Previous Page Next Page 
మరణ మృదంగం పేజి 17


    "ప్రతివాడూ అలా అనుకోబట్టే దేశం ఇలా తగలడుతోంది".

    "మరేం చెయ్యాలి?"

    "అన్యాయాన్ని ఎదుర్కోవాలి".

    "సరే, ఎదుర్కో ప్రస్తుతం నీ క్రింద వాడు తప్పుచేసినట్టు నీకు తెలుసు. దాన్ని ఎలా ఎదుర్కుంటావో కాస్త చేసి చూపించు. పోలీసుల వరకూ ఎందుకు? కనీసం నీ కమేప్నీ ఛైర్మనూ, డైరక్టర్లు కూడా  నువ్వు చెప్పేది నమ్మరు".

    ఆమె ఫోన్ దగ్గిరకి వెళ్ళి, అతడు వారించేలోపులో రిసీవర్ ఎత్తి రామలింగేశ్వరావు ఇంటికి ఫోన్ చేసింది. "ఒక సారి మా ఇంటికి వస్తారా......ఇప్పుడే.....ప్లీజ్..... థాంక్యూ" అని పెట్టేసింది.

    "ఏం చెయ్యబోతున్నావునువ్వు?"

    ఆమె అతడికి జవాబు చెప్పకుందా సోఫా వెనుక టేప్ రికార్డర్ పెట్టి, ప్లగ్ అమర్చింది. ఆమె చేయదల్చుకున్నది అర్ధమైనట్టు అతడు నవ్వేడు. సోఫాలో కూర్చొని టేప్ బటన్ ని నొక్కి, "అవును, నేనే  ఫైల్లో కాగితం మార్చాను. ఏం చేస్తారు మీరు?" అన్నాడు కంఠం మార్చి. తిరిగి వింటే అది అదోలా వినిపించింది. జానీ కంఠంలా లేదు. ఆమె మొహం పాలిపోయింది.

    "రామలింగేశ్వర్రావు కంఠం ఎలా వుంటుందో నాకు తెలీదు. కానీ, రేపీ క్యాసెట్ ని నువ్వు మీ ఛైర్మన్ దగ్గిర వినిపిస్తే అతడు వాదించేది ఇదే! ఎవరో మిమిక్రీ  ఆర్టిస్ట్ చేత రికార్డు చేయించి, తన మీదకు నేరం తోసేసావని అంటాడు. ఇలాటి టేప్ రికార్డర్ సాక్ష్యం కోర్టులో కూడా పనిచెయ్యదు".

    "మరెలా?"

    "ఎలా ఏమిటి?"

    "అతనిప్పుడు వుస్తున్నాడు".

    "చూడు బేబీ. అతడిని పిలిచింది నువ్వు. ఎందుకు పిలుస్తున్నావో నాకు చెప్పకుండానే అతడికి ఫోన్ చేశావు. నాలాగే అతడిని కూడా డిన్నర్ కి పిలుస్తావనుకున్నాను".

    ఆమె మొహం ఎర్రబడింది. "నువ్వు నాకు సాయం చేస్తావనుకున్నాను. అంతేకానీ, ఒక మనిషి ఇలా ఇరుకున పడితే చూస్తూ సంతోషించే సాడిస్ట్ ని అనుకోలేదు" అంది.

    "పిలిచినందుకు రాత్రికి డిన్నర్ ఇస్తావనుకున్నాను. పిలిచి ఇలాటి ఇరకాటమైన పరిస్థితుల్లో పడేస్తావనుకోలేదు" అన్నాడు అతడు అదే స్వర స్థాయిలో.

    "నీలాంటి వాడికి డిన్నర్ కూడా వేస్టే. వెళ్ళిక్కణ్ణుంచి. ఈ సమస్యని నేనే పరిష్కరించుకోగలను".

    "మంచిది బేబి. వెళ్ళొస్తాను" అంటూ అతడు బయల్దేరబోతూ వుండగా  తలుపు కొట్టిన చప్పుడయింది. ఇద్దరూ అప్రయత్నంగా ఒకర్నొకరు చూసుకున్నారు. జానీ లోపలి గదిలోకి వెళ్తూ "నీ సమస్య తలుపు కొడుతోంది. తెరువు. అది వెళ్ళే వరకూ నేను లోపలుంటాను. దయచేసి ఇందులో నన్ను మాత్రం ఇరికించకు"

    "ఆగు. నీ పిస్టల్ ఇలా ఇచ్చి వెళ్ళు. నీలాటి పిరికివాడి దగ్గర  అలంకారప్రాయంగా  దాన్ని చూసినట్టు గుర్తు" వెటకారంగా అంది.

    అతడు మాట్లాడకుండా జేబులోంచి పిస్టల్ తీసిచ్చి "బెస్టాఫ్ లక్" అని  లోపలికి వెళ్ళిపోయాడు. ఆమె దాన్ని పుస్తకాల వెనుకపెట్టి, వెళ్ళి తలుపు తెరిచింది రామలింగేశ్వరరావు లోపలికివస్తూ, "ఇంతరాత్రి ఎందుకు పిలిచారు" అన్నాడు అతడి కళ్ళు ఆమె ఒంటరి తనపు ఇంటిని పరీక్షగా చూస్తున్నాయి.

    "కూర్చోండి"

    అతడి కళ్ళలో ఏ మాత్రం భయం లేకపోవటం ఆమెకు విస్మయాన్ని కలుగచేసింది.

    "మిమ్మల్ని ఎందుకు పిలిచానో మీకు తెలుసా".

    "ఎందుకు?"

    "ఇండియన్ ఫాస్పేట్ కంపెనీ  విషయంలో మీరు చేసిన మోసాన్ని మీతో చెప్పించటానికి".

    రామలింగేశ్వర్రావు నవ్వి "నేను ఒప్పుకొంటానని ఎలా అనుకున్నావు?" అన్నాడు.

    ఆమె దిగ్భ్రమ చెందింది. తనలా అడగ్గానే అతడు బెంబేలు చెందుతాడనీ, తనకు తెలియదని బుకాయిస్తాడనీ అనుకుంది. ఇంత డైరెక్టుగా తనని ఎదుర్కొంటాడనీ పైగా ఏకవచనంలో సంభోధిస్తాడనీ అనుకోలేదు.

    "జరిగిదానికి నేనే బాధ్యుడనని వ్రాసి సంతకం పెట్టి ఇవ్వు. అదిగో కాగితం" అంది. అతడు మాట్లాడలేదు. అతడి చూపు తన శరీరంమీదే నిలవటాన్ని ఆమె గమనించింది. ఆఫీసులో నమ్రతగా వుండే రామలింగేశ్వర్రావేనా ఇతడు అన్న అనుమానం కలుగుతోంది.

    ఈ లోపులో అతడు లేచి, నువ్వు జనరల్ మానేజర్ వి అయితే అవ్వొచ్చు. కానీ, ఎప్పుడో ఎవర్నీ ఇలా ఇంటికి పిలవకు. అసలే వంటరి ఆడదానివి" అని బయటకు నడవబోయాడు.

    "ఆగు" అంది ఆమె పిస్టల్  తీస్తూ. "నిన్ను చంపి అయినాసరే నీతో తప్పు ఒప్పుకునేట్టు చేస్తాను".

    "ఓహొ నీ దగ్గిర పిస్టల్ కూడా వుందే" అన్నాడు అతడు కిటికీ దగ్గరగా వెళుతూ. అతడు అటువైపు ఎందుకు వెళుతున్నాడో అర్థం కాలేదు. అతడేగానీ కిటికీకి వున్న తెర  తొలగించి సైగ చేసివుంటే ఏమి జరిగేదో గానీ, ఈ లోపు లోపల్నుంచి జానీ గాలిలా వచ్చి అతడిని బలంగా కొట్టాడు. ఊహించని ఈ దెబ్బకి రామలింగేశ్వర్రావు దూరంగా వెళ్ళి పడ్డాడు.

    అనూషతోపాటు లోపల ఇంకొక మనిషి వున్నాడని వూహించని రామలింగేశ్వరావు ఈ పరిణామానికి విస్తుబోయాడు. అతడి తల గోడకి కొట్టుకుని టప్ మని చప్పుడయింది.

    "ఈ విషయాన్ని నేను చూసుకోగలను జానీ. నువ్వెందుకు వచ్చావ్" అంది అనూష అతడి మాటలు అతడికే తిప్పికొడుతూ. ఈ లోపులో జానీ తెర కొద్దిగా  తొలగించి చప్పున  వెంటనే సర్దేశాడు.

    దూరంగా కరెంటు స్తంభం దగ్గిర సలీంశంకర్ నిలబడి ఇటే చూస్తున్నాడు.

    "ఇందులో నిన్ను ఇరికించవద్దన్నావ్ గా" అంది మళ్ళీ.

    "షటప్" అన్నాడు జానీ. అతడంత కోపంగా విసుగ్గా వుండటాన్ని ఆమె అదే మొదటిసారి చూడటం. దగ్గిరకి వెళ్లి ఆమె చేతిలో పిస్టల్  తీసుకుంటూ, "ఇతడే గానీ కొద్దిగా  సైగచేసివుంటే ఇంకో అయిదు నిముషాల్లో నీ ఇల్లు గుర్తు పట్టలేనంతగా  మారిపోయి వుండేది. దీని వెనుక సలీంశంకర్ వున్నాడని నేను అప్పుడే చెపితే నువ్వు నమ్మలేదు" అన్నాడు.

    "నువ్వెవరో నాకు తెలీదుగానీ సరిగ్గా చెప్పావ్" లేస్తూ అన్నాడు రామలింగేశ్వర్రావు. జానీ బలంగా అతడిని మరోసారి కొట్టాడు. అతడు అరవబోతూవుంటే పిస్టల్ చూపించి, "నోటివెంట మాట బయటకు వచ్చిందంటే ఈ బుల్లెట్ నీ తలలోంచి దూసుకుపోతుంది." అని బెదిరించాడు. ఆ క్షణం అతడి కర్కశత్వాన్ని చూసి అనూషే బెదిరింది.

    "అలా కూర్చో రామలింగేశ్వర్రావ్. నువ్వు కిటికీలోంచి సైగ చెయ్యనంత వరకూ నీకే ప్రమాదమూ లేడని భావించి ఆ సలీంశంకర్ అక్కడ అలాగే నిలబడి వుంటాడ్లే..... చెప్పు అసలేమిటిదంతా? నీకూ సలీంశంకర్ కి ఏమిటి సంబంధం?"

    రామలింగేశ్వర్రావు మాట్లాడలేదు. జానీ అనూష వైపు తిరిగి "మీ ఇంట్లో ఆవకాయ వుందా? పోనీ  చిల్లీ సాస్ అయినా సరే" అని అడిగాడు.

    అనూష లోపలికెళ్ళింది.

    "ఇంతకు ఇంతా బదులు తీర్చుకుంటాడు సలీంశంకర్" అన్నాడు రామలింగేశ్వరరావు.

    "ఏడిశాడు. విషయం అంత వరకూ వస్తే ఆ సంగతి తేల్చుకుంటాను".

    ఈలోపులో అనూష లోపల్నుంచి వచ్చింది. ఆమె చేతిలో సాస్ సీసా వుంది.

    .....సరిగ్గా  రెండు నిముషాల తరువాత రామలింగేశ్వర్రావు చెప్పాడు.

    "ఇదంతా నేను చేయలేదు. నా తప్పు ఆమె పట్టుకోగానే ఆ విషయం అప్పుడే నేను మార్చిపోయాను. కానీ నాల్రోజుల క్రితం నాకు కబురొచ్చింది".

    "ఎవరి దగ్గిర్నుంచి".

    "వసంత్ దాదా దగ్గర్నుంచి"

    జానీ చేతిలో పిస్టల్ అప్రయత్నంగా క్రిందికి దిగటం అనూష గమనించింది. వ.....సం....త.... దా....దా.

    మొరాకో - ఇండియాల సంబంధం చెడిపోవడంలాటి దూరపుటాలోచన చేసి ఇంత పెద్ద ఎత్తు వేయగలిగే శక్తి సలీంశంకర్ కి లేదని జానీ ఎప్పుడో వూహించాడు. కానీ, తెరవెనుక నుంచి ఆకారం క్రమక్రమంగా బయటకి వచ్చినట్టు వసంత్ దాదా దీని వెనుక నుంచి వస్తాడని వూహించలేదు. "ఎందుకీ అమ్మాయి మీద మాఫీయాకి ఇంత కోపం" అని అడిగాడు.

    "నాకు తెలీదు. ఆమెకు సరదాగా  బుద్ధి చెప్పాలని మాత్రం నాతో అన్నాడు. నాకెలాగో ఆమెమీద కోపం వుంది. దాంతో ఈ పనికి ఒప్పుకున్నాను. నేను తీసుకున్నది పెద్దరిస్కు అని నాకు తెలుసుగానీ, సలీశంకర్, తను వెనుక వుంటానని ధైర్యం చెప్పాడు".

    జానీ చాలా సేపు మవునంగా వుండి. సీసా పక్కన పెడుతూ "సరే ఈమె తరపు రాయబారిగా నేనొక ప్రపోజల్ చెపుతాను. వెళ్లి దాదాకి విన్నవించు! అయిపోయిందేదో అయిపోయింది. తెలిసో తెలియకో ఈమె చేసిన తప్పుకి దాదా ఈమెని  ఇరకాటమైన పరిస్థితిలో పడేసి బుద్ధి చెప్పాడు. దానికీ సరి..... ఈ ఇండియన్ ఫాస్పేట్ సంగతి మేము మర్చిపోతాం. ఇంకోలా చెప్పాలంటే నీవే ఈ పని చేసావని స్టాక్ హొం ఛైర్మన్ కి గానీ, డైరెక్టర్లకీ గానీ తెలియకుండా, ఈ విషయం ఇక్కడితో మర్చిపోతాం. దీనికి ప్రతిఫలంగా దాదా ఈ అమ్మాయి విషయం మార్చిపోవాలి. సలీంశంకర్ ఇక ఈమె జోలికి రాకూడదు.సరేనా-"

    "నేనొప్పుకోను "-పక్కనుంచి వినిపించింది. ఈ మాట అన్నది అనూష. "ఈ  ఫైళ్ల మార్పిడి విషయం ఇప్పుడే పండాకి ఫోన్ చేసి....."

    "నోర్మూయ్" ఆమె మాటలు పూర్తి కాకుండా గద్దించాడు జానీ, తరువాత రామలింగేశ్వరరావు వైపు తిరిగి, "ఇదీ మా ప్రపోజల్. దీనివల్ల నీకూ లాభం వుంది. ఆలోచించుకో- గొడవలెందుకు?" అన్నాడు.

    "అడిగి చెపుతాను".

    "గుడ్" అతడు వెళ్ళిపోయాడు. అతడి వెనుకే తలుపు మూసుకుపోయింది. ఆ నిశ్శబ్దంలోంచి అనూష అంది- "నువ్వింత పౌరుషహీనంగా, ఇంకా వల్గర్ గా చెప్పాలంటే ఒక కొజ్జాలా ప్రవర్తిస్తావని నేను కలలో కూడా అనుకోలేదు".

    జానీకి ఆ మాటలకి కోపం రాలేదు. పిస్టల్  లోపల  పెట్టుకుంటూ "ఏదైతే జరక్కూడదని అనుకుంటున్నావో అది జరిగింది బేబీ! వసంత్  దాదా కూడా  రంగంలోకి వచ్చాడంటే నువ్వు ఆవగింజలా పేలిపోతావ్. ఈ యుద్ధ విరమణ సంధికిగానీ దాదా ఒప్పుకుని వదిలిపెడితే ఈ ప్రపంచంలో నీకన్నా అదృష్టవంతులు ఎవరూ వుండరు. చాలా చిన్న విషయం ఇది. దురదృష్టవంతులు ఎవరూ వుండరు. చాలా చిన్న విషయం ఇది. దురదృష్టవశాత్తు ఇంతవరకూ వచ్చింది. ఇక్కడితో ఆగిపోతే అందరికీ మంచిది".

    "మీలాంటి వాళ్ళు వుండబట్టే  ఈ దేశం ఇలా తగలడుతోంది" అందామె కఠినంగా. "నా అసిస్టెంట్ నా ఫైల్సు మారుస్తాడు. నా  ఉద్యోగం పొయినా నేను మౌనంగా వూరుకోవాలి. నన్ను ఎవడో జీపులో రేప్ చేయ్యటానికి తీసుకెళ్ళటానికి ప్రయత్నిస్తాడు. నేను ఎవరికీ ఫిర్యాదు చేయకూడదు. నా ఇల్లు ధ్వంసం చేస్తారు. అయినా నేను వూరుకోవాలి. ఎందుకు?"

    "దీని వెనుక మాఫియా వుంది కాబట్టి?"

    "మాఫియా- మాఫియా- మాఫియా, వాళ్ళుకూడా మీలాటి మనుష్యులే. పోతే మీలా గాజులు తొడుక్కోలేదు. అందుకే ప్రపంచాన్ని ఆడిస్తున్నారు".

    "అయితే ఏమంటావ్?" విసుగ్గా అన్నాడు జానీ.
   
    "నేనూ వంసత్ దాదాగాడ్ని ఎదుర్కోదలుచుకున్నాను".

    జానీ నవ్వేడు. "ఎలా?"   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS