Previous Page Next Page 
తపస్వి పేజి 17


    "నా రిజల్ట్స్ ఎప్పటి కప్పుడు డాక్టర్ శ్రీరాములు గారికి వ్రాస్తున్నానండీ! ఇవాళే ఆయన దగ్గర నుండి నా ప్రయోగాలు మెచ్చుకుంటూ ఉత్తరం వచ్చింది. ఇదిగో చూడండి!"
    డాక్టర్ శ్రీరాములు గారు మేధావి. ఆయన ప్రశంసలందుకోవటం సామాన్య మైన సంగతి కాదు. సరిగా ఇలాంటి సమయంలో ఆయన దగ్గర నుండి ఆ ఉత్తరం విక్రమ్ కి రావటం ఎంతో మంచిదనిపించింది సాక్తర్ కిరణ్ కుమార్ కి!
    "కంగ్రాట్యులేషన్స్!" అన్నాడు చిరునవ్వుతో.
    తరువాత చాలాసేపు తన ప్రయోగం గురించే మాట్లాడాడు విక్రం...
    "ఇది పూర్తి కావటానికి చాలా డబ్బు ఖర్చవుతుందనుకోండి. కాని..." అంటూ ఆగిపోయాడు.
    "తొందరపడ్డావేమో విక్రమ్! ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. చూసీ చూడనట్లు ఊరుకోవలసింది"
    "మీరు కూడా ఇలాగే అంటున్నారా?"
    "పోనీ, ఏం సాధించగలిగావో చెప్పు!"
    "వెంటనే ఏమీ సాధించకపోవచ్చు. విద్యుచ్చక్తి కనిపెట్టిన మరునాడే, టెలివిజన్ చూడగలిగామా? మనసన్నాక మంచి చెడ్డలకు చలించకుండా ఉంటుందా? ఈనాడు ఒక విలువ అణగిపోవచ్చు. కానీ మరొకనాటికి అది గుర్తింపబడదా?"
    "కానీ, ఈలోగా నష్టపడుతున్నది నువ్వే కదా!"
    "నష్టమా! ఏమిటి?"
    "నీ ఉద్యోగం పోలేదూ?"
    "రిపోర్ట్ చెయ్యకుండా ఉంటే...ఒక దారుణమైన అన్యాయాన్ని సహించాననే వ్యథ మనసును కోస్తూ ఉంటే...అది నష్టం కాదా..."
    "గుడ్!" అంటూ నవ్వాడు డాక్టర్ కిరణ్ కుమార్.
    తన ఎదురుగా ఉన్న ఈ వ్యక్తికి ఎలాంటి సమయంలోనూ, ఏ విధమైన ఓదార్పు వాక్యాలూ అవసరం లేదు. తనకు తానుగా నిలబడగల వ్యక్తి- తనదైన మార్గం దృఢంగా నిర్ణయించుకున్న వ్యక్తి.
    తలుపు పైన చిన్నగా తట్టిన చప్పుడయ్యింది. లోపలకు రమ్మన్న ఆహ్వానం లేకుండానే సౌందర్య లోపలకు వచ్చేసింది.
    డాక్టర్ కిరణ్ కుమార్, సౌందర్య ఒకరి నొకరు చూసుకున్నారు. కిరణ్ కుమార్ కు కొద్దిగా ఆశ్చర్యం కలిగింది. విక్రమ్ కు గర్ల్ ఫ్రెండ్స్ ఎప్పుడూ ఉండేవారు కాదు. సౌందర్యను కూర్చోమని "విక్రమ్! ఈవిడను పరిచయం చేస్తావా?" అన్నారు.
    "నాకు తెలియదు" ఏదో వింత వస్తువును చూస్తున్నట్లు కుతూహలంగా సౌందర్యను చూస్తూ అన్నాడు విక్రమ్.
    విక్రమ్ మాటలకంటే ఆ చూపులే ఎక్కువ ఆశ్చర్యం కలిగించాయి డాక్టర్ కిరణ్ కుమార్ కి. ఆ చూపులలో ఉన్నది ప్రేమ కాదు, లాలన కాదు, కుతూహలం. తెలిసీ తెలియనట్లున్న దేనినో తెలుసుకోవాలనిపించే కుతూహలం!
    "మీకు అభ్యంతరం లేకపోతే నా పరిచయం నేనే కలిగించుకుంటాను" అంది సౌందర్య.
    "చెప్పండి!"
    "నేను ఈయన శత్రువర్గంలో వ్యక్తిని. ఇవాళ ఈయనకు గొప్ప పరాభవం కలిగిందని తెలిసి చూసి సంతోషించడానికి వచ్చాను!"
    ఒక్కసారి సౌందర్య ముఖంలోకి చూసి చిరునవ్వుతో చెయ్యి జాపారు డాక్టర్ కిరణ్ కుమార్.
    "అయితే మీ చెయ్యి ఇలా ఇవ్వండి. ఇవాళ నుంచీ మన స్నేహితులం!"
    సౌందర్య తన చెయ్యి అతని చేతిలో ఉంచి "మీరు కూడా ఈయన శత్రు వర్గంలో వారేనా?" అంది.
    "కాదు! కాదు! విక్రం నాకు స్నేహితుడు."
    "మరి....."
    "వర్గం ఏదయితేనేం? ఇతడికి అండ కావలసిన సమయంలో...కనీసం కావాలని మనం భ్రమపడినప్పుడు ఇద్దరమూ వచ్చాము. అందుకు"
    "ఇతనికి అండగా ఉండటానికి రాలేదు నేను..."
    "రావటమంటూ జరిగాక కారణం ఏదయినా ఫరవాలేదు. అది సరే, ఇతని పరాభవ దుఃఖం ఎలా ఉంది?"
    "నేను ఊహించినట్లుగానే ఉంది."
    కిరణ్ కుమార్ కనుబొమ్మలు పైకి లేచాయి. సౌందర్యను చూసి నవ్వుతూ "అయితే మీకు ఆనందం కలిగినట్లేనా?" అన్నారు.
    "నేను ఊహించింది వేరు. ఆశించింది వేరు. ఆనందం ఎలా కలుగుతుంది?"
    "మనసుకు కష్టంగా ఉందా?"
    "లేదు! భయం వేస్తోంది!"
    "గుడ్! వేరీ గుడ్!" పకపక నవ్వారు కిరణ్ కుమార్.
    విక్రంతోనూ, సౌందర్యతోనూ చెప్పి వెళ్ళిపోయారు.
    "నేనెవరో మీకు తెలుసా?" విక్రంణు అడిగింది సౌందర్య. తన కళ్ళలోకి సూటిగా చూసే అతని చూపులలోని కుతూహలాన్ని చదవటానికి ప్రయత్నించసాగింది. అప్పటి వరకూ తన చూపులతో చూపులు కలవగానే తడబడి చూపు తిప్పుకొనేవారే కాని ఎదుర్కొన్నవారే లేరు.
    "తెలీదు!"
    "మీకు ఉద్యోగం పోవటానికి ఎవరూ కారకులో, వాళ్ళ కూతుర్ని"
    "ఓహో"
    "ఇప్పుడేమనిపిస్తోంది మీకు నన్ను చూస్తోంటే...."
    "ఇది విన్నందువల్ల క్రొత్తగా ఏమీ అనిపించటం లేదు!"
    "అలాగా! అంతకుముందు ఏమనిపించేది?"
    "సృష్టిలోని సౌందర్యమంతా మీలో ఉందని..."
    "ఇలాంటి పొగడ్తలు చాలా విన్నాను."
    "ఇది పొగడ్తా?"
    "కాదా?"
    "మీరు పొగడ్త అనుకోగలిగితే మంచిదే! ఏ సూత్రాలకు లొంగని ఒకానొక విశృంఖల తాండవం...ఆ తాండవంలో విలీనమయి శ్రుతి బద్దమైన ఒక దివ్యనాదం... మీలో కనిపిస్తున్నాయి నాకు!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS