Previous Page Next Page 
విష్ణు విలాసిని పేజి 17

     తండ్రి మాటలు పూర్తి అవకుండానే కృష్ణయ్య అందుకున్నాడు.    
    "నీకు ఏడుకొండలవాడికి పెళ్ళి ఎప్పుడు జరిగింది? దానికి ఆధారం ఏమిటి? సాక్ష్యం ఎవరు? లోకాన్ని ఎట్లా నమ్మించగలవ్?"    
    "లోకంతో నాకు పనిలేదు"    
    "మాకుంది నీకూ ఉంది. మనం అడవుల్లోలేం ఈ సమాజంలో ఉన్నంతకాలం దాని నియమాలు పాటించాలి."    
    "సమాజం తప్పుదారిలో నడుస్తుంటే దానిని సంస్కరించటం కూడా మన బాధ్యతేగా!"    
    "చిన్నపిల్లవి అట్లా మాట్లాడవచ్చా?"    
    "చిన్నపిల్లలకి పెళ్ళి చెయ్యచ్చా? తప్పుకాదూ!"    
    "ముదినాపసాని  అడగటానికి వచ్చింది చూడండి! మన పద్ధతులని సంప్రదాయాలని తప్పు పడుతోంది. ఇది ఇంకా చిన్నపిల్లేమిటి? ఏడేళ్ళ పిల్ల మాట్లాడాల్సిన మాటలేనా ఇవి?" కృష్ణయ్య కోపం పెరుగుతోంది?    
    "సీత, రుక్మిణి.....వీళ్ళంతా పెద్దయ్యాక తమకు నచ్చిన భర్తల నెన్నుకున్నారు. ఇప్పుడు ఊహ తెలియని పసిపిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ఇదేం సంప్రదాయం?"    
    కృష్ణయ్యని ఊరుకోమని సైగచేసి పెద్దాయన చెప్పటం మొదలు పెట్టారు.    
    "చూడుతల్లీ! చిన్నదానివైనా చాలా పెద్ద ప్రశ్న అడిగావు. విను చెపుతాను. నువ్వు అన్నట్టు చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు చెయ్యటం మంచిది కాదు. అందుకే యుక్తవయసు వచ్చేదాకా కాపురానికి పంపం. 'మరి, పెళ్ళికి ఎందుకు తొందర? పూర్వం అట్లా చేసేవారుకాదు కదా!' అని నీ సందేహం కొన్ని శతాబ్దాల క్రితం మహమ్మదీయులు మనదేశంపై దండెత్తిన తర్వాత వచ్చిన అనేక రాజకీయ, సామాజిక పరిణామాల ఫలితంగా స్త్రీలు, విద్యా విత్తాలకి దూరమై, వంటింటికి పరిమితమై పోయారు. ఇపుడు పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి కనక స్త్రీలకి మళ్ళీ పూర్వవైభవం వస్తుందేమో దానికి నా బంగారు తల్లే శ్రీకారం చుడుతుందేమో!"    
    "ఇప్పుడు మాట్లాడాల్సింది శుభకార్యం గురించి నాన్నగారూ! శ్రీకారం గురించి కాదు" కృష్ణయార్యుడు కలగచేసుకున్నాడు.    
    "నా తల్లి శ్రీకారం చుట్టేది చదువుకి. శుభకార్యం పద్దతిగా జరిగిపోతుంది కదు తల్లీ!" అంటూ వెంకమాంబవైపు చూశారు.    
    వెంకమాంబ మాట్లాడలేదు.    
    "నీ పక్షాన నేను మాట ఇచ్చాను. మనిద్దరిదీ ఒకటే పక్షం నా మాట వినుతల్లీ. ఊఁ! అను"    
    "... ... ..."    
    "చూశారా నాన్నగారూ! ఒప్పుకోటల్లేదు"    
    "నువ్వుండు కృష్ణా! నేను మాట్లాడుతున్నానుగా!"    
    కృష్ణయ్య చేతితో నోరుమూసుకుని కాస్త వెనక్కి జరిగాడు, తనకేమీ సంబంధం లేనట్లు.    
    "నువ్వెంతో పెద్దదానిలాగా, ఎన్నో తెలిసిన దానిలాగా మాట్లాడుతున్నావ్. మేము చెప్పిన దానికన్న నే కెక్కువ విషయాలే తెలుసు. వివాహం చేసుకుని గృహస్థాశ్రమం స్వీకరించటం ధర్మం కదా! నువ్వు కాదంటే ఎట్లా? మేం నలుగురికీ ఏం చెప్పాలి? నలుగురిలో తలెత్తుకుని తిరగటం ఎట్లా? చెప్పు"    
    "అందరికీ వివాహం అవసరం లేదు తాతగారూ! ఆ రోజుల్లో గార్గి మొదలైన వేదవాదినులుండేవారు. వారు గృహస్థాశ్రమం స్వీకరించకుండా, నేరుగా బ్రహ్మచర్యం నుండి సన్యాసాశ్రమం స్వీకరించారు."    
    "అది ఆనాటి మాట ఆనాటి సమాజం ఆమోదించింది. ఈనాటి నియమాలు వేరు. భగవంతుడు కాలస్వరూపుడు, ధర్మస్వరూపుడు కాలానుగుణమైన ధర్మంగా పరిణమించి వ్యక్తమౌతూ ఉంటాడు. అందుకే ధర్మం ఒక్కొక్క యుగంలో ఒకొక్క విధంగా అనుష్టించబడుతూ, స్వల్పమైన మార్పులతో దర్శనమిస్తూ ఉంటుంది.    
    ఒకక్షణం ఆగారు విన్నది వంటపట్టటాని కన్నట్టు.    
    "కాలానుగుణమైన ధర్మాలనిపాటించటం దైవాజ్ఞని నిర్వర్తించటమే అవుతుంది. వివాహం, ముఖ్యంగా ఆడపిల్లలకి విద్యుక్తధర్మం ఈ కాలంలో దాన్ని నువ్వు అనుసరించాలి."    
    "కాని, నాకు వివాహం అయిపోయింది. పునర్వివాహం ధర్మ సమ్మతం కాదు."    
    తన కోపాన్ని నిగ్రహించుకునే ప్రయత్నం చేస్తున్నాడు కృష్ణయార్యుడు.    
    "నా సర్వస్వం శ్రీనివాసుడే. నా జీవిత్ర్హం నా ప్రాణం స్వామే. ఆయనే నా ఆత్మేశ్వరుడు."    
    "నీకు స్వామికి ఉన్న సంబంధం ఆత్మ పరమైంది. శారీరక స్పృహ జనితమూ భౌతికమూ కాదు. పాంచభౌతిక శరీరం ఉన్నప్పుడు ఆ శరీర ధర్మాన్ని కూడా పాటించాలి కదా!"    
    "అన్ని శరీరాలకి ఒకే ధర్మం ఉండదు. దానిలో నివసించే ఆత్మనిబట్టి మారుతూ ఉంటుంది. "వేదవేదాంగాలు చదివిన పండితురాలిలాగా చెప్పింది.    
    "శరీరధారులందరికీ ఆహారం అవసరం కదా ఆకలి తీరటానికి అదే విధంగా వివాహమూను."    
    తాతగారి మాట పూర్తికానీయలేదు వెంకమాంబ మధ్యలోనే అంది.    
    "అయితే ఈరోజునుంచి నేను ఆహారం తీసుకోను. ఈ శరీరానికి ఆహారం అవసరం లేదు. అప్పుడైనా వివాహం అవసరం లేదని మీకు అర్ధం అవుతుందేమే!"    
    "అమ్మా! ... ... ..." తాతగారి మాట వినకుండా లోపలికి వెళ్ళిపోయింది. తండ్రీకొడుకులకి ఇంకా మాట్లాడుకునేందుకు ఏమీలేదు. వెంకమాంబ పట్టుదల తెలుసు అయితే ఆహారం దగ్గర కూడా పట్టుదలగా ఉంటుందా? చిన్నపిల్లకదా, ఉండలేదులే అనుకుంటూనే, ఉంటుంది. ఉండి తీరుతుంది అని కూడా గట్టిగా అనుకున్నారు    
                                   * * *    
    తలుపుచాటునుంచి ఈ సంభాషణలని పొల్లుపోకుండా విన్న అత్తాకోడళ్ళకి కూడా భయం వేసింది. పసిది, పట్టుమని ఏడేళ్ళునిండలేదు. ఆ మాటలేమిటి? తండ్రితోనూ, తాతతోనూ ఆ వాదన ఏమిటి? తలలు పండిన పండితుల తీరుగా చర్చించి వాళ్ళని అవాక్కయ్యేట్టు చెయ్యటమేమిటి? మనస్సులో అప్పుడప్పుడు లీలగా మెదిలే భయాలన్నీ విశ్వరూపం ధరించాయి మంగమాంబకి.    
    మొదటిసారిగా గుండెల్లోరాయిపడిన సంఘటన జరిగి చాలా రోజులైంది. నాలుగేళ్ళ ప్రాయంలో పొరుగింటి పిల్లలు బొమ్మలపెళ్ళి ఆటలకి పిలిస్తే వెళ్ళి, పెళ్ళికొడుకు వెంకటేశ్వరస్వామి అని, పెళ్ళికూతురు తను అని చెప్పిందిట! అట్లా అనకూడదంటే చాలా వాదించిందిట ఆ పిల్లలకి కోపం వచ్చింది. ఆ ఇంట్లో పెద్దలకి మాత్రం కొంతకాలం నీలాటి రేవుదగ్గర మాట్లాడటానికి ఆహారం దొరికింది. మర్నాడే మంగమాంబ నీళ్ళబిందెతో దూరంగా కనపడగానే గమనింఛనట్టుగా అనదలచుకున్నవన్నీ అనేశారు. వాళ్ళు కోరుకున్నట్టే, వినీ, విననట్టుగా ఉండిపోయింది. కాని గుండెల్లో ఏదో భయం... ... ...కూతురి ప్రవర్తన పిచ్చితనమా? తెలివితక్కువ తనమా? అయోమయమా? నిజంగానే భూతమా? దెయ్యమా? దెయ్యానికి ప్రకృతి అయిన దైవమా? ... ... ...తన కూతురు దైవాంశ సంభూతురాలా? ఆ మాట అనుకోగానే మంగమాంబ గుండెలయతప్పింది. ఆనందంతోపాటు భయంకలిగింది. తన కూతురు తనకెక్కడ దూరం అవుతుందోననే భయంతో....అందుకే ఆ భావాన్ని మనస్సులోకి రానీయకుండా జాగ్రత్త పడుతుంది. పొరపాటునవస్తే బయటికి నెట్టేస్తుంది.

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS