Previous Page Next Page 
ప్రార్థన పేజి 19


    రిజిస్ట్రార్ ఆఫీసులో సంతకం పెడుతున్నప్పుడు కూడా వసుమతీ భార్గవ ఒకే విషయం గురించి ఆలోచిస్తున్నారు. చాలా చిన్న సమస్యలు. అవే ఇబ్బంది పెడతాయి. ఆ రాత్రి ఏదయినా హోటల్లో రూమ్ తీసుకుందామన్నాడు భార్గవ. వద్దంది వసుమతి. జీవితంలో ఇదే మొదటి రాత్రి అని తెలుసు. అయినా అతడితో కలిసి బయట ఎక్కడో గడపటం యిష్టంలేదు. పెళ్ళయిన మొదటిరోజే తండ్రిని తల్లి ఎక్కడో బయటికి తీసుకుపోయిందన్న భావం ఆ చిన్నపిల్లల మనసులో పడటం ఇష్టంలేదు.

 

    తన వాళ్ళంటూ ఎవరూ లేని లోటును వసుమతి మొదటిసారి ఫీలయింది. అనవసరంగా పెద్దరికాన్ని తెచ్చుకుంది గానీ ఆమె వయసెంతనీ? చాలా చిన్న కోర్కె ఆమెది. ఈ ఒక్కరోజు తన పక్కన వుండి తనతో అన్ని పనులూ చేయించే ఒక్క ముత్తయిదువన్నా వుండి వుంటే బావుణ్ణు అని. ఆ ఇంటిలో పరిచయమైన మొదటిరోజే పిల్లలు ఆమెకు స్నేహితులయ్యారు. కానీ ఈ మొదటిరోజు ఆమెని యిబ్బంది పెడ్తూనే వుంది. అ రోజే ఆ ఇంట్లో కొత్త హోదాలో ప్రవేశించటం, రాత్రి వుండిపోవటం.

 

    అయితే ఆమె భయం తొందర్లోనే పోయింది. రిసెప్షన్ నించి వచ్చేటప్పటికి రాత్రి తొమ్మిదయింది. పిల్లలు భోజనాలు చెయ్యకుండా వేచి వున్నారు. రిసెప్షన్ లో కడుపు పూర్తిగా నిండిపోయినా, వాళ్ళ సంతృప్తి కోసం డైనింగ్ టేబుల్ దగ్గిర కూర్చున్నారు ఇద్దరూ.

 

    బయటనుంచి రాగానే భార్గవకి తన గదిలోకి వెళ్ళటం అలవాటు. అతడో క్షణం గదిని చూసి అవాక్కయినా, వెంటనే మామూలుగా దుస్తులు మార్చుకొని వచ్చేసేడు. ముసి ముసిగా నవ్వే జిన్నీని కళ్ళతో కోప్పడబోయి వూరుకున్నాడు. ఆ అమ్మాయి ఒక్కతే నవ్వుని దాచుకోలేకపోతూంది.

 

    భోజనాలు పూర్తయ్యాక వసుమతి మళ్ళీ ఇబ్బందిలో పడింది. పిల్లలు పడుకునే వరకూ ఎక్కడ వుండాలా అని. జిన్నీ శ్రీనూలది ఒక గది. ప్రార్థనది వేరే గది. అందరూ తలో గదిలోకి వెళ్ళిపోయారు. ఆమె డైనింగ్ టేబుల్ సర్దటమనే కొత్త బాధ్యతని అనందంగా స్వీకరించి అక్కడే అరగంట గడిపి, గడియారం పదికొడ్తూ వుండగా భార్గవ గది సమీపించి లోనికి అడుగు పెట్టింది.

 

    ....

 

    ఆ అలంకరణలో 'పనితనం' లేదు. చిన్న పిల్లలు కట్టిన మాలలు అస్తవ్యస్తంగా మంచానికి వేలాడుతున్నాయి. వెలిగించిన అగరొత్తులు కొసవరకూ వచ్చి చివర్లు వెలుగుతున్నాయి. కానీ ఆమె చూస్తోంది వాటినికాదు. అసలా గది లోపలి భాగాన్ని చూడగానే ఆమె ఒక క్షణం అచేతనురాలైంది. అంతలో వెనుక అలికిడై వెనుదిరిగి చూసింది. దొంగతనంగా గుమ్మం తలుపు చాటునుంచి చూస్తూన్న జిన్నీ పట్టుబడిపోయి, తల్లిని వెక్కిరించి దొంగలా లోపలికి వెళ్ళిపోయింది.

 

    వసుమతికి వున్నట్టుండి ఎందుకో దుఃఖం వచ్చింది. అయితే ఆ దుఃఖం విచారంవల్ల వచ్చినది కాదు. కొద్దిగా విచారమూ, కొద్దిగా ఉద్వేగమూ, భరించలేని ఆనందమూ అన్నీ కలవటం వల్ల వచ్చిన కన్నీళ్ళు అవి. ముగ్గురు పిల్లలు- తమకు తెలిసీ తెలియని జ్ఞానంతో అల్లిన ఆ పొదరిల్లుని చూసి- 'నా గురించీ ఆలోచించేవారున్నారన్న' ఆనందంతో కళ్ళచేరిన చెమ్మ అది. అతికష్టంమీద తనని తాను సంబాళించుకుంది.

 

    ఆమెని మరి యిబ్బంది పెట్టటం ఇష్టం లేనట్టూ భార్గవ తలుపు వేసేసేడు.

 

                                       *    *    *

 

    అప్పుడు రాత్రి పదకొండయింది.

 

    అతడి పక్కన కూర్చుని వుంది.

 

    అతడు ఆమెవంకే చూస్తున్నాడు. చాలా సామాన్యమైన స్త్రీ ఆమె. ఆ శరీరం విద్యుల్లత కాదు. ఆ లలాట మర్ధచంద్రమూ, ఆ కపోలము దర్పణమూ కావు. జడ భృంగావళి కాదు. కేశాలు చామరాలుగానీ, కనుబొమ్మలు స్పర్శ చాపాలు గానీ కావు.

 

    అయినా ఆమె అతని భార్య.

 

    నాసిక తిలప్రసూనమూ, నేత్రము కందళీ కుట్మలమూ, చూపు ఉత్పలపంక్తి. దంతము ముత్యమూ- పలుకు వేణునడమూ- ఇవేవీ కావు.

 

    అయినా ఆమె అతని భార్య.

 

    నఖములు కుందకళికలై, స్థనములు చక్రవాకములై, నాభి ఆవర్తమైనదై, వళువ నిచ్చెనులై, పృష్టము కాంచన పట్టమై, నితంబము పులినమై, ఊరువులు కదళీకాండములై, హసము వెన్నెలై, ఫేనమై, కైవరమై ప్రభవించిన అప్సరస కాదు.

 

    కానీ అతని భార్య.

 

    అది చాలు.

 

    చాలామంది అనుకుంటారు- ఆకర్షణ వల్ల ప్రేమ పుడుతుందని! అది తప్పు.

 

    ప్రేమ కేవలం రెసిప్రొకేషన్ వల్లే పుడుతుంది, తొలి స్పర్శలోనో, తొలిరాత్రి అనుభవంలోనో, అవతల్నుంచి వచ్చే రెసిప్రొకేషన్ తో అది పెరిగి అన్ని రంగాలకూ విస్తరించి రెండు జీవితాలు పెనవేసుకోవటానికి తోడ్పడుతుంది. చూడటానికి చాలా చిన్న విషయంగా కనబడినా ఇందులో ఎంతో వాస్తవముంది. ప్లెటానిక్ లవ్ కి కూడా ఈ వాస్తవం అన్వయిస్తుంది. అయితే అందులో రెసిప్రొకేషన్ భావాలకి సంబంధించినది.

 

    వాస్తవంపట్ల అవగాహన లేని మరో విషయం... అహర్నిశలూ పనిచేసే మనిషి ఐహికవాంఛల గురించి. పని-వాంఛ డైరెక్ట్ ప్రొపోర్షనేటని చాలామంది భావించారు. పనిచేసే కొద్దీ అలసట దూరమై సమయం ఎలా ఊరుతుందో వాంఛ కూడా అలానే పెరుగుతుంది. అతడి సంబంధాలు మొదటి భార్యతో సరిగ్గా లేవన్న విషయం వాస్తవమే. పోతే అతడికి నైతిక విలువలపట్ల పెద్దగా నమ్మకంలేదు. కానీ నమ్మకం లేకపోవటము వేరు, వదులుకునే శ్రమ తీసుకోవడం వేరు. ఇంతకాలం గడిచిపోయే జీవితాన్ని అలాగే గడిచిపోనిచ్చేడు. ఆ నిర్లిప్తతని ఛేదిస్తూ ఇప్పుడు ఎదురుగా ఈమె వుంది. మనసనే సముద్రంలో కోరిక ఉత్తుంగ తరంగమై కాలం వేసిన చెలియలికట్టని దాటుతూంది. ఈమె తన జీవితంలో ఎలా కలిసిపోతుందో చూడాలి. పెదవిమీద నవ్వూ, కడుపుమీద ముడతా సంసిద్ధతని సూచిస్తున్నాయి.   

 

    ఆమె అతడివేపు చూసింది. ఆమె భావాలు వేరు. ఆమె దీన్ని గురించి చదివిందే తప్ప తెలీదు. మనసు వణుకుతూంది. దాంట్లోనూ కొద్దిగా ఆనందం లేకపోలేదు. అయితే ఈ అనందం కన్నా- తనకంటూ ఒక ఇల్లు తన గురించి కూడా ఇకనుంచీ ఆలోచించే వాళ్ళున్నారన్న సంతృప్తి ఎక్కువ. సంతృప్తి నుంచి కోరిక పుడుతుంది. అసంతృప్తి నుంచి పుట్టే ఆవేశం కన్నా - సంతృప్తినుంచి పుట్టే ఆవేశం ఆహ్లాదకరమయినది.

 

    అందుకే అతడు ఆమె భుజాలమీద చేతులు వేయగానే అప్రయత్నంగా దగ్గరికి జరిగింది. అతడు మొట్టమొదటిసారి ఆమెని నుదుటిపైన పాపటి దగ్గర చుంబించాడు. ఒక అధికారాన్ని శాసిస్తున్నట్టూ ఒక ప్రేమని పంచి ఇస్తున్నట్టూ, ఒక ఆర్తిని ఇద్దరం పంచుకుందామన్నట్టూ వుందా తొలిముద్దు. అంతే ఆ తర్వాత ఉవ్వెత్తుగా లేచిన కెరటం అతడిని ఉక్కిరి బిక్కిరి చేయబోయింది. చేతుల్నీ, తలనీ ఒకేసారి క్రిందికి జార్చేడు. అతడి ఆత్రంలో అనుభవం వుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS