కానీ ఆత్మారాం కోసం ఎవరో ఫోన్ చేస్తున్నారు. ఎంత అవసరమైన పనో తెలియదు తను పిలవనని ఎలా అనగలడు?
ఒక నిర్ణయానికొచ్చి అత్మారావుని పిలిచి ఫోన్ అందించాడు ఎడిటరు. రీసివర్ రెండు చేతులతో పట్టుకుని "అలౌవ్" అన్నాడు ఆత్మారాం బిగ్గరగా. లైన్లో అవతల ఉన్నవాళ్ళు చెప్పింది శ్రద్ధగా విని "వస్తా! ఒవ్! తప్పకుండా వస్తా!" అని రిసీవరు పెట్టేశాడు.
"ఏమయింది ఆత్మారాం!" అన్నాడు ఎడిటరు ఆదుర్దాగా. అతను తన దగ్గర పనిచేసే వాళ్ళని తన కుటుంబ సభ్యుల లాగే చూసుకుంటాడు.
"మా బామ్మర్ది సర్! సెకెండ్ షో సినిమాకి వెళ్దాం , డ్యూటీ నుంచి దిగ్గానే సక్కగా జమ్రుద్ టాకీస్ కి పచ్చేయ్యమని ఫోన్జేసిండు" అన్నాడు ఆత్మారాం సిగ్గుపడుతూ.
చిరాకుని అణుచుకున్నాడు ఎడిటరు. అతనికి ఎదురుగా ఇందాకటి నుంచి కూర్చుని ఉన్న అమ్మాయి తన ఉనికిని గుర్తు చెయ్యడాని కన్నట్లు చిన్నగా దగ్గి గొంతు సవరించుకుంది.
అప్పుడు మొదటిసారిగా ఆ అమ్మాయిని పరీక్షగా చూశాడు ఎడిటరు.
"చెప్పండి ఏం పని" అని అనాలా! "చెప్పు! ఏం పని?" అని అనాలా అని అసంకల్పితంగానే ఆలోచించింది అతని మనసు. ఏకవచనంతో సంబోధించేటంత పెద్దదీ కాదు. టీనేజఋ లేదా జస్ట్ టీన్స్ లో నుంచి బయటపడి ట్వెంటీ లోకి వచ్చి ఉంటుంది. ప్రేష్ ప్రం కాలేజ్ లాగా కనబడుతోంది.
"చెప్పండి ఏం పని?" అన్నాడు ఎడిటరు. నల్లఫోన్ రిసీవరు మీద చెయ్యి వేస్తూ -----
చటుక్కున ఆమె చూపులు అతని చేతిని అనుసరిస్తూ ఫోన్ మీదికి పోయాయి. లేడీ కళ్ళలా చాలా విశాలమైన నేత్రాలు ఆమెవి. చాలా అలర్టుగా వున్నాయి ఆమె చూపులు. ఎక్కడ ఏ కదలిక అయినా ఎక్కడ ఎలాంటి సవ్వడి వినిపించినా వెంటనే అటుసాగి దాన్ని శోదిస్తున్నాయి ఆమె దృక్కులు. ఆమె ప్రవర్తన చూస్తే వనస్థలిపురానికి ఎదురుగా వున్న జింకల పార్కులో కనబడే లేళ్ళు గుర్తు వచ్చాయి ఎడిటరుకి.
"నా పేరు హరిణి" అంది ఆ అమ్మాయి.
"చాలా స్థారకమైన పేరు. ఎంత కో యిన్సిడేన్స్ " అనుకున్నాడు ఎడిటరు మనసులోనే.
"ఇది చూడండి" అని నీటుగా పిన్ చేసిన మూడు కాగితాలు అతనికి ఇచ్చింది హరిణి.
"బడ్డింగ్ రైటర్! ఔత్సాహిక రచయిత్రి. గుడ్!" అనుకుంటూ ఆ కాగితాల వైపు చూడబోయాడు ఎడిటరు.
వెంటనే నల్లఫోన్ మోగింది.
ఆ కాగితాలు అలా చేతిలో పట్టుకునే రిసీవరు ఎత్తాడు ఎడిటరు --------
"హలో! ఎడిటరు జీ! కమిషనరు హియర్! ఇందాక లైన్ కట్ అయిపోయినట్లుంది కదూ!"
"మీ ఉదయార్కర్ దొరికాడు" అన్నాడు కమీషనరు క్లుప్తంగా.
"ఒక్కసారిగా ప్రాణం లేచి వచ్చినట్లయింది ఎడిటరుకి."
"దొరికాడా! ఎక్కడ? ఎప్పుడు"
"స్పృహ లేని స్థితిలో రోడ్డుమీద పడి వుంటే తెలిసిన వాళ్ళెవరో చూసి నర్సింగ్ హోమ్ లో చేర్పించారు."
"హౌ ఈజ్ హీ?"
"హీ ఈజ్ స్టిల్ అన్ కాన్షస్! బట్........."అని సంకోచంగా ఆగి అన్నాడు కమిషనరు "ఎడిటర్ జీ! ఉదయార్కర్" ఎలాంటి స్థితిలో ఉన్నాడో నేను చెప్పడం కంటే మీరు చూస్తే మంచిది" ఒక్కసారి గుండె లయ తప్పినట్లయింది ఎడిటరుకి. ఏమయింది ఉదయార్కర్ నర్సింగ్ హోమ్ తాలూకు అడ్రసూ తదితర వివరాలు కమిషనరు చెబుతుంటే నోట్ చేసుకుని థాంక్స్ చెప్పి రిసీవరు పెట్టేశాడు ఎడిటరు.
తర్వాత తన చేతిలో ఉన్న కాగితాల వైపు చూశాడు. మొదట ఒక్క క్షణం సేపు అతనికేమి అర్ధం కాలేదు. మెదడు మొద్దుబారినట్లయిపోయింది.
తర్వాత ఒక్కసారి తల విదిలించి దృష్టి కేంద్రీకరించి చూశాడు. తన ఎదురుగా కూర్చుని ఉన్న అమ్మాయి, వాట్స్ హర్ నేమ్! ఆ! హరిణి........హరిణి అందించిన కాగితాలు కధ తాలూకు స్క్రిప్టు కాదు అది.
లాయరు నోటీసు........
ఒకసారి ఆ అమ్మాయి వైపు చూసి కనుబొమలు ముడివేసి గలగల చదివాడు దాన్ని.
అతను చదవడం ముగించగానే అంది ఆ అమ్మాయి.
"జస్వంత్ మా అన్నయ్య. లీడింగ్ లాయరు. పేరు వినే వుంటారు మీరు. అతను డ్రాప్ట్ చేశాడు ఆ నోటీసుని."
మాట్లాడకుండా ఒకసారి ఆమె వైపు చూసి నిదానంగా రెండోసారి చదివాడు ఆ నోటీసుని.
అప్పుడు అతని మనసు కెక్కింది దాని సారాంశం.
రెండు వారాల క్రింద తమ పత్రికలో కె. యస్. హరిణి అనే పేరుతొ ఒక కధ పడింది. "నా డైరీలో ఒక పేజీ" అని నిజంగా తన జీవితంలో జరిగిన ఒక లవ్ ఇన్సిడెంట్ ని రచయిత్రి డ్రమటైజ్ చేసి రాసినట్లుగా ఉంది. ఆ కధ వేరేషణ్!
కానీ నిజానికి ఆ కధ రాసింది హరిణి కాదు. ఎవరో ఆకతాయి తనంగా కధని ఆ అమ్మాయి పేరుతొ రాసి పంపాడు. హరిణి చాలా పేరు ప్రతిష్టలు ఉన్న సంపన్నుల ఇంటిబిడ్డ. ఆమె గౌరవ మర్యాదలకు భంగం కలిగేలా ఈ కధని ప్రచురించినందుకుగానూ పత్రిక మీదా, సంపాదకుడి మీదా లక్ష రూపాయలకు పరువునష్టం దావా వేస్తున్నారు.
