ఇంకేముంది? వెంకమాంబ ప్రతిభ ఊరూరా పాకింది.
* * *
వెంకమాంబకి పెళ్ళి చేసెయ్యాలి. అప్పుడే ఏడోఏడు వచ్చింది. ఎనిమిదేళ్ళు దాటితే పుట్టగతులుండవు అని సోమయాజి తరచు చెప్పి వెడుతూ ఉంటాడు. చాలా తీవ్రంగా సంబంధాలు చూస్తున్నారు. కాని ఎవరూ ముందుకి రాలేదు. నిజానికి రానియ్యలేదు. గ్రామంలో అడుగు పెట్టకముందే, పొలిమేరల్లోనే పెళ్ళికూతురు పిచ్చిది, వెర్రిబాగులది, గయ్యాళిది, తైతక్కలాడుతుంది అనే వార్తలు పని కట్టుకుని మరీ మోసుకెళ్ళి చెప్పే శ్రేయోభిలాషులున్నారు. చుట్టు పక్కల కొన్ని గ్రామాల వరకు వెంకమాంబ వింత ప్రవర్తన గురించి వ్యాపించి ఉంది.
"ఈ సంబంధం కూడా హుష్ కాకి" ఉస్సురంటూ వీధి అరుగుమీద కూలబడ్డాడు కృష్ణయార్యుడు.
"ఏమన్నారు?" తండ్రి కొడుకు దగ్గరిగా కూర్చున్నాడు.
"పాతపాటే!"
"నచ్చలేదన్నారా?"
"నచ్చపోవటానికి అందం లేదా? గుణం లేదా? వంశ ప్రతిష్ఠ తక్కువా...అన్నీ బాగానే ఉన్నాయికాని, పిచ్చిపిల్లని చేసుకోరుట!"
"అంత మాటన్నారా, నా బంగారు తల్లిని?"
"వీళ్ళింకా నయం ఇంతకు ముందు వాళ్ళకన్నా. దెయ్యం పట్టిందని, కాదు, అసలు దెయ్యమో, పిశాచమో? అని అన్నవాళ్ళుకూడా ఉన్నారుగా!??
"వాళ్ళకేం తెలుసు? నా మనవరాలు మహజ్జాతకురాలు. అయినా, గొప్పగొప్ప వాళ్ళ గురించి అర్ధం కాకపోవటంతో సామాన్యులు అట్లా అనుకోవటం అలవాటే?"
"ఏం గొప్పతనమో, ఏమో? మనకి మాత్రం తిప్పలు. ఊళ్ళోను, బంధువుల్లోను తలెత్తుకుని తిరగలేక పోతున్నా" కృష్ణయార్యుని గొంతులో విసుగు స్పష్టంగా కనపడింది.
ఎప్పుడూ విసుగ్గా మాట్లాడని కొడుకు మాటల్లో విసుగు తండ్రిని కాస్త కలవరపరిచింది. అందులోనూ తన ఎదురుగా...తనతో.... విసుగ్గా మాట్లాట్టమా? తండ్రికి కొడుకు మనో వేదనలోని తీవ్రత అర్ధం అయింది. తాను పెద్దవాడవటంతో ఇంటి పెత్తనం, వ్యవసాయం, ఆలయ నిర్వహణలతో క్షణం తీరిక లేకుండా శ్రమపడిపోతున్నాడు. అలసట మీద మనో నిబ్బరాన్ని, నైతిక బలాన్ని దిగజార్చే చుట్టుపక్కల వాళ్ళ మాటల ప్రభావం అధికంగా ఉంటుంది. అందుకే కొడుకులోని చికాకుని సానుభూతితో అర్ధం చేసుకోగలిగాడు. కన్నతండ్రిగా కొడుకు మనస్సుకి కొంత ఆశ్వాసన ఇవ్వాలనుకున్నాడు.
"ప్రహ్లాదుడి భక్తిని కన్నతండ్రే అర్ధం చేసుకోలేక పోయాడు"
"నేను హిరణ్యకశిపుడిని కాను"
"భక్తిలోని పరాకాష్ట తెలియచెప్పటానికి ప్రహ్లాదుడి పేరు చెప్పానంతే! పసితనంలో విష్ణుదర్శనం పొందిన ధృవుడు లేడూ? మన తల్లి ఆ కోవకి చెందింది."
"వారెంతటి భక్తులైనా, తమ ధర్మాలని పాటించారు. గృహస్థాశ్రమధర్మాన్ని స్వీకరించి పితృదేవతల ఋణం తీర్చుకున్నారు."
"అంతే కదా! ఆ సంగతి నాకొదిలేయ్! అమ్మాయి పెళ్ళి జరిపించే బాధ్యత నాది."
"అవతలివారు ఒప్పుకున్నా, మన అమ్మాయి ఒప్పుకోవద్దూ! ఆరిందాలాగా తనకి పెళ్ళే వద్దని వాదిస్తోంది. చిన్నంతరం, పెద్దంతరం లేకుండా, శాస్త్రాలన్నీ చదివిన వేత్తలాగా మాట్లాడుతోంది. అంతా వితండ వాదం."
కొడుకు చికాకుకి మూలకారణం అర్ధమయ్యింది. తన మాటని కూతురు వినటం లేదే అని. కొడుకు బాధని తగ్గించే పరిష్కారం బోధ పడింది.
"ఏదో చిన్నతనం తెలిసీ తెలియని మాటలు, చేష్టలు నేను మాట్లాడి ఒప్పిస్తానుగా"
"అదిగో! చూడండి! ఊరంతా పెత్తనాలు చేసి, పాటలుపాడి, కుప్పిగంతులు వేసి ఇంటికి వస్తోంది" అన్నాడు కృష్ణయార్యుడు గుమ్మంలోకి అడుగుపెడుతున్న వెంకమాంబను చూసి.
"అలాగే!" అనే తాతగారి మాట పూర్తికాకుండానే లోపలికి వచ్చింది వెంకమాంబ ముఖమంతా ఆనందంతో.
"అమ్మా! ఎక్కడి నుంచి వస్తున్నావు?"
"గుడి నుండి తాతగారూ!"
"ఎందుకమ్మా అట్లా ఎప్పుడూ గుడి అంటూ తిరుగుతావు? ఇంటి పట్టున ఉండచ్చు కదా!'
"అమ్మా నాయనమ్మా చెప్పిన పనులన్నీ చేసి, వాళ్ళకి చెప్పే వెళ్ళాను."
"పెళ్ళీడు కొచ్చిన పిల్లలు అలా తిరక్కూడదు పెళ్ళికాదు."
"గుడికెడితే పెళ్ళికాదా? ఎవరు తాతగారు ఆమాటన్నహిరణ్యాక్ష హిరణ్యకశిపులు?"
"మామూలుగా వెడితే పరవాలేదు నీలాగా అదే పిచ్చిగా వెడితే పిచ్చిదని ఎవరూ పెళ్ళి చేసుకోరు నిన్ను."
"నాకు పెళ్ళేమిటి మళ్ళీ? అదెప్పుడో అయిపోయిందిగా!"
వింటున్న ఇద్దరూ మాన్ప్రడిపోయారు.
"వేంకటాచలపతే నా భర్త" -తిరిగి తనే అంది.
"ఆయన దేవుడు. అట్లా అనకూడదు" తాతగారు సద్ది చెప్పబోయారు.
"ఆయన దేవుడే! సకలలోకైక నాథుడే? నాకూ నాథుడే!"
"నాన్నగారూ! చూచారా?" కృష్ణయ్య ఆదుర్దాగా అడిగాడు.
"నేను మాట్లాడతానుగా! నువ్వూరుకో!" అని కొడుకు పైనుండి చూపును మళ్ళీ మనుమరాలివైపు మరల్చారు.
"ఆయన గుళ్ళో విగ్రహం కదా! ఎట్లా కుదురుతుంది?"
"మనం మాత్రం విగ్రహాలం కాదూ? ఆయన రాతి విగ్రహం మనం రక్తమాంసాలతో చేయబడిన విగ్రహాలం"
"అదే వితండవాదం" కృష్ణయ్య వెంటనే అసంకల్పితంగా అన్నాడు.
"నేను చెప్పింది నిజమే కదా తాతగారూ!"
"కాని, అటువంటి వివాహం లోక విరుద్దంకదా! ప్రకృతి నియమాలను ఉల్లఘించటం అవుతుంది. ఇటువంటి దెప్పుడైనా జరుగుతుందా?"
"గోదాదేవి శ్రీరంగనాథుని వివాహమాడలేదూ? మీరాబాయి కృష్ణుడే తన భర్త అని చెప్పి నిరూపించింది కదా!"
"అటువంటి వాళ్ళు కోటి కోట్లలో ఒకరో ఇద్దరో? అటువంటి దైవాంశ సంభూతులకి, మనకి పోలికా? అయినా మీరాబాయికి లోకధర్మంగా వివాహం అయ్యింది తెలుసుగా! గోదాదేవికి శ్రీరంగనాధుడికి అందరి సమక్షంలో వివాహమయ్యింది, మరి, నీ విషయం అట్లాకాదే!"
