Previous Page Next Page 
యువత నవత పేజి 16

 

   "అసలు ఆ వూహే మనసులోకి రాకుండా అరికట్టడం బ్రహ్కయినా సాధ్యంకాదు! యవ్వనం ఉన్నంతవరకు ఈ స్పందన వుంటూనే వుంటుంది! స్నేహితురాలివి కనుక మనసులోమాట చెప్పుకొన్నానుగాని నాకు నిగ్రహం లేదని  ఈ  వలపుభారంతో వెళ్లి అతడిని కొగలించుకొంటానని ఎందుకనుకొంటున్నావు? ఇంతేనా?"నువ్వు నన్ను అర్దం చేసుకొంది?" శాలిని నొచ్చుకొన్నట్టుగా అంది.

     శాలిని మఖం తెల్లగా పాలిపోయింది. "భార్యా బిడ్డలున్నవాడంటే నమ్మను అతడలా కనిపించడు. బాచ్ లర్ లో వుండే చురుకుదనం, ఉత్సాహం వేరు! గృగస్తులో వాటికి బదులు నిండుదనం వుంటుంది!"

    "అతడిలో ఉత్సాహం, చురుకుదనం ద్విగుణీకృతం చేసిన ఉత్తమ గృహిణి అయి వుంటుంది ఆమె! అతడి ఉత్సాహానికి కారణం ఆమెను అతడు అత్యంతగాఢంగా ప్రేమించడం కూడా కారణం కావచ్చు!"

    శాలిని నీళ్లు నిండిన కళ్లతో నిశ్సబ్దంగా చూడసాగింది.

     అతడి బొమ్మ ఇప్పుడయినా తుడిచి వేస్తావా? లేదా మగవాడికి యిద్దరు భార్యలుండొచ్చునని సమర్దించుకొంటావా?"

     "ఛీ! నీకళ్లకి నేనెలా కనిపిస్తున్నాను?"
   
    "ప్రేమ కొందరి కళ్లముందు వెలుగులు పరిస్తే మరి కొందరి కళ్లముందు చీకట్లు పరుస్తుంది! ఆ చీకట్లో దారి తప్పుతారు. భార్య వున్న మగడిని ప్రేమించి తన జీవితాలను నాశనం చేసుకొన్న స్త్రీల కధలెన్ని లేవు?"

    "ఆ కథల్లో నాదొక కథ అవుతుందని నువ్వు భయపడకు, సుధా!" పైటకొంగుతో కళ్లు తుడుచుకొంటూ అంది శాలిని.

     మరుసటిరోజు బడిలో శర్మ కనిపించినప్పుడు శాలిని గుండెలో అలజడి రేగలేదు. అతడంటే ఆసక్తి చచ్చిపోయినట్టుగా అయింది! అతడితో యిదివరకే మరొక స్త్రీ జీవితాన్ని పంచుకొంది! అతడి ప్రేమానురాగాల మీద, రూప సౌందర్యాలమీదా హక్కు సంపాదించుకొంది.

     ఇంకేముందని ప్రేమిస్తుందతడిని?

    కాని, శాలినిలో ఉత్సాహం, సంతోషం ఊదేసినట్టుగా అయ్యాయి!

    ఒక పచ్చటితీగను నిర్దాక్షిణ్యంగా పెరికివేసినప్పుడు అది నిలువునా ఎండిపోతూ పడే బాధా, నరకం లాంటివి శాలిని ముఖంలో కనిపిస్తుంటే,  సుధకు తను అనవసరంగా పాపం చుట్టుకొంటున్నా ననిపించింది.

    "ఏయ్! విరాగిణీ!  నీకో మంచిమాట చెబుతాను. నాకివ్వడానికి స్వీట్ పాకెట్  రెడీగా  పెట్టుకో!"

    "ఇహ యీ ప్రపంచంలో మంచి మాటలుంటాయనుకో!" విషాదంగా అంది.

     "ఆ మాట విన్నాక ఈమాట అనలేవు! కనీసం చేతితో పంచదార అయినా పట్టుకో!"

    "నీకంత  తినాలని వుంటే డబ్బాలోంచి తీసుకు తినరాదు?" శాలిని విసుగు వ్యక్తం చేసింది.

     "పూర్వం రాజులకి, రాణులకి శుభవార్తలు చెబితే చెప్పిన వాళ్లకి మెడలోంచి మణి, రత్నహారాలు అమాంతం తీసిచ్చే  సంప్రదాయం వుండేదట!"

    "నేను రాణినికాదు! నా దగ్గర మణిరత్నహారాలు లేవుగాని ఏమిటో చెప్పు!" అడ్డుతగిలింది శాలిని.

     "ఇంత విసుగైతే చెప్పనులే!"

    "చెప్పకు! తెలుసుకోవాలనే ఆసక్తది నాకేంలేదు!"

    "ఇప్పుడు తెలుసుకోకపోతే తరువాత బాధపడతావు! ఎందుకు తెలుసుకోలేదా అని!నీ ఇష్టం! నాకేం!"

    "నువ్వేం వూరించకు!"

    "నీ మొహం! చెప్పేస్తున్నా! శ్రీశ్రీశ్రీ రాధాకృష్ణగారికి ఇంకా వివాహంకాలేదు. ఆయనకి నలుగురు బిడ్డలుకాదు, ఒక బిడ్డ  వుండడంకూడా పూర్తిగా అబద్దం!"

    శాలిని ముఖంలో చప్పున మార్పువచ్చింది. ఆశ చిగురు తొడిగినట్టుగా అయింది. "అది చెప్పింది నువ్వే! ఇది చెప్పింది నువ్వే! ఏది నిజమో, ఏది అబద్దమో తెలుసుకోలేకుండా వున్నాను!"

    "ముందు చెప్పింది అబద్దం. కేవలం నిన్నో ఆట ఆడిద్దామని అలా చెప్పాను. కొంత విషాదం తరువాత వచ్చే  ఆనందం చాలా అపురూపంగా వుంటుందని! ఇహ నేను శర్మగారి గురించి తెలుసుకొన్న నిజమైన వివరాలు, అతడికింకా పెళ్లికాలేదు. అతడు వంటరిగానే వుంటున్నాడు. వాళ్ల వాళ్లు  హైదరాబాద్ లో వుంటారు. ఇతడు యింటికి పెద్దకొడుకు! ఇతడి తరువాత ముగ్గురాడపిల్లూ, తరువాత అబ్బాయిట. వాళ్ల నాన్నగారు ఈ మధ్యే రిటైరయ్యారు. మధ్యతరగతి సంసారం! ఈ కాలంలో కాస్ట్ గురించి బహిరంగంగా  మాట్లాడడం సభ్యత, నాగరికతకాదు. కాని, పెళ్లి అనేసరికి కులం ప్రసక్తి తప్పకుండా వస్తుంది ఉద్యోగం కావాలన్నా, విద్య కావాలన్నా తప్పనిసరిగా గవర్నమెంటే"నీ కులం ఏమిటి? నీ మతం ఏమిటి?" అని అడుగుతూంటే ఈ కులం మతం యిప్పట్లో పోయేవికాదు! అదృష్టవశాత్తు నీ కులం ఒక్కటే కాని శాఖాభేదాలు వున్నట్టున్నాయి. ఈ కాలం లోనూ శాఖలనుకూడా కొండంతలు చేసే వాళ్లు లేకపోలేదు. మీ ఇద్దరికి పెళ్లి కావాలంటే ఒక పెద్ద యుద్దం చేయాల్సివస్తుందేమో!"

    "ఆలులేదు, చూలులేదు కొడుకు పేరు సోమలింగం అన్నాడట వెనుకటికెవరో అలా వుంది నీ వరుస! అతడేమిటో , అతడి నీ మనస్సేమిటో తెలియకుండానే మా యిద్దరికి పెళ్లి నిశ్చయం చేసేస్తున్న నీ తెలివికి సంతోషించాలో ఏడవాలో, తెలియడం లేదు?"అంది సాలిని "అతడికి ఇదివరకే పెళ్లి అయిందని,  నలుగురు బిడ్డల తండ్రి అని చెప్పి  నన్ను యెంతనరకం పెట్టావు.  నువ్వు చేసిన ఈ పరిహాసానికి, పెట్టిన బాధకు నువ్వు నలుగురి బిడ్డల తండ్రివి ప్రేమించి బాధపడాలని శాపం యిస్తున్నాను" అంది పెదవుల మధ్య నవ్వుని బంధిస్తూ.

     "కాని, ఇప్పుడు అతడు బ్రహ్మచారి అని తెలిసి "స్వర్గం ఎక్కడో లేదు జీవితంతోనే వుంది" అనిపిస్తుందా లేదా?"

    "రెండు నాలికలున్న స్నేహితురాలివల్ల అంతా దుఃఖమే  ననిపిస్తూంది!"

    ఆ గ్రామంలో ఒక మహిళా మండలి ఏర్పాటుచేయించాలని వచ్చినప్పటినుండి శ్రమపడుతూంది సుధ. స్త్రీలు తమ సమస్యలను ఒకచోట చర్చించుకొనేందుకు, ఏదయినా ఒక న్యాయం  కావాలంటే,   ఒక హక్కు కావాలంటే  అందరూ ఒకటై సాధించుకొనేందుకు ఈ మహిళా  సంఘాలు ఎంతో తోడ్పడతాయి.

     మొదట్లో ఎవరూ చేరడానికి ఒప్పుకోలేదు. "ఆఁ ఏం మహిళా మండలిలెద్దూ!కూరకివస్తాయా? కుండకివస్తాయా?" అని  పెదవి విరవడం కొందరుచేస్తే, "మా అత్తలోలదు!" అని ఒకామె అంటే "నా  మొగుడు తిడతాడు!" అని ఒకామె అంది.   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS