సౌందర్య ఉలిక్కిపడినట్లయింది.
"కానీ, అందులో మీరు భావించిన అర్ధంలో ప్రశంస అవుతుందా? చిత్రంలో బిచ్చగత్తె వికార స్వరూపం చూసి "ఎంత అందమైన చిత్రం!" అంటాం!....అంటే..."
"అర్ధమయింది... థాంక్స్!"
విక్రం మాట్లాడకుండా సౌందర్యనే చూస్తూ కూర్చున్నాడు.
సౌందర్య ఇబ్బందిగా కదిలింది.
"నాకు మీ నాన్నగారి మీద కోపం లేదు."
"మంచిదే! ఆయన తప్పేం లేదు! ఎవరయినా ఇంతే! అంతా మామూలే!"
"అవును."
"మీలాంటి మూర్ఖులు ఎప్పుడూ ఇలాంటివే ఎదుర్కోవలసి వస్తుంది."
"తెలుసు!"
"నిజానికి మీరు హాస్పిటల్ నుండి వెళ్ళిపోవడమే నాకు కావలసింది."
"ఎందుకు?"
"అది మా హాస్పిటల్! మా హాస్పిటల్ మా హాస్పిటల్ గానే రాణించాలి. అలాగే నలుగురు గుర్తించాలి. మీరు నిష్కారణంగా మా ఖ్యాతి మకు రాకుండా అడ్డుపడుతున్నారు!"
తళుక్కుమన్నాయి విక్రం కళ్ళు.
కొద్దిగా ముందుకు వంగాడు.
"అయితే మీకూ నాకూ ఈ శతృత్వం తప్పదు. మీ హాస్పిటల్ మీ హాస్పిటల్ లా ఉండకుండా నేను శాయశక్తులా అడ్డు తగులుతూనే ఉంటాను."
"ఆ సంగతి నాకు తెలుసు, కానీ జయించలేరని మీకు తెలుసా? మేము బలవంతులం!"
"ఎవరి బలం వాళ్ళది."
"మీరొక్కరు"
"కాదు! నా వాళ్ళు ఇంకా ఉన్నారు. కొందరే కావచ్చు. కానీ ఉన్నారు. అందర్నీ నడిపించేది ఎప్పుడూ కొందరే!"
"ఏదీ? మీ వాళ్ళని మరొకర్ని చూపించండి."
"మీరే!"
"నేనా?"
"ఇప్పుడిప్పుడు మీరేమన్నారో కాస్త గుర్తు చేసుకోండి. ఆ మాత్రం అర్ధం చేసుకోలేని మూర్ఖుడ్ని నేను కాను. నన్ను గుర్తించలేనంత అమాయకులు మీరూ కాదు!"
"నేను మీకు సహకరిస్తానని భ్రమపడకండి!"
"భ్రమపడటం లేదు. భయపడుతున్నాను. నిబ్బరంగా నిలబడండి!"
మాట్లాడకుండా వెళ్ళిపోయింది సౌందర్య...
11
ఒక్క రోజు కూడా సుధను చూడకుండా ఉండలేడు వామనమూర్తి...ఏదో ఒక సమయంలో ఎలాగో ఒకలాగ తీరిక చేసుకుని సుధ దగ్గరకు వచ్చి కూర్చుంటాడు.
"నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను" అని కాని, "ప్రేమిస్తున్నాను" అని కాని వామనమూర్తి సుధతో ఎప్పుడూ చెప్పలేదు.
"ఇలా నా దగ్గరకు రావటంలో నీ ఉద్దేశ్యం ఏమిటని" సుధ అతడ్ని ఎప్పుడూ ప్రశ్నించలేదు.
ఆ రోజు వామనమూర్తి తన దగ్గరకు రాగానే వేడి గాఫీతో పాటు ఒక యాస్ప్రిన్ కూడా అందించింది సుధ.
చిరునవ్వుతో అందుకుని త్రాగాడు వామనమూర్తి. వామనమూర్తికి ఆశ్చర్యమూ, ఆనందమూ కలిగించే విషయం ఇది. తనకు ఏ క్షణంలో ఏది కావాలో సుధకు తెలిసినట్లు ఇంకెవరికీ తెలియదు. సుధ దగ్గరకు వచ్చే సరికి తల పగిలినట్లే అనిపించసాగింది వామనమూర్తికి. ఆ కాఫీ త్రాగేసరికి తలనొప్పి ఎక్కడి దక్కడ మాయమయినట్లనిపించింది. అందుకు కారణం సుధ ఇచ్చిన కాఫీ త్రాగటమా? యాస్ప్రిన్ ప్రభావమా? డాక్టరయి ఉండీ తనిలా ఆలోచిస్తున్నాడు!
"విక్రంణు ఉద్యోగంలోంచి తీసేసారు!"
"విన్నాను. ఆయన మీ స్నేహితుడు కదూ!"
"అవును"
"మీరు కూడా వ్యతిరేకంగానే రిపోర్టు ఇచ్చారని విన్నాను..."
"ఇచ్చాను"
"మంచిపని చేశారు. కర్తవ్యం ముందు వ్యక్తిగత అనుబంధాలు పాటించకూడదు!"
ఫకాలున నవ్వాడు వామన్.
"సుధా! ఇలాంటి స్లోగన్సు ఎదుటి వ్యక్తుల్ని మోసం చెయ్యడానికి బాగా పనికొస్తున్నాయి. కానీ, నన్ను మోసం చేసుకోవటానికి పనికి రావటం లేదు. నన్ను నేను జోకొట్టుకుంటున్నాను సాధ్యమైనంతవరకూ..కానీ, ఉండుండి.....ఎక్కడో ....ఏదో,పట్టి కుదిపి.....అర్ధమవుతోందా?"
"ఆయన తప్పు లేనప్పుడు.... లేదని మీకు తెలిసినప్పుడు.....వ్యతిరేకంగా ఎందుకు రిపోర్టు చేశారు?"
"నేను చెయ్యలేదు. రిపోర్టు చేశాక నలుగురిలాగే నేనూ మాట్లాడాను..."
"కానీ మీకు నిజం తెలుసు."
"ఆ నలుగురికీ కూడా తెలుసు!"
"మీరూ నలుగురిలా ఎందుకు మాట్లాడారు?"
"పైకి రావటానికి..."
"పైకి రావటం...అంటే?"
"డాక్టరుగా పేరు ప్రఖ్యాతులు...డబ్బు...హోదా"
"ఇవన్నీ వస్తున్నాయి కదా! మీరు పైకి వచ్చినట్లే మీరు చాలా ఆనందంగా ఉన్నారు కదూ!"
కలవరపడినట్లయి సుధ ముఖంలోకి చూశాడు వామనమూర్తి...సుధ నవ్వింది వెన్నెలలాగా...
సుధకు అర్ధమయింది. సమస్తమా అర్ధమయింది. సుధ దగ్గర తను ఏమీ దాచలేదు. దాచినా సుధ ముందు దాగవు. దాచవలసిన అవసరమూ లేదు. అన్నీ అర్ధం చేసుకుని అలా నవ్వగలదు.
