగా అరిచాడు.
    నో  రెస్పాన్స్.
    "దాసూ.."  కేకేసాడు.
    స్టూలు మీదే నిద్రపోతున్న దాసూ ఉలిక్కిపడి లేచి 'సాబ్'  అంటూ ఫెడ్రిక్ దగ్గరకు వచ్చాడు.
    "షిన్నీ.. ఏం చేస్తుందో చూడు..  పాపం..  దాని గొలుసు తీసేయ్"అన్నాడు.
    దాసు షిన్నీ వైపు అడుగులు వేస్తున్నాడు.  అప్పటివరకూ ఆ మాటలు విన్న ఆగంతకుడు,  వెంటనే నిశ్శబ్దంగా అక్కడనుంచి జారుకొని,  కాంపౌండ్ వాల్  ఎక్కి అటువైపు దూకేసాడు.
    షిట్...మాంచి ఛాన్స్ మిస్సయింది అనుకుంటూ.
                   *           *          *
    ఒక్కసారిగా పెద్ద కేక వేసాడు దాసు.
    ఫెడ్రిక్ మనసులో ఏమూలో అనుమానం,  భయం దాసూ ఏమైంది అంటూ అటువైపు వెళ్ళి,  అక్కడి దృశ్యాన్ని చూసి స్దాణువు  అయ్యాడు.
    డాబర్ మేన్.. తన ప్రియమైన షిన్ని.. రక్తపు మడుగులో చచ్చిపడివుంది.
    రక్తం  ఇంకా పచ్చిగానే వుంది.  అప్పడే హత్యకు గురైనట్టు తెలుస్తుంది.
    "షి..న్నీ..."  అరిచాడు ఫెడ్రిక్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS