6
ఎడిటరు పక్కన సైడ్ టేబుల్ మీద ఉన్న రెండు ఫోన్లలో ఎర్రది PMBXకి కనెక్ట్ అయి ఉంది. ఆపరేటరు ద్వారా వచ్చే కాల్స్ దాన్లో వస్తుంటాయి. రెండో ఫోను నల్లది డైరెక్ట్ లైన్.
సర్క్యులేషన్ డిపార్టుమెంట్ వాళ్ళతో చాలా ఇంపార్టెంట్ విషయం గురించి ఎర్రఫోన్ లో మాట్లాడుతున్నాడు ఎడిటరు. ఇంకా ఉదయార్కర్ జాడ తెలియలేదు. చాలా అన్యమనస్కంగా ఉన్నాడతను. అయినా పనిదారి పనిదే! ఆగిపోవడానికి వీల్లేదు.
అతను అలా మాట్లాడుతూ ఉండగానే రెండో ఫోన్ మోగింది.
"ఒక్క నిమిషం!" అని ఎర్రఫోను మౌత్ పీస్ లోకి చెప్పి అరచేత్తో దాన్ని మూసి నల్లఫోను ఎత్తాడు ఎడిటరు.
"హలో! ఎడిటర్జీ! పోలీస్ కమీషనర్ హియర్!"
"హలో కమీషనర్ సాబ్! ఉదయార్కర్ ఆచూకి ఏమన్నా తెలిసిందా! అన్నారు ఎడిటర్.
కమీషనర్ ఏదో చెబుతున్నాడు కానీ అందులో ఒక్క ,ముక్క కూడా ఎడిటరుకి వినబడటంలేదు. గురగురమని శబ్దం వస్తోంది లైన్లో. విపరీతమైన డిస్టర్బెన్స్.
"హలో! హలో!" అన్నాడు ఎడిటరు.
ఎవరో పీక నోక్కేసినట్లు చటుక్కున డెడ్ అయిపొయింది లైన్.
చిరాకును అణుచుకుంటూ ఎడమచేతిలో ఉన్న ఎర్రఫోను లోకి చెప్పారు ఎడిటరు. :సారీ సర్ ద ఇంటరెప్షన్! మీరు ఫోను పెట్టెయ్యండి. ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ నేనే రింగ్ చేస్తాను మాట్లాడుకుందాం."
ఆ రిసీవర్ క్రెడిల్ మీద ఉంచేసి నల్లఫోనులో కమీషనరు నెంబరు డయల్ చెయ్యడం మొదలెట్టాడు ఎడిటరు.
అప్పుదూ రూమ్ తలుపు విసురుగా తెరుచుకుంది. దూసుకువస్తున్నట్లు లోపలికి వచ్చేడు ఒక మనిషి. పెద్ద శరీరం. చిన్న తలకాయ. ఖద్దరు బట్టలు కిర్రు చెప్పులు. ఆయన కనుబొమ్మలు బుర్రమీసాలంతా పెద్దవిగా వున్నాయి. మీసాలు నిమ్మకాయలు నిలబడెంత పెద్దవిగా వున్నాయి. అయన వెనకనే ఒక అమ్మాయి నమ్రతగా లోపలికి వచ్చింది.
వాళ్ళని కూర్చోమని సైగ చేశాడు ఎడిటరు.
"చెప్పండి" అన్నాడు నెంబరు డయల్ చేస్తూనే.
"నా పేరు ధనుర్భాణుడు " అన్నాడాయన. దుమధుమలాడుతూ "మాకు తెలగపిండి యాపారం ఉంది."
"అలాగా"
"మీ పత్రికలో కట్నానికి గుడ్ బై అని ఓహ శీర్షిక వుంది కదూ!"
"అవును చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది దానికి.'
"రెస్పాన్సా గాడిద గుడ్డా! దానివల్ల నా దుంపరేగేట్లుంటే?"
"ఏమయింది?"
"మేమంటే గిట్టని వాడెవడో ఆడి పిండం పిల్లులకి బెట్టా - నా రెండో వాడి ఫోటో మీ కట్నానికి గుడ్ బై శీర్షికకి పంపాడు."
"అరెరె!"
"అరెరె అని మెల్లిగా అంటారేమిటండీ! మా ఉళ్ళలో కట్నాలు శానా ఎక్కువ. పెద్ద చదువులు చదివితే ఒక లకారమన్నా కళ్ళ జూడోచ్చని మా రెండోవాడ్ని డాక్టరీ చదివించాం. కట్నానికి గుడ్ బై అని ఆడి ఫోటో గ్రాపు పడింది. ఇప్పుడు తెల్లారే సర్కి కట్నాల మార్కెట్లో మా వాడి రేటు పడిపోయింది. ఇదంతా ఎవడి తప్పు అంటారు?"
"చూడండి........" అన్నాడు ఎడిటరు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ.
"చూడడానికే వచ్చా! ఆ ఫోటో తియ్యండి ఎప్పుడు పంపాడో చెప్పండి. అదంతా కళ్ళారా చూడాలనే నేనిప్పుడు."
"సారీ! మీరు ఎవరో మాకు తెలియకుండా......"
"నేను ఎవర్నా! నేను ఎవర్ననేది నీకు ఇప్పుడు కదయ్యా! కోర్టులో కలుసుకున్నాక అప్పుడు తెలుస్తుంది నీకు! నీ మీదా , నీ పత్రిక మీదా దావా వెయ్యకపోతే నా పేరు ధనుర్భాణుడెందుకవుద్దీ? దారిన పొయ్యే దానయ్య అవుద్దిగానీ"
"కోర్టుకి వెళతారా? ఏమని?" అన్నాడు ఎడిటరు శాంతంగా.
"నా కొడుక్కి కట్నం రాకుండా చేసి నా నోట్లో దుమ్ము కొట్టారని."
సరిగ్గా అప్పుడు మోగింది నల్లఫోన్. పోలీస్ కమీషనరు దగ్గర నుంచి అయి ఉండాలి. ఉదయార్కర్ దొరికాడా! రిసీవరు ఎత్తి మౌత్ పీస్ కి అడ్డంగా అరచేతిని ఉంచి ధనుర్భాణుడితో అన్నాడు ఎడిటరు.
"మీకు తెలుసో తెలియదో కట్నం తీసుకోవడం చట్టరీత్యా పెద్ద నేరం! మీ అంతట మీరు కోర్టుకి వెళ్ళే శ్రమ అక్కర్లేదు. లైన్లో పోలీస్ కమీషనరు వున్నారు. ఆయనతో చెబుతాను. ఆ తర్వాత మమ్మల్ని కోర్టుకి లాగే పని ఆయనే చూసుకుంటారు" అని "హలో" అన్నాడు ఎడిటర్.
మరుక్షణంలో ధనుర్భాణుడు కుర్చీలో నుంచి లేచాడు. రెండో క్షణంలో అతను తలుపు దగ్గర ఉన్నాడు. మూడో క్షణంలో మెట్లు దిగడం మొదలెట్టాడు.
చిన్నగా నవ్వుకుంది "హలో!" అన్నాడు ఎడిటరు మళ్ళీ.
"రామ్ జీ వున్నాడా?" అంది ఒక గొంతు!
"రాంజీ! ఏ రాంజీ?"
"అదే సారీ. ఆత్మారాం!"
ఆత్మారాం ఎడిటరు దగ్గర పనిచేసే ఆఫీసు బాయ్.
చాలా టెన్షన్ ఫీలవుతున్నాడు ఎడిటర్. ఇందాక కమిషనరు ఫోన్ చేసినప్పుడు లైన్ కట్ అయిపొయింది. మళ్ళీ ఏ క్షణంలోనైనా అయన ఫోన్ చెయ్యవచ్చు. అయన రింగ్ చేసినప్పుడు తన ఫోన్ ఎంగేజ్ అయి ఉంటే మళ్ళీ కన్ ఫ్యూజన్!
