"హమ్మయ్య, తిట్టలేదు" మనసులో సంతోషించాడు విష్ణు.
ఇంతలో కార్తీక్ అడిగాడు.
"సుధాకర్ తనతో ఈ రకం గా మాట్లాడుతాడని అన్నయ్య ఊహించి ఉంటాడా?"
"అస్సలు అనుకుని ఉండరు సార్. అయినా ఆయన అన్నది కూడా నిజమే. మన వాటాలన్నీ మనకి ముట్టేయి. అన్నీ సీఎం గారికి కూడా తెలిసే జరిగాయి. అందుకే అతను ఈ ట్విస్ట్ కి షాక్ అయ్యాడు. కానీ వాడు పరమ dangerous అంటారు. వాడి వెనక మాఫియా ఉంది సార్" భయంగా అన్నాడు విష్ణు.
"వాడి మొహం" కొట్టి పారేశాడు కార్తీక్.
"మదాలస ఎవరు? బినామీ అంటాడేమిటి?" అడిగాడు కార్తీక్.
ఏడుపొచ్చింది విష్ణుకి.
"ఈ దరిద్రం కూడా ఇప్పుడు తన ద్వారా తెలియాలా?"
"మాట్లాడవేమిటి?" రెట్టించాడు కార్తీక్.
"అంటే సార్, ఆవిడ మన సార్ కి... గాళ్ ఫ్రెండ్" గుసగుస గా అన్నాడు.
"అర్థం కాలేదు. ఈ రూం లో ఎవరున్నారు? గట్టిగా మాట్లాడు" విసుక్కున్నాడు కార్తీక్.
మళ్లీ చెప్పాడు విష్ణు.
"ఏమిటీ?"
అతనికి అంతా చేదు తిన్నట్లుగా అయింది. తననుకున్నట్లు బృంద సంతోషంగా ఏమీ లేదు.
తన అన్న నమ్మిన వాళ్లందరినీ మోసం చేశాడు....బృంద తో సహా అందరినీ."
"బృంద కి తెలుసా?" అడిగాడు కార్తీక్.
"ఆవిడకి ఎప్పుడో తెలుసు సార్. మీకు తెలుసో లేదో వాళ్లిద్దరి మధ్య మాటలు లేవు! ఏదో సార్ కనపడకుండా పోవటం అనే సంఘటన జరిగినప్పటి నుంచి కాస్త మెసేజ్ లు మొదలయ్యాయి" చెప్పాడు విష్ణు.
ఈ విషయం తనకి తెలీకుండా ఉంటే బాగుండేదని అనిపించింది కార్తీక్ కి.
***
సుధాకర్ అండ్ కో తో ఉన్న కాంట్రాక్టులు అన్నీ రద్దు చేయటం, జరిగిన పని లో నాణ్యత పాటించనందుకు పెనాల్టీ వేయటం
గురించి మీటింగ్ అయిన వెంటనే విష్ణు ప్రెస్ కి లీక్ లు అందించాడు
***
ఆ సాయంత్రం సుధీర్ బృంద కి ఫోన్ చేసాడు.
గట్టిగా అరవడం మొదలెట్టాడు.
"నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా? కార్తీక్ గాడిని ఎక్కడ నుంచి తీసుకొచ్చావు?"
"నీతో మాట్లాడటం తప్పనిసరి అవటం వల్ల మాత్రమే మాట్లాడుతున్నాను. నా మీద వదిలేసావు. నాకు తోచిన పరిష్కారం నేను ఇచ్చాను. నచ్చక పోతే నువ్వే వచ్చి రిజైన్ చేసేయి." అనేసింది బృంద.
"అమ్మో, రాజీనామానా?"
గుండె కలుక్కుమంది అతనికి. ఎంత కష్టపడి తను ఆ స్థితి కి వచ్చాడు.
"కార్తీక్ నా మీద కక్ష తీర్చుకుంటున్నాడు. నీకు అర్థం కావడం లేదు" నెమ్మదిగా అన్నాడు.
"కార్తీక్ సంగతి నాకు తెలుసు. అందరూ నీలా ఉండరు" అందామె.
"ఏదో ఒకటి చేసుకో కానీ సుధాకర్ గాడి కాంట్రాక్ట్ వాడికి ఇప్పించు. వాడొక క్రిమినల్. వాడి గురించి మీకు తెలియదు." అతని గొంతులో భయం తాలూకు వణుకు వినిపించింది.
ఒక్క క్షణం ఆమె ఆలోచించింది. తర్వాత సీరియస్ గా చెప్పింది.
"అటువంటి వాళ్ళతో స్నేహాలు, బంధుత్వాలు, వ్యాపారాలు చేస్తే వచ్చే పర్యవసానాలు భరించక తప్పదు. ఈ విషయంలో నేనేమీ చేయలేను. కావాలంటే నువ్వే వచ్చి చూసుకో" కాస్త కటువుగా చెప్పి ఫోన్ పెట్టేసింది.
నివ్వెరపోయాడు సుధీర్.
____****____
