రెండు చేతుల్తోనూ స్పాంజి హోల్డర్ ని పట్టుకుని చేతుల్లో వున్న బలం అంతా ఉపయోగించి దూదితో ఆమె గొంతు లోపలి భాగాన్ని నొక్కసాగాడు. అసలు తన బలానికే గాయం మరింత పెద్దదవుతుందేమోనన్న అనుమానం వేసిందతడికి. కానీ వేరే మార్గం లేదు. బి.పి. పడిపోవటం ఇంకా ఆగలేదు. కానీ పాయింట్ కీ పాయింట్ కీ మధ్య కాలం ఎక్కువ అవుతూంది.
ఆపరేషన్లలో రక్తం 'క్లాట్' అవకపోతే ఇక డాక్టర్ల అవస్థ వర్ణనాతీతం. సలహా చెప్పే వారుండరు. ఆలోచించటానికి టైమ్ ఉండదు. కళ్ళముందే రోగి నెమ్మది నెమ్మదిగా, మృత్యువు వేపుకు సాగిపోతూంటే నిస్సహాయంగా చూస్తూ వుండాలే తప్ప యింకేమీ చెయ్యలేరు. తను కత్తితో కోసిన చోటునుంచే ప్రాణం రక్తం రూపేణా బయటకు పోతూంటే ఎంతటి డాక్టర్ కయినా దుఃఖం రాకమానదు.
అందులోనూ ఈ స్థితి మరీ ఘోరమైంది. ప్రాణం మీద కొచ్చే అపెండిసైటిస్సూ కాదు. ప్రాణాలు తీసే హార్డుడిసీజూ కాదు. హాయిగా ఆడుతూ పాడుతూ తిరిగే ఓ పాపకు తీరిగ్గా తిని కూర్చుని టాన్సిల్స్ ఆపరేట్ చెయ్యబోవటం.
పాప మొహం దగ్గర గుడ్డ అంతా నల్లగా మారి వుంది. ఆకుపచ్చ గుడ్డమీద రక్తం పడీ... పడీ...
ఉన్నట్లుండి ఆ గది చైతన్యవంతమైంది. రాబర్టుసన్ సిస్టర్ వేపు తిరిగి "మాచింగ్ టెస్ట్ ప్లీజ్. క్విక్" అన్నాడు. నర్సు పాప రెండో చెయ్యి గుడ్డ క్రిందనుంచి బయటికి తీసి, నరానికి సూదిగుచ్చి రక్తంలాగసాగింది. బి.పి. మళ్లీ తగ్గింది. అందరూ ఆందోళనగా వున్నారు. నర్సు రక్తం తీసుకుని దాదాపు పరుగెత్తింది.
వరండాలో వడివడిగా వెళుతూన్న నర్సుని చూసి, దూరంగా నిలబడ్డ వసుమతికి ఏమీ అర్థంకాలేదు. భార్గవ ఎక్కడో కారు దగ్గర శేఖరంతో మాట్లాడుతున్నాడు. ఆపరేషన్ పూర్తయ్యాక డాక్టర్ ని అట్నుంచి అటే విమానాశ్రయానికి తీసుకువెళ్ళటానికి చర్చిస్తున్నారు వాళ్ళు.
"ఐస్ క్రీమ్ ఎంతసేపటికి పెట్టొచ్చు?"
"ఏం?"
"నేను తెస్తానని చెప్పాను".
"ఎయిర్ పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు తెద్దాంలే".
లోపల బ్రద్దలవుతూన్న అగ్నిపర్వతాల సంగతి తెలియక, వాళ్ళు ఐస్ క్రీముల గురించి మట్లాడుకుంటున్నారు.
బయట ఈ సంభాషణ జరుగుతూంటే రక్తాన్ని తీసుకెళ్ళిన సిస్టర్ లాబ్ చీఫ్ పేథాలజిస్ట్ కి అంతా చెప్పి, శాంపిల్ ఇచ్చింది. అంతా హడావుడి- ప్రతి క్షణమూ విలువైనదే.
చీఫ్ అనుభవజ్ఞుడు, పాపని పరీక్ష చేసిన నర్సు సంగతి అతడికి తెలుసు. నూటికీ, కోటికీ ఒక్కరుంటారు. మొత్తం వృత్తికే పేరు తెచ్చే వారు! జరిగిందేమిటో స్పష్టంగా తెలుస్తూంది. కానీ అతడు తన భావాల్ని వ్యక్తం చెయ్యలేదు. మనసులోనే దాచుకున్నాడు. మౌనంగా నర్సు దగ్గిర్నుంచి శాంపిల్ తీసుకుని తమ దగ్గిరవున్న రక్తంతో మాచింగ్ చెయ్యటం ప్రారంభించాడు.
చాలా సినిమాల్లోనూ, పుస్తకాలలోనూ హీరోతో డాక్టర్లు "మీ గ్రూపు సరిపోయింది" అంటూ వుంటారు. అది తప్పు. గ్రూపు సరిపోవటం ఒక్కటే సరిపోదు. పేషెంటు రక్తం, ఈ ఫారిన్ రక్తాన్ని తనలోకి ఆహ్వానించగలిగి వుండాలి. అందుకే 'మాచింగ్ టెస్ట్'.
అతడు టేబిల్ మీదకు వంగి పని ప్రారంభించాడు. సరిగ్గా అయిదు నిమిషాల తర్వాత అతడి పని ముగిసింది. కావల్సిన బ్లడ్ ని ఆపరేషన్ థియేటర్ కి పంపిన రెండు నిముషాలకు నర్సు వచ్చింది- ప్రార్థనకు టెస్టులు నిర్వహించిన నర్సు.
లాబ్ చీఫ్ కి నలభై అయిదేళ్లుంటాయి. బలంగా ఎత్తుగా సైన్యంలో పనిచేసేవాడిలా వుంటాడు. రాత్రంతా నిద్రలేక మొహం పీక్కుపోయివున్న నర్సుని పరకాయించి చూసి, "కేస్ నెంబర్ 126 టెస్టు చేసింది నువ్వేనా" అని అడిగాడు.
"ఎవరూ?"
"ప్రార్థన అనే పాప".
"ఆ... అవును. ఏం?"
"క్లాటింగ్ టెస్టు చెయ్యలేదా?"
"చే... చేశాను".
"నువ్వు అబద్ధం చెపుతున్నావు".
"లేదు, నిజమే చెపుతున్నాను".
చీఫ్ చిన్న గొట్టాన్ని ఎత్తి పట్టుకున్నాడు. కూల్ డ్రింకులో వేసుకొని పీల్చే గొట్టం (స్ట్రా) లా వుందది. చీపురుపుల్ల అంత మందంతో ప్లాస్టిక్ గొట్టం. దీన్ని కాన్యులా అంటారు.
(వేలి దగ్గిర సూదితో పొడిచి వస్తున్న రక్తాన్ని సన్నటి ఈ గొట్టంలోకి పీలుస్తారు. ఒక నిముషం తరువాత కొసముక్క విరుస్తారు. ఇలా నిమిషం తరువాత మరో ముక్క విరుస్తారు. ఇలా నిముషం తర్వాత నిముషం చీపురుపుల్లని విరిచినట్టూ విరుచుకుంటూ పోతారు. ఏ ముక్క దగ్గిర రక్తం జీళ్ళపాకంలా సాగుతుందో- అన్నో నిముషం తరువాత ఆ రోగి రక్తానికి గడ్డకట్టే గుణం వుందన్నమాట. దీన్నే క్లాటింగ్ టెస్టు అంటారు. ప్రతి ఆపరేషను ముందూ తప్పక చెయ్యవలసిన పరీక్ష ఇది.)
లాబ్ చీఫ్ అన్నాడు- "ప్రతి విషయంలోనూ నేను జాగ్రత్తగా వుంటాననీ, లెక్క చూసుకుంటాననీ నీకు తెలుసుకదా. నువ్వు చేసిన తప్పు ఏమిటంటే- వాడకుండా వదిలేసిన 'కాన్యులా' ని తిరిగి తీసుకొచ్చి స్టోరులో పెట్టేయటం- నిజం చెప్పు. చెప్తే నిన్ను పోలీసులు అరెస్టు చెయ్యకుండా చూస్తాను".
ఆమె బెదిరిపోయి 'పోలీసులా' అంది.
"అవును. నువ్వు చేసిన తప్పువల్ల అక్కడ ఏమైందో తెలుసా?"
"ఏమైంది?"
"పాప చచ్చిపోయింది".
నర్సు ఆకులా వణికిపోయింది.
"నిజం చెప్పు, ఏమైంది? ఉన్నదన్నట్టూ చెప్తేనే నిన్ను రక్షించగలను" గద్దించాడు. పాప చచ్చిపోయిందనేసరికి పూర్తిగా బెదిరిపోయి వెక్కుతూ- "టెస్టు చెయ్యబోతూంటే ఫోన్ కాల్ వచ్చింది. దాంతో-" అని మరి చెప్పలేకపోయింది. అతడు చెయ్యిచాచి ఆమె చెంపమీద ఎంత బలంగా కొట్టేడంటే- దానికి ఆమె నిలదొక్కుకోలేక తూలి క్రింద పడింది. ఆ చర్యకి నర్సులు, అసోసియేషన్ వారు చెయ్యబోయే స్ట్రెయికు గురించి, తన పనిష్ మెంట్ గురించీ ఆలోచించలేదు. ఈ నిశ్శబ్దంలోంచీ బాంబు పడ్డట్టూ అతడి మాటలు వినిపించినయ్... "నీలాటి ఒక్క పురుగువల్ల మొత్తం వృత్తికే చెడ్డపేరు వస్తుంది. అక్కడ ఆపరేషన్ థియేటర్ లో ఏం జరుగుతుందో నాకు తెలీదు. ఒకవేళ అక్కడ రోగికి ఏమైనా అయిందంటే మాత్రం నిన్ను చంపి కాకులకూ గ్రద్దలకూ వేసేస్తాను. దేముణ్ణి ప్రార్థించుకో".
* * *
బాటిల్ మీద బాటిల్ - మొత్తం అయిదు బాటిల్స్ రక్తం ఎక్కించబడింది. అప్పటివరకూ స్పాంజి హోల్డర్ ని అలాగే గాయం దగ్గర నొక్కి పట్టుకొని వున్నాడు. సర్జన్. ఒక చేత్తో ఆమ్లజని సరిచేస్తూ మరోచేత్తో బి.పి. పరీక్షించాడు. రక్తం శరీరమంతా ప్రవహించి, కావల్సిన ప్లేట్ లెట్స్ ని గాయం దగ్గిరికి చేర్చింది. ఇదంతా అంతర్గతమయిన చర్య.
