Previous Page Next Page 
నన్ను ప్రేమించవు పేజి 16

    "వాళ్ళకి నిర్లక్ష్యం ఎక్కువ...." చెప్పాడు శివరావు. తండ్రి ఎదుట మొదటిసారి నోరు తెరిచి.
    "అది నువ్వెలా చెప్పగలవు?" అడిగాడు ఆశ్చర్యంగా.
    "ఇంటి ముందు మొక్కలున్నాయి చూడండి. ఆ మొక్కలు నీళ్ళు లేక ఎండిపోతున్నాయి. గది కిటికీలో పుస్తకాలు చిందరవందరగా పడున్నాయి. మీరు కాస్త పరిశీలనగా చూస్తే అవన్నే డిటెక్టివ్ నవలలని గ్రహిస్తారు...." తొణక్కుండా చెప్పాడు.
    తండ్రి కొన్ని క్షణాలు ఆలోచించి అన్నాడు.
    "నీళ్ళు దొరక్కపోతే మొక్కలకు పొయ్యడం కుదరదు. కిటికీలోని పుస్తకాలు ఇంట్లో ఎవరివన్నా కావచ్చు...."
    చిన్న నవ్వాడు శివరావు.
    "పెళ్ళి చేసుకోవడం ఇష్టంలేక ఏవో కారణాలు చెబుతున్నానని అనుకోకండి. వాళ్ళ ఇంట్లో బావి వుంది. ఒక్కర్తే అమ్మాయని చెప్పారు నాకు. పుస్తకాలు ఎవరివో అంటున్నారు. పుస్తకాలు ఎవరివో అనుకున్నా ఈ ఇల్లు వాళ్ళ స్వంతమే కదా! అంతేకాదు పిల్ల తండ్రి పోలిక...."
    "పిల్ల తండ్రి పోలిక అయితేనేం....అందంగానే ఉంది కదా! పైగా తండ్రి పోలిక అంటే అదృష్టం కూడాను...." అసహనంగా అన్నాడు తండ్రి.
    "పిల్ల తండ్రికి పేకాట పిచ్చి ఉందని, త్రాగుతాడని మధ్యవర్తి చెప్పాడు. మీరన్నట్లు పిల్లని చేసుకోవడానికి అవి అడ్డు కాదు. తండ్రి పోలికలు వచ్చినప్పుడు తండ్రి గుణం ఒక్కటైనా రాదంటారా?"
    శివరావు తండ్రి షాక్ తిన్నాడు. కొడుకువైపు మొదటిసారి చూస్తున్నట్టు చూశాడు, కొడుకులో శారీరకంగా ఎటువంటి మార్పు కనిపించడం లేదు. ఒకవేళ మార్పువస్తే వెంటనే తెలుసుకోవచ్చు. కాని మానసికంగా వచ్చిన మార్పు ఎలా తెలుస్తుంది? నిజానికి కొడుకు గురించి స్పష్టంగా అక్కడే తెలుసుకున్నాడు. కొడుకు భుజం తట్టి లోపలకు వెళ్ళాడు.
    సాయంకాలం మరో సంబంధం చూశారు.
    "నీ ఉద్దేశ్యం ఏమిటి?" యధాప్రకారం అడిగాడు తండ్రి.
    శివరావు వెంటనే సమాధానం చెప్పలేదు. నిర్ణయం వెంటనే చెప్పాల్సిన పనిలేదు. కాని తండ్రి
తోందరపడుతున్నాడు. పెళ్ళిచూపులప్పుడు పిల్లని జాగ్రత్తగా అలంకరిస్తారు. కొంతమంది బ్యూటీషియన్ తో మేకప్ చేయిస్తారు. అందువల్ల పెళ్ళి చూపుల్లో అందం ప్రధాన విషయంగా పరిగణించకూడదు. కలిసి జీవించడానికి అవసరమైన మానసిక స్థితి ఉందో లేదో తెలుసుకోవాలి. ఇవన్నీ తండ్రికి చెప్పాలని ఉన్నా చెప్పడానికి జంకాడు.
    "పర్లేదు, బాగుంది..." గొంతు పెగుల్చుకుని చెప్పాడు.
    ఉత్సాహంగా ఆయన లోపలకు వెళ్ళాడు. అరగంటలో మిగతా మాటలు పూర్తయ్యాయి. సంబంధం ఖాయం చేసుకుని పాతిక సంవత్సరాల క్రితం శివరావు కడుపులో ఉన్నప్పుడు అద్దెకొచ్చిన ఇంటికి చేరుకున్నారు.
    ఆ రాత్రి శివరావుకు నిద్రపట్టలేదు.

                                                       *    *    *    *    
    అలవాటుగా తెల్లవారు ఝామున మెలకువ వచ్చింది శివరావుకి. మంచంపైన తానొక్కడే పడుకుని ఉన్నాడు. తిరిగి కళ్ళుమూసుకున్నాడు. మనిషి జీవితం హఠాత్తుగా మారిపోవడానికి ఒక్క సంఘటన చాలు. ఇరవై రోజులక్రితం ఉదయం నిద్రమేలుకున్న మరుక్షణం మార్నింగ్ వాక్ కి వెళ్ళేవాడు. ఇప్పుడు అదే సమయానికి మేలుకుని రాత్రి పక్కలో పడుకున్న భార్య గురించి ఆలోచిస్తున్నాడు.
    శోభనం గురించి కవులు, రచయితలు పుస్తకాల్లో అద్భుతంగా వర్ణిస్తారు. సినిమాల్లో కూడా శోభనం సన్నివేశాన్ని ప్రత్యేకంగా చూసిస్తారు. హీరో చెయ్యి తగిలిన హీరోయిన మెలికలు తిరిగిపోతుంది. రాత్రి జరిగిన శోభనం తల్చుకుంటే అవన్నీ అభూత కల్పనలని తోస్తోంది. రుచి లేని పదార్ధం తిని అమృతంలా ఉందని చెప్పినట్టుంది శోభనం గురించి చెప్పే గొప్పలు.
    "నిద్రపోతున్నారా?" భార్య గొంతు విని కళ్ళు తెరిచాడు.
    మంచం ప్రక్కనే నిలబడి తనవంక చూస్తున్న భార్యని చెయ్యి పట్టుకుని మీదకు లాక్కున్నాడు. ఆమె చప్పున చెయ్యి విడిపించుకుని మంచానికి దూరంగా జరిగి అంది.
    "మగవాడు కోరినప్పుడు పడుకునే యంత్రం కాదు ఆడది."
    శివరావు విస్తుపోయి కొద్దిసేపు మాట్లాడలేకపోయాడు. అతని మనసుని బలంగా తాకాయి ఆ మాటలు. అతను తేరుకోకముందే ఆమె అక్కడ నుంచి వెళ్ళిపోయింది.
    శివరావు ఆలోచిస్తూ ఉండిపోయాడు. తను చేసిన తప్పేమిటో అతనికి అర్ధం కాలేదు. ఆ రోజంతా ముభావంగా ఉన్నాడతను. రెండో రాత్రి కూడా చడీచప్పుడు లేకుండా గడిచిపోయింది.
    మధ్యాహ్నం భోజనం అయినా తరువాత గదిలో పడుకున్నాడు శివరావు. కొంత సమయం గడిచిన తరువాత భార్య వచ్చింది. ఆమెను దగ్గరకు లాక్కుని అడిగాడు.
    "ఉదయం స్నానం చెయ్యలేదా?..."
    "సాయంకాలం చేస్తాను...."
    కొన్ని క్షణాలు మాట్లాడలేదు అతను.
    "పెళ్ళయిన తరువాత ఉదయం లేచిన వెంటనే స్నానం చెయ్యాలి" చెప్పాడు.
    "నాకు అలవాటు లేదు."
    "పోనీ నేను చెబుతున్నాను.....రేపటి నుంచి చెయ్యి" నవ్వడానికి ప్రయత్నిస్తూ అన్నాడు.
    ఆమె మాట్లాడకుండా అక్కడా నుంచి వెళ్ళిపోయింది. రాత్రి పది వరకూ తిరిగి కనిపించలేదు.
    "ఉదయం అలా అన్నానని కోపం వచ్చిందా?" అనునయంగా అడిగాడు. ఉదయం తను ఆమెను నొప్పించి ఉంటె ఆ భావాన్ని తుడిచేయాలని అతని ఉద్దేశ్యం.
    "నాకు అలవాటులేని పని ఎవరు చెప్పినా చెయ్యను" అంది తెగేసినట్టు.
    ఆమెని పరిశీలనగా చూశాడు, పెళ్ళి చూపులప్పుడు చక్కని బొమ్మలా అలంకరించుకుని కూర్చుంది. ఆమెను చూసి తల్లిదండ్రులు ఎగిరి గంతేశారు. ఆమె అందం తనని కూడా ఆకట్టుకుంది. సరిగ్గా అక్కడే తను పప్పులో కాలేశాడు. మొదటిరాత్రే ఆమె తన మాట వినకపోతే, జీవితాంతం ఆమెతో సంసారం చెయ్యగలడా తను?
    ముందుగా చూడడానికి వెళ్ళిన అమ్మాయి ఇంటి పరిస్థితి చూసి మనస్తత్వాన్ని విశ్లేషించాడు. తన అభిప్రాయాన్ని తండ్రికి నిర్భయంగా చెప్పాడు. రెండో సంబంధం చూడటానికి వెళ్ళినప్పుడు మాత్రం అటువంటి ప్రయత్నం చెయ్యలేదు. తన వాదంతో తల్లిదండ్రుల మనసు కష్టపెడుతున్నాననే అనుమానం కలిగింది. అంతేకాదు, ఉదయం తను చేసిన విశ్లేషణ మీద తనకే నమ్మకం లేకపోయింది.
    అతను నిట్టూర్చాడు.
    జరిగిపోయిన దాని గురించి చింతించి ప్రయోజనంలేదు. జరగాల్సిన దాన్ని గురించి ఆలోచించాలి. తమ మధ్య ఏర్పడిన అభిప్రాయ భేదాన్ని ఏదోవిధంగా సరి చెయ్యాలి. అలా అనుకున్న శివరావు భార్యని మీదకు లాక్కున్నాడు. అతని మనసు రాజీకి సిద్దపడటంతో శరీరం వేడెక్కింది. ఆమె పెదాలు చుంబించి చప్పున మొహం వెనక్కి తీసుకున్నాడు.
    "నోట్లో ఏలక్కాయ వేసుకోలేదు కదూ?" అడిగాడు.
    ఆమె సమాధానం చెప్పలేదు.
    అప్పటికి శివరావు శరీరంలోని వేడి సగానికి తగ్గిపోయింది. అయిష్టంగానే ఆమెను ఆక్రమించుకున్నాడు. కొన్ని నిముషాల తరువాత ఎడంగా జరిగి అటు తిరిగి  పడుకున్నాడు.
    "సెక్స్ అంటే రెండు కండరాల రాపిడి కాదు."
    ఎవరో రచయిత రాసిన వాక్యం అతనికి గుర్తొచ్చింది.
                          *    *    *    *
    తనలో పేరుకున్న అసంతృప్తి శివరావు అధిగామించలేకపోయాడు. తను తీవ్రంగా భావిస్తున్న విషయాలు భార్యాభర్తల మధ్య సాధారణ విషయాలు కావచ్చునని అనుకున్నాడు. అలా అనుకోవడంవల్ల కూడా అతనికి ఉపయోగంలేకపోయింది. కటిక చీకటిలో రెండు నిముషాలు అనుభవించే ఆ సుఖం కోసం ప్రపంచంలోని మనుషులంతా ఆరాటపడుతున్నారని నమ్మలేకపోయాడు. తనకి తెలియని, అనుభవానికి రాణి సుఖం ఏదో ఉందని భావించాడు. దానిని ఎలా గుర్తించి అనుభవించాలో అతనికి అంతు పట్టలేదు.
    సంవత్సరంలో పదిహేను రోజులు మాత్రమే అతని భార్య సెక్స్ కి అంగీకరించేది. ఆ తరువాత ఎంత ప్రయత్నించినా దగ్గరకు రానిచ్చేది కాదు. ఇలా నాలుగు సంవత్సరాలు గడిచాయి. వరుసగా ముగ్గురు పిల్లలు కలిగారు. సంవత్సరంలో పదిహేను రోజులు మాత్రమే కలిస్తే పిల్లలు ఎలా పుడుతున్నారో అర్ధం కాలేదు. సంతృప్తికరంగా ఒక్కసారైనా సెక్స్ అనుభవించకుండా ముగ్గురు పిల్లలకు తండ్రి అయ్యేసరికి దాదాపు పిచ్చి పట్టినంత పనైంది. ఒకరోజు బార్ లో స్నేహితునికి తన సమస్యలు, మనసులోని అనుమానాలు చెప్పుకున్నాడు. వారం రోజుల తరువాత ఒక డాక్టర్ ని కలిశాడు.
    "మీ భార్యకు రతికార్యం పట్ల అయిష్టత ఉంది. కొంతమంది ఆడవాళ్ళకు రతికార్యం బాధాకరంగా ఉంటుంది. అటువంటి వాళ్ళు పురుష సంపర్కానికి దూరంగా ఉంటారు. ఈ తరహా ఆడవాళ్ళు లెస్బియన్స్ గా మారతారు. మీ భార్య సంవత్సరంలో పదిహేను రోజులు మాత్రమే గడిపి తరువాత దూరంగా ఉండేదని చెప్పారు. దీనిని బట్టి రతిపట్ల వ్యతిరేకత ఉన్నా పిల్లల్ని కనాలనే కోరిక ఆమెకుంది. బహుశా ఆమె డాక్టరు సలహా తీసుకుని ఉంటుంది. మెన్షస్ అయిన పదో రోజు నుంచి పదిహేను రోజుల పాటు మీతో కలిసేది. ఆ రోజుల్లో గర్బధారణకు అవసరమైన అండం ఆడవాళ్ళలో విడుదలవుతుంది. చివరి బిడ్డ పుట్టి సంవత్సరం అయినా ఆమె దూరంగా ఉండడానికి కారణం ముగ్గురు పిల్లలు చాలునని ఆమె అనుకుంది..." చెప్పాడు డాక్టర్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS