క్షణం తరువాత యాదగిరి పైకి తేలాడు. వాడితోపాటు ఒక రక్త సిక్తమైన శరీరం పైకి వచ్చింది. చుట్టూరక్తం కలిసిన నీళ్ళు, పక్కనే శవం. అన్నీ చూసి ఆమె బేజారైంది. ఇంతలో దూరంగా జీపు వస్తున్న చప్పుడు వినిపించింది రెండో మనిషి ఏమయ్యాడో తెలీదు.
చప్పున అతడామె చెయ్యి పట్టుకుని నీటిలోకి తీసుకెళ్ళాడు. ఆమె చూసిన రబ్బరు ట్యూబ్ ఆ శిథిలమైన గోడల నుంచి లోపలకు వెళ్ళింది నీళ్ళలోనే వాళ్ళిద్దరూ గోడమలుపు తిరిగారు. అక్కడి దృశ్యం చూసి ఆమె స్థాణువైంది. అద్దం అవతల ప్రయోగశాల వుంది. నీళ్ళల్లో, పైకి శిథిలమై కనిపించే ఆ కోట అడుగు భాగం అది.
ఆమె తల తిప్పి పక్కకు చూసింది. యాదగిరి జేబులోంచి కటింగ్ ప్లేయర్ లాంటి పనిముట్టు తీశాడు. ఆ రబ్బర్ ట్యూబ్ ని కరెంట్ వైరుగా గుర్తించింది.
ఆమెను అక్కడే నీటిలో వుండమన్నట్టు సైగచేసి అతను ట్రాప్ డోర్ గుండా లోపలికి వెళ్ళాడు.
ఊహించని విధంగా ట్రాప్ డోర్ లోంచి లోపలకు వచ్చిన వ్యక్తిని చూసి, లోపలి వాళ్ళు అరవబోయారు. యాదగిరి వారి మెడమీద కొట్టిన చిన్న దెబ్బతో స్పృహ తప్పారు. ప్రతిమ తన కళ్ళను తాను నమ్మలేకపోయింది. పవోలిన్ కిక్ అది. ఎంతో శిక్షణ పొందితే కాని అది రాదు.
ఈ లోపులో అతను వెతికి, తనకి కావల్సిన కెమికల్స్ తీసుకున్నాడు. రెండు నిమిషాల్లో మిశ్రమంగా తయారుచేశాడు. రబ్బరు ట్యూబు విడగొట్టి, షార్ట్ సర్క్యూట్ చేసి, వేగంగా బయటకొచ్చాడు. ఆమె ఇంకా లోపలికి చూస్తూనే వుంది. ఆమె చెయ్యి పట్టుకుని దూరంగా తీసుకెళ్ళాడు. చెరువు అవతలికి వెళ్లడానికి అర నిమిషం పట్టింది. ఇద్దరూ నీటిలోంచి పైకి వచ్చారు.
మొహానికి వున్న మాస్క్ తీయగానే ఆమె అడిగిన మొదటి ప్రశ్న "ఎవరు నువ్వు.......?"
అతడు జవాబు చెప్పకుండా దూరంగా వున్న శిథిలాలవైపు చూడసాగాడు. ఈ లోపులో అటునుంచి జీపు వచ్చి అక్కడ ఆగింది. అందులో నుంచి యస్బీయార్ దిగాడు. చీకట్లోవున్న యాదగిరి, ప్రతిమ- దూరంగా జీపులోంచి దిగిన వాళ్ళకి కనబడడం లేదు యస్బీఆర్ రెండు అడుగులు వేయగానే శవం కాలికి తగిలింది. అదిరిపడ్డాడు. సగం నీళ్ళలోనూ, సగం ఒడ్డునా వున్న ఆ శవాన్ని చూసి అతడు ఏదో అంటున్నాడు. అరుస్తున్నాడు. అంతా హడావిడి, కంగారు, జనం అటూ ఇటూ పరుగెడుతున్నారు.
అప్పుడు జరిగింది విస్ఫోటనం.
ఆ చెరువులో వున్న నీళ్ళన్నీ కదిలిపోయేలా, శిథిలాలు ఎగిరిపోయేలా ప్రేలుడు సంభవించింది. క్షణం సేపు నీటి అడుగు నుంచి మంటలు బయటికొచ్చాయి. ఆ శబ్దం నారాయణపేట వరకు కూడా వినిపించి వుంటుంది. ఆ వెలుగులో ఆ ఆకస్మిక సంఘటనకు భూషణరావు దిగ్భ్రమ చెందడం స్పష్టంగా కనిపించింది. జీపులోంచి దిగి మనుష్యులు పరుగెడుతున్నారు. ఇటే వస్తున్నారు. చెరువుకి అవతలి వైపున ఆకారాల్ని చూసి కాల్పులు మొదలుపెట్టారు. "పరుగెత్తు.... రన్..... క్విక్......" అన్నాడు ఆమెతో.
ఆమె కదల్లేదు. జీపు వాళ్ళవైపు బయలు దేరింది.
"యూ బ్లడీ...... వాళ్ళొచ్చేస్తున్నారు....... పరుగెత్తు..."
"ఎవర్నువ్వు.....? అది చెప్తేగాని కదలను" ఆమె మొండిగా కదలకుండా అంది.
"నేత్ర..... ఏజెంట్ నేత్ర........" అన్నాడు ఆమె చెయ్యి పట్టుకుని లాక్కెళ్తూ.
* * *
"ఈ రాత్రికి మనం ఈ అడవిలోనే తలదాచుకోవాలి. వాళ్ళు ఇంకా వెతుకుతూనే వుంటారు."
"నా ముందున్నది నేత్ర అని నా కళ్ళను నేనింకా నమ్మలేక పోతున్నాను. శ్మశానంలో బూడిదయిన నేత్ర బ్రతికి ఎలా వచ్చాడు........?"
"అది హోడినీట్రిక్." అతడు ఆ రాత్రి కోసం చెట్టుకొమ్మల మీద- ఫారెస్ట్ బెడ్ ఏర్పాటు చేస్తూ అన్నాడు. ఇక రెడ్డినాయుడు ఇంటికి వెళ్లడం ప్రమాదకరం.
"ఎందుకీ నాటకం.....?" అడిగింది.
అతడు కూర్చుని చెప్పడం ప్రారంభించాడు.
"దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఏదో జరుగుతూంది. లేకపోతే ఏజెంట్ క్యూ ఇంతకాలం ఇండియాలో మకాం వెయ్యడు. సర్పభూషణరావు తోటలో మొదట ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. దానికి ఏకైక సాక్షిని నేను. అక్కడే ఏజెంట్ క్యూని చూశాను. అతడిని చూడగానే ఇది చిన్న విషయం కాదని తెలిసిపోయింది. దాంతో నేను చని పోయినట్టు నాటకం ఆడాను. నేను పోవడంతో ఇక ఈ విషయం తెలిసినవాళ్ళు ఎవరూ లేరు కదా అన్న ధైర్యంతో వాళ్ళు తమ కార్య కలాపాలూ కొనసాగించారు. అయితే అక్కడ ఆ తోట ప్రమాదకరం అనుకున్నారు. మకాం మార్చేశారు. ఎక్కడన్నది తేలలేదు. అందుకని నేను రహస్యంగా పరిశోధన సాగించాను. సర్పభూషణరావు చాలాసార్లు నారాయణపేట వచ్చాడు. అందుకని నేనూ ఇక్కడకొచ్చి ప్రెసిడెంట్ దగ్గర నౌకరుగా చేరాను. ఆర్నెల్లు ఓర్పుతో వున్నాను. ఇక్కడ చెరువులోంచి భూషణరావు ఫిష్ ఎక్స్ పోర్ట్ చేసే మిష మీద ప్రయోగశాల నడుపుతున్నాడని తెలిసింది. కానీ దాన్ని పట్టుకుంటే ఏం లాభం..... అతని తప్పేం వుండదు. అతన్ని లీగల్ గా ఏమీ చెయ్యలేం. అందువల్ల వాళ్ళ పరిశోధనలు పూర్తి అయ్యేవరకు వేచి వుండాలి అనుకున్నాము. మన సీక్రెట్ ఏజెంట్ ఒకరు వాళ్ళలో చేరి వున్నాడు. వలవేసి సిద్దంగా వున్నాం. ఎప్పటికప్పుడు తనకి తెలిసిన వివరాలు మన ఏజెంట్ చెప్తున్నాడు. కానీ ఈ లోపున నువ్వు వచ్చావు. వాళ్ళ రహస్యం మనకి తెలిసినట్టు వాళ్ళు కనుక్కున్నారు. నీ వల్ల మొత్తం ప్లానంతా పాడయింది. నిన్ను నారాయణ్ పేట నుంచి వెనక్కి పంపిద్దామకున్నాను. నాక్కూడా తెలియకుండా నీళ్ళలో దూకావ్. ఇక తప్పని పరిస్థితుల్లో ఆ లాబ్ ని పేల్చేయ్యవలసి వస్తుంది. సర్పభూషణరావుకి ఇది తప్పకుండా సి.బి.ఐ. పనే అని అనుమానం వస్తుంది. ఈసారి మళ్ళీ అతడేం చేస్తాడో వేచి చూడాలి. ఒక్క వాక్యంలో చెప్పాలంటే మళ్ళీ అంతా మొదటి కొచ్చింది" అంటూ పూర్తిచేశాడు. అప్పటివరకు వింటున్నదల్లా, అతడు చెప్పడం ముగించగానే వున్నట్టుండి ఏడవడం ప్రారంభించింది. నేత్ర కంగారుగా "ఏమిటి-? ఏమైంది- ఏమైనా కుట్టిందా....." అని అడిగాడు.
"నేను సీక్రెట్ ఏజెంట్ గా పనికిరాను. మీరింత కష్టపడి చేసింది నేను నా మూర్ఖత్వంతో పాడుచేశాను. రేపు మన చీఫ్ కి నేను ఎలా జవాబు చెప్పగలను....?" అందామె ఏడుస్తూ.
"ఏదో ఒకటి నేనే చెప్తాలే. తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేయవలసి వచ్చిందంటే బహుశా నిన్నేమీ అనకపోవచ్చు."
ఆమె కృతజ్ఞత నిండిన కంఠంతో "థాంక్యూ" అంది కాస్త తేరుకుని.
"ఇక పడుకో..... నేను కాపలా వుంటాను" అన్నాడు.
ఆమె మనసు తేలికయింది. వెల్లికిలా పడుకుని ఆకాశంకేసి చూస్తూ గట్టిగా "కల నిజమాయెగా కోరిక తీరెగా" అని పాడడం ప్రారంభించింది. అతడు అదిరిపడి లేచి "నీకేమైనా పిచ్చి ఎక్కిందా?" అని అడిగాడు.
ఆమె బిక్క మొహం వేసి "రాత్రి నిద్రపోయే ముందు కొంచెంసేపు అలా గొంతెత్తి గట్టిగా పాడడం అలవాటు. లేకపోతే నిద్ర రాదు. మా నాయనమ్మ కూడా తిడుతుంది" అంది.
