Previous Page Next Page 
ప్రార్థన పేజి 18


    సర్జెనూ, అనస్తటీస్టూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. అనస్తటీస్టు తల పంకించాడు. గాయంమీద దూదిని సుతారంగా వెనక్కి తొలగించి చూశాడు సర్జెను. సిస్టర్ సక్కర్ రెడీగా పట్టుకుని వుంది. కొద్దిగా రక్తం బయటకు వచ్చింది. దాన్ని నెమ్మదిగా తుడిచాడు. మరి కొద్ది రక్తం రాబోయి ... ఆగిపోయింది!

 

    ఆ గదిలో ఒక్కసారిగా 'స్' మన్న శబ్దం వచ్చింది.

 

    చీఫ్ సర్జెనూ, అతడి అసిస్టెంట్లూ, నర్సులూ అందరూ ఒక్కసారి అప్పటివరకూ బిగపట్టిన గాలిని సంతృప్తిగా విడవటంతో వచ్చిన శబ్దం అది.

 

                                        *    *    *

 

    మిగతాదంతా తొందరగా జరిగిపోయింది.

 

    బి.పి. నూటికిపైగా పెరిగింది.

 

    "రెండో టాన్సిల్స్ ఇప్పుడిక ముట్టుకోవద్దు" అన్నాడు రాబర్టుసన్.

 

    "రక్తాన్ని మళ్ళీ రి-ఇన్వెస్టిగేట్ చేయిద్దాం".

 

    "షల్ ఐ రికవర్ ది పేషెంట్".

 

    "యస్-"

 

    నైట్రస్ ఆక్సైడ్ ప్రవాహాన్ని ఆపుచేసి ప్రోస్టిక్ మిన్ ఇంజెక్షన్ చేసేడు. రిఫ్లెక్సెస్ ప్రారంభమై పాప శరీరం కంపించింది. ఆమె ఊపిరి తీసుకోవటం ప్రారంభించగానే ఆక్సిజన్ కూడా తీసేసేడు. కంపనం ఆగిపోయింది. ఆ తరువాత అయిదు నిముషాలకు ప్రార్థనకి మగతగా మెలకువ వచ్చింది.

 

                                                               *    *    *

 

    "నమస్తే నేను వెళ్ళొస్తాను" చేతులు జోడించి అన్నాడు రాబర్టుసన్.

 

    వసుమతి కూడా నమస్కారం చేసింది.

 

    "సారీ, ఒకవైపు మాత్రమే చెయ్యగలిగాను. బ్లడ్ తొందరగా క్లాట్ అవలేదు".

 

    వింటున్న వసుమతి మొహంలో ఆందోళన కొట్టిచ్చినట్టూ కనపడింది. అయితే ఈ విషయాన్నంతా ముందే వివరంగా తెలుసుకున్న భార్గవ తేలిగ్గా "పాప అనీమిక్ గా వుందట, మనం ముందు ఆ విషయం చూసుకోలేదు. అనవసరంగా అందర్నీ కంగారు పెట్టేసేం" అన్నాడు.

 

    "నో- నో- చూసుకోవటం మా బాధ్యత. క్లాటింగ్ టైమ్ పరీక్షలో ఏదో పొరపాటు జరిగింది" అని వసుమతి వైపు తిరిగి, "మీకు ఈ ఊళ్ళోనే డాక్టర్ అన్నాజీరావు తెలుసా" అని అడిగాడు.

 

    ఆమె తలూపింది.

 

    "అతడితో మాట్లాడాను ఇప్పుడే. మీకు తీరుగ్గా వున్నప్పుడు పాపని ఒకసారి తీసుకెళ్ళండి. పూర్తిగా పరీక్ష చేస్తారు".

 

    భార్గవ "అదేమిటి- నాకు చెప్పకుండా ఆమెకి చెపుతున్నారు?" అంటూ నవ్వేడు.

 

    "పిల్లల విషయంలో తండ్రులకన్నా తల్లులు జాగ్రత్తగా వుంటారు".

 

    వసుమతి మనసులోనే సంతోషించింది. 'పరాయి' అన్న సంగతి మామూలు మాటల్లో కూడా అందరూ విస్మరిస్తున్నందుకు. ఆ ఆనందంలో కూడా డాక్టరు మాటలు ఆమె మనసును తొలుస్తూనే వున్నాయి. అంతలో ఆమె తనకు తానే ధైర్యం చెప్పుకుంది. ఈ విషయాలన్నిటిలోనూ భర్త ఎక్స్ పర్టు. అతడు ఇంత ధైర్యంగా వున్నాడంటే బహుశా తాను చాలా చిన్న విషయానికి అనవసరంగా భయపడుతూందేమో.

 

    "నేను అట్నుంచి అటే ఇన్ స్టిట్యూట్ కి వెళ్ళిపోతాను. అక్కణ్ణుంచి నీకు ఫోన్ చేస్తాను" అన్నాడు భార్గవ. ఆమె తలూపింది. ఈ మధ్య అతడికి చాలా పని వుంటూంది. మామూలు రోజుల్లో ప్రొద్దున ఏడింటికే వెళ్ళిపోతున్నాడు.

 

    ఆమె వరండాలో నిలబడి చూస్తూంది. కారు కదిలింది. శేఖరం డ్రైవ్ చేస్తున్నాడు. వెనుకసీట్లో రాబర్టుసన్ కూర్చొని వున్నాడు. మిగతా వారు అతడికి వీడ్కోలు చెపుతున్నారు.

 

    ఎందుకో అనిపించింది ఆమెకి, విమానం దాటిపోయి అతడు వెనుదిరిగివస్తే బావుణ్ణు అని.

 

                                             3

 

    "ఇంకా ఎన్ని గుచ్చాలి బాబో, నాకు చేతులు నొప్పెడ్తున్నాయి-" అంది జిన్నీ.

 

    "ఎన్ని గుచ్చితే అంత బావుంటుంది" అంది ప్రార్థన. ఈ లోపులో శ్రీనూ గ్లాసులో బియ్యం పోసి తీసుకొచ్చాడు.

 

    "ఇది దేనికి?"

 

    "అగరొత్తులు గుచ్చటానికి" అంటూ బల్లమీద పెట్టాడు.

 

    "గ్లాసులో పాలు పోస్తారు, బియ్యం పొయ్యరు" అంది జిన్నీ.

 

    "మొన్న సినిమాలో చూశా, ఊదొత్తులే పెట్టారు" అంటూ వాదించాడు శ్రీనూ. ప్రార్థన ఇద్దరిమధ్యా రాజీ కుదర్చటానికి ప్రయత్నిస్తూ "పోనీ రెండూ పెడ్తారు సరేనా" అంది.

 

    జిన్నీ వెళ్ళి ఫ్రిజ్ లో పాలు గ్లాసులో పోసి తీసుకొచ్చింది. శ్రీనూ అదిచూసి "ఐసుపాలు పొయ్యరు, వేడిపాలు పోస్తారు" అని వెక్కిరించాడు.

 

    "అవునా పక్కన్నా?"

 

    ప్రార్థన క్కూడా ఈ విషయం సరీగ్గా తెలీదు. "పోనీ రెండు గ్లాసులూ పెడ్దామా- ఒకటి ఫ్రిజ్ లో పాలూ, ఒకటి వేడి పాలూ" అని అడిగింది జిన్నీ.

 

    "అక్కర్లేదు, మొన్న టీ.వి.లో నాగేశ్వర్రావన్లే- 'గ్లాసులో ఈ వేడి పాలలా జీవితం లతా' అని నాకు తెల్సు. వేడివే పెట్టేది" ధీమాగా చెప్పాడు శ్రీనూ.

 

    మంచం చుట్టూ పూలు కట్టటం పూర్తయింది.

 

    ముగ్గురూ దూరంగా నిలబడి తాము చేసిన పనివంక సంతృప్తికరంగా చూసుకున్నారు.

 

    జిన్నీ కిటికీ తలుపు తెరిచింది, కిటికీలోంచి కనబడ్తూన్న ఆకాశం వేపు చూసి, "ఇంకేం చంద్రుడు కూడా వచ్చేసేడూ".

 

    "చంద్రుడెందుకు?" ప్రార్థనకి అర్థం కాలేదు.

 

    'ఇంత చిన్న విషయం తెలీదా' అన్నట్టూ శ్రీనూ ఆమెవైపు చూసి "పాట పాడటానికి... " అని, జిన్నీ వైపు తిరిగి, "ఏ సినిమారా జిన్నీ" అనడిగాడు.

 

    "అమ్మాయి కోరికలు".

 

    "అమ్మ పాడితే పాడుతుందేమో గానీ నాన్న చచ్చినా పాడడు".

 

    ఈ లోపులో ప్రార్థన మరిన్ని పూలు తెచ్చి పక్కమీద జల్లింది.

 

    అసలీ ఆలోచన వచ్చింది జిన్నీకి!

 

    భార్గవ, వసుమతి ప్రొద్దున్న రిజిస్ట్రార్ ఆఫీసుకి వెళ్ళి- అట్నుంచి గుడికి వెళ్ళి- సాయంత్రం స్నేహితులకి పార్టీ ఇచ్చి ఇంటికి వచ్చేసరికి గదిని ఇలా సినిమాలోలా అలంకరిద్దామని అనగానే ప్రార్థన వెంటనే వప్పుకుంది. జిన్నీ ఏం చెప్పినా వెంటనే దాన్ని వద్దనే శ్రీనూ కూడా దీనికి సరేనన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS