హఠాత్తుగా మెలకువ వచ్చింది నచికేతకు.
ఎందుకలా మెలకువ వచ్చిందో అర్ధం కాలేదు.
దాహంగా అనిపించింది. వాటర్ జగ్ కోసం చేయి చాచాడు. అప్పుడు ఓ నల్ల పిల్లి అటకమీద నుంచి కిందకు దూకింది. బ్యాలెన్స్ స్లిప్ అయి టీపాయిమీద పడింది. టీపాయి మీద వున్న వాటర్ జగ్ నేలమీద పడి భళ్ళున పగిలి, నీళ్ళు నేలమీద పడ్డాయి.
ఛ...అనుకున్నాడు నచికేత.
హాలులో ఉన్న ఫ్రిజ్ దగ్గరికివెళ్లి వాటర్ బాటిల్స్ తెచ్చుకోవాలంటే బద్దకమేసింది.
అయినా తప్పదనుకుంటూనే లేచి స్లిప్పర్స్ వేసుకుని తలుపు తీయబోయి...షాక్ కొట్టినట్టు ఫీలయ్యాడు.
తలుపు రావడంలేదు.
బయట్నుంచి గొళ్ళెం పెట్టారు.
తన గదికి బయట్నుంచి గొళ్ళెం పెట్టేదెవరు?
"రామయ్యా...రామయ్యా..."పిలిచాడు కంగారుగా నచికేత. అటువేపు నుంచి రెస్పాన్స్ లేదు...
"రామయ్యా...రామయ్యా..." మరోసారి గట్టిగా అరిచి పిలిచాడు.
అంత గట్టిగా పిలిచినా అటువైపు నుంచి రామయ్య రాకపోవడంతో నచికేతలో భయంమొదలైంది.
కంగారు, ఆదుర్దా...భయం...ఒకదానికొకటి తోడయ్యాయి. స్టోర్ రూమ్ తలుపులు మూసి, తాళం వేసి హాలులోకి వచ్చాడు.
అప్పుడు వినిపించింది...నచికేత గదిలోనుంచి తనను పిలవడం...
నచికేత గది బయట్నుంచి గొళ్ళెం పెట్టింది రామయ్యే.
తన క్షుద్రోచ్ ప్రక్రియకు నచికేత అడ్డం కాకూడదని ఓ అర్దరాత్రి మెలకువ వచ్చి స్టోర్ రూమ్ వైపు వచ్చి చూస్తే తన క్షుద్రోచ్ విఫలమవుతుందన్న ఆలోచనతో ఆ గదికి బయట్నుంచి గొళ్లెం పెట్టాడు.
క్షణ క్షణానికి తలుపుమీద శబ్దం ఎక్కువ అవుతోంది.
రామయ్య కళ్ళు తీక్షణంగా ఆ గది తలుపునకున్న గొళ్లెం వైపు చూశాయి.
ఆ గొళ్లెంలో చిన్న కదలిక.
ఆ గొళ్లెం దానంతటదే పైకి లేచి గొళ్లెం ఊడొచ్చింది.
తర్వాత రామయ్య నేలమీద అటు తిరిగి పడుకున్నాడు.
* * *
నచికేత బలమంతా ఉపయోగించి తలుపు లాగాడు. ఒక్కసారిగా తలుపు తెరుచుకుంది. వెనక్కు పడబోయి నిలదొక్కుకున్నాడు.
ఒక్కసారిగా నచికేతకు ఆశ్చర్యమేసింది. ఇంతసేపూ తను బలంగా లాగినా రాణి తలుపు ఒకేసారి తెరుచుకోవడమేంటి?
పరుగు పరుగున రామయ్య దగ్గరికి వెళ్లి అనుమానంగా చూసేడు.
రామయ్య అటువైపు తిరిగి గుర్రుపెడుతూ పడుకున్నాడు. మొదటిసారిగా రామయ్యమీద అనుమానం మొదలైంది నచికేతకు.
10
"వాట్ మిస్టర్ పీటర్సన్ మనం సింగపూర్ నుంచి ఇండియా వచ్చి మూడ్రోజులైంది. మీరు చెప్పినట్టే ఈ ఫైవ్ స్టార్ హోటల్ లో లగ్జరీసూట్ తీసుకున్నాను. మూడు రోజులుగా సీరియస్ గా ఆలోచిస్తున్నారేగానీ, నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడ్డం లేదు. ఎనీథింగ్ రాంగ్..." అడిగాడు డేనియల్ పీటర్సన్ వంక చూస్తూ...
మూడు రోజులుగా పీటర్సన్ టేబుల్ ముందు కూచోని ఏవేవో కాగితాలు పరిశీలిస్తూ ఏదేదో ఆలోచిస్తూ ఉండడం గమనించాడు డేనియల్.
పీటర్సన్ గొంతు విప్పి...
"యస్ మిస్టర్ డేనియల్...సమ్ థింగ్ రాంగ్...ఎక్కడో, ఏదో మిస్టేక్ జరిగింది. అందుకే ఆలోచిస్తున్నాను. మన తరపున పన్జేసే వాకర్ మిస్సింగ్...మిస్సింగే కాదు అతనో యాక్సిడెంట్లో చనిపోయాడు...
బిత్రోచికి ప్రీతి పాత్రుడైన వాకర్ ని మనం బ్రతికించుకునే అవకాశం పోయింది. కనీసం అతనిలో మనం ప్రేతాత్మనైనా ప్రవేశపెట్టగలిగేవాళ్లం సరైనా సమయానికి మనం ఇక్కడికి వచ్చి ఉంటే...
అతికీలకమైన పనిమీద నేను వాకర్ ను ఇక్కడికి పంపాను. మనకు అతి నమ్మకస్థుడైన వాకర్ తన పనిని సమర్ధవంతంగా పూర్తి చేసేవాడే.,..బట్...అతనికున్న ఒకే ఒక వీక్నెస్...సెక్స్...యస్...సెక్స్ అతని బలమైన వీక్ నెస్.
అందుకే అర్ధరాత్రి అని చూడకుండా అమ్మాయిల కోసం బయల్దేరి నిద్రమత్తులో బైక్ డ్రైవ్ చేస్తూ చచ్చిపోయాడు. అతడి డెడ్ బాడీని మార్చురీలో ఉంచి ఎవరు అతడి గురించి రాకపోవడంతో అన్ ఐడెంటీ బాడీగా పాతిపెట్టేసారు.
అతను ప్రమాదవశాత్తూ మరణించిన రోజే అతనిలో బిత్రోచి శక్తిని ప్రవేశపెడితే మనకు ఎంతో ఉపయోగకరంగా ఉండేవాడు. ప్చ్ ఇప్పుడా అవకాశం లేదు..." ఓ నిట్టూర్పు విడుస్తూ చెప్పాడు పీటర్సన్.
"ఇప్పుడు మనం వాకర్ డెడ్ బాడీ ఎక్కడుందో తెలుసుకోలేమా?"
"వాకర్ డెడ్ బాడీ ఎక్కడుందో తెలిసింది. అతనిలోకి క్షుద్ర ప్రేతాత్మ ప్రవేశించింది. కానీ, దాని శక్తి పదమూడు రోజుల వరకు మరో రెండ్రోజుల్లో ఆ శక్తిని కోల్పోతాడు.
ఆ క్షుద్ర ప్రేతాత్మ అతన్నుంచి వెళ్లిపోతే, మనం బిత్రోచిని సంతృప్తి పరిచి, మరో పదమూడు రోజులపాటు క్షుద్ర ప్రేతాత్మ వాకర్ లో ఉండేలా చూడాలి.
సరిగ్గా పక్షం రోజుల్లో వాకర్ బిత్రోచిని చేరుకోవాలి. బిత్రోచి పాదాలముందు అతని మృతదేహం అర్పితమవ్వాలి.
"బిత్రోచిని చేరుకోవాలా? అంటే?...." డేనియల్ అయోమయంగా అడిగాడు.
"బిత్రోచి గెస్ట్ హౌస్ లోనే బిత్రోచి విశ్రాంతి తీసుకుంటోంది....తాపీగా చెప్పాడు పీటర్సన్.
"నువ్వు చెప్పేది చాలా కన్ ఫ్యూజింగ్ గా వుంది" డేనియల్ అన్నాడు.
"చెబుతాను. ఇంతవరకూ బయట ప్రపంచానికి తెలియని ఓ భయంకరమైన విషయం నీకు చెబుతాను..." ఆగి ఒక్కక్షణం ఊపిరి బలంగా బయటకు వదిలి...కళ్ళు మూసుకుని చెప్పసాగాడు పీటర్సన్... సరిగ్గా నూట యాభయ్యేళ్ల క్రితం, మా తాత ముత్తాతలు సింగపూర్ నుంచి ఇండియా వచ్చారు.
మా ఫోర్ ఫాదర్ వాగిన్సన్ ని క్షుద్ర విద్యలు ప్రదర్శిస్తున్నాడని సింగపూర్ నుంచి తరిమివేశారు. కొద్దిపాటి ఆస్తితో ఇండియా వచ్చి ఓ అడవి మధ్యలో ఓ గెస్ట్ హౌస్ నిర్మించుకున్నాడు. అప్పటికింకా భారతదేశంలో చిన్న చిన్న రాజ్యాలున్నాయి.
అడవి మధ్యలో నిర్మించుకున్న అ గెస్ట్ హౌస్ రాజమహల్ ని తలదన్నేలా వుంటుంది. వాగిన్సన్ బిత్రోచిని నిద్రలేపి, ప్రపంచాధిపత్యం సాధించే ప్రయత్నంలో ఎన్నో మంత్ర తంత్రాలను, క్షుద్ర ప్రేతాత్మలను తన చెప్పుచేతల్లో ఉంచుకోవాలనుకున్నాడు. ఆ ప్రయత్నంలో ఓ అందమైన కన్నెపిల్లని బలి ఇవ్వడానికి సామంతరాజు కూతుర్ని ఎంపిక చేసుకుని కిరాయి మనుషుల ద్వారా ఆ యువతిని బంధించి బిత్రోచికి సమర్పించబోయేడు. ఆ విషయాన్ని పసిగట్టిన ఆ రాజు తన సైన్యంతో ఆ గెస్ట్ హౌస్ ను చుట్టుముట్టాడు. బిత్రోచికి స్త్రీ సమర్పణ పూర్తికాలేదు. దాంతో భిత్రోచి అసంతృప్తికి గురైంది. కోపంతో అగ్రహోదగ్రమైంది. వాగిన్సన్ తప్పించుకున్నాడు.
కొన్నాళ్లపాటు ఆ గెస్ట్ హౌస్ చుట్టు బలమైన కాపలా పెట్టించాడా రాజు.
కాల క్రమంలో రాజులు పోయారు. రాజ్యం అంతరించాయి. ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చింది.
మా తాత జబర్సన్ ఇండియా వచ్చి గెస్ట్ హౌస్ మరమ్మతులు చేయించాడు. అందులో నివాసం ఉంటున్నాడు. మా నాన్న కూడా అందులోనే ఉండేవాడు. అప్పటికే అసంతృప్తితో ఉన్న బిత్రోచి కోపానికి మాతాత గురయ్యాడు. రక్తం కక్కుకుని చచ్చిపోయాడు. ఆ భయంతో మా నాన్న మళ్ళీ సింగపూర్ వచ్చి కొన్నాళ్ళుగా బిత్రోచిని ఆరాధిస్తూ బిత్రోచిని ప్రసన్నం చేసుకొని, ముప్పయ్యేళ క్రితం ఇండియా వచ్చి `బిత్రోచిని మళ్ళీ నిద్రలేపే ప్రయత్నం చేసాడు.
బ్యాడ్ లక్ ఏమిటంటే...చుట్టు ప్రక్కల గ్రామాలవాళ్ళు మా నాన్నను మంత్రగాడనే అనుమానంతో సజీవదహనం చేసారు.
బిత్రోచి సాక్షిగా మా నాన్న అగ్నికి అహుతయ్యాడు.
దాంతో బిత్రోచి కన్నెర చేసాడు. చుట్టుప్రక్కల గ్రామాలు తుడిచి పెట్టుకుపోయాయి. చిత్రవిచిత్రమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి.
ఆ గెస్ట్ హౌస్ లో ఎవరు బస చేసినా హత్యకు గురయ్యేవారు. అలా హత్యల మిస్టరీతో ఆ గెస్ట్ హౌస్ శాశ్వతంగా మూతపడిపోయింది.
ఆ గెస్ట్ హౌస్ పరిసర ప్రాంతాలు నిర్మానుష్యమయ్యాయి. కొన్ని కిలోమీటర్ల మేర అడవి. ఆ అడవిలో మధ్యలో గెస్ట్ హౌస్.
ఆ అడవిలో క్రూరమృగాలు, విషసర్పాలు వుంటాయి. అడవి చుట్టూ కంచెలాంటిది లేపి, ప్రమాదకర స్థలమని అప్పట్లో బోర్డుకూడా పెట్టారు. ఆ గెస్ట్ హౌస్ లోనే బిత్రోచి నిద్రపోతూ వుంది. బిత్రోచిని నిద్రలేపాలి. సంతృప్తిగా అర్పణ గావించాలి. ఏ మాత్రం డిస్ట్రబెస్స్ లేకుండా మంత్రోచ్చారణ కొనసాగించాలి అంటే...ఆ గెస్ట్ హౌస్ సరైన ప్రాంతం..." చెప్పడం ఆపి డేనియల్ వంక చూశాడు.
షాకుతిన్నట్టు అలానే ఉండిపోయాడు డేనియల్స్.
"హాయ్ డేనియల్ వాట్ హేపెండ్?" అడిగాడు పీటర్సన్.
'నువ్వు ఇండియా రావడం వెనుక ఇంత పెద్దకారణం వుందా?" విస్మయంగా అడిగాడు డేనియల్.
"ఇంతకన్నా బలమైన కారణం కూడా వుంది. ఎక్కడైతే మా ఫోర్ ఫాదర్ వాగిన్సన్ బిత్రోచిని నిద్రపుచ్చి, సంతృప్తిడ్నిచేసి తిరిగి నిద్రలేపే ప్రయత్నంలో విఫలమయ్యాడో...అక్కడే నేను సక్సెస్ అవ్వాలి..." పీటర్సన్ బలంగా విశ్వసించి అన్నాడు.
"నాకా నమ్మకం వుంది" అన్నాడు డేనియల్.
"బట్...నాకు లేదు..." పీటర్సన్ అన్నాడు.
"అదేం?"
"మనం గెస్ట్ హౌస్ లోకి ప్రవేశించడం అసాధ్యం..." అన్నాడు పీటర్సన్.
