సంతోషం, ఆశ్చర్యం కనపరుస్తూ ఆ పెద్దమనిషి లేచి నిలబడి, ఓహో, తమరేనా అమ్మా, సీతా అనసూయా చూశారూ, అలాంటి కోవలోని వారు తమరు" అంటూ కూర్చున్నాడు.
కాంతం ఒక్కక్షణం విచిత్రంగా చూచి, "బాబు గారూ, నన్నంతగా పెద్ద చేయటం కేవలం మీకు మాయం దుండే అభిమానం తప్ప మరొకటికాదు...ఇలా దయ చేయండి, ఫలహారం పుచ్చుకోండి" అని పళ్ళెంలో నుంచి రెండు అప్పడాలు తీసి నా చేతికిచ్చి "మిగిలిన రెండు అప్పడాలతో పెళ్ళెం ఆయన ముందు పెట్టింది. మేమిద్దరం అప్పడాలు కరకరా నమిలేసి, చెరోకప్పు కాఫీ తాగుతున్నాము.
ఇంతలో నేనన్నానూ_"మా కాంతం మాహా యోగ్యురాలండి. ఆ మహా ఇల్లాలి యొక్క యోగ్యత వల్లనే మా కుటుంబానికి ఏ లోటూ లేకుండా జరుగుతున్నది అని." మరేంటండీ, ఆ మహా ఇల్లాలి పాతివ్రత్యం మహత్యం చేతనే మీకు ఇంత సిరీ సంపదా ఏర్పడ్డవి, మరి సందేహం లేదండీ" అని అన్నాడు ఆయన.
"ఇంకొంచెం కాఫీ అండీ" అన్నది కాంతం, ఆయనను ఉద్దేశించి, ఆయన అక్కర లేదన్నాడు. మరోక్షణం అయిన తరువాత "పిల్లలు స్కూలునుంచి వచ్చే వేళైందండి, నేను సెలవు పుచ్చుకుంటానండీ బాబుగారూ, అని చెప్పి కాంతం మేడమెట్లు దిగి వెళ్ళిపోయింది.
ఫలహారం కూడా అయిపోయింది. ఇంట్లో ఉడక పోస్తున్నది. బైటికి ఎక్కడికయినా వెడితే బాగుండునూ అని అనిపించింది నాకు, కాని ఆ పెద్దమనిషితో ఏం చెప్పాలో తెలియక కూర్చుని, రెండు నిమిషాలైన తరువాత నేనే అన్నానూ_ "తమరేమైనా పనిమీద వచ్చినట్లా అండి" అని.
"ఎబ్బెబ్బే వుట్టినే వచ్చానండీ, మరేం పెద్ద పనీలేదూ అని ఆ వాక్యం పూర్తిచేయకుండానే వుండిపోయినాడు ఆయన.
ఇలాంటి పెద్ద మనుష్యులతో చాలా బాధ, వాళ్ళు వచ్చిన పనేదో చెప్పనూ చెప్పరూ, మనలను పోనీయనూ పోనీయరూ ఎంతసేపూ అలాగ చూస్తూ కూర్చుంటారు. అందుకనే నేను మళ్ళీ అన్నాను_"చెప్పండి, ఏదైనా పనుంటే, సందేహిస్తున్నట్టున్నారు చేయగల సాయం ఏమైనా వుంటే చూస్తాను" అని, ఆయన అప్పటికీ మాట్లాడలేదు! జవాబుకోసం కాసేపు నిరీక్షించాను. టైము చూశాను. ఆఁహ, ఎన్ని చేసినా ఆయన నోట్లో నుంచి మాట పెగల్లేదు.
సాధారణంగా నా కోసం వచ్చేవాళ్ళు రెండు రకాలుగా వుంటారు, "కథ ఏమైనా వ్రాసి మా పత్రికకు ఇవ్వండి" అని అడిగే పత్రికాధిపతులు ఒకరకం. ఈయన వాలకం చూస్తే ఆ రకం మనిషి కాదని తెలుస్తూనే వుంది. అది కాకపోతే మా అబ్బాయికి నాలుగు మార్కులు వేసి ప్యాసు చేయించండీ" అంటూ వచ్చేది రెండోరకం.
ఈ పెద్దమనిషి ఆ రెండోరకం వాడు అయివుంటాడని తోచింది. నిజంగా అంతే అయి వుంటుంది లేకపోతే అంతసేపు నీళ్ళు నమలటానికి అవసరం ఏముంటుందీ అనుకొని. "అయితే తమకు పిల్ల లెంతమంది బాబూ" అన్నాను.
"అయిదుగురండీ" అన్నాడు ఆయన. "ఉహూ, అయితే తమ పెద్ద అబ్బాయి ఏ క్లాసూ?" అన్నాను. సంగతేదో తెలుసుకొని చెప్పాలిసిన మామూలు మాటలు చెప్పి తొందరగా పంపిద్దామని. ఆయన కొంచెం విచారంగా అన్నాడు_"నాకు మొగపిల్లలు లేరండీ, అయిదుగురూ ఆడపిల్ల లేనండీ" అని.
ఈ జవాబు విన్న తరువాత ఆయన ఎందుకొచ్చాడూ అన్న ప్రశ్న మరీ క్లిష్టమైపోయింది. నిర్మొగ మాటంగా "అయితే మరిసెరువు" అని చెప్పి పంపించేయటానికి మనస్సు ఒప్పలేదు. పిల్లల పెండ్లి విషయంలో కూడా మాష్టర్ల సహాయాన్ని ఇల్లాంటి పెద్దమనుష్యులు ఆపేక్షిస్తూవుండటం కద్దు, "ఒకవేళ అల్లాంటి పనిమీద ఏమైనా వచ్చాడేమోనని, పిల్లల పెండ్లి అయినాయా అండి" అని కుశలప్రశ్న వేశాను.
"ఆ, పెద్దపిల్లలు ముగ్గురి పెండ్లి అయింది _ వాళ్ళు కాపరానికి కూడా వెళ్ళారు. మిగిలిన ఇద్దరికీ సంబంధాలు సిద్ధంగానే ఉన్నాయండీ, మీ దయవల్లా" అన్నాడు. ఇక ఇల్లాంటి పిచ్చి ప్రశ్నలతో కాలం గడపటానికి ఇష్టం లేక, కుర్చీలోనుంచి లేస్తూ "చిత్తం అల్లాగ వెళ్ళాలిసిన పనుందండి. మళ్ళీ ఎప్పుడైనా తమ దర్శనం చేస్తాను" అన్నారు.
ఆయన తెల్లబోయి "చిత్తం. చిత్తం అల్లాగేనండి-కాని, ఒక్క చిన్న విషయంలో తమ సలహా కావాలని వచ్చాను" అన్నాడు.
"అల్లాంటి దేమయినా వుంటే చెప్పండి మరి" అని నిలబడి పోయినాను,
"మరేం లేదండీ, చూశారూ. తమరు కథల్లో సంసారాన్ని స్వర్గధామంగా వర్ణించారు" అంటూ మొదలు పెట్టాడు. నా కథలు మెచ్చుకుంటున్నాడు కాబట్టి నేను కూర్చోక తప్పింది కాదు.
మళ్ళీ అన్నాడు ఆయన -"ఘోటక బ్రహ్మచారులకైనా కాంతం కథలు చదివినమీదట పెండ్లాడాలని బుద్ధిపుడుతుంది" అని.
"మీకు పూర్తిగా నాయందు అభిమానం" అన్నాను నేను.
అల్లా కాదండోయ్, ముఖ ప్రీతికోసం అంటూన్న మాటలు కావండయ్యా... "సంసారం సాగరం దుఃఖం, అన్న మాటలు వ్యర్ధపదాలని అనిపించారు తమరు" అంటూ ఆయన నన్ను మెచ్చుకొన్నాడు.
నేనూ సంతోషించి "అయితే తమరేదో చిన్న పనిమీద వచ్చారన్నారూ" అన్నాను ఆతురతతో.
"చిత్తం-చిత్తం, మనవి చేస్తా. నాకూ పెండ్లాంబిడ్డలూ ఉన్నారండి! నాకు ఇల్లు జూస్తే నరకకూపంలా ఉందండి!! పిల్లలు చూద్దామా, అల్లరీ! పెళ్ళాం చూద్దామా, గయ్యాళీ ! నేనూ ఆమె, కజ్జా ఆడనిరోజు లేదండి. ప్రతి రోజునూ ఏదో ఒక విషయమై తగాదా వస్తూనే ఉంటుందండి" అంటూ ఆయన కళ్ళు తేలేసి చూడటం మొదలుపెట్టాడు.
"అయితే....నన్నేమి చేయమంటారూ"
అన్నా నేను నవ్వుతూ.
"తమరు మాకు ఏదైనా ఓ తరుణోపాయం చూపెట్టాలె. ఎల్లాగ ప్రవర్తించాలో, సంసారిక జీవనం సుఖప్రదం కావటానికి రహస్యం ఏమిటో తమరు సెలవిస్తే తెలుసుకొందామని కొండంత ఆశతో తమదగ్గరికి వెళ్ళిపోవచ్చానండి. ఈ విషయంలో...కొద్దిగా...నాకు మీరు ఉపదేశం చెయ్యాలి" అంటూ ఆ పెద్దమనిషి ప్రాధేయపడ్డాడు.
"ఉపదేశం చెయ్యటానికి ఇదేమన్నా వేదాంతమా మంత్రశాస్త్రమా అండీ!" అన్నాను నేనూ నవ్వుతూ.
"మీరు అల్లాగ అంటే కాదుబాబూ. ఏదో మార్గం చూపా"లంటూ ఆయన ఒక్క తీరున బలవంత పెట్టాడు.
ఆయన మాట తోసేయటానికి వీల్లేక పోయింది.సరే నాకు తోచినముక్కలు చెబుదాం. ఇందులో తప్పేముందీ అనుకొని "సరే, అసలుసంగతి....మీ భార్యను మీరు ప్రేమిస్తున్నారా" అన్నాను. "అయ్యో, ప్రేమించకేమండీ, అయిదుగురు పిల్లల తండ్రినీ" అన్నాడు ఆయన. "అయితే పోట్లాటలు ఎందుకొస్తయ్యీ" అన్నా.
