Previous Page Next Page 
రుద్రనేత్ర పేజి 17


    ఆమె ముందు తలుపుతీసి బయటికొచ్చింది. చల్లటిగాలి రివ్వున కొట్టింది. వీధి నిర్మానుష్యంగా వుంది. అయే అడుగు వెయ్యబోతుంటే ఆ మసక వెన్నెల్లో ఒక నీడ ఆమె వెనకనుంచి ముందుకు పాకింది.

 

    భుజం మీద నుంచి చెవి దగ్గరగా సన్నగా "బయటకా  దొరసానీ......" అని వినిపించింది. ప్రతిమ ఒక్క గెంతులో పక్కకి దూకి పిస్టల్  తీసి గురిచూసింది.

 

    ఎదురుగా యాదగిరి.

 

    "నువ్వా......?" అంది తేలిగ్గా ఊపిరి పీలుస్తూ.

 

    ఆమెకి అతడిని చూస్తుంటే 'నిశాచరుడు' అన్న పదానికి సరయిన అర్థం తెలుస్తూంది. సర్దుకుని "అయిదు రూపాయిలిస్తాను. నేనిలా అర్థరాత్రి  బయటకు వెళ్తున్న విషయం ఎవరికీ చెప్పకు" అంది.

 

    "మా దొరసాని అయితే పది రూపాయినిచ్చేది" అన్నాడు బేరం సరిగ్గా సెటిల్ చెయ్యమన్నట్టు.

 

    "షటప్..... నేనెవరో తెలుసా.......? ఇండియన్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ ని. భారతీయుడివైనందుకు మా డిపార్ట్ మెంటు కి సాయపడడం నీ ధర్మం. ఈ విద్యుక్త ధర్మాన్ని........." అంటూ చెప్పుకుపోతున్న ఆమెని మధ్యలో ఆపి "తెనుగులో చెప్పు దొరసాని....... సమ్ జైత లేదు" అన్నాడు.

 

    "ఒక నిగూఢ రహస్యాన్ని లోకానికి వెల్లడి చేయడానికి వెళ్తున్నాను. ఈ విషయం ఎవరికీ చెప్పకు."

 

    "చెప్పను"

 

    "నిజంగా చెప్పకూడదు"

 

    "ఒక్కసారి చెప్పొద్దన్నాక చెప్తానా........? ఇప్పుడు నువ్విట్ట నిల్చున్నావు. నీ కాళ్ళమధ్య నుంచి తొండొకటి పైకి బోయింది. నేనైమైన నీకు చెప్పినాను........?"

 

    వాడి మాటలు పూర్తికాలేదు. మోకాలి మీద నుంచి పైకి ఏదో పాకినట్టయింది. కెవ్వున అరిచి వాడిని కౌగిలించుకుంది. 'అవసరం' వాడి మెడచుట్టూ చేతులు వేయించి గెంతిస్తోంది. వాడు ఆమె చీరని పట్టుకుని చీర కుచ్చిళ్ళు దులిపాడు. ఒక  తొండ రోడ్డుకడ్డంగా పది పరుగెత్తింది.

 

    "ఈ వూళ్ళో తొండలెక్కువా.........?" అని అడిగింది. ఏజెంట్ క్యూనీ, తొండనీ పక్క పక్కన నిలబెడితే, తొండకే ఎక్కువ భయపడుతుందామె. అందుకే ఆ ప్రశ్న అడిగింది.

 

    "అవ్..... సానా......" అన్నాడు.

 

    "నువ్వు నాతోటే వస్తావా?"

 

    "ఎక్కడికి దొరసాని......?"

 

    "దేశంకోసం. రా చెప్తాను" బ్రీఫ్ కేసు చెయ్యి మార్చుకుంటూ అంది.

 

    "దేశంకోసం చచ్చినా  ఫర్లేదన్నావు. తొండని చూసి గిట్ట బేజారవుతున్నావ్...... నీ తన్లి.....పద......"

 

    ఇద్దరూ  దాదాపు  గంట నడిచారు. చెరువొచ్చింది. చెరువుకి అవతలివైపు కోటలాంటి గృహం వుంది. శిథిలమైపోయింది. నీళ్ళు దాన్లోకి కూడా వెళ్ళి వున్నాయి.

 

    ఆమె చాలా సేపు నిలబడింది "ఇక్కడేం లేదుగా.......?" అన్నాడు యాదగిరి ఆమె జవాబు చెప్పలేదు. ఏదో  కృత్రిమత్వం కనపడుతూంది అక్కడ. దూరంగా రోడ్డుమీద, చెరువు వరకూ వచ్చి ఆగిపోయిన టైర్ల గుర్తులు.

 

    "నువ్విటు వెళ్ళి చెరువుని చుట్టిరా. నేనటు వెళ్తాను" వాడిని అక్కణ్ణుంచి దూరంగా పంపించివెయ్యడానికి అంది.

 

    "వెళ్ళి ఏం జెయ్యాలె......?" అని  ఎదురు ప్రశ్న వేశాడు.

 

    "ఏవైనా గుర్తులుగానీ, వస్తువులు గానీ కనపడుతాయేమో చూడు."

 

    "నాకు రేజీకటి. ఏం కనబడవు. నీతోనే వుంటా" దగ్గరికి చేరుతూ అన్నాడు.

 

    ఆమె విసుక్కుంటూ "సరే రా....." అంటూ శిథిలమైన భవంతివైపు నడిచింది. చెరువులో నీళ్ళు భవంతి గోడలను తడుపుతున్నాయి. మరింత  దగ్గరికి వెళ్ళారు. కీచురాళ్ళ శబ్దం మరింత ఎక్కువైంది.

 

    "వద్దు దొరసానీ....... నాకు భయమవుతూంది. పోదాంపద ఎనక్కి"

 

    ఆమె అడుగు  ముందుకేసింది. కాలికి ఒక ట్యూబ్ తగిలింది. రబ్బర్  ట్యూబ్  అది. నీళ్ళలోంచి బయటకు వచ్చింది. ఆమె అనుమానం స్థిరపడింది. ఆమె  ఓరకంట యాదగిరిని చూసింది "వెళ్ళిపోదామంటావా...?"

 

    అతడు తలూపాడు. ఇద్దరూ తిరిగి గ్రామం వైపు నడక సాగించారు. చెట్ల  తోపులోకి వచ్చాక అతనన్నాడు "ఇంకిటేపు రాకండి దొరసాని. ఇక్కడ పాములు. తేళ్ళు ఎక్కువ."

 

    "ఆమె నుంచి సమాధానం రాకపోవడంతో అతడు చుట్టూ చూశాడు.

 

    ఆమె లేదు. అతడు కంగారుపడ్డాడు. "దొరసానీ....." అని పిల్చాడు. జవాబు లేదు. దూరంగా చెరువు వైపు వెళ్తూన్న నీడ  కనిపించింది. "ఆగు దొరసానీ......" అని అరిచాడు.

 

    అప్పటికే ఆలస్యమైంది.

 

    "బ్రీఫ్ కేస్ లోంచి మాస్క్  తీసి మొహానికి అమర్చుకుని నీళ్ళలోకి దూకింది. ఆమె మంచి స్విమ్మరు. ఆ ట్యూబ్ ని పట్టుకుని నీళ్ళ  అడుక్కి వెళ్ళింది. అడుగునంతా నాచు, పిచ్చి మొక్కలు. ఆమె  టార్చిలైటు కాంతిలో చేపలు మెరుస్తూ కనపడుతున్నాయి. ఆమె ట్యూబ్ తో పాటే మరింత దూరం వెళ్ళింది. అకస్మాత్తుగా ఆమె ముందు గోడ ఒకటి కనిపించింది. ఆమె దాన్ని  తడుముతూ నీటి పైకి వచ్చింది పైకి మామూలుగా కనపడుతున్నా ఆ చెరువు లోతే దాదాపు యాభై అడుగు లుంటుంది.

 

    చెరువు అవతలి వైపునున్న శిథిల గృహంలోకి తను వచ్చినట్టు గ్రహించింది. ఆరడుగుల వెడల్పున్న బాట అది. నడుము లోతు వరకు నీళ్ళున్నాయి. ఆమె ఆ బాటలో మరింత దూరం వెళ్ళింది.

 

    అక్కడ కనబడింది ట్రాప్ డోర్.

 

    ఆమె దాన్ని పరిశీలించింది. ఆమె  గుండె వేగంగా కొట్టుకుంటూంది. ఆమె దాన్ని తెరవ బోతుంటే వెనుక చప్పుడైంది. ఆమె వెనక్కు తిరగబోయే లోపులో ఒక వాటర్  యారో ఆమె పక్కనుంచి దూసుకుపోయింది. వాటర్  సూట్ లో వున్న ఇద్దరు వ్యక్తులు ఆమెవైపు వేగంగా వచ్చారు. ఆమె నీటిపైకి రావడానికి ప్రయత్నించింది. ఆమె ప్రయత్నం కొనసాగనివ్వకుండా వెనక్కి లాగారు. వాళ్ళల్లో ఒకడు కత్తితో ఆమెను పొడవడానికి ప్రయత్నించాడు. ఆమె పక్కకి తిరగడంలో భజం చీరుకుపోయి భగ్గున్న మండింది.

 

    ఆమె చాలా జూనియరు. విదేశీ గూఢచారుల వ్యవహారాల్లో గాని, హార్డ్ కోర్ స్మగ్లర్ కేసుల్లో గాని ఆమె  ఇంతవరకూ పనిచేయలేదు. కేవలం రహస్యఫైళ్ళు తయారుచేయడం వరకే ఈ రెండు సంవత్సరాలలో నేర్చుకుంది. సీక్రెట్ సర్వీస్ లో ఆమెకు ట్రైనింగ్ ఇచ్చారు. కానీ 'అండర్ వాటర్' పద్ధతులు ఆమెకు తెలియవు.

 

    ఒక వ్యక్తి ఆమె చేతులు వెనక్కి విరిచి పట్టుకున్నాడు. ఇంకో వ్యక్తి కడుపులో పోడవబోయాడు. ఆమె కళ్ళు మూసుకుని దేవుణ్ణి ప్రార్థించసాగింది. అంతలో అక్కడ నీళ్ళలో చిన్న కలకలం వినిపించింది. ఆమెను పట్టుకున్న చేతులు విడిపోయాయి. ఆమె అప్రయత్నంగా నీటిపైకి వచ్చింది.

 

    అడుగున రెండు తిమింగలాలు దెబ్బలాడుకుంటున్నట్టు కల్లోలం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS