Previous Page Next Page 
కౌగిట్లో కృష్ణమ్మ పేజి 16

 

    మరొకమారు భీకరధ్వనులు విన్పించేలా వికటంగా నవ్వింది శ్వేతకి. ఆ తరువాత ఏమయిందో జ్యోతికి తెలియదు.
    ఎంతో సమయం ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు. ఎవరో తట్టి లేపుతున్నట్లు అయి బరువుగా రెప్పలు విప్పింది ఆమె. ఎదురుగా ప్రొఫెసర్ శ్రద్దాదేవి కన్పించింది.
    కంగారుగా తనవంకే చూస్తోంది.
    "ఏమయింది?" అని అడిగింది జ్యోతి అర్ధం లేని చూపులు చూస్తూ.
    "నీ ప్రశ్నకు నీవే సమాధానం చెప్పాలి. ఏమయింది నీకు?" అన్నది ప్రొఫెసర్ శ్రద్దాదేవి చేయి అందిస్తూ. "ఇలా క్రిందపడి ఉన్నావేమిటి? తిరిగి తానె అంది.
    తాను ఎక్కడ వున్నదీ, ఎలా ఉన్నదీ ఒక్కసారి పరిశీలించి చూచుకుని దిగ్గున లేచి కూర్చుంది జ్యోతి.
    ఈ అయోమయవస్థ ఏమిటో ప్రొఫెసర్  కు రవంత అయినా అర్ధం కాలేదు. తాను జ్యోతిని మరంత కంగారు పెట్టటం మంచిది కాదనిపించింది. అలాగే చేయి పుచ్చుకుని నడిపిస్తూ లోపలి గదిలోకి వెళ్ళిందామె.
    ప్లాస్క్ లోంచి వేడివేడి కాఫీ ఒంపి జ్యోతికి ఓ కప్పు అందించింది. అవి త్రాగాక రవంత రిలాక్స్ అయింది. కొంచెంగా అయోమయ స్థితి నుంచి తెరుకోవటం ప్రారంభించింది.
    ఒకసారి యిల్లంతా కలియతిరిగి జరిగిందేమిటో గ్రహించటానికి ప్రయత్నించింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి. ఎక్కడా ఏమీ జరిగిన సూచనలు కన్పించలేదు. తలుపులు బార్లా తెరచి వున్నా ఎక్కడి వస్తువులు అక్కడే వున్నాయి. విలువయిన వస్తువులు కూడా ఎవరూ అంటుకోలేదు.
    జ్యోతి మెడ బోసిగా వున్నదని ఈ మధ్యనే తాను మిషన్ మీద తీయించిన సన్నని చెయిన్ ఆమె మెడలోనే కన్పిస్తోంది. జరిగినది దొంగతనం కాదని గ్రహించిందామే.
    తలుపులు దగ్గరగా వేసి తిరిగి వచ్చింది.
    అప్పటికి బాగా రిలాక్సయింది జ్యోతి. ప్రొఫెసర్ శ్రద్దాదేవి ఆ గదిలో కాలు పెట్టగానే "ఎంత సేపయింది మీరు వచ్చి" అని అడిగింది. అంతకు పూర్వం జరిగిన సంభాషణకూ , ఈ ప్రశ్నకూ ఎలాంటి సంబంధం లేకపోవటంతో ఆమె మన్హాస్థితి అలజడిగా వున్నదనీ , ఆ స్థితి నించి ఇప్పుడామె రవంత కోలుకున్నదని గ్రహించింది ప్రొఫెసర్.
    "ఇప్పుడే వచ్చాను జ్యోతి! నేను యూనివర్శిటీ పోయాక నీవు ఏమి చేశావు, జ్ఞాపకం తెచ్చుకో" మంద స్వరాన లాలనా పూర్వకంగా అడిగిందామె. ఆ ప్రశ్నకు బదులు చెప్పాలని ప్రయత్నించిన జ్యోతి అంతా జ్ఞాపకం చేసుకుందుకు ముందుగా కనులు అరమోడ్చింది. శ్రద్దాదేవి యూనివర్శిటి కి పోయిన తరువాత జరిగిన సంగతులన్నీ ఒక్కొక్కటిగా వెనువెంట జ్ఞాపకం రాసాగినాయి.
    ఏడు దినాలు రాత్రింబవళ్ళు అనక శ్రమించి లిపి శాస్త్రాన్ని నేర్చుకుంది తాను. తన పని పూర్తి అయాక యూనివర్శిటి కి వెళ్ళిపోయింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి. తాను విశ్రాంతి అయినా ఆశించకుండా తామ్రపత్రాలను పటించాలన్న ప్రయత్నంలోకి దిగింది.
    తామ్రపత్రాలనూ, లింగ్ స్టిక్స్ లో రిఫరెన్స్ పుస్తకాలనూ దగ్గర వుంచుకుని వాటిని చదివి అర్ధం చేసుకోవటం ప్రారంభించింది. తుది ఘట్టంలో చివరి తామ్రపత్రం చదవటం ప్రారంభించాక అదంతా చిలుము తినివేయటం నించి అర్ధానికి అవరోధం అయిపొయింది.
    ఆ రాకాసి గుహ ఎక్కడ వున్నదో తెలుసుకోవడం అసాధ్యమయింది. తాను ఆ సమాచారం తెలుసుకోవాలని శ్రమిస్తూ వుండగా తలుపులు తట్టిన చప్పుడు అయింది. లేచి వెళ్ళి తలుపు తీస్తే ఎదురుగా ఒక అరుదయిన యువతి రూపం కన్పించింది. ఆమె ఆరడుగుల పొడవు వుంది.
    సూర్యకిరణాలు మానవాకృతి ధరించినట్లు శరీరమంతా ధవళ వర్ణ కాంతులు విరజిమ్ముతున్నాయి.
    ఆ దృశ్యాలు తిరిగి ఆమె మనోపటలం మీద ప్రత్యేక్షమయినాయి .అన్నిటి కన్నా శ్వేతకి ఆత్మ రూపంలా కన్పించిన ఆ యువతి శరీర ధావల్యం మరుపురానిదిగా అయింది.
    సూర్యకిరణాలు మానవాకృతి అయినట్లు, ఆ చూపుల తీక్షణత!! ఇవన్నీ జ్ఞాపకం రాగానే జ్యోతి తిరిగి తన మనోధైర్యం కోల్పోవటం ప్రారంభించింది. ఆమె మనసు భాధాపరితప్తమయింది.
    ఈ తామ్రపత్రాల పరిశోధనలో తాను తల దూర్చటం నించి అవాంచితమయినదేదో జరగనుందని భావించిందామె.
    కన్నులు అశ్రుతప్తాలయినాయి. భయంకరమైన ఆ జ్ఞాపకాలతో ముఖం ఎర్రగా జేవురించింది. పెదవులు తములపు ఆకుల్లా అల్లల్లాడ సాగినాయి. కనుల కాంతి విలుప్తమైపోయింది.
    తాను అడిగిన ప్రశ్నకూ వెంటనే సమాధానం యివ్వలేదు సరికదా -- క్షణక్షణానికి ముఖంలో రంగులు మారుతున్నాయి.
    చివరకు మనో ధైర్యమంతా చెడి ఈ స్థితికి వచ్చిందామే. అలా రావటం గమనించిన ప్రొఫెసర్ శ్రద్దాదేవి ఏదో అనర్ధమే జరిగిందని అనుకుంది.
    "ఎందుకలా బెంబేలు పడిపోతావు. ఏమయిందో చెప్పు. నేను వెళ్ళి పోయాక ఏం జరిగింది" అని అడిగింది లాలనగా ఆమె తల మీద చేయి వేసి నిమురుతూ. పై చెరగుతో పాలిపోయిన చెక్కిళ్ళ మీది కన్నీటి చారికలను అద్దింది. అర్ధ్తతా పూర్ణమయిన లాలింపుతో రవంత ఊరడిల్లింది జ్యోతి.
    "ఆమె ......ఆమె ......శ్వేతకి " అని పూర్తీ గా చెప్పలేక కన్నులు మూసుకుంది. ఆ పేరు వినగానే ఉలిక్కిపడిపోయింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి.
    "శ్వేతకి ......అవును శ్వేతకి . ఏమయింది " అన్నది కంగారుగా.
    "ఆమె వచ్చింది ------' జ్యోతి.
    "శ్వేతకి వచ్చిందా ? ఈజిట్?" అంటూ నిర్ఘాంతపడింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి. రెప్ప వేయటం మరచి జ్యోతి వంకే చూడసాగింది. మరొక స్థితిలో అయితే ఆమె మాటలు నమ్మేందుకు వీలుకానివి.
    కాని తాను వచ్చేసరికి జ్యోతి పడి వున్న స్థితీ, ఆ తరువాత ఆమె ముఖంలో కనిపించే భీతావహమయిన భావాలూ గమనించాక నమ్మకుండా ఉండలేకపోయింది. జ్యోతి అసత్యవచనా లెందుకు వల్లిస్తుంది?
    "అవునమ్మా! శ్వేతకి వచ్చింది. రాకాసి గుహల గురించిన ఆలోచనను విడిచి పెట్టాలని కోరింది. అందుకు నేను నిరాకరించాను. నావంక కోపంగా చూసింది. ఏవో మాటలంది, ఆ తరువాత నాకేమయిందో తెలియదు. నేను పడిపోయాను. ఆమె ఎప్పుడు, ఎలా వెళ్ళిపోయిందో తెలియదు.' అంటూ జరిగిన సంగతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ చెప్పింది జ్యోతి.
    రవంత సేపు నిర్ఘాంతపడిపోయి అలాగే చూస్తూ ఊరుకుంది ప్రొఫెసర్ శ్రద్దాదేవి. ఆమె మనసు కల్లోల సాగారమయిపోయింది.
    శ్వేతకి ఆత్మరూపం రాకాసి గుహలో బంధించిన మాట యాదార్ధమైతే కావచ్చు, అది విముక్తి కోరుతోంది. నిజమే కావచ్చు. దాని శక్తి కిరణాలు జ్యోతి మీద కేంద్రికరించబడినాయన్నది అసత్యం కాకపోవచ్చు.
    కాని ఆ శ్వేతకి ప్రేతాత్మ మానవాకృతి లో యిలా రావటం, బెదిరించడం యదార్ధమే కాగలదా? ఇలా జరగటానికి అవకాశాలున్నాయా అని ఆలోచించసాగిందామె.
    చాలాసేపు భయంకరమయిన నిశ్శబ్ద సాగారాన్ని ఆలోచనా ర=తరంగాల్లో కల్లోలితం కావిస్తూ గడిపిందామే.
    ఆ తరువాత మనసులో ఒక మెరుపు లాంటి ఆలోచన మెదిలింది. దాంతో ఆమె సంవేదనాపూర్ణమూ, సంశయాస్పదమూ అయిన ఆలోచనలకు స్వస్తి పలికింది.
    ముఖం ప్రపుల్లమైంది.
    "జ్యోతి! ఆ తామ్రపత్రాలను ఎక్కడ దాచావు" అని అడిగింది. ఆ ప్రశ్న వింటూనే ఉలిక్కిపడిపోయింది జ్యోతి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS