Previous Page Next Page 
చీఫ్ మినిస్టర్ పేజి 17

 

రాజధాని కి దాదాపు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ గ్రామం.
సుధీర్, బృంద పుట్టి పెరిగిన ప్రాంతం.

పిల్లలంతా సిటీ లకి తరలి వెళ్లిపోగా మిగిలిన కొద్దిపాటి జనాభా ప్రపంచంతో సంబంధాలు లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారు.  సిటీల్లో అవకాశాలకు అర్రులు చాచని వాళ్ళు, ఇంకా సిటీ వ్యామోహం లో పడకుండా, పుట్టిన ఊళ్ళోనే పోవాలన్న సిద్ధాంతాన్ని జీర్ణించుకున్న వాళ్ళు మాత్రం అక్కడే ఉండిపోయి పనీపాటలు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. 

ఒకప్పుడు మనుషులతో కళ, కళలాడిన ప్రాంతం. ఇప్పుడక్కడ జవం లేదు, జీవం లేదు. ఆ ఊరిని పట్టించుకునే వాళ్ళు లేక బూడిద కమ్మినట్లుగా, ఎండిపోయినట్లుగా ఉంది. ఇదివరకు విశాలంగా ఉన్న రోడ్లు ఇప్పుడు సన్నగా, వంకరటింకరగా కుంచించుకు పోయాయి.

ఎటువంటి సెంటిమెంట్ లేని కఠిన మనస్కుడు అయిన సుధీర్ కే ఆ ఊళ్ళో అడుగుపెట్టగానే ఒక్క క్షణం మనస్సు చివుక్కుమంది. 

ఎట్లాంటి ఊరు ఎట్లా అయిపోయింది?

ఒకప్పుడు ఊరికి వస్తుంటే దారంతా పచ్చటి పొలాలు కనపడేవి. ప్రతి ఇంటి ముందూ పూల మొక్కలు, కూరగాయల మొక్కలు ఉండేవి. ఎర్రటి మందారాలు, చిట్టి చేమంతులు లేని ఇల్లు ఉండేది కాదు. దారిలో నడుస్తున్న వాళ్ళకి పూల అందాలు స్వాగతం చెప్తున్నట్లుగా ఉండేవి. పెద్దవాళ్ళు అరుగుల మీద కూర్చుని వచ్చే పోయే వాళ్ళని పలకరిస్తూ కనపడేవాళ్లు.

శిధిలమైన మొండి గోడ లా ఉందా ఊరిప్పుడు.ఊరి అభివృద్ధి కోసం తనేమయినా చేసివుంటే బాగుండేదేమో అనిపించింది సుధీర్ కి ఆ క్షణాన. మరుక్షణం లో ఆ ఆలోచనను మెదడు లో నుంచి చెరిపేశాడు. ఆ ఊళ్ళో నివసిస్తున్న వాళ్ళకు లేని బాధ తనకెందుకనిపించింది. అతను ఎప్పటికప్పుడు తన మీద తనకి ఎటువంటి అపరాధ భావం లేకుండా ప్రతి విషయం లోనూ ఒక సిద్ధాంతాన్ని సృష్టించుకుంటాడు.

ఎటయినా వెళ్లిపోవాలి, కొన్నాళ్ళ పాటు ఎవరికీ కనిపించకూడదు అనుకున్నప్పుడు సుధీర్ కి తట్టిన మొదటి ఆలోచన ఆ ఊరే. ఆ ఊరు తప్ప తనని కడుపులో పెట్టుకుని చూసుకునే వాళ్ళు ఎవరూ లేరనిపించింది.

బృంద వాళ్ళు నివసించిన ఇల్లు ఇంకా బృంద పేరు మీదే ఉంది. పక్క ఇంటిని లత కొనుక్కుని అక్కడే నివసిస్తోంది. అక్క ఇల్లు పాడుబడిపోకుండా వారానికి ఒకసారి శుభ్రం చేయించటం, అవసరం అయినప్పుడు రిపేర్ చేయించటం చేస్తోందామె. ఆమె ని అడిగి ఇంటి కీస్ తీసుకోవచ్చు.

అదృష్టవశాత్తు అతను ఊళ్ళో అడుగు పెడుతున్నప్పుడు తెలిసిన వాళ్ళెవరూ అతణ్ణి గమనించలేదు.

అతను వచ్చే టైమ్ కి లత ఇంట్లో లేదు.  డ్రైవర్ ని పంపి పక్కింట్లో కనుక్కుంటే తెలిసింది. 

టీచర్ గా పని చేస్తోందట. స్కూల్ కి వెళ్లిందట. 

ఇదెప్పటి నుంచో...? 

బృంద తో మాటలు ఉంటే ఇట్లాంటి విషయాలు అన్నీ తెలిసేవి. ఆవిడ తనతో మాట్లాడదు. అందుకే ఈ డెవలప్మెంట్ తన వరకూ రాలేదు. చిన్నప్పుడు లతకి చదువే వచ్చేది కాదు. పిల్లలకి ఈవిడ ఏం నేర్పుతుంది...వాళ్లేం నేర్చుకుంటారు?

ఓపిగ్గా ఆమె వచ్చేవరకూ కార్ లోనే కూర్చుని వెయిట్ చేశాడు.

"ఎంత హాయిగా ఉంది జీవితం? ఉరుకులు, పరుగులు లేవు, కుట్రలు, కుతంత్రాలు లేవు, ప్రెస్ ని ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. తనతో ఉంటూనే తన చుట్టూ గోతులు తవ్వుతున్నారని తెలిసిన వాళ్ళతోనూ పైకి మర్యాదగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. పాము చుట్ట మీద కూర్చున్నట్లు ఉంటుంది పదవి అనేది. పైకి మెత్త గా ఉన్నట్లు భ్రమింపజేసినా, ఏ మాత్రం ఏమరుపాటు గా ఉన్నా బుసలు కొడుతూ లేచి కాటేస్తుంది. " విశ్రాంతిగా కార్ లో కూర్చున్నా కదుల్తున్న ఆలోచనలు.

నాలిగింటికి దూరంగా వస్తూ లత కనపడింది. బృంద అంత అందగత్తె కాకపోయినప్పటికీ బాగానే ఉంది అనుకున్నాడు. పల్లెటూళ్ళో పొల్యూషన్ అనేది సోకక కోనెట్లో తామర పూవు లా స్వచ్ఛంగా కనిపిస్తోంది.

ఎండలో నడిచి రావటం వల్ల పట్టిన చెమట ను తుడుచుకుంటూ గేట్ తీస్తోంది. 

ఆమె లోపలికి వెళ్ళాక వెనకే వెళ్లి తన ఇంటి కీస్ అడగొచ్చని అనుకున్నాడు సుధీర్.

ఎంతకీ లోపలికి వెళ్ళటం లేదు.

కాసేపు మొక్కలు సవరించింది. తర్వాత ముందు వైపు వరండా లో వేలాడదీసిన పూసలు సర్దింది.

సుధీర్ కి కాసేపు అర్ధం కాలేదు. ఏం మనుషులు వీళ్ళు?! వీళ్ల జీన్స్ లోనే ఏదో సీరియస్ లోపం ఉన్నట్లుంది. బృంద అట్లా, ఈమె ఇట్లా. 

మెటీరియలిస్టిక్ విషయాలేవీ ఆనందం ఇవ్వవంటారు. 

పూసలు, పెంకులు లాంటివి మెటీరియల్ కాదా? వాటికి ఆత్మ ఎమన్నా ఉంటుందా? ఎక్కువ ధర ఉండేవి మాత్రమే మెటీరియలిస్టిక్ అవుతాయా?

బయటే తను పలకరిస్తే ఆమె ఆశ్చర్యపోయి ఎక్కువ ప్రశ్నలు వేస్తుంది. ఈ లోగా ఎవరైనా చూసినా, విన్నా అనవసరమైన పబ్లిసిటీ అవుతుందని అతని భయం. వీలైనంత గుట్టు చప్పుడు కాకుండా ఈ ఊళ్ళో గడిపి విశ్రాంతి తీసుకోవాలని వచ్చాడతను. అందుకే ఆమె లోపలకి వెళ్తే తను అనుసరించి కీస్ తెచ్చుకోవాలని అతని ఆలోచన. 

ఆమె లోపలకి వెళ్ళటం ఆలస్యం చేస్తున్న కొద్దీ అతనిలో అసహనం పెరగసాగింది.

పది నిమిషాలకి కానీ ఆమె తాళం తెరిచి లోపలికి వెళ్ళలేదు.

ఆమె లోపలకి అడుగు పెట్టగానే కార్ దిగి సుధీర్ వెనకే వెళ్ళాడు. 

చేతిలో ఉన్న హ్యాండ్ బాగ్ హాల్ లో ఉన్న టీపాయ్ మీద పెట్టి సోఫా లో కూర్చోబోతోంది లత. 

గుమ్మం దగ్గర అలికిడికి తలెత్తి చూసింది.

సుధీర్ ని చూసి ఒక్క క్షణం భ్రుకుటి ముడిచింది.

రాజకీయాల్లోకి ప్రవేశించాక ఒక్కసారి కూడా ఊరి వైపు కన్నెత్తి చూడని సుధీర్  ఇప్పుడు ఎందుకొచ్చినట్లు? అర్థం కాలేదామెకు.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS