Previous Page Next Page 
ప్రార్థన పేజి 16


    అనస్తటీస్టు అతడిపక్కగా వచ్చి "హావ్ యూ గాట్ ఎనీ ప్రోబ్లమ్ సర్" అని అడిగాడు.

 

    పాప మీదనుంచి కళ్ళు తిప్పకుండా అడిగాడు రాబర్టుసన్. "హౌ ఈజ్ బీ.పీ.?"

 

    అనస్తటీస్టు తన పరికరాలవైపు చూసుకుని "ఇట్స్ ఓ.కే." అన్నాడు. అంటూ పాపవైపు తిరిగి, "మైగాడ్" అన్నాడు. "బ్లడ్ ఈజ్ వూజింగ్" పాప నోరు రక్తసిరక్తమై వుంది. నాలుక తెగిన కండరంలా ఎర్రటి చిక్కదనంతో కనపడుతూంది.

 

    రాబర్టుసన్ మళ్ళీ సక్కరు ఉపయోగించి పొరపాటున ఏదైనా రక్తనాళం తెగిపోయిందా అని పరీక్ష చేశాడు. అయితే అటువంటిదేమీ లేదు. గాయం చిన్నదిగానే వుంది కానీ స్రావం ఆగటంలేదు. ఈసారి దూదితో గాయాన్ని మరింత గట్టిగా నొక్కిపట్టాడు. ఆ బలానికి పాప గొంతు నొక్కు పడిపోతుందా అనిపించేలా వుంది. ఐదు నిముషాలు అలాగే వత్తి పట్టుకుని గడియారం వంక చూసేడు.

 

    ఏడున్నర!

 

    మైగాడ్ అనుకున్నాడు. విమానం తొమ్మిదింటికి. అదికాదు అతడు ఆలోచిస్తున్నది- ఆపరేషను ప్రారంభించి అప్పుడే గంట కావస్తుంది.

 

    అలా నొక్కి పట్టుకునే అతడు పాపవైపు చూసేడు. అకస్మాత్తుగా అతడి చెవుల్లో ఒక ధ్వని వినిపించింది.

 

    దదితై ... దితై... దత్తరి దత్త తాహా తద్దిగిడ్ తై దితై దత్తరి దత్తతాహం....

 

    రెండు కాళ్ళు తన కర్ణపుటాలమీద నేరుగా నృత్యం చేస్తున్నట్టు- క్రితం రాత్రి భార్గవ సన్నటి స్వరంతో తనకి ఇచ్చిన వివరణ గుర్తొచ్చింది. "మా పురాణాల్లో రాక్షసులు వుంటారు. వారిని- సంహరించడానికి దేముడు చేసే ప్రళయతాండవం ఇది. దిదితై... దితై" కూతురి నృత్యాన్ని వివరించాడు.

 

    అతడెన్నో ఆపరేషన్లు చేసేడు. ఇంతకన్నా ఎక్కువ ప్రమాదకరమైన స్థితుల్లో పడ్డాడు. కానీ ఈ స్థితి వేరు. పాప లేతదనం, పాప ముగ్ధత్వం, పాప నృత్యం అన్నీ గుర్తొస్తున్నాయి. తాను అనవసరంగా- తన అహాన్ని సంతృప్తి పరచుకోవటానికి ఈ ఆపరేషన్ చేస్తానన్నాడా? ఇండియన్ డాక్టర్ల ముందు తన గొప్పతనం. నిరూపించుకోవాలన్న సాడిజం తన మనసులో ఏ మూలో రవ్వంత వుందా? ఆ పాపంవల్లే తననీ రోజు ఇలా దేముడు శిక్షించబోతున్నాడా? నో... దానికీ పాప బలికాకూడదు.

 

    అతడికి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది. పాప గొంతు దగ్గర గాయాన్ని బలంగా దూదితో నొక్కిపట్టి వుంచిన చేతులు కంపిస్తున్నాయి. బేసిన్ వేపు చూసేడు. బేసిన్ నిండా దూది రక్తంతో తడిసి ముద్దలు ముద్దలుగా పడివుంది. ఈ ఉదయం పాప శరీరం నుంచి యీ విధంగా రక్తమంతా తోడెయ్యటానికే నేనిక్కడ నిర్దేశింపబడ్డానా అనుకున్నాడు.

 

    అయిదు నిముషాలు అయింది. అతడు దూది తొలగించి గాయం వేపు చూసేడు. గాయం తెల్లగా వుంది. సంతృప్తిగా అమ్మయ్య అనుకోబోయేడు. అంతలో తెలుపు నెమ్మదిగా ఎర్రబడటం ప్రారంభించింది. పుట్టలోంచి చీమలు నెమ్మదిగా బైటకొచ్చినట్టూ ఆ ఎర్రదనం నలువైపులకు వడివడిగా పాకిపోయింది. అతడి మొహం పాలిపోయింది. ఒక చెమటచుక్క జుట్టులోంచి నుదుటిమీదకు జారి ధారాపాతమయింది. జీవితంలో మొట్టమొదటిసారి అయ్యాడతడు -

 

    పానిక్!

 

                                          *    *    *

 

    "అబ్బ, వళ్ళంతా నొప్పులే బాబూ" అంది ఆమె. అప్పుడు టైము పావుతక్కువ ఎనిమిదయింది. పక్కమీద పడుకున్న అతడు పక్కకి తిరిగి ఆమె వేపు చూసి నవ్వేడు. అతడు మెడికల్ కాలేజీ స్టూడెంటు. వైద్యం అయిదో సంవత్సరం, అయిదు సంవత్సరాల్నుంచీ చదువుతున్నాడు.

 

    "అప్పుడే లేచావేం" అని అడిగాడు.

 

    "తొమ్మిదింటికి ఆస్పత్రికి వెళ్ళాలి".

 

    "ఆఁ బోరు-మానేద్దూ".

 

    "బోరే. ఏముంది ఎప్పుడు చూసినా బ్లడ్ టెస్టూ... యూరిన్ టెస్టూ. ఆ ఉద్యోగం అంటేనే బోరుకొడుతుంది".

 

    "పోనీ లాబ్ నుండి జనరల్ కి మార్పించుకోరాదూ-"

 

    "అది మరీ బోరు బాబూ. డాక్టర్లతోపాటూ పేషెంట్ల సరసాలు కూడా భరించాలి".

 

    "అవును. ఇక్కడయితే స్టూడెంటు కుర్రాళ్ళ కంటికి ఎప్పుడూ ఫ్రెష్ గా కనిపిస్తూ వుండవచ్చు. టెస్ట్ లు ముఖ్యం. టెస్టులదేముంది- మీరేం వ్రాసిస్తే అది వేదం. అందులో ఈ మధ్య టెక్నీషియన్స్ కూడా మీ మీదే అంతా వదిలిపెట్టి రెస్ట్ తీసుకుంటున్నారుగా, ఇక మీదే రాజ్యం".

 

    "ఏం రాజ్యమో, రాత్రంతా నిద్రలేకుండా చేసేవు. ఇప్పుడు వెళ్ళి ఆస్పత్రిలో ఏం పని చెయ్యను? యూరిన్ రిపోర్టులో ఈజ్నోఫిలిస్ అని వ్రాసినా ఆశ్చర్యపోనక్కరలేదు" బ్రా తొడుక్కుంటూ అంది.

 

    ప్రజల్ని పరిరక్షించాల్సిన పవిత్రమైన వైద్యరంగాన్ని ఇంత తేలిగ్గా తీసుకునే వీళ్ళకోసమా నేను ఉదయిస్తున్నది అనుకున్న సూర్యుడు మేఘాల చాటుకి తప్పుకున్నాడు. మినుక్కు మినుక్కు మంటూ ఆరిపోతున్న దీపాన్ని అరచేతులు అడ్డుపెట్టయినా రక్షించటానికి అహర్నిశలూ పోరాడే రాబర్టుసన్ లాంటి డాక్టర్లు ఇంకా చాలామంది వున్నందుకే ఈ వృత్తికి గౌరవం వుంటుంది. వాళ్ళకోసమే సూర్యుడు ఉదయిస్తాడు.

 

    ప్రాణం వేరే సంగతి. దాన్ని వుంచేదీ, తీసుకునేదీ, నిర్ణయించేది డాక్టర్లు కాదు.

 

                                                               *    *    *

 

    "ఒకసారి కేస్ షీట్ ఇవ్వండి" అని డాక్టర్ అడగ్గానే సిస్టర్ దాన్ని అందించింది.

 

    ప్రార్థన తాలూకు కేస్ షీట్ వెంట రాబర్టుసన్ కళ్ళు పరుగెడుతున్నాయి. ఆపరేషన్ మధ్యలో కేస్ షీట్ స్టడీ చెయ్యవలసి రావటం చాలా దురదృష్టకరమైన విషయం. అయినా తప్పదు.

 

    బ్లడ్ క్లాటింగ్ టైమ్.

 

    బ్లడ్ బ్లీడింగ్ టైమ్, రక్తం గడ్డకట్టే టైమ్ .. అంతా సరిగ్గానే వుంది. మరెక్కడ తప్పు?

 

    ఆఖరిసారి ప్రయత్నిద్దామని, డాక్టర్ తిరిగి గాయం మీదనుంచి కాటన్ తీశాడు. మళ్ళీ బుసబుసా రక్తం!

 

    ఈ లోపులో అనస్తటీస్టు కంగారుగా అరిచేడు. "ప్రెస్ ఇట్!! ప్రెస్ ఇట్!!!" రాబర్టుసన్ ఒక్కసారిగా షాకై వెంటనే తిరిగి వత్తేడు. అనస్తటీస్టు ఆందోళనగా "బి.పి. ఈజ్ డ్రాపింగ్. బి.పి. పడిపోతూంది" అన్నాడు. హాలంతా ఒక రకమైన ఉద్వేగం నిండుకుంది.

 

    అందరికళ్ళూ పరికరంవైపు తిరిగినయ్.

 

    తొంభై నాలుగు.... ఎనభై ఎనిమిది.... ఎనభై మూడు.. డెబ్భై తొమ్మిది...

 

    అనస్తటీస్టు పేషెంట్ శరీరంలోకి మరింత వేగంగా సెలైన్ వెళ్ళే ఏర్పాటు చేశాడు. అయినా లాభం లేకపోయింది. 'మైగాడ్' అనుకున్నాడు మనసులో.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS