Previous Page Next Page 
మరణ మృదంగం పేజి 18


    "ఏదో ఒకటి చేస్తాను. పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఒకరైనా నిజాయితీ పరుడు వుండకపోడు నాకు సాయంచేయటానికి-"

    "దాని వల్ల దాదా కాలిగోరు కూడా వూడదు. ఒకవేళ వూడినా అది చూడటానికి నువ్వీ భూమ్మీద  వుండవు".

    "నీలాటి వాళ్ళకి తెలుగులో ఒక మంచి పదం వుంది".

    "ఏమిటది?"

    "పిరికి సన్నాసులు".

    అతడు అప్పుడు ఆమెను పట్టుకుని చటుక్కున దగ్గరకు లాక్కొని ముద్దు పెట్టుకున్నాడు. ఆమె ఆ ఫ్లాట్ ళు అన్నీ  ప్రతిధ్వనించేలా కెవ్వున కేక పెట్టింది. అతడు మళ్ళీ  దగ్గరకు లాక్కొని పెదవులమీద తాన్ పెదాల్ని గట్టిగా ఆన్చి ఆమెని హత్తుకుని వదిలేసాడు. ఆమె వెళ్ళి సోఫాలో కూలబడింది.

    "ఈ పన్నెండు ఫ్లాటుల్లొవున్న వందమంది జనంలో ఒక్కడు కూడా నువ్వు. అరిచిన అరుపులకి రాలేదు చూడు. కనీసం ఒకడుకూడా వీళ్ళలో కొజ్జా కాని వాడు  లేడు- నీ భాషలో చెప్పాలంటే! ఇదీ మన దేశం. పోతే ...... నేను నిన్ను  ముద్దు పెట్టుకోవటం తప్పే. కానీ ఎందుకు పెట్టుకున్నాను. నేనే సలీంశంకర్ ని అనుకో. రేపు అతడొచ్చి ఇలా  చేసినా  ఎవరూ నిన్ను రక్షించరు. అది చెప్పటానికి ఇలా  చేసాను. ఏదో  నిజాయితీ పోలీసాఫీసరు, వగైరా వగైరా అన్నావు. ఇప్పుడు నేను  చేసిన పనికి నా మీద ఏం కేసు వేస్తావు.....? వసంత్ దాదా కూడా అలాగే ఏ సాక్ష్యమూ లేకుండా చేస్తాడు. ఈ ముద్దు నీకో బ్రెయిన్ వాష్!! నేనే నీ  మొదటి శత్రువు ననుకో ...... నన్నెలా ఎదుర్కొంటావో, ఏ చట్టంతో బంధిస్తావో రాత్రంతా ఆలోచించు. ఏమీ చేయలేకపోతే- ఆ దాదాని కూడా ఏమీ  చేయలేవన్నమాట. నాతో ఓడిపోయినా ఫర్వాలేదు. కానీ దాదాతో ఓడిపోతే అదే నీ జీవితపు ఆఖరు ఓటమి అవుతుంది. తరువాత నువ్వుండవు కాబట్టి. నువ్వేమీ చెయ్యలేవని చెప్పటానికే ఇలా చేసాను. మానవత్వం, న్యాయం, శిక్ష- ఇలాటి విషయాలన్నీ గొప్పవి. ప్రాక్టికల్ గా పనికిరావు. దానికి ఇదిగో - ఇప్పుడు జరిగిన సంఘటనే ఉదాహరణ. వీలైతే నేను చేసిన పనికి కనీసం ఒక గంట లాకప్ లో వుండేలా  చెయ్యి" అంటూ గుమ్మం వరకు వెళ్ళి ఆగి, "సారీ..... అండ్ థాంక్స్ ఆల్సో" అని వెళ్ళిపోయాడు.

    కళ్ళు మూసుకుని ఆమె అలాగే చాలాసేపు నిశ్చేష్టురాలిగా వుండిపోయింది.

    జీవితంలో మొట్టమొదటి ముద్దు అది..... అతడు మొత్తం 13 సెకన్లపాటు ముద్దు పెట్టుకున్నాడు. అందులో 6.67 సెకన్లకాలం పెదవుల్ని వత్తాడు. 3.39 సెకన్లు నాలుకతో స్పృశించాడు. 3.01 సెకన్లు కొన పంటితో నొక్కిపట్టుకున్నాడు. అద్భుతమైన ఫాస్ట్ నెస్ వుంది అందులో కెలిడియోస్కోప్ లా అన్నీ  వున్న ముద్దు అది. కానీ అది ఆలోచించటం లేదు. అతడు పిస్టల్ తీసిన విధానం (పది రోజుల క్రితం) రామలింగేశ్వర్రావుని కిటికీ దగ్గిర ఎదుర్కొన్న విధానం (పది నిముషాల క్రితం)  తనని ముద్దు పెట్టుకున్న ధైర్యం ?పది సెకన్ల క్రితం) అన్నీ కలిపి ఆలోచిస్తున్నది.

    మామూలప్పుడు నవ్వుతూ, తేలిగ్గా మాట్లాడే అతడే, రామలింగేశ్వర్రావు సలీంశంకర్ పేరు చెప్పి బెదిరించినప్పుడు కర్కశంగా, "ఏడిశాడు. విషయం అంతవరకూ వస్తే వాడి సంగతి తేల్చుకుంటాను" అన్న మాటలు ఇంకా ఆమె స్మృతి పథంలో మెదులుతున్నాయి.

    జానీ భయస్తుడు కాడు ...... మనకెందుకు పోన్లే అన్న మనస్తత్వం .....బుద్ధుడు పుట్టిన భారతదేశపు పౌరుడు.

    ......కాస్త రెచ్చగొడితే......?

    వసంత్ దాదా- చీకటి ప్రపంచపు దాదాల్లో చక్రవర్తి-మకుటంలేని మహారాజు- ఎన్నో కుటుంబాల్నీ, మనుష్యుల్నీ సర్వనాశనం చేసి- భారః పోలీసుల అసమర్థత మీదా- చట్టపు లొసుగులమీదా పడి వికటాట్టహాసం చేస్తున్న డ్రాక్యులా!

    అయినా, ఆ సింహాసనాన్ని కూలదొయ్యటానికి మొదటి గునపపు దెబ్బ ఎక్కడో పడాలి కదా! అది తనే ఎందుకు కాకూడదు? ఆ ఆయుధం జానీయే ఎందుకు అవకూడదు?

    -ఆమె పెదాలమీద చిరునవ్వు కదలాడింది.

    జానీ అన్నట్టు వసంత్ దాదా గురించి ఆమె కింకా తెలీదు.

   
                                       9

   
    జానీ అన్నమాటలు అనూషని రెండు రోజులదాకా చెవిదగ్గిర వెంటాడుతూనే వున్నాయి. "అతడు నీ ఇంటిలోకి చాలా మామూలుగా ప్రవేశిస్తాడు. అతిసాధారణంగా నిన్ను రేప్ చేస్తాడు. నీ అరుపుల్ని ఇరుగు పొరుగు వాళ్ళెవరూ పట్టించుకోరు. కోర్టులో సాక్ష్యం వుండదు".

    తన వాదనని నిరూపించటం కోసం అతడు పెట్టుకున్న ముద్దు కన్నా -ఈ మాటలే ఆమెని ఎక్కువ బాధ పెడుతున్నాయి.

    ఎటు వెళ్తుందీ దేశం?- సగటు మనిషికి తన చుట్టూ వున్న పరిస్థితుల సంగతి తెలియటం లేదా? బహుశా పట్టించుకోడనుకుంటాను. ప్రైవేట్ బస్  ఆపరేటర్లు - ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థకి ఇంత నష్టం కలిగిస్తున్నా; తమ  వీధిలోనే ప్రభుత్వ బస్సుల తాలూకు స్పేర్ పార్ట్ ళు బ్లాక్ లో అమ్మకం కోసం లారీలతో వచ్చి దిగుతున్నా; తమ పక్క ప్రభుత్వ ఖాళీ స్థలాన్నీ ఓకే రౌడీ వచ్చి ఆక్రమించుకున్న ఊరికేవుండటం భారతీయ సగటు పౌరుడి రక్తంలోనే జీర్ణించుకు పోయిందేమో! మోసగింపబడటం కూడా తమ జీవితంలో ఒక భాగం అనుకుంటున్నాడేమో మోసగింపబడటం కూడా తమ జీవితంలో ఒక భాగం అనుకుంటున్నాడేమో సగటు భారతీయుడు.

    తను సగటు భారతీయురాలు కాదా?

    ఎవడో తనని జీపు ఎక్కించుకు వెళితే, తను వూరుకోవడం లేదా??

    బలవంతుడితో వైరం ఎందుకు అని ప్రతివాడూ అనుకోవటంలో అసహజమేమీ లేదు. కానీ తను కూడా అందులో ఒకరవటమే చిత్రం! తన వాదనలు కూడా కేవలం 'వాదన' వరకేనా? క్రియా రూపేణా శూన్యమేనా?

    వాళ్ళని ఎదుర్కొంటే ఏమవుతుంది? రేప్ చేస్తారా? హత్య చేస్తారా? అ రెండూ జరిగే లోపులో తను కనీసం ఒక్క నరరూప రాక్షసుడి అంతమైనా చూడలేదా? 'ప్రతివాడూ, ఇలా  అనుకోబట్టే ఈ దేశం ఇలా తగలడుతోంది' అన్న తన మాటలు గుర్తొచ్చినయ్! కనీసం తన వరకైనా తన భావాల్ని ఆదరించకపోతే, ఇంత చదువు, ఇన్ని తెలివితేటలు, ఇంత వ్యక్తిత్వం- ఎందుకివ్వన్నీ? తగలెయ్యనా?

    అనూష ఒక నిర్ణయానికి వచ్చింది.

    ఢిల్లీలో అన్నయ్య శ్రీకాంత్ కి ఫోన్ చేసింది. మామూలు కుశల ప్రశ్నలడుగుతూ, యధాలాపంగా ప్రశ్నిస్తున్నట్టు "వసంత్ దాదా నీకు తెలుసా?" అని అడిగింది. అంతదూరం నించి కూడా శ్రీకాంత్ కంఠంలో మార్పు కనిపించింది.

    "ఇప్పుడతని ప్రసక్తి ఎందుకు?"

    "ఊరికే అడుగుతున్నాన్లే చెప్పు".

    "పేపర్లో చదువుతున్నావ్ గా ....... అందరికీ తెలిసిందే...... అతడిది నా జ్యూరిస్ డిక్షనే! మా డిపార్ట్ మెంట్ ని మూడు చెరువుల నీళ్ళు తాగిస్తున్నాడు. ముఖ్యంగా నన్ను......"

    "అంత పెద్ద పొజిషన్ లో వుంది నువ్వేమీ చెయ్యలేకపోవటమేమిటి?"

    "చిన్న పిల్లలా మాట్లాడక! అతడు తన అనుచరులతో నా మీద వేర్వేరు చోట్ల పెట్టిన కేసులు ఉపసంహరించుకుంటే అతడితో రాజీ పడదామని చూస్తున్నాను".

    "నేను నా అన్నయ్య శ్రీకాంత్ తోనేనా మాట్లాడుతూ వున్నది?"

    "నువ్వేం హేళన చెయ్యనవసరం లేదు".

    "నాకు ఆ వసంత్ దాదాకి సంబంధించిన కొన్ని వివరాలు కావాలి".

    "ఏమిటవి?"

    ఆమె చెప్పింది.

    అతడు అటునుంచి ఆశ్చర్యంగా, "ఎందుకివన్నీ?" అని అడిగాడు.

    "మీసా క్రింద తప్ప అతడ్ని ఇంతవరకూ ఒకసారి కూడా అరెస్ట్ చేయలేక పోయారు మీరు. కనీసం ఒకసారన్నా అలా పట్టిద్దామని.."

     "వసంత్ దాదా అంత సులభంగా  దొరకడు అనూషా."

    "అతడు కాకపోతే అతి మూలస్థంభం- మరోకడు.... 'రోజుకి రూపాయి లాభం' స్కీమ్ నీకు తెలుసుగా?"

    "తెలుసు, బొంబాయి లేబర్  కాలనీల్లో విషజ్వరంలా వ్యాపిస్తుంది అది".

    "అది వసంత్ దాదా ఆలోచనే".

    "అవును- అతడి అనుచరుల నడుపుతున్నారు దాన్ని".

    "దానిమీద దెబ్బ తియ్యాలనుకుంటున్నాను" అంది. శ్రీకాంత్ తనకి తెలిసిన వివరాలు అందించాడు. వారి సంభాషణ దాదాపు పది నిముషాలే జరిగింది.

    అయితే వారిద్దరికీ తెలియని విషయం ఒకటుంది. తన సర్కిల్ లో తనకు బద్దవిరోధి అయిన శ్రీకాంత్ పట్ల వసంత్  దాదా అత్యంత జాగరూకతతో వున్నాడు. అతడి ఫోను ఎప్పుడో ట్రాప్  చేయబడింది.

    ఆ విధంగా అనూష- శ్రీకాంత్ మధ్య జరిగిన సంభాషణని యథాతధంగా వసంత్ దాదా వినటం జరిగింది.

    'రోజుకో రూపాయి స్కీము' మీద యుద్ధం మొదలు పెట్టడం అన్న ఆలోచన ఒకరికి వచ్చిందీ అని తెలియగానే వసంత్ దాదా- ఇన్నాళ్ళకి తనకి సమ ఉజ్జీ ఒకరు ఉద్భవించబోతున్నారని గ్రహించాడు. ఆ సమఉజ్జీ స్త్రీ  అవటం అతడికి నవ్వూ. ఉషారు కల్గించింది. ఏం చేస్తుందో చూద్దామని వేచి వున్నాడు- కోపంతో కాదు. చిరునవ్వుతో.

   

                                 *    *    *


    ఇక్కడ రచయిత మధ్యలో నేను ప్రవేశిస్తున్నందుకు పాఠకులు క్షమించాలి. రోజుకి రూపాయి స్కీముతాలూకు ఆలోచన (1970లో అనుకుంటాను సరీగ్గా  గుర్తులేడు) ఓఅక ఛార్టేర్ట్ అకౌంటెంట్ కి వచ్చింది. బొంబాయిలో కూలీలు అత్యధికంగా నివసించే ప్రదేశంలో దీన్ని పరిచయం చేసాడు అతడు. ఈ స్కీములో చేరాలంటే పది రూపాయిలు కట్టాలి. ఆ తరువాత మరో ఇద్దర్ని, అలా పది రూపాయలూ ప్లస్ మరో రూపాయి బోనసూ, మొత్తం పదకొండు రూపాయలు లభిస్తుంది. ఒకవేళ అలాంటి ఇద్దరు లభించకపోతే, "నేను ఇద్దరు సభ్యుల్ని చేర్పించలేను" అని వెళ్ళి చెపితే, ఖర్చుల నిమిత్తం ఒక రూపాయి మినహాయించుకుని, తొమ్మిది రూపాయిలు తిరిగి ఇచ్చేస్తారు.

    మిగతా స్కీములకి దీనికీ తేడా ఇక్కడే. మనీ సర్క్యులేషన్ లాటి అత్యాశ ఇందులో లేదు. సప్తగిరి (విజయవాడ) లాటి మోసాలు లేవు.

    వస్తే వంద రూపాయలు లాభం, పోతే రూపాయి నష్టం. అంతే. చేసుకున్న వాడికి చేసుకున్నంత!!

    ఈ స్కీము మొదలు పెట్టిన మొట్టమొదటి రోజు చేరిన కూలీ  మొదటి పది రోజుల్లో దాదాపు అయిదొందల మందిని చేర్పించి రెండొందల యాభై సంపాదించాడు. పదకొండో రోజు ఎవరూ దొరక్క రూపాయి పోగొట్టుకున్నాడు. అయితేనేం వెరసి 249 రూపాయిలు లాభం.

    ఈ వార్తా కార్చిచ్చులా లేబర్ కాలనీలో వ్యాపించింది.

    ఈ స్కీమ్ పెట్టిన పెద్ద మనిషి, తనకి సభ్యులు చెల్లించిన డబ్బునంతా ఏ రోజుకారోజు బ్యాంకులో డిపాజిట్టుగా వేసేవాడు.

    దాంతో సభ్యుల డబ్బుకి నూటికి నూరుశాతం ఆ బ్యాంకు గ్యారంటి లభించింది.

    ఈ స్కీమ్ పెట్టినవాడికి కూడా మామూలుగా ఏమీ లాభంలేదు. ఒకరిద్దర్ని చేర్పించగానే వాడికి వాడి  పది ప్లస్ ఒక రూపాయి ఇచ్చెయ్యాలి. మిగతా ఇద్దరూ ఎవర్నీ చేర్పించ ;లేకపోతే వారికి 18 ఇచ్చెయ్యాలి! ఇలా  లక్ష మంది సభ్యులున్నా చివరికి మిగిలేది ఒక రూపాయి లాభమే!

    కానీ అసలు ట్రిక్ ఇక్కడే వుంది!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS