Previous Page Next Page 
గజ్జె ఘల్లుమంటుంటే పేజి 16


    "గ్రాండ్ పా! ఇంకేమీ అడగను! మా డాడీ పేరు చెప్పండి" అంది.
   "పేరు చెప్పాక ఇంకేమీ అడక్కుండా బుద్ధిగా పడుకుంటావా?" బద్దలయిపోతున్న గుండెని చేతులతో పట్టుకుంటున్నట్లు రాసుకుంటూ అడిగారు.
    "ప్రామిస్! అడగను! గ్రాండ్ పా!" అంది.
    "రాజేష్!"   
    "రాజేషా!" తన క్లాసులో రుక్మిణీ రాజేష్ జ్ఞాపకం వచ్చింది శిల్పా రాజేష్ అనుకుంటూ నవ్వుకుంటోంది.
    "ఊ..... " అంటూ ఆలోచనలో పడిపోయిన రామానుజంగారి భుజం పట్టుకుని, పెద్ద ఆరిందాలా "గ్రాండ్ పా! ఇక పడుకుందాం పదండి" అంది.
    ఆశ్చర్యం, ఆనందం, దుఃఖం గుండెను పీల్చేస్తుంటే శిల్పని ఎత్తుకుని మంచంమీద వాలిపోయారు రామానుజంగారు! శిల్పకి ఇన్ని తెలివితేటలున్నాయని గానీ, ఇంత చక్కగా మాట్లాడగలదని గానీ, ఆమె పుట్టిన ఈ పదేళ్లలోనూ అనుకోలేదు. రాగిణి దురదృష్టానికి బాధపడుతూ ఏ తెల్లవారుఝామునో నిద్రలోకి జారుకున్నారు రామానుజంగారు.
    అతన్ని గట్టిగా కావలించుకొని నిద్రపోయింది శిల్ప తృప్తితో!
    ఆనాటి నుంచి శిల్ప వీరిని 'గ్రాండ్ పా',  'గ్రాండ్ మా' అని పిలవడం మొదలుపెట్టింది.
    దాంతో ఇన్నాళ్ళూ ప్రశ్నార్థకంగా వున్న ఈ పిల్ల రాగిణి బిడ్డేనని, అందరికీ వెల్లడయింది. దాంతో అయినవాళ్ళూ, కానివాళ్ళూ నానా రకాలుగా మాట్లాడారు. దాదాపు అందరూ కూడా సరోజినినే దూషించారు. రాగిణి బతుకు బండలు కావడానికి కారణం ఈవిడేనన్నారు. "వయసు వచ్చిన పిల్లని సినిమాలకని పంపించిందట! ఆ ప్రొడ్యూసర్ ఆ అమ్మాయిని ఉంచుకున్నాట్ట! ఈ తల్లికి సిగ్గులేదూ?"
    "డబ్బుకోసం భార్యాభర్తల్ని విడదీసింది! తల్లీ బిడ్డల్ని వేరుచేసింది! ఇది కన్నతల్లేనా?"
    సరోజినికి శిల్పని చూసి సగం కడుపు తరుక్కుపోయి గతుక్కుమంటుంటే, వీరిమాటలు వింటుంటే మరీ మతిపోయింది. డాక్టరొచ్చి ఏవో మందులు రాసిచ్చి వెళ్లారు. మనోవ్యాధికి మందేముంది? ఎన్ని మందులు వాడినా ఏ మాత్రం తగ్గలేదు సరోజినికి!
    శిల్ప సెలవులు పూర్తయిపోయాయి. అవినాష్ తోటే పంపాలనుకున్నారు శిల్పని. కోటయ్యగారూ, రామానుజంగారు తరచు కలుసుకుంటూనే వున్నారు. హైదరాబాదు నుంచి శిల్పా, అవినాష్ లు ఫ్లయిట్ లోనే వెళ్ళిపోయారు.
    "బై..... బై..... గ్రాండ్ పా...... బై.... బై గ్రాండ్ మా!" అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్న శిల్పని చూస్తుంటే, ప్రాణాలు పోతాయేమోనని అనిపించింది రామానుజం దంపతులకి! సరోజిని పసిపిల్లలా ఏడుస్తుంటే ఆమెని ఓదార్చే శక్తి అక్కడ ఎవరికీ లేకపోయింది.
    శిల్ప వెళ్ళిపోయాక ఆమె మరీ పిచ్చిదైపోయింది! దానికి తోడు రాగిణి దగ్గరి నుంచొచ్చిన ఉత్తరంలో సినిమా ఎప్పుడయిపోతోందో, తనెప్పుడొస్తుందో రాయలేదు! శిల్ప గురించి ఒక్క మాటైనా రాయలేదు. భరణి గురించి గానీ, వాళ్లబ్బాయి గురించి గానీ ఏమీ లేదు. తనూ భార్గవ పెళ్ళి చేసుకుందామని నిశ్చయించుకున్నట్టు రాసింది. ఉత్తరం చదివి కుప్పగా కూలిపోయింది సరోజిని. "భార్గవ భార్య ఊరుకుంటుందా? జుట్టుపట్టి రచ్చకీడ్చదూ? రాజేష్ తో పెళ్ళి ఛిన్నాభిన్నమైపోయింది. ఇప్పుడు పెళ్ళయి భార్య వుండగా భార్గవతో పెళ్ళా? ఇది ఎందుకిలా తయారైంది?" తల బాదుకుంది సరోజిని.
    "ఊరుకో సరోజినీ! దాని తలరాత అలావుంది" ఓదార్చారు రామానుజంగారు.
    "కాదండీ! దీనికంతటికీ కారణం నేనే! ధనదాహం నన్ను రాక్షసిని చేశాయి. నేను మహాపాపిని! నాకు ప్రాయశ్చిత్తం లేదు" అంటూ గుండెలవిసేలా ఏడ్చి ఏడ్చి పడుకుంది.
    రామానుజంగారికి చెప్పుకోవడానికి కూడా ఎవ్వరూ లేరు. సానుభూతి చూపడానికి కూడా ఎవ్వరూ లేరు..... ఒక్క కోటయ్య తప్ప.
    "రామూ! నేనొక్క మాట చెబుతా, అలా చేస్తావా?" అడిగారు కోటయ్యగారు!
    "చెప్పరా! అలాగే చేస్తాను" పసిపిల్లాడిలా కంటతడి పెట్టుకున్నారు రామానుజంగారు.
    "ఇక్కడ జరిగిన విషయాలన్నీ భరణికి రాశాను. కొంతకాలం మీ ఇద్దరినీ అక్కడికి పిలిపించుకోమని రాశాను."
    "అలా రాశావా?" కంగారుగా అడిగారు రామానుజంగారు.
    "అవును! ఏమీ?"
    "ఒరేయ్! అల్లుడి ముందర పరువుపోదూ? అమ్మాయంటే మన పిల్లగానీ, అల్లుడు మనవాడౌతాడా?"
    "రామూ! కాశ్యప్ కి నీ మీద ఎంత గౌరవముందో నీకు తెలుసు. అతను నీకు కొడుకులాంటివాడు. అల్లుడయినా, కొడుకయినా అతడే కదా! నీకు ఇంకెవ్వరున్నారు?"
    రామానుజంగారు మరి ఆ విషయం మాట్లాడలేదు.
    ఒక వారం రోజులు గడిచిపోయాయి. సరోజిని మంచం దిగడం లేదు. భోజనం కోటయ్యగారింటి నుంచి క్యారేజీ వస్తోంది. ప్రతిరోజు ఏదో ఒక టైములో కోటయ్యగారొచ్చి, కాస్సేపు కూర్చునిపోతున్నారు.
    'పోస్ట్' అన్న కేక విని రామానుజంగారు పరుగెత్తుకొచ్చారు. అమెరికా నుంచొచ్చిన ఉత్తరం, ఆత్రంగా చించి చదివారు. ఉత్తరంతో పాటు ముప్పయి వేల రూపాయలకి డ్రాఫ్ట్!!
    "వెంటనే మీరు అత్తయ్యగారు టిక్కెట్లు కొనుక్కొని బయలుదేరండి. అత్తయ్య ట్రీట్ మెంటు కోసం వెళుతున్నామంటే, పాస్ పోర్టు, వీసా తొందరగా ఇస్తారు, మిమ్మల్ని స్పాన్సర్ చేస్తూ ప్రభుత్వం వారికి నేను ఉత్తరం కాపీ ఒకటి జత పరుస్తాను. భరణి మీకు మళ్ళీ రాస్తుంది. ప్రస్తుతం కోటయ్యగారి ఉత్తరానికి సమాధానం రాస్తోంది. అయినా మాస్టార్ గారూ! మీకు నా దగ్గర మొహమాటమేమిటి? నన్ను ఆజ్ఞాపించే హక్కు మీకుంది. వెంటనే అన్ని ఏర్పాట్లూ చేసుకుని బయలుదేరి రండి.
                                                                                                                        మీ అల్లుడు కాశ్యప్!"
    ఉత్తరం చదువుతుంటే ఆనంద భాష్పాలు, చెంపలమీదుగా జారి గుండెలమీదికి రాలాయి.
    "ఏమిటండీ ఉత్తరం?" మంచం మీంచే అడిగింది సరోజిని.
    "సరోజినీ మనం అమెరికా వెళుతున్నాం. నీకు అమెరికా వెళ్లే ఛాన్సు పోయిందనుకున్నావు కదూ?"
    సరోజిని రామానుజంగారి గుండెలకి తల ఆన్చి, చంటిపిల్లలా వెక్కి వెక్కి ఏడ్చింది.
    ఇరువురి హృదయాలు సముద్రంలా ఘోషించాయి!
    ఈ సంగతి చెప్పాలని కోటయ్యగారి దగ్గరికి ప్రయాణమవుతూంటే, ఆయన గడప దగ్గరే ఎదురయ్యాడు. "కంగ్రాచ్యులేషన్స్ రామూ!" అన్నారు నవ్వుతూ రామానుజంగారి చేతులందుకుని కరచాలనం చేస్తూ.
    "నీకూ వచ్చిందా ఉత్తరం?"
    "ఇదిగో" చేతికిచ్చాడు.
    భరణి ఉత్తరంలోని ప్రతిఅక్షరం. ఆమె అద్భుత హృదయాన్ని ప్రతిబింబిస్తోంది.
    "కోటయ్యగారూ!
    ఎలాగైనా వీలైనంతత్వరలో మా అమ్మనీ, నాన్ననీ ఇక్కడికి పంపించెయ్యండి. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. అవినాశ్, శిల్పా ఒకే స్కూల్లో చదువుతున్నారు కాబట్టి, కాస్త శిల్పని కనిపెట్టుకుని వుండండి. కన్న తల్లిదండ్రుల ప్రేమకి నోచుకోని, ఆ పిల్లకి అమ్మా నాన్నల ప్రేమ కూడా కరువైపోతుంది. శిల్పకి కావలసిన డబ్బు నేను పంపిస్తాను. మీ ఉత్తరం పట్టి చూస్తే అక్క లోకంలో లేదనిపిస్తుంది. చిత్ర జగత్తు మాయలో పడి, బాధ్యతలూ, బంధాలూ అన్నీ మరిచిపోయినట్టుంది. మొదటినుంచీ అక్కవేసిన ప్రతి అడుగూ అడుసులోనే పడింది. ఆలోచనా రహితంగా, ఆవేశంతో తీసుకున్న ప్రతి నిర్ణయం ఇలా వుంటుంది. అలా కాకపోతే, అక్క కాపురం రాజేషుతో హాయిగా సాగిపోయేది. అప్పుడు నాకు సలహా ఇచ్చే వయస్సు లేదు. నాన్న మాటలని ఎవ్వరూ లెక్క చెయ్యలేదు. ఆయన సలహా అప్పుడు ఎవ్వరికీ నచ్చలేదు. ఇంతకీ దాని రాతలా వున్నప్పుడు, మంచి మాటలెలా రుచిస్తాయి? మంచి ఎలా జరుగుతుంది. పోన్లెండి! ఇప్పుడవన్నీ రాస్తే ఉత్తరం కాదు, నవలవుతుంది. అమ్మనీ, నాన్ననీ, జాగ్రత్తగా వీలైనంత త్వరలో పంపే ఏర్పాట్లు చెయ్యండి. కాశ్యప్ నాన్నగారి పేరు మీద ముప్పయి వేలకి డ్రాఫ్టు పంపారు. ఉంటా మరి! మీ సమాధానం కోసం ఎదురు చూస్తుంటాను. మీకూ! మీ ఆవిడకి నా నమస్కారాలు. మీ ఇంట్లో అందరినీ అడిగానని చెప్పండి. అవినాష్ కి నా ఆశీస్సులు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS