Previous Page Next Page 
తరిగొండ వెంగమాంబ పేజి 17

    వెంగమాంబ ఇంటిపక్కనున్న అక్కా రామయ్య దీక్షితులు అర్చకుడు. అర్చకులలో పెద్ద కావడమే కాక, సర్కారీ నౌకరీ అతనిది. తక్కిన అర్చకుల కన్నా అతనికి అధికారం ఎక్కువ. అక్కా రామయ్య విద్యావంతుడు. ధనవంతుడు. పెద్ద కుటుంబీకుడు. వెంగమాంబ గొప్ప భక్తురాలనీ, మరోభక్తుడు ఆమెకు రాతి ఇంటిని ఉచితంగా ఇచ్చాడని తెలిసి, ఆమెపై మరీ అసూయపడి పోయాడు అక్కారామయ్య. అప్పట్నుంచి వెంగమాంబపై దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టాడు.
    వెంకమ్మది నిజమైన భక్తి కాదని, ఓ వితంతువు జుట్టు ఉంచుకోవడం ధర్మం కాదనీ, యవ్వనవతి ఒంటరిగా ఉండటం తగదనీ ప్రచారం చేస్తూ, వెంగమాంబను దూషించడం ప్రారంభించాడు. కానీ అక్కారామయ్య మాటలు ఎవరూ లెక్కచేయడం లేదు. వెంగమాంబ గొప్ప రచయిత్రి అనీ, మహా పుణ్యాత్మురాలని అనుకోవడం అతనికి కంటగింపుగా అనిపించింది. వెంగమాంబను ఎలా వేధించాలి? అనే విషయాన్ని రకరకాలుగా ఆలోచించడం ప్రారంభించాడు అక్కారామయ్య.
    అవివేకి, మూర్ఖుడు చేసే పనులకు అర్థం ఉండదు కదా!
    ఎంగిలి విస్తళ్ళను వెంగమాంబ తులసీవనంలోకి విసిరేయమని తనవాళ్ళకు చెప్పాడు అక్కరామయ్య. వాళ్ళంతా ఎంగిలి విస్తళ్ళను వెంగమాంబ తులసివనంలోకి విసిరేస్తున్నారు. వాళ్ళలా చేస్తున్నప్పటికీ వెంగమాంబ తులసివనంలోకి విసిరేస్తున్నారు. వాళ్ళలా చేస్తున్నప్పటికీ వెంగమాంబ మారుమాట్లాడకుండా, వనాన్ని శుభ్రం చేసుకుంటోంది. ఓ రోజు వెంగమాంబ అక్కారామయ్యను పిలిచి "నాయనా! నువ్వు చేస్తున్న పని తప్పు" అంది నెమ్మదిగా.
    "తప్పుడు పనులు చేసేది నువ్వా..... నేనా ..... నీకు ఉచిత గృహాన్ని ఎవడు, ఎందుకిచ్చాడో నాకు తెలుసులే!" వికృతంగా నవ్వాడు అక్కారామయ్య.
    "హరి....హరీ" అంటూ చెవులు మూసుకుంది వెంగమాంబ. "నాయనా! నువ్వు నన్ను వేధిస్తున్నావనుకుంటున్నావు. కానీ, నువ్వు బాధిస్తున్నది స్వామిని." అంది చేతులు జోడిస్తూ.
    "ఎవరే స్వామీ! నీ స్వామీ? ఓహో.... వితంతువైన నీకు ఇదొక కపట నాటకమా?!" అని కళ్ళెగరేసాడు.
    "నాయనా, అహంకారం తగదు. అన్నింటినీ గమనిస్తూ, ఆ పైవాడున్నాడు."
    "అవునవును. నువ్వు తరిగొండ నుంచి లేచిపోయి వచ్చినప్పుడు కూడ ఆ సర్వేశ్వరుడు చూస్తూనే ఉన్నాడుగా" అన్నాడతను వెటకారంగా. ఆ అర్చకునితో ఇక మాట్లాడ్డం అనవసరమనీ, మంచి మాట మనసుకెక్కనివానితో మాట్లాడ్డం నిష్ప్రయోజనమనీ ఊరుకుందామె.
    ఆమె సహనం, అతనిలో కక్షని మరింతగా పెంచింది. వెంగమాంబను వెళ్లగొట్టే ప్రయత్నాలను ముమ్మరం చేసాడు. వెంగమాంబ శీలవతి కాదనీ, వితంతువైన ఆమె జుట్టు పెంచుకుని ఊరేగుతుంటే, ఆమెను మహాభక్తురాలని గౌరవించడం తప్పుకాదా! అంటూ దుష్ప్రచారం చేయడం మొదలెట్టాడు.
    "అయ్యయ్యో..... అలా అనకు. వెంగమాంబ సామాన్య భక్తురాలు కాదు. ఆనాడు, బావిలో రాయిపడి నీళ్ళు రాకపోతే వెంగమాంబ  ప్రార్థించేసరికి, నీళ్ళు పొంగి పొర్లిన విషయాన్ని మరచిపోయావా? ఆమె రాసిన "వెంకటాచల మహాత్మ్యం" భక్తులను పరవశింప జేస్తోంది. ఆమెను అనవసరంగా దూషించకు. కళ్ళుపోతాయి" అంటూ వాపోయాడు గుడిమెట్ల దగ్గరున్న ఓ భక్తుడు.
    ఆ మాటలకు మండిపడ్డ అక్కారామయ్య, "నువ్వు భక్తుడివి, ఆవిడ ఓ మహాభక్తురాలు. ఛీ" అని తిట్టుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు.
    అక్కారామయ్య పగ 'పాము పగలా' రోజురోజుకీ తీవ్రమౌతోంది. ఎలాగైనా వెంగమాంబను అక్కడ్నుంచి తరిమేయాలన్న పట్టుదల, అతనిలో తీవ్రమైంది.
    ఆరోజు ఏకాదశి వ్రతం పూర్తిచేసుకుని, గోవింద నామాలను స్మరిస్తూ తులసివనంలో ప్రదక్షిణలు చేస్తూ, తను రచించిన "వెంకటాచల మహాత్మ్యం" నుంచి ఓ పద్యాన్ని పాడుతోంది.
    పుట్టి గిట్టుచున్న భూలోకవాసుల
    రక్షించుటకు రమారమణి తోడ
    వేంకటాచలమందు విఖ్యాతిగా నుండి
    సురులచే గోవింద నామ భజన
    మొనర చేయించుచు ఘనపాపములైన
    క్షీణింపజేయును సిరులనిచ్చి
    పాలింపుచున్నట్టి ఫణి గిరీశ్వరునకే
    వ్యూహ మహాలక్ష్మి కుర్విమీద
    వెలయు నా వీరలక్ష్మి  విమల హృదయ
    యగుచు నలమేలు మంగాఖ్యనవనియందు
    నమరె పద్మావతికి వేంకటాద్రికీలను   
    వెలయు శుభ మంగళము మహా విభవముగను
    ఆమె అలా పద్యాలు పాడుతుంటే అలమేలు మంగాసహిత వేంకటేశ్వర స్వామి సాక్షాత్కరించినట్లనిపిస్తోంది. వెంగమాంబ పరవశంతో నృత్యం చేస్తోంది. ఉన్నట్టుండి ఆమె పక్కన పళ్ళికిలిస్తూ కనిపించాడు అక్కారామయ్య.
    భగవంతుడు ఏదో ఒక రూపంలో దుష్టశిక్షణ చేసి తీరతాడు కదా!
    "ఓరీ పాపాత్ముడా! నీవు, నీ వంశం సర్వనాశనం అవుతుంది. పో" అంది వెంగమాంబ.
    భక్తురాలి వాక్కు వృథాగా పోతుందా?
    అక్కారామయ్య కుటుంబ సభ్యులు అనుకోకుండా వ్యాధిగ్రస్తులయ్యారు. కొంతమంది మశూచికంతో మరణించారు. అంత పెద్దకుటుంబం నాశనమవడాన్ని చూసి గ్రామస్థులంతా భయకంపితులయ్యారు. ఒకరోజు ఉన్నట్టుండి అక్కరామయ్య రక్తం కక్కుకుంటూ మరణించాడు. అచిరకాలంలో ఒక్కడు మినహా, అక్కారామయ్య కుటుంబమంతా నాశనమైపోయింది.
    ఊరంతా వెంగమాంబ శాపానికి గల శక్తిణి ప్రత్యక్షంగా చూసి వణికిపోయింది. ఆమె సాక్షాత్తూ అమ్మవారే! ఆమెని దూషిస్తే తగిన శాస్తి వణికిపోయింది. ఆమె సాక్షాత్తు అమ్మవారే! ఆమెను దూషిస్తే తగిన శాస్తి తప్పదనుకున్నారు. మరికొంతమంది "దుర్మార్గం మితిమీరితే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా?" అని అన్నారు. వెంగమాంబ మాత్రం మాత్రం వీటన్నింటితో సంబంధంలేకుండా గ్రంథ రచన చేస్తూ, స్వామిపై కీర్తనలు పాడుకుంతోంది.
    ఇదిలావుండగా, ఒకరోజు వెంగమాంబ ఇంటి తలుపు తడుతున్నారెవరో!! వెంగమాంబ చటుక్కున లేచి తలుపుతీసింది. "అమ్మా క్షమించు. ఎలాగో నేనొక్కడినే బతికాను. తల్లీ!! కరుణించు" అంటూ ఓ యువకుడు ఆమె కాళ్ళపై పడ్డాడు. వెంగమాంబ అతనివైపు చూసింది.
    క్షమాపణ భగవత్తత్వమే కదా!!
    కరుణతో అతడిని "లే నాయనా!" అంటూ లేవదీసింది. అతని వీపు నిమిరి ఆశీర్వదించింది, కానీ ఇహపై నీ కుటుంబంలో ఒక్కరే ఉంటారంటూ కొంతమేర శాపాన్ని ఉపసంహరించింది. అప్పట్నుంచి అక్కరామయ్య వంశంలో ఒక్కడే!
                          *    *    *
    కాలం గడుస్తోంది.
    భక్తుల సంఖ్య పెరుగుతోంది.
    వెంగమాంబ చావడిలో సాయంత్రమయ్యేసరికి భక్తుల సందడి ఎక్కువైపోతుంది. కొంతమంది ఆమెను ప్రశ్నలడుగుతుండగా, మరికొంతమంది చంటిపిల్లలను తెచ్చి, వెంగమాంబ ఒళ్ళో పెట్టి, ఆశీస్సులను కోరుతున్నారు. గోవిందనామాలు జపిస్తున్నారు. దేవునికి హరతులిస్తున్నారు. కొన్నిసార్లు వెంగమాంబ భక్తితో నృత్యం చేస్తోంది. పరవశంతో గొంతెత్తి పాటలు పాడుతోంది.
    కొన్నిసార్లు మౌనంగా ఉండిపోతోంది. కొన్నిసార్లు నవ్వుతుంది. కొన్ని సార్లు ఏడుస్తుంది. అలాంటప్పుడు భక్తులకు భయమేస్తుంటుంది. ఆ స్థితిలో ఎవరైనా వెంగమాంబ దగ్గరకు చేరితే మాట్లాడదు. ఆ సమాధి స్థితి నుంచి బయటకు రావడానికి ఎంతో సమయం పడుతుంది. ఒక్కొక్కసారి వెంగమాంబ మౌనవ్రతం పాటిస్తుంటుంది. వ్రతంలో ఉన్నప్పుడు తలుపులు తీయదు.
    ఓరోజు వెంగమాంబ "లోపల స్వామివారున్నారు" అని అంది. ఆ మాటలు విని అందరూ ఆశ్చర్యపోయారు. ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. కొన్నిసార్లు పవళింపు కీర్తనలు, కొన్నిసార్లు విందు పాటలు, మేలుకొలుపు పాటలు పాడుతుండేది. ఆ రోజు వెంగమాంబకు నిద్రపట్టలేదు. అటు ఇటు తిరుగుతూ తులసి వనంలోకెళ్ళింది. ఎవరివో అడుగుల చప్పుడు! వెంగమాంబ ఆ అడుగులను అనుకరిస్తూ వెళ్ళగా అవి గుడి లోపలిదాకా వెళ్ళాయి. తులసివనంలోకి ఎవరొచ్చారు? గుడిలోపల వరకు తనను ఎవరు తీసికొచ్చారను కుంటూ, ధ్వజ స్తంభానికి నమస్కరించి, ఇంటికొచ్చేసింది వెంగమాంబ.
    వెంగమాంబ మనసు పరిపరివిధాలా పోయింది. స్వామి తనను గుడిలో హారతి ఇమ్మంటున్నాడు. ఇంతకాలానికి స్వామి తనపై దయచూపాడు. "స్వామీ! నా మౌన వ్రతానికి బదులుగా ఇలాంటి బదులిచ్చావా?" అంటూ మురిసి పోయిన వెంగమాంబ, స్వామికి తన స్వహస్తాలతో హారతి ఇవ్వాలని సంకల్పించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS