Previous Page Next Page 
సంపూర్ణ గోలాయణం పేజి 17



    "సరే నండీ, అలాగే?" భయంగా సరే నన్నాడు.

    సాయంత్రం ఆరింటికి అయిదునిమిషాలుండగానే వచ్చేశాడు మోహన్ "వెరీగుడ్. యూ ఆర్ ఎ పంక్చు వల్ మేన్!" అని మెచ్చుకున్నాడు పృధ్వి.

    మరో అయిదునిముషాల్లో తయారై వాకిట్లోకి వచ్చారు. ఓ చేతిలో గొడుగు, రెండో చేతిలో లెదర్  బాగ్ దానిలో టార్చి లైట్, ప్లాన్ వగైరాలున్నాయి.

    రోడ్ మీదికి రాగానే "సార్! రిక్షా  పిలవనా" అన్నాడు "ఠఠ్ నరవాహనం ఎక్కను" అన్నారాయన.

    బస్టాపుకి రాగానే సార్! పోనీ డీసెల్ వాహనంలో వెళ్దామా?" అడిగాడు.

    వద్దు, బోలెడంతమంది జనం వున్నారు. బస్ కోసం  బోలెడు సేపు వెయిట్ చెయ్యాలి. టైం ఈజ్  గోల్డ్ అన్నాడాయన.

    ఇక చేసేదిలేక నటరాజా సర్వీస్ మొదలు పెట్టాడు మోహన్. అయిదు కిలోమిటర్లదూరం. మిట్టపల్లాల రోడ్డు దేవుడు గుర్తొచ్చాడు మోహన్ కి కానీ ప్రొఫెసర్ గారు మాత్రం ఏ మాత్రం అలసటలేకుండా గజానికి ఒక అంగచొప్పున వేస్తూ ఎక్కడా ఆక్కుండా నడిచేశారు.

    మధ్యలో తాము వెళ్తున్నది దీపిక పనిమీద అని ఆ కార్యం నిర్విఘ్నంగా నెరవేరితే దీపిక తండ్రి తనమీద వుంచిన బాధ్యత నెరవేరినట్లే  అనీ చెప్పారు.

    నడిచి నడిచి తమ ఇంటి దగ్గరకే వెళ్తున్న ప్రొఫెసర్ గారిని "ఇటెక్కడికి?" అని అడిగాడు. కానీ  ఆయన చెప్పలేదు సీరియస్ గా చూశారంతే.

    తిన్నగా వెళ్ళిదీపా వాళ్ళింటి ముందు ఆగేసరికి మోహన్ పై ప్రాణం పైనే  పోయింది. ఇంట్లోకి వెళ్దాం రమ్మంటాడేమో రమ్మంటే యిప్పుడేవస్తా అని చల్లగాజారుకోవాలి అనుక్కునాడు. కానీ ఆ అవసరం రాలేదు. ఇంట్లోకి వెళ్ళలేదు.

    ఇంటి పక్కగా కాస్త దూరంలో నిలబడి "మోహన్ నౌ వియ్ ఆర్ గోయింగ్ టూ స్టార్ట్ ఆవర్ వర్క్" అన్నారు.

    "చెప్పండి సర్!" సిద్దం అయిపోయాడు మోహన్ దీపిక పని కాబట్టి బంగాళాఖాతంలో దూకమన్నా సిద్దమే అన్నాడు.

    సుమారుగా మీటరు దూరం అంటే ఎంతుంటుంది చెప్పు?" సుమారుగా చూసి "ఇదిగో ఇక్కడి నుంచి అక్కడికి! అని చెప్పాడు.

    "వెరీగుడ్, బాగా చెప్పావు. యిలాగే నేను చెప్తూ వుంటాను. నువ్వు అంచనాగా చెప్తూ వుండాలి" అన్నారు. అయోమయంగా చూసి తలాడించారు.

    లెదర్ బాగ్ లోంచి ప్లాన్ తీసుకుని ఓపెన్ చేశారు రెండో చేత్తో టార్చి వెలిగించారు.

    "అదిగో అదే దీపికా  వాళ్ళ పూజగది అక్కడి నుంచి దక్షిణదిశ అంటే సౌత్ డైరెక్షన్లో సుమారు వందమిటర్లు పోవాలి పద!" అన్నారు.

    నా కర్థంగా లేదండీ మీరు చెవుతున్నది!" అన్నాడు మోహన్.

    కించిత్ విసుగ్గా చూసి "ఇప్పుడా మీటరు కొలిచేవు కదా! అలాగే కళ్ళతో సుమారుగా వందమీటర్లు కోలు, కమాన్, అన్నారు.

    అలాగే అని బుర్రాపి పనిమొదలు పెట్టాడు. దీపా వాళ్ళింటి ఉత్తరంలో భారతి యిల్లు. ఆపోజిట్ డైరెక్షన్లో బయలుదేరారు. మూడు మిటర్లు వెళ్ళి ఆగిపోయాడు మోహన్.

    "సార్ సుమారుగా మూడు మిటర్లు కొల్చేనండీ గోడ వచ్చేసింది అన్నాడు వినయంగా.

    మరికొంచెం విసుగ్గా చూశారు పృధ్వి. "వస్తే రానీ! నువ్వు ఆగకు గోడవచ్చినా, చెట్లోచ్చినా చేమలొచ్చినా లెక్కచెయ్యాకు. అలా కొల్చుకుంటూ పద. మధ్యలో మాత్రం ఆగిపోకు లెక్కపోతుంది" అన్నాడు.

    అర్థం అయినట్లు తలూపి మళ్ళీ వెనక్కి వెళ్ళి దీపిక పూజగది నుండి కొల్త మొదలు పెట్టాడు గోడదాటి రోడ్డుదాటి వేపచెట్టు దగ్గర  ఆగాడు. "పందమీటర్లు అయింది సార్ అన్నాడు.

    "అయిందా! తూర్పుకి తిరుగు ఎనిమిది వందల మిటర్లు" అన్నారాయన.

    మళ్ళీ మొదలు, కిళ్ళీ కొట్టు దాటి పిల్లల స్కూలు, పబ్లిక్ పంపు, రెండిళ్ళు, దాటుకుంటూ ఇంకో వేపచెట్టు కిందకి చేరారు.

    నౌ టెక్ వెస్ట్ టర్న్ హండ్రెడ్ మీటర్స్" అని ఆదేశించారాయన.

    అలా అరగంటసేపు ఆగకుండా తిరిగి అరవిందా నర్సింగ్ హొమ్ ఎదురుగా ఆగారు.

    "అదుగోసార్! ఆ మూల దాకా వస్తుంది మీరు చెప్పిన మెజర్ మెంట్!" అన్నాడు మోహన్ ఆయాన పడుతూ.

    సీరియస్ గ చూశారాయన. "ఎక్కడా లెక్క తప్పలేదు కదూ!" అడిగారు.

    "లేదండి బాగానే మెజర్ చేశాను. కాపోతే రెండు మూడు మిటర్లు అటూ ఇటూ కావచ్చు."

    రెండు నిమిషాలు సీరియస్ గా ఆలోచించేసి "రేప్పోద్దున వద్దాం పద" అన్నారు. సగం దూరం దాకా ఆయన్ని దిగబెట్టి వెనుతిరిగాడు మోహన్.

    "రేప్పోద్దునే వచ్చేయ్ మోహన్" మరోసారి గుర్తు చేశారాయన.

    "అలాగే సార్!" అన్నాడు మోహన్.

    ఉసూరుమంటూ ఇంటికి చేరాడు.

    వాకిట్లోనే నిలేసింది భారతి "బావా! బావా పార్వతి గారింటికెళ్ళి పల్లకీ తెచ్చి పెట్టవా?" అంది గారంగా.

    చిర్రెత్తుకొచ్చింది మోహన్ కి. "పార్వతి గారింటికీ వెళ్ళి పల్లకీ తేను, పంకజంగారింటికెళ్ళి పందిరిమంచమూ తేను.

    "అయినా ఇదేం పిచ్చి నీకు. పొద్దస్తమానం అలా ఆగమ్మ కాకిలా ఊరిమీదపడి తిరుగుతూ పుస్తకాలు చదివేబదులు కాస్త వంటా వార్పూ నేర్చుకోరాదా!" అన్నాడు  విసుగ్గా.

    దానితో భోరున ఏడ్చేసి తండ్రికి కంప్లయింట్ చేసింది భారతి.

    "తల్లిలేని పిల్ల వెర్రితల్లి దాన్నేమీ అనకురా అబ్బాయ్ అరిచేతుల్లో పెట్టుకుని పెంచుకుంటున్నాను. ఏమిటో అదలా అర్ధాంతరంగా పోబట్టి దీనికీ నాకూ ఈ  కష్టాలు. అదే వుండివుంటేనా!" అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు సూర్యం.

    వాళ్ళిద్దర్నీ ఓదార్చి ఊరుకోబెట్టేసరికి తల ప్రాణం తోకకి వచ్చింది. అన్నం తినేసి మంచంమీద పడుకొని "ఏమిటో నాది మరీ అస్తవ్యస్త బ్రతుకైపోయింది అనుకున్నాడు విసుగ్గా.

    తెల్లవారగానే ఎర్లీగా ఏడింటికల్లా ప్రొఫెసర్ గారి దగ్గరకు వెళ్ళాడు అప్పటికే ఆయన సిద్దంగా వున్నారు.

    ఇద్దరూ కలసి అరవిందా నర్సింగ్ హొమ్ కి వచ్చారు.

    అరవిందా నర్సింగ్ హొమ్ డాక్టర్ రాజగోపాలన్ గారిది ఆయన చాలా మంచి డాక్టర్. పాతికేళ్ళుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయన భార్యా అరవిందా రాజగోపాలన్ గారుకూడా డాక్టరే చల్లని చెయ్యి మా తల్లిది అని చెప్పుకుంటారు జనం.

    వైద్యంలో ఇద్డందీ అందెవేసిన చెయ్యి అంతేకాక దానధర్మాల్లోకూడా ముందు వుంటారు ఆయన సహాయం కోసం చాలామంది వస్తూ వుంటారు పొద్దున్నే ఓ అరగంట సమయం అలా వచ్చేవారికోసం కేటాయిస్తారు ఆయన.

    అలవాటు ప్రకారం ఎనిమిది కొట్టేసరికి తెల్లటి పాంట్ షర్ట్ వేసుకుని మేడ దిగివచ్చారు డా|| రాజగోపాలన్ గారు ఆ హల్లో ఆయన కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళంతా లేచి వినయంగా నమస్కారాలు చేశారు.

`    అందరినీ ఆదరంగా పలకరిస్తూ వారివారి కష్టసుఖాలు కనుక్కుంటూ ప్రొఫెసర్ గారి దగ్గరకు వచ్చారు. "చెప్పండి ఏం కావాలి?" అని అడిగారు.

    "నేను విరాళంకోసం రాలేదు. మీతో పనుండి వచ్చాను" అన్నారు పృధ్వి "ఓ ప్లీజ్  వెయిట్ అందర్నీ పంపించి వస్తాను" అనేసి ముందుకి వెళ్ళారు డాక్టరుగారు.

    అందరినీ పంపించి వచ్చి కుర్చీ లాక్కుని కూర్చున్నారు డా|| రాజగోపాలన్ గారు.

    "మీతో ఓ ముఖ్యమయిన పనుండి వచ్చాను. ఐయాం పృధ్వి. ప్రొఫెసర్ పృధ్వి" అన్నారు ప్రొఫెసర్ గారు.

    "చెప్పండి నాకు టైమ్ అయిపోతుంది. పేషెంట్లు వెయిట్ చేస్తుంటారు" తొందరపెట్టారు డాక్టరుగారు.

    "మీరు నాకో సాయం చేయాలి. మీ ఆపరేషన్ ధియేటర్లో నేను గుంట తవ్వుకుంటాను. ఎంత అరగంట పని. పనైపోగానే మళ్ళీ నేనే పూడ్చేసి సిమెంట్ చేసేస్తాను" అన్నారు ప్రొఫెసర్ గారు గుసగుసగా.

    నోరు అవలించి వుండిపోయారు డాక్టరుగారు "ఏమిటి ఏమన్నారు? మళ్ళీ చెప్పండి!" అన్నారు ఆశ్చర్యంనుంచి తేరుకుని.

    "అదే నేను మీ  ఆపరేషన్ ధియేటర్లో గుంట తవ్వు కోవాలి. అవసరం వచ్చింది. ఎందుకని మీరడక్కండి. నాకు సాయంచేస్తే మీ ఉపకారం ఉంచుకోము" అన్నారు పృధ్వి. నిట్టూర్చి లేచారు డాక్టరుగారు. "ఒక్కనిముషం!" అంటూ లోపలికి  వెళ్ళి భార్యని పిల్చుకొచ్చారు. ఇద్దరూ ఏమిటో అరవంలో మాట్లాడుకున్నారు.

    "ఏమిటి బాబూ ఏమిటో కావాలన్నారుట!" ఆదరంగా అడిగింది అలవిందా రాజగోపాలన్.

    అరిగిపోయిన రికార్డులా గడగడ చెప్పేశారు పృధ్వి. మళ్ళీ  అరవంలో మాట్లాడుకున్నారు డాక్టర్లిద్దరూ.

    "మీతో ఎవరయినా వచ్చారా?" మరింత ఆదరంగా అడిగింది అరవిందగారు.

    "మోహన్ వచ్చాడు. వరండాలో కూర్చున్నాడు" అన్నారు పృధ్వి "మీరిక్కడే కూర్చోండి" అనేసి వరండాలోకి వచ్చారు. "ప్రొపెసర్ గారి తాలూకు మోహన్ ట ఎవరండీ!" అన్నారు రాజగోపాలన్ గారు.

    పేషెంట్ల మధ్య కూర్చున్న మోహన్ చివాల్న లేచి "నేనేనండీ!" అన్నాడు.

    "ఓసారిలా వస్తారా!" అంటూ మూలకి తీసుకువెళ్లారు డాక్టర్స్ "చూడండి! ప్రొఫెసర్ గారు ఇఅలా గోతులు తీస్తానని ఎంతకాలంగా అంటున్నారు?" చల్లగా నవ్వుతూ ప్రశ్నించింది అరవింద.

    వాళ్ళడుగుతున్నది ఏమిటో అర్ధంగాక కంగారు పడిపోయాడు మోహన్.

    అది గమనించి వాత్సల్యంగా భుజం తట్టారు రాజగోపాలన్ గారు "కంగారుపడాల్సింది ఏమీలేదు రెండేళ్ళ క్రిందట ఇలాటికేసే ఒకటి వచ్చింది మా దగ్గరికి పాతికేళ్ళ కుర్రాడు. తాజ్ మహల్ కట్టించింది మా తాతయ్యే! అని అరుస్తూనేవుండేవాడు పాపం ట్రీట్ మెంట్ ఇప్పించాం రెండు నెలలు. అంతే లక్షణంగా పెళ్ళిచేసుకుని కాపురం చేసుకుంటున్నాడు"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS