ఒక కూలీ, తను పది రూపాయిలు కట్టగానే- తన లాంటి ఇద్దరి కోసం ప్రపంచం మీద పడతాడు. వారం పదీ రోజులు తిరుగుతాడు. దొరికారా సరేసరి. లేకపోతే మరో పది రోజులు వెతుకుతాడు. ఏ క్షణమైనా సరే తన తొమ్మిది రూపాయిలూ తీసుకోవచ్చనే ధీమా వుండటంతో తన పది రూపాయిల కోసం పట్టించుకోడు.
అది చాలు- ఈ స్కీమ్ సంస్థాపకుడి- బ్యాంకు నుంచి వడ్డీ సంపాదించటానికి.
ఈ స్కీమ్ ఎంత గొప్పగా పేలిందంటే 1976 లో దీన్ని స్థాపించిన యువకుడు 1979లో మధ్యప్రదేశ్ లో అరవై లక్షలు పెట్టి పేపర్ మిల్లు ఒకటి కొనుక్కున్నాడు. ఇది వాస్తవం! నమ్మినా నమ్మకపొయినా ఇది నిజం!!
ఇదే స్కీమ్ ని వసంత్ దాదా తరువాత స్థాపించాడు. తన సామ్రాజ్యాన్ని బొంబాయి నుంచి కలకత్తా, ఢిల్లీలకి వ్యాపింపచేశాడు. కలకత్తాలో మరింత లేబర్ ఫోర్స్ వుంది. అక్కడ ఈ స్కీమ్ ఇంకా బాగా ప్రాచుర్యం పొందింది.
అనూషకి ఒక అనుమానం వచ్చింది.
న్యాయబద్ధంగా గానీ, చట్టబద్ధంగా గాని, నైతికంగా గానీ ఈ స్కీమ్ లో ఏ విధమైన మోసమూ లేదు. లక్షలు సంపాదించవచ్చు అది వేరే సంగతి. కానీ డబ్బు సంపాదన మంసిహి రక్తం రుచి చూసిన పులి అలవాటు లాంటిది. ఇంత డబ్బూ బ్యాంకులో వేసి కేవలం వడ్డీ ద్వారా సంతృప్తి పడటం, మనిషికి సాధ్యమేనా? అందులోనూ ముఖ్యంగా వసంత్ దాదాకి.
అనూష శ్రీకాంత్ ద్వారా వాకబు చేసింది అదే.
వసంత్ దాదా ఈ డబ్బుని బ్యాంకులో వేయటం లేదు..... తన మిగతా కార్యకలాపాల్లో వినియోగిస్తున్నాడు.
మొదట్లోవేసి, బ్యాంక్ గ్యారంటీ సంపాదించాడు- ఆ తరువాత అది మానేసి, ఆ గ్యారంటీని మాత్రం తన ప్రకటన (అడ్వర్టైజ్ మెంట్స్) కి ఉపయోగించుకున్నాడు. అందరూ చేసేపనే ఇది. సామాన్య ప్రజలకి ఇది తెలీదు.
సెన్స్ లెస్ ఇన్సూరెన్సు కంపెనీలూ- భాగ్యదర్శి ఇన్వెస్ట్ మెంట్ కంపెనీలూ, రవీ సర్క్యులేటింగ్ స్కీమ్ లూ..... వసంత్ దాదాలు ఎక్కడో లేరు. మన పక్కనే వున్నారు. అయితే వీరంత తెలివి తక్కువగా ప్లాన్ వేయడు దాదా! కొన్ని వందల రెట్లు పకడ్బందీగా వేస్తాడు. అలాగే వేసాడు కూడా.
ఇలాటి 'రోజుకో రూపాయి స్కీము' లో ఎంతమంది ప్రస్తుతం సభ్యులుగా వున్నారో, ఎంత డబ్బు ఆ అధిపతుల దగ్గిర వుందో లెక్కలు కట్టి ఒక ఇంగ్లీషు పత్రికలో వ్యాసంగా ప్రచురించింది అనూష.
"బ్యాంకు మీ డబ్బుకి గ్యారంటీ ఇస్తుంది" అన్న ప్రకటన ఆ సంస్థ ప్రకటించటం ఏ తేదీ నుంచి మానేసిందో ఆ తేదీతో సహా వ్యాసంలో వ్రాసింది. ఈ డబ్బు అంతా ఎటు వెళ్ళింది అని ప్రశ్నించింది. ఒకవేళ ఈ సభ్యులంతా మా డబ్బు మాకిచ్చెయ్యండి అని అడిగితే ఎక్కణ్ణుంచి తెచ్చి ఇస్తారు అని అడిగింది.
ఒక లీడింగు ఇంగ్లీషు దిన పత్రికలో ఈ వ్యాసం పడింది.
వసంత్ దాదాకి శత్రువులు లేకపోలేదు. చిన్న చిన్న మాఫియా గ్రూపులు అతనికి వ్యతిరేకంగా పని చేస్తూనే వున్నాయి. అయితే అవి అంతగా చెప్పుకోదగ్గవి కావు. అయితే ఈ సందర్భంలో ఈ వ్యాసాన్ని వాళ్ళు తమ ప్రచారానికి ఉపయోగించుకున్నారు. లేబర్ కాలనీలలో ఏ వార్తా అయినా క్షణాల్లో వ్యాపిస్తుంది. ఇలాంటి స్కీములకి నమ్మకం ముఖ్యం. "రోజుకి రూపాయి స్కీము' దివాళా తీస్తుందని వార్త పొక్కగానే, పది రూపాయిలు పెట్టుబడి పెట్టిన ప్రతీవాడూ, మరో ఇద్దర్ని వెతకటం మానేసి-తన తొమ్మిది రూపాయిలూ తీసుకోవటానికి కంపెనీకి పరుగెత్తాడు.
మొదటి రోజు కంపెనీ రెండు లక్షల పైగా చెల్లించవలసి వచ్చింది.
రెండో రోజు ఆరు లక్షలు.
మూడో రోజు ఆరు లక్షలు.
వారం రోజులపాటు ఇలా చెల్లించవలసిన మొత్తం దాదాపు డెభ్భై లక్షలు తేలింది (దీన్ని బట్టి ప్రజల సొమ్ముతో ఎంత వ్యాపారం జరుగుతూ వుందో వూహించు కోవచ్చు). ఇంకెవరైనా అయితే గాలి బుడగలా పేలిపోవలసినవారే........ వసంత్ దాదా కాబట్టి నిలదొక్కుకున్నాడు. కూలీల్లో తిరిగి నమ్మకం కుదరటానికి వారం రోజులు పట్టింది. ఎక్కడెక్కడ నుంచో డబ్బు తెచ్చి సర్దవలసి వచ్చింది. శ్రీకాంత్ వలపన్నుక్కూర్చున్నాడు. ఏ క్షణమైతే ఏ ఒక్కరికైనా కంపెనీ డబ్బు చెల్లించలేక పోతుందో ఆ క్షణం అరెస్ట్ చేయించటానికి.
ఈ మధ్య కాలంలో దాదాకి ఇంత దెబ్బ తగల్లేదు. తుఫాను వెళ్ళి పోయాక చూసుకుంటే నష్టం దాదాపు పదిహేను లక్షలు దాకా తేలింది. ఒక చిన్న వ్యాసం ఇంత పని చేస్తుందనుకోలేదు.
వసంత్ దాదా పెదాల మీద చిరునవ్వు మాయమైంది.
10
"హల్లో"
"బిల్హణుడు స్పీకింగ్ హియర్"
"జానీ వున్నాడా?"
"మీరెవరు- మీ కంఠస్వరం బావుంది. అందుకని అడుగుతున్నాను" తడువుకోకుండా అన్నాడు.
"అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఇన్ కంటాక్స్".
"మైగాడ్ ...... వుండండి మాడమ్...... సారీ మాడమ్..... ఇప్పుడే కనెక్షన్ ఇస్తాను" క్షణం తరువాత జానీ లైన్లోకి వచ్చాడు.
కొంచెం సేపు మామూలు సంభాషణ జరిగాక, అనూష అంది. "వరంగల్ పక్క కొన్ని యూకలిప్టస్ ప్లాంటేషన్స్ వేసే నిమిత్తం ఒక లిమిటెడ్ కంపెనీ రాబోతుంది. అందువల్ల రేపు అటు వెళ్తున్నాను. నువ్వూ వస్తావేమో కనుక్కుందామని......"
జానీ సన్నగా విజిల్ వేసాడు. "అమ్మాయి పిలిస్తే రానంటానా? తప్పకుండా. బైదిబై - ఏమిటి ఇన్ కంటాక్స్ అన్నావుట?"
'మీ వాడికి అలా చెపుతే గానీ - అమ్మాయిలంటే వున్న తేలిక అభిప్రాయం పోదని ఇన్ కంటాక్స్ అన్నావుట?"
'మీ వాడికి అలా చెపుతే గానీ- అమ్మాయిలంటే వున్న తేలిక అభిప్రాయం పోదని..... బై- రేపు కలుద్దాం".
........
ఆ మరుసటిరోజు ఇద్దరూ వరంగల్ వైపు ప్రయాణం సాగించారు.
"ఎక్కడా మనం వుండేది? ఏకశిలాలోనా?"
"కాదు, రామప్ప టెంపుల్ గెస్ట్ హవుస్ లో".
జానీ మళ్లీ సన్నగా విజిల్ వేయటాన్ని ఓరకంట గమనించింది,
"అనవసరమైన ఆలోచన్లూ, ఆశలూ పెట్టుకోకు జానీ! నిన్నొక చిన్న పని మీద తీసుకు వెళ్తున్నాను".
"ఏమిటి?"
"వెళ్ళాక చెపుతాను".
కారు భువనగిరి దాటాక ఆమె నెమ్మదిగా అంది - "వసంత్ దాదాకి చిన్న బుద్ధి చెప్పాను జానీ".
జానీ మొహంలో నవ్వు మాయమైంది. "ఏమిటీ ఎలా?" అన్నాడు.
ఆమె తను వ్రాసిన వ్యాసం సంగతీ, బిజినెస్ సర్కిల్స్ లో దాని ప్రభావం గురించీ, దాదాకి దానివల్ల వచ్చిన నష్టం గురించీ చెప్పింది. జానీ చాలా సేపటివరకూ మాట్లాడలేదు. అతడి మూడ్ పాడయిందని తెలుస్తూనే వుంది. "ఏదైనా అవుతే నాకవుతుంది. నీవెందుకు అలా వుండటం" అంది. దానికీ జానీ సమాధానం చెప్పలేదు. దీర్ఘాలోచనలోంచి తేరుకున్నట్టు 'నాకు భయంగా వుంది అని మాత్రం అన్నాడు.
"ఒంటరి ఆడపిల్లని చూసి ముద్దు పెట్టుకున్నప్పుడు లేదా భయం?"
కారు రామప్ప గుడి పక్క హవుస్ దగ్గర ఆగింది. గుమాస్తా వచ్చి తలుపు తీసి తాళాలు అందించాడు. దూరంగా వున్న సరస్సు మీద నుంచి చల్లటి గాలి వస్తోంది. ఇద్దరూ చెరో రూమ్ లోకి ప్రవేశిస్తుండగా, "ఇంకో అరగంటలో ఆ కంపెనీ వాళ్ళు వస్తారు స్థలం చూడాలి వెళ్దాం" అంది.
"నాతో ఏదో పని వుందన్నావ్".
"చెప్తాను".
జానీ లోపలికి వెళ్ళిపోయాడు. అయిదు నిముషాల తరువాత ఆమె అతడి గదిలోకి ప్రవేశించింది. టవల్ కట్టుకుని అతడు స్నానానికి వెళ్లటానికి సిద్ధంగా వున్నాడు.
ఆమెని చూసి చప్పున బాత్ రూమ్ లోకి వెళ్ళిపోయి, "మొగవాళ్ల గదిలోకి అలా తలుపు కొట్టకుండా ప్రవేశించకూడదు" అన్నాడు.
ఆమె నవ్వి, "ఆ టవల్ క్రితం ఈ రూమ్ లో దిగిన వాళ్ల కిచ్చినదట. దాన్ని బయట పారెయ్యి. ఇంకొకటి తెస్తున్నాడు నౌకరు. బైదిబై తొందరగా స్నానం చెయ్యి. వాళ్లు వచ్చే టైమయింది" అంది.
జానీ చెయ్యి తలుపు సందులోంచి టవల్ ని బయటకు విసిరేసింది.
రెండు నిముషాల తరువాత బ్రీఫ్ కేసు మూసినా చప్పుడు క్లిక్ మని వినిపించింది.
బాత్ రూమ్ లోంచి 'ఓయ్' అన్నాడు.
"నేను వెళ్తున్నాను".
"ఎక్కడికి? వుండు .....అయిపోయింది. వాడిని తొందరగా టవల్ తెమ్మను".
"వాడు ఇప్పట్లో రాదు జానీ! రేపటి వరకూ మనని దిస్తర్భ్ చెయ్యొద్దని వాడిని పంపేసేను! నీ వాచీ, వుంగరం, బట్టలు, తువ్వాళ్ళు, చివరికి బెడ్ షీట్లతో సహా అన్నీ తీసుకునిపోతున్నాను".
"ఏయ్-ఏమిటిది? ఆగు".
"జానీ! ఈ ప్రపంచంలో ఇంతమంది దుర్మార్గులు- నరరూప రాక్షసులు ఇలా విచ్చలవిడిగా చలరేగుతూ వుంటే ఎవరికి వారు తమకి పట్టనట్టు వూరుకోవటమే అని నేను అంటే నన్ను ఎత్తిపోడిచావు. ఏదో వుదాహరణ ఇస్తున్నట్టు నన్ను ముద్దు పెట్టుకుని, "ఏ రిపోర్టు ఇస్తావో ఇచ్చుకో. నీకేం సాక్ష్యం వుంది?" అని హేళన చేశావు. జరిగిన ప్రతి దానికి జవాబు చెప్పటానికి పోలీసు స్టేషన్ లు అక్కర్లేదు జానీ. ఈ రకంగా కూడా జవాబు చెప్పొచ్చు. అసలే వూరికి రామప్పగుడి దూరం. వంటిమీద నూలు పోగు లేకుండా ఇక్కణ్ణుంచి మన నగరం ఎలా వస్తావో నీ ఇష్టం! అన్యాయం జరిగిన ప్రతివాడూ ఏదో రకంగా బదులు తీర్చుకోవచ్చు- అన్నమాట నిజమని ఇప్పుడైనా వప్పుకుంటావా? ఇంకెప్పుడూ ఎవరింట్లోకీ ప్రవేశించి నీ స్వంత భార్యని ముద్దు పెట్టుకున్నట్టు ఎవరినీ ముద్దు పెట్టుకోక. అలా పెట్టుకుంటే నువ్వో చిన్న తరహా వసంత్ దాదా అవుతావు. అప్పుడ ఇంకా పెద్ద ఎత్తులో నీకు కూడా దాదాకి చెప్పినట్టే పాఠం చెప్పవలసి వస్తుంది. వెళ్లోస్తాను".
"ఆగు ఏయ్! నాకేం సిగ్గులేదు. రెండు క్షణాలు టైమిస్తున్నాను. బ్రీఫ్ కేసు అక్కడ పెట్టి వెళ్లు. లేకపోతే ఇలాగే బయటకు వచ్చేస్తాను. భరించలేవు. ఇక నీ ఇష్టం".
అని క్షణం ఆగి, అతడు తలుపు తీశాడు.
బయట కారు స్టార్టయిన శబ్దం వినిపించింది.
ఆమె గానీ వెళ్ళిపోతే తన పరిస్థితి ఏమిటో ఊహించుకోలేని జడుడు కాడు. ఎవరూలేని ఈ టైమ్ లో ఆమెని పట్టుకోవటమే మంచిది.
అలాగే కారువద్దకు పరుగెత్తాడు మెట్లు దిగి క్రిందికి వచ్చాడు.
దుమ్ము లేపుకుంటూ కారు సాగిపోయింది.
దూరంగా చెరువు కట్ట. ఇటు ప్రక్క గుడి. అంతా నిర్మానుష్యం.
11
'తెగిన హరపు వెదజల్లుబడిన ముత్యాలు పాత్రలయితే సూత్రధారుడు దారం' - అని అన్నాడొక విమర్శకుడు. మరణ మృదంగ హారపు ముత్యాలు సలీం శంకర్, వంసత్ దాదా, అనూష, ఉత్పలత అయితే, దారం-
విష్ణుశర్మ!
జీవితంలోని తన ఓటమికి తను కారణం కాదని ఆత్మవంచన చేసుకొనే సగటు కోట్లాది ప్రజల్లో అతనొకడు. ప్రేమించిన రోజుల్లో తనంత గొప్పవాడు మరెవడూ లేడని పొంగిపోయాడు. ప్రపంచం అంతా గాలిలో ఎగిరి పోతున్న అనుభూతి పొందాడు. ప్రేమింపబడటం ఈ ప్రపంచంలో చాలా కొద్దిమంది అదృష్టవంతులకి మాత్రమే సాధ్యమయ్యే ఏకైక వరం అని భావించే మూర్ఖుల్లో ఒకడయ్యాడు. ఈప్రపంచంలో -ఈ సోకాల్డ్ ప్రేమ- ప్రేమించడం- ప్రేమించబడటం అనేవి చాలా చౌకబారు పదాలనీ- ఏ జంక్షన్ లో ఓ అరగంట నిలబడినా ఎవరో ఒకరు ప్రేమించటం మొదలు పెడతారనీ తెలియని అడాల్ సెంట్ మనస్తత్వంతో ప్రేమలో పడ్డాడు.

