"థాంక్స్!" అన్నాడు ఎడిటరు.
లైన్ కట్ అయిపొయింది.
* * * *
అది మరో మేగజైను తాలుకూ ఆఫీసు. ఎడిటర్స్ కేబిన్. కానీ ఆ ఆఫీసులో ఎడిటరుని ఎడిటరు అనరు. అక్కడ అతన్ని ఇన్ చార్జ్ అంటారు.
అతని పేరు ప్లాగ్ మాస్ట్ తో ఎక్కడా కనబడదు.
అతని కేబిన్ లోకి అడుగుపెట్టాడు రైటరు ప్రేమ్ కుమార్. చనువుగా వచ్చి కుర్చీలో జేరగిలబడి కూర్చున్నాడు.
"ఏమండీ ఎలా ఉంది మీ మేగజైను ?" అన్నాడు సిగరెట్ అంటిస్తూ.
తను చూస్తున్నది కలో నిజమో అర్ధం కానట్లు కళ్ళప్పగించి చూస్తున్నాడు ఇన్ చార్జ్. ప్రఖ్యాత రచయిత ప్రేమ్ కుమారు తమ ఆఫీసుకి రావడమా! అతనెప్పుడూ ఈ గుమ్మం తొక్కను కూడా తొక్కలేదే!అతను ఒక లీడింగ్ మేగజైను కి రేగ్యులరుగా రాసే రైటరు. తమ దగ్గరికి ఎందుకు వచ్చాడు?
అద్భుతాలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి.
ఆశ్చర్యంతో తలమునకలయిపోతూ , "మీరు మా ఆఫీసుకి రావడం మాకు విశేషమైన గౌరవం" అన్నాడు ఇన్ చార్జ్. "కాఫీ తాగుతారా! కూల్ డ్రింకా?"
దానికి జవాబు చెప్పకుండా నిర్లక్ష్యంగా నవ్వాడు ప్రేమ్ కుమారు. "మీ సర్క్యులేషన్ ఎంత ఉంది ఇప్పుడు.
"అరవై, డెబ్బయ్ వేల మధ్యనే ఉంటోంది." అని బజర్ మోగించి, బాయ్ రాగానే, కూల్ డ్రింక్ తెమ్మని చెప్పాడు ఇన్ చార్జ్.
"మీ సర్క్యులేషన్ లక్ష దాటించమంటారా?" అన్నాడు ప్రేమ్ కుమార్ చాలా తేలిగ్గా.
ఆశ్చర్యంలో నుంచి తేరుకున్నాక సంతోషంగా నవ్వాడు ఇన్ చార్జ్. "మీరు తలుచుకుంటే ఏ అద్భుతమన్నా చెయ్యగలరు. మీరు సీరియల్స్ రాస్తున్న మేగజైను ని పైకి తెచ్చింది మీరేనని ఎవరికి తెలియదూ?"
"ఆ ఎడిటర్ కి మాత్రం తెలియదు. అతను తనవల్లే మేగజైను పైకి వచ్చిందని అనుకుంటున్నాడు. ఐ వాంట్ టూ టీచ్ హిమ్ ఏ లెసన్!"
"మీ కోపం వాళ్ళకు శాపమైతే, మాకు వరం అవుతుంది." అన్నాడు ఇన్ చార్జి, ఉద్వేగం పట్టలేక అరచేతులు గబగబ రుద్దుకుంటూ.
నిర్లక్ష్యంగా తలపంకించి "వాళ్ళు ఏదో సెన్సేషనల్ సీరియల్ అంటూ పెద్ద ఆర్భాటం చేస్తున్నారు. ఆ సీరియల్ నేనే మీకు రాసి పెడతాను. సూపర్ హిట్ అవుతుంది. మీ మేగజైను సర్క్యులేషన్ మొదటివారంలోనే లక్ష దాటుతుంది. మూడు వారాలు తిరిగే సరికి మన రైవల్ మేగజైన్ కుంటడం మొదలెడుతుంది. సరిగ్గా మూడు నెలల తర్వాత గుర్తుంచుకొండి......
సరిగా మూడు నెలల తర్వాత వాళ్ళ మాడు పగిలేలా దెబ్బ తీస్తాం. ఆ మేగజైన్ ని పూర్తిగా పడుకోబెట్టేస్తాను. మీ మేగజైన్ ని నెంబర్ వన్ మేగజైన్ గా చేస్తాను" అన్నాడు ప్రేమ్ కుమార్. సంతోషాన్ని కంట్రోల్ చేసుకుని అన్నాడు ఇన్ చార్జ్.
"ఇది మేము కలలో కూడా ఉహించలేని ఆదృష్టం. కానీ....." అని సంకోచంగా ఆగిపోయాడు.
"చెప్పండి."
"మీరు తీసుకునే పారితోషకం చాలా ఎక్కువని తెలుసు. ఇప్పట్లో మేము......."
అసహనంగా అతని మాటలని కట్ చేశాడు ప్రేమ్ కుమార్. ఇప్పుడేం రిమ్యునరేషన్ ఇవ్వక్కర్లేదు నాకు. ఆ డబ్బు కూడా పబ్లిసిటి మీద ఖర్చు పెట్టండి. అయితే ఒక కండిషన్ మీద!"
"చెప్పండి"
"తూచి తూచి అంటున్నట్లు అన్నాడు." ప్రేమ్ కుమార్.
"మీ సేల్సు పెరిగితే, ఆ ప్రాఫిట్ లో షేర్ ఇవ్వాలి నాకు."
ఒక్కసారి ప్రేమ్ కుమార్ మొహంలోకి చూశాడు ఇన్ చార్జ్. ప్రేమ్ కుమార్ మంచి రైటరు. అది నిజమే! అయితే అతను మంచి బిజినెస్ మాన్ కూడా! అవును!
"అలాగే మా మానేజ్ మెంట్ వారితో చెబుతాను" అన్నాడు ఇన్ చార్జి.
"ఒప్పుకుంటారు" అన్నాడు ప్రేమ్ కుమార్ చాలా ఆత్మవిశ్వాసంతో.
"మిస్టర్ ప్రేమ్ కుమార్! మిమ్మల్ని అడిగేటంతటి వాడిని కాను నేను. అయినా అడుగుతున్నాను. వాళ్ళు సీరియల్ మొదలెట్టేస్తున్నారు. మనం అందుకోగలమా?" అన్నాడు సందేహంగా.
"నెక్ట్స్ వీక్ వాళ్ళ సీరియల్ రాదు" అన్నాడు ప్రేమ్ కుమార్ దృడంగా.
"ఎందుకని?" అన్నాడు ఇన్ చార్జి తెల్లబోతూ.
"ఇందుకు" అని డ్రమెటిక్ గా తలుపు వైపు చూపించాడు ప్రేమ్ కుమార్.
అప్పటిదాకా తలుపు వెనక నిలబడి ఉన్న ఒక మనిషి లోపలికి వచ్చి వినయంగా నమస్కరించారు.
అతన్ని చూడగానే ఇన్చార్జి కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి.
