"ఈజిట్?"
"అవును సార్! అతడిని కొద్దిగా సంస్కరించి శత్రువుల్లోకి పంపామంటే వాళ్ళు బెదిరిపోతారు. చచ్చిపోయిన నేత్ర తిరిగివచ్చాడని తెలిస్తే చాలు- వాళ్ళు మానసికంగా బలహినమైపోతారు. నేత్ర పేరు చెప్తే....."
ఆ మాటలు సగంలో ఆపి, చీఫ్ తాపీగా "నేత్ర పేరు చెప్తే శత్రువులు ఏమవుతారో తెలీదు కాని, నీ ఉద్వేగం చూస్తుంటే డిపార్ట్ మెంట్ లో అమ్మాయిలు ఎలా రెచ్చిపోతారో అర్థమవుతూంది. ఇంతకీ ఇప్పుడే మంటావ్?" అన్నాడు.
ప్రతిమ కాస్త నిరాశ చెందినా, వెంటనే సర్దుకుని "ఆ తెలంగాణా జీతగాడిని సంస్కరించి చదువు నేర్పి, కోటు సూటు వేసి నేత్రగా తయారు చేస్తాను."
"దానికెంత కాలం పడుతుందో తెలుసా?"
"అడవిదొంగ సినిమాలో ఒక పాటలో చిరంజీవి చదువంతా నేర్చుకోలేదా సార్? కాళిదాసు ఒక్క స్పర్శతో కవి అయిపోలేదా సార్?"
"నిన్నక్కడికి పంపింది కేసు పరిశోధించమని. అంతే తప్ప పాటలు పాడుతూ మనుష్యుల్ని మార్చడానికి కాదు. నేత్రమీద నీకు మనసుంటే, అతడు పోయాడు కాబట్టి, ఆ పోలికలున్న మనిషిని ఓ పది సంవత్సరాలు కష్టపడి తీర్చి దిద్దుకుంటే నాకభ్యంతరం లేదు. ఇలాంటి ఫోన్లు మాత్రం చెయ్యకు" అంటూ ఫోన్ పెట్టేశాడు.
ప్రతిమ కూడా నిరుత్సాహంగా ఫోన్ పెట్టేసింది. ఇంటికి వెళ్ళే వరకు ఈ విషయమే ఆలోచించింది. ఇంటికొచ్చాక తన పరిశోధన ప్రారంభించింది. మధ్యాహ్నం ఒంటిగంటకి భోజనం చేసి అందరూ నిద్రపోయారు. రెడ్డినాయుడి కొడుకు ఎక్కడో గోళీలాడుకోవడానికి వెళ్ళాడు. దూరంగా కాకి అరుపు తప్ప అంతా నిశ్శబ్దంగా వుంది. యాదగిరి నుంచి కూపీ లాగేందుకు యిదే మంచి సమయం.
ముందు గదిలో స్తంభానికి అనుకుని తాదాత్మ్యంగా చుట్ట కాలుస్తున్నాడు యాదగిరి. "స్.....స్..." అని సన్నటి స్వరంతో పిలిచింది. యాదగిరి కళ్ళు విప్పగానే, తన గదిలోకి రమ్మనట్టు సైగ చేసింది.
వాడు ఆమె గదిలోకి ప్రవేశించాడు. ఆమె మంచం మీద కూర్చుంది. నాందిగా ఒక చక్కటి నవ్వు నవ్వింది. అతడు అయోమయంగా చూసి "ఊహు..... నేనట్టాటోడ్ని కాదు దొరసానీ......" అన్నాడు. ఆమె అర్థం కానట్టు చూసింది. వాడు ఇబ్బందిగా "ఇట్టాటి పన్లు నాకు నచ్చవు" అన్నాడు.
లాగి పెట్టి కొట్టినట్టయింది. సర్దుకోవడానికి అయిదు నిమిషాలు పట్టింది. ఏడవలేక నవ్వుతూ "అది కాదు యాదగిరీ...... నిన్ను కొన్ని ప్రశ్నలడుగుతాను. అలా కూర్చుని సమాధానాలు చెప్పు."
"పని నేకుండా యిట్ట కూకుంటే పెద్ద దొర తనఖా ఇయ్యడు."
"ఫర్వాలేదు. ....... నా దగ్గర వున్నానంటే ఏమీ అనడు" అంది సర్ది చెపుతున్నట్టు.
"పెయ్యి (ఒళ్లు) నొక్కేదా దొరసానీ? గట్ట పనిచేస్తూంటే ఏం అనడు దొర."
ఆమె కుంచించుకుపోయి "వద్దొద్దు........" అంది.
"అయితే పొయొస్త, దొర చూస్తె ఏందా కబుర్లంటడు."
"వద్దు కూర్చో..... యిలా వేళ్ళు నొక్కు" అని చెయ్యి అందించింది. ఆమెకు దేశం గుర్తుకువచ్చింది. దేశంకోసం ప్రాణాలర్పించిన వీరులున్న ఈ దేశంలో ఒక దేశ ద్రోహిని పట్టుకోవడానికి వేళ్ళు నొక్కించుకుంటే తప్పేమిటి అనుకుంది. ఒకసారి చరిత్రాత్మకమైన ఆ నిర్ణయానికి వచ్చాక ఇక తను నారాయణ్ పేట్ వచ్చిన పనికోసం కూపీ లాగడం మొదలుపెట్టింది. అయితే డైరెక్ట్ గా విషయానికి రాలేదు.
"నీకు సూటు బూటు వేసుకోవడం యిష్టమేనా?" అంటూ సంభాషణ మొదలు పెట్టింది.
"సూటా? అంటే ఎట్టగుంటది?"
"సిన్మాల్లో చూస్తావ్ చూడు అలా."
"ఎందుకు దొరసానీ సూటు నాకు?"
"నీకు చదువు కూడా నేర్పుతాను."
"వొద్దునే దొరసాని...... నాకిట్ట నొక్కేదే బావుంది" కళ్ళు అరమోడ్పులు చేసి అన్నాడు.
అందులో ద్వంద్వార్థం ఏదైనా వుందేమో అని వాడివైపు అనుమానంగా చూసి, 'ఇప్పుడు లాభం లేదు. రేపు ప్రయత్నించాలి' అనుకుని మాట మార్చి-
"ఈ వూరికి ఈ మధ్య జీపులు, కార్లు ఎక్కువ వస్తున్నాయి కదూ" అడిగింది.
"కార్లూ- సీబునా?" అవి వాడు తలగోక్కుని "కార్లంటే తెలుసు. సీపునంటే? ఈ రెంటికీ తేడా ఏటి?" అని అడిగాడు.
ఆమెకు ఎలా చెప్పాలో అర్థంకాలేదు.
అంతలో వాడే- "ముందు పొడుగ్గా వుండేవి కార్లు. ఎనక ఎత్తుగా వుండేవి సీపును. అంతేగా దొరసాని" అన్నాడు.
వాడి మాటలో ద్వంద్వార్థం ఏదైనా వుందా? వాడు అతి తెలివితో మాట్లాడుతున్నాడా అని చూసి, అటువంటిదేమీ లేదని తెలుసుకున్నాక అవునన్నట్టు తలూపింది.
"అటువంటివి రానేదే ఈ వూరు!" అన్నాడు.
"నువ్వు చూసుండవు."
"ఏమో మల్ల నాకు తెల్వదు" అన్నాడు.
ఆమె ప్రశ్న మారుస్తూ "సర్పభూషణరావు అనే ఆయన ఈ వూళ్ళో సగం స్థలం కొనేశాడటగా. నిజమేనా?" అని అడిగింది.
"ఓ ఆయానా...... ఊళ్ళో ఏడ కొన్నడు? చెర్లో కొన్నడు."
ఆమె ఆశ్చర్యంగా "చెరువులోనా?" అని అడిగింది మళ్ళీ.
"అవ్..... దాన్ని పూడ్పించి స్తనాన్లు చేసి అమ్ముతాడంట."
ఉన్నట్టుండి ఆమె కెవ్వున అరిచింది.
"ఏమైంది? ఏమైంది దొరసాని?" కంగారుగా అడిగాడు.
ఆమె అరిచింది వాడికి "ల" అన్న అక్షరం పలకడం రానందుకు కాదు "వేలు..... నావేలు గట్టిగా నొక్కినట్లున్నావు. విరిగిపోయింది" అంది బాధగా.
"మా దొరసాని అయితే ఇంకా గట్టిగావొత్తమంటది" అన్నాడు వాడు కార్యదీక్షాపరాయణుడిలా.
"చాల్లే యిక పొ" అంది విసుగ్గా.
* * *
రాత్రి పన్నెండింటికి ప్రతిమ లేచింది. పెట్లోంచి పిస్టల్ తీసి జాకెట్ లో పెట్టుకుంది. 'ఓ ఆయనా.... వూర్లో ఏడకొన్నాడు? చెర్లో కొన్నడు. దాన్ని పూడ్పించి స్తలాలు చేసి అమ్ముతాడంట' అన్న యాదగిరి మాటలు ఆమెకు గుర్తొస్తున్నాయి. సర్పభూషణరావు లాటివాడు ఇంత చిన్నస్థలాల వ్యాపారం ఎందుకు చేస్తాడు? చేసినా స్వయంగా ఇన్నిసార్లు ఎందుకు వస్తాడు?
ఈ రాత్రే ఆ విషయం తేల్చెయ్యాలనుకుంది.
బ్రీఫ్ కేసుతో ఆమె గదిలోంచి బయటి కొచ్చింది. పురాతనమైన తెలంగాణా టైపు చావిడి నిర్మానుష్యంగా వుంది. దూరంనుంచి రెడ్డినాయుడి గురక వినిపిస్తూంది.
