నేను నేలమాళిగకు మార్గాన్ని వివరించే తుది తామ్రపత్రాన్ని చదువుతూ ఉండగానే తలుపు తట్టిన చప్పుడు అయింది. అది అలాగే వొదిలేసి వెళ్ళి తలుపు తోశాను. ఆమెతో మాట్లాడుతూనే నేను స్మృతి తప్పి అక్కడ పడిపోయాను. ఇప్పుడు మీరు వచ్చాకే కదా లేచి రావటం?" అన్నదామె. శ్రద్దాదేవి తన ఆలోచనలలో కొంత నిజమయినందుకు అబ్బురపడిపోయింది. తక్షణమే లేచి రీడింగ్ రూం కు వచ్చింది.
ఆ వెనుకనే జ్యోతి కూడా వచ్చింది.
గది అంతా కలయ వెతికారు. తామ్రపత్రాల జాడ కన్పించలేదు అంతకు పూర్వమే పరిశీలించినప్పుడు ఎక్కడి వస్తువులు అక్కడ వున్నాయి. ఇప్పుడు పరిశీలిస్తే అంతర్దానమయిన వస్తువేదో తెలియవచ్చింది. జ్యోతి బేలగా చూసింది. ఆమె మనసు గాయపడింది. తాత నించి వారసత్వంగా వచ్చిన అపురూప వస్తువు అది.
తండ్రి సామాన్యుడే అయినా, వాటి గురించి పరిశోధించాలన్న ఆసక్తి కాని, పరిశోధించే చొరవ కాని లేనివాడయినా అతడు వాటిని పోనివ్వలేదు. జీవితకాలమంతా కాపాడి జాగ్రత్తగా తనకు అప్పగించాడు. తాను వాటిని పరిశోధించనూ లేదు. జాగ్రత్తగా కాపాడనూ లేదు. అవి అంతర్దానమయినాయి. తండ్రినించి వచ్చిన లాంచీ ఆనాడు ఒక నవాగతుడి రాకతో తుత్తునియలు అయిపొయింది.
ఈనాడు సూర్యకిరణాలు మానవాకృతి దాల్చినట్లు నడచి వచ్చిన ఈ అపురూపమయిన యువతి వల్ల ఈ తామ్రపత్రాలు అంతర్ధానమయినాయి. అంతటితో ఆమె మనసు క్షతమయిపోయింది.
"అయ్యో! నేను తామ్రపత్రాలను బల్ల మీదనే ఉంచాను. ఏమయినాయో నాకు తెలియదు." అంటూ కుప్పలా కూలి పోయిందామే. నీర్జీవ ప్రతిమలాగ అయిపొయింది.
పదేపదే సమ్మోహన శక్తితో నిండి తుణీరాల్లాంటి శ్వేతకి చూపులే మనసు మీద గ్రుచ్చుకుంటున్నట్లు అనిపించినాయి.
ప్రొఫెసర్ శ్రద్దాదేవి ఆమె నోదార్చింది. చిన్న పిల్లను లాగ అక్కున చేర్చుకుని ఆశ్వసించింది.
"అమ్మా జ్యోతి! నీవు రవంతయినా కంగారు పడక. తల్లీ నేనున్నాను. అన్నీ చూచుకుంటాను. నా బిడ్డవు అనుకున్న తరువాత నీకు ఎదురయే సవాళ్ళను డీ కొనవలసిన అవసరం నాకూ వుంది. ఈ తామ్రపత్రాల విషయంలో నీవెంత వ్యద చెందుతున్నావో నేను కూడా అంతే వ్యద చెందుతున్నాను.
తామ్రపత్రాలు పోయినంత మాత్రాన నీవు రవంతయినా బాధ పడవలసింది లేదు. ఇలా జరుగుతుందని నేను ఊహించ లేదు -- కాని నాకు తెలియకుండానే నేనొక మంచి పని చేశాను.
చారిత్రకమయిన ఆధారాలను అన్వేషించేందుకు దారులు రెండే వుంటాయి. స్క్రిప్టులు, ఇన్స్ క్రిప్ట్ లు, సమకాలినులు వ్రాసిన వ్రాతలు. అది సాహిత్యపరమయిన ఆధారం.
ఇన్స్ క్రి ప్షన్ లు శాసనాలు. వాటిని పఠించదలుచుకున్న వారు యధాతధంగా వీలయితే చదువుతారు.
సాధారణంగా అలాంటివి దొరికేప్పుడు శిధిల దశలోనే ఉంటాయి. కాబట్టి చదవటం కష్టమయినప్పుడు వాటిని చదివేందుకు బొగ్గుపొడిని చల్లి తడిపిన కాగితంతో అద్దుతారు.
ఆ అక్షరాలు కాగితం మీద ముద్రించ బడతాయి.
ఇలా జరుగుతుందని తెలియకపోయినా చదివేందుకు సులభమయిన విధానమని నేను అలా చేశాను.
ఇప్పుడు పోయిన తామ్రపత్రాల డూప్లికేట్ నా దగ్గరున్నాయి. అందు నించి నీవు చేయవలసిన ప్రయత్నానికి అవరోదాలంటూ ఏమీ లేవు. అని చెప్పింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి.
జ్యోతికి అనందమయింది. ఆమెతో పరిచయం తన ఉన్నతికే దోహదం చేయగలదన్న ఆమె విశ్వాసం మరింత బలీయమయింది. అప్పటికప్పుడే బయటకు వెళ్ళి అరగంట తరువాత ఫోటోస్టాట్ కాపీలతో తిరిగి వచ్చింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి.
కృతజ్ఞతాపూర్వకంగానూ, ఆరాధనా భావంతోనూ ఆమె ముందు వినమ్రురాలాయి పోయింది జ్యోతి.
* * *
అప్పటికి సరిగా అర్ధరాత్రి అయిందేమో! తామ్రపత్రాలు అంతర్దానమయి అప్పటికి పదిరోజు లయిందేమో!
ఈ పది రోజులుగా ఫోటో స్టాట్ కాపీల ఆధారంతో తన పరిశీలనను కొనసాగిస్తోంది జ్యోతి. సందేహాలు ఏవయినా మనసును తాకితే ప్రొఫెసర్ శ్రద్దాదేవిని ఆశ్రయించి వాటిని తీర్చుకొంటోంది.
పగలంతా ఆమె ఆలోచనలు పలు విధాలుగా పోతున్నాయి. శ్రద్దాదేవికి కావలసిన సౌకర్యాలను సమకూర్చుట మనేది ఆమెకు తృటిలో పని. ఆమె నిరాడంబరమయిన అలవాట్లు బాగా ఆర్ద్రమయినాయి.
అందునించి ఆమెకు ఎప్పుడేమి అందించాలో అలా జరిగిపోతోంది. ఆమె యూనివర్శిటి కి పోయిన తరువాత లైబ్రరీలోని అనేక గ్రంధాలను బాగా అద్యయనం చేస్తోంది జ్యోతి.
శ్రద్దాదేవి సబ్జెక్ట్ ఫిలాసఫీ కావటం నించి ఆమె దగ్గర త్తత్వశాస్త్రం తాలూకు గ్రంధాలు అనేకం వున్నాయి. అక్కడక్కడ ప్రాచీన తాత్త్విక రీతులను వివరించే చోట రాకాసి గుహల గురించిన సమాచారం కన్పిస్తోంది. కాని అది బహుస్వల్ప సమాచారం.
మూడు సహస్రవర్షాలకు పూర్వం దక్షిణ భారతదేశంలో జీవించిన నాగ యక్ష పుండ్ర పుళింద జాతుల జీవన విధానాల్ని వివరిస్తూ. వారి విశ్వాసాలు, ఆలోచనలు, ఆచారాలు, క్రోడికరిస్తూ అక్కడక్కడ వివరణలు దొరుకుతాయి.
అలాంటి చోట మృతులయిన వారి శరీరాల్ని వారు ఏం చేసే వారన్న అంశాన్ని ప్రస్తావిస్తాయి గ్రంధాలు. అప్పుడే ఈ సమాధి గుహలు రాకాసి గుళ్ళు, రాకాసి గుహలు అని పిలువబడే నేలమానిగల గురించిన సమాచారం వుంటుంది.
కీర్తి శేషులయిన "కవి సమ్రాట్టు" ఉవాచలు ఉత్తుత్తివి కావు. నల్లవాడికన్నా తెల్లవాడు తెలివయినవాడు అని విశ్వనాధుల ఉవాచ.
బ్రిటీష్ వాళ్ళు హయంలోనే ఈ రాకాసి గుళ్ళను కనిపెట్టారు. అర్కేలాజికల్ వారి చేత కొన్నిటిని త్రవ్వించారు.
సంక్షిప్త రూపంలో రాకాసి గుహల గురించిన సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకుంది జ్యోతి.
ఆంధ్రదేశంలో మహబూబ్నగర్, కరీంనగర్ -- రెంటాల' పేదగంజాం, గుంటూరు ప్రాంతాలు , కొన్ని మన్యం ప్రాంతాలలోనూ ఈ సమాధి గుహలున్నాయి. రాజధాని నగరమయిన హైదరాబాద్ లో హష్మత్ పేట పోయే రోడ్డులో వున్నాయి. మౌలాలి కొండ గుట్టల్లో కూడా ఉన్నాయి.
వాటి గురించిన వివరాలన్నీ ఒక చోట చేర్చి చూస్తె జ్యోతికి వాటి పూర్తి స్వరూపం ఇలా అర్ధమయింది.
సమాధి గుడులు ఉన్నచోట రెండు మూడు టన్నుల బరువు వుండే పెద్ద పెద్ద రాతి గోలీలు వలయాకారంగా భూమి మీద అమర్చి వుంటాయి. అటువంటి వలయాకృతులు ఉన్నచోట ఒకదాని వెంట వందల సంఖ్యలో వుంటాయి.
తెలివయిన తెల్లవాడు ఆ వలయాకృతులు అలా క్రమ పద్దతిలో వందల సంఖ్యలో వుండడం చూసి అనుమానించాడు. ఆర్కేలాజికల్ వారి చేత త్రవ్వించాడు.
రాతి గోలీల మధ్య రెండు మూడు సెంట్ల భూమి ఉంటుంది. వాటి మధ్య త్రవ్వితే భూమి అంతర్భాగంలో ఒక నేల మాళిగ కన్పిస్తుంది. 'యు' ఆకారంలో మూడు రాతి పలకలు అమర్చి ఉంటాయి. ఒక్కొక్క రాతి పలక ఇంచుమించు పది పన్నెండు అడుగుల పొడవూ, వెడల్పూ కలిగి ఉంటుంది. అవి ఇంగ్ల్హీషు అక్షరం 'యు' లాగ నిలిపి ఉంటాయి. ఒక వంక తెరచి ఉంటుంది.
