వెంగమాంబ శవం ఏదీ? ఏమైనట్లు? కనీసం బూడిద కూడా లేదు. అర్చకులలో ఆందోళన మొదలైంది. అదేమిటి? వెంగమాంబను కదలకుండా చేసి, చుట్టూ గోడ కట్టించింది తామేగా?! మరి వెంగమాంబ ఎక్కడ? ఒకవేళ వెంగమాంబ మామమైందా? భగవంతుని సాన్నిధ్యం చేరుకుందా? ఒకవేళ దయ్యమై గ్రామ ప్రజలకు పీక్కుతింటుందా?!
ఒక్కసారిగా గ్రామ ప్రజలు అర్చకులపై పోట్లాటకు దిగారు. అర్చకులంతా గుళ్ళో అర్చకత్వం వదిలేయాలన్నారు. మహాభక్తురాలిని అవమానించిన మీకు పాపం చుట్టుకుంటుందన్నారు. కానీ, వెంగమాంబ ఏమైందన్న సంగతి ఎవరికీ తెలియదు.
బిలం ద్వారా బయటపడి వెంకటచలారణ్యానికి చేరిన వెంగమాంబకు దుఃఖం కలుగలేదు. అలా భగవంతుని తలచుకుంటూనే ముందుకు నడవ సాగింది. అలా ఆమె ఆ దుర్గమారణ్యంలో భయంకరమైన కోనవద్దనున్న శ్రీ ఆంజనేయస్వామి పాదాల చెంతకు చేరింది. అక్కడ్నుంచి ఆమెకు అడుగు ముందుకు పడలేరు. శరీరం సోమ్మసిల్లింది. స్వామి పాదాల చెంతనే మేను వాల్చింది. అలా మొగిలిపెంట అనబడే ఆ ప్రాంతం వెంగమాంబకు ఆవాసమై పోయింది.
ఆంజనేయుని పాదాల వద్ద కూర్చుని తన దైవమైన శ్రీనివాస పరబ్రహ్మాన్ని గురించి తపస్సు చేయనారంభించింది వెంగమాంబ. ఎండావానలకు అతీతంగా ఆమె తపస్సును కొనసాగించింది. వెంగమాంబ తపస్సు గురించి ఆ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో వ్యాపించడంతో, జనం వెంగమాంబను చూసేందుకు తండోపతండాలుగా వస్తున్నారు. ఆమె నిశ్చల తపస్సును చూసి జనం అబ్బురపడుతున్నారు. అలా నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. వెంగమాంబ దీక్ష తగ్గలేదు. ఆమె ఆంజనేయస్వామిపై కూడా కీర్తనలు రచించిపాడసాగింది. భక్తజనులు ఆమెతో శృతి కలపడంతో ఆ అరణ్యప్రాంతమంతా సందడి!! భక్తి పారవశ్యంతో వెంగమాంబ స్పృహ తప్పి పడిపోగా, దగ్గరున్న భక్తులు సేదతీర్చారు. నీళ్ళు పట్టి హారతినిచ్చారు. ఆ భక్తురాలిని శ్రీనివాసుని కోవెలకు చేర్చాలని నిశ్చయించారు.
అప్పటికే వెంగమాంబ భక్తి ప్రపత్తులు తిరుపతి వరకు వ్యాపించాయి. భక్తులామెను శ్రీనివాసుని కోవెలకు చేర్చగానే, అక్కడి అర్చకులు ఆమెను దర్శించుకున్నారు. ఆమెకు వసతి సౌకర్యాలు కల్పించాలని నిశ్చయించారు. తూర్పు మాడ వీథి చివరనున్న రాతి రథం కుడి పార్శ్వాన ఓ పూరిల్లునిచ్చి ఆమెను గౌరవించారు. వెంగమాంబ మనసు పరిపరి విధాలుగా పోతోంది. తను ఈ పూరింట్లో ఉంటూ, స్వామిని సేవించుకుంటే చాలదా? తన జన్మ ధన్యం కాదా?! అనుకుంటూ, ఆ పూరింటినే వైకుంఠంలా భావిస్తూ భగవద్ధ్యానంలో మునిగిపోతోంది. శ్రీనివాసుని పాకశాల నుండి వెంకమ్మకు భోజనార్థమై వస్తువులు పంపించబడ్డాయి. వకుళమాలికాదేవి వెంగమాంబను ప్రేమానురాగాలతో చూస్తోంది.
వెంగమాంబ తనకు దగ్గర్లో ఓ బృందావనాన్ని ఏర్పరచుకుంది. శ్రీ మన్నారాయణుని సేవ చేసుకుంటూ, తులసిమాలలు అల్లి స్వామికి అర్పిస్తోంది. కానీ తులసివనానికి నీళ్ళు కావాలిగా?! అందుకోసం ఓ దిగుడు బావిని తవ్వించాలనుకుంది వెంగమాంబ. పనివాళ్ళు ఎంత తవ్వినా నీళ్ళు రాకపోగా, ఒకపెద్ద బండరాయి అడ్డం పడింది. ఆ విషయం తెలుసుకున్న వెంగమాంబ, ఆ గుంటలో దిగి పరమేశ్వరుని ప్రార్థించింది. మోహన రాగంలో ఆమె పాడిన భక్తి కీర్తన దిక్కులంతా ప్రతిధ్వనించగా, సురగంగ పొంగి ప్రవహించింది.
జనం విస్తుబోయారు. దివి నుంచి గంగను భువికి రప్పించిన మరో అపర భాగీరథీ అంటూ కొనియాడారు. "ఆహా! ఈ తిరుమల గిరి మహాత్మ్యం. ఈ భక్తురాలి వలన కొలనులు, చెరువులు, బావులు, తటాకాలాన్నీ నీళ్ళతో నిండిపోయాయి." అంటూ జనం చెప్పుకోవడాన్ని వెంగమాంబ మౌనంగా ఆలకిస్తోంది. వెంగమాంబ స్వామిని పూజిస్తూ, భక్తి కావ్యరచనకు ఉపక్రమించింది. ముందుగా 'రాజయోగ సారము' అనే గ్రంథాన్ని రాయాలని సంకల్పించింది.
వినరయ్యా కవులార, విద్వాంసులార
వినరయ్యా - మీరెల్ల విమలాత్ములారా
ఘనయతిప్రాస సంగతులు నేనెరుగ
వరుస నాక్షేపింప వలదు సత్కృపను
అంటూ తన గ్రంథరచనను మొదలు పెట్టింది. వెంగమాంబ.
"రాజయోగసారం"లో కపిల మహర్షికి, దేవహూతికి జరిగిన తాత్త్విక సంభాషణే కథావస్తువు. కపిలుడుమ్ తల్లియైన దేవహూతికి పిండోత్పత్తి గురించి. పంచకోశ ప్రభావం గురించి బోధించాడు. అలా కపిలుడు తల్లికి ఎంతో జ్ఞానబోధ చేసాడు. దేవహూతి ధన్యురాలు. వెంగమాంబ, తండ్రి కృష్ణయ్య కనిపించారు. కానీ, తండ్రి ఎవరు? తల్లి ఎవరు? అన్నీ ఆ "ఆదిదేవుడే" అనుకుంటూ ఆయనకు చేతులెత్తి నమస్కరించి రచన కొనసాగించింది. వెంకమ్మ విరచితమైన రాజయోగాన్ని భక్తులు రోజూ పారాయణం చేయించుకుంటున్నారు.
ఇలా కొన్ని రోజులయ్యాక వెంగమాంబ మనసు భాగవతంపైకి మరలింది. ద్విపదలో రచన మొదలు పెట్టింది. భాగవతంలో అశ్వత్థామతో ద్రౌపది పలికిన పలుకులు వెంగమాంబ కవితాత్మ హృదయానికి అద్దం పడతాయి.
వెంగమాంబ నిత్యం వేంకటేశ్వరునే ధ్యానిస్తుండడంతో, ఆమె మనసు నిండా ఆయన రూపమే. సర్వవ్యాపకుడైన ఆ స్వామి ఆమె కళ్ళముందేఉన్నాడు. ఆ వెంకటాచలుని మహాత్మ్వం ఒకటా, రెండా!! ఆమె కనులు తెరిచినా మూసినా, స్వామి రూపమే.
"వెంకటాచల మహాత్మ్యం" అనే ఆరాశ్వాసాల కావ్యాన్ని రచించింది వెంగమాంబ. స్వామి లీలలను కళ్ళకు కట్టినట్లు వివరించిందామె. ఆ గ్రంథాన్ని స్వామికి అంకితమిచ్చింది. శ్రీ వరాహ పద్మ భవిష్యోత్తర పురాణాంతర్గతమైన మహాత్మ్యాలన్నీ ఆ గ్రంథంలో పొందుపరిచిందామె. వెంగమాంబ పాండితీ విభవానికి అబ్బురపడ్డారు పండితులు. తనకు అంకితమిచ్చిన ఆ కావ్యాన్ని తన మరో మహిమారూపంగా భావించిన శ్రీ వేంకటేశ్వరస్వామి, వెంగమాంబపై అవ్యాజమైన ప్రేమవృష్టి కురిపించాడు. వెంగమాంబకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వకుళమాలికాదేవి ప్రతిరోజూ కనిపెట్టి చూస్తోంది.
ఆరోజు తులసిమాలను స్వామికి అర్పించి వచ్చింది వెంగమాంబ. వకుళమాలికా దేవి గుమ్మంలో వచ్చి కూర్చుంది. ఆమెను చూడగానే వెంగమాంబలో ఓ విధమైన భావోద్వేగం. "అమ్మా! నువ్వెంతో ధన్యురాలవు. ద్వాపరంలో యశోదాదేవిగా ఉన్న నిన్ను , బ్రహ్మ వకుళాదేవిగా పుట్టించి, శ్రీ వరాహస్వామికి సేవలు చేయడానికి నియమించాడుగా తల్లీ! శ్రీనివాసమూర్తి వైకుంఠన్ని వదలి శేషాచలనికి చేరినపుడు, శ్రీనివాసునికి సేవ చేయమని ఆ వరాహస్వామి నియమించాడటగా. అమ్మా! వకుళమాలికాదేవీ, నీకన్నా ధన్యులెవరమ్మా? ఆ స్వామికి సమస్త సేవలు అందిస్తున్న నీవు, నాకోసం పడిబియ్యం పంపిస్తున్నావు. నా భాగ్యమేమని చెప్పను తల్లీ!" ఈ మాటలు అంటున్నప్పుడు వెంగమాంబ గొంతు గాద్గదికమైంది. ఆనంద బాష్పాలు పొంగి పొర్లాయి.
"అమ్మా! స్వామి ఎవరిని, ఎందుకు, ఎక్కడ నియమిస్తాడో మనకు తెల్సా? తరిగొండ వెంగమాంబ శ్రీనివాస క్షేత్రానికొస్తుందని అనుకున్నానా?" అంది వకుళమాలికాదేవి. "అమ్మా! ఒకసారి ఆ స్వామి మహాత్మ్యాన్ని వినిపిస్తావా?" అని మరలా అడిగింది వకుళమాలికాదేవి.
"అమ్మా! ఏది వినిపించేది? బ్రహ్మకు వేంకటేశ్వరుడు ప్రత్యక్షమవడాన్ని చదవనా? వైష్ణవ ధర్మాన్ని చదవనా? శ్రీనివాసుడు వేటాడటాన్ని చదవనా? ఏం చదివేది?' వెంగమాంబ స్వరంలో ఆనందడోలికలు.
"అమ్మా! అన్నింటా ఆ స్వామే కదా! ఏది విన్నా జన్మ తరిస్తుందిగా!" అంది వకుళమాలికాదేవి.
వేటకెళ్ళిన శ్రీనివాసుడు శృంగారవనంలో పద్మావతిని చూసాడు. అప్పుడు చదరంగం ఆడుతోందామె. ఆ పద్మావతి సౌందర్యాన్ని పొదలమాటు నుంచి చూసాడు శ్రీనివాసుడు.
"వెంగమాంబా! పద్మావతి దేవి సౌందర్యాన్ని ఆ శ్రీనివాసుడెలా చూసాడో నాకేం తెలుసునమ్మా! నువ్వెలా వర్ణించావో చెప్పు" వకుళమాలికాదేవి చిరునవ్వుతో అంది. వెంగమాంబ వరుసగా వెంకటాచల మహాత్మ్యంలోని అంశాలన్నిటినీ హృద్యంగా చదివి వినిపించింది.
ఇంతలో వకుళమాలికాదేవి, "అమ్మా! నా పాకశాలను వదలి ఇక్కడే నీతో మాట్లాడుతున్నాను వెంగమాంబా! నువ్వు నాతోరాకూడదూ!?" అంది. వెంగమాంబ వకుళమాలికాదేవి పాదాలకు నమస్కరించి, ఆమె వెళ్ళాక ఆ పాదాలనే స్మరిస్తూ కూర్చుంది.
వెంగమాంబ మహాత్మ్యం సర్వత్రా వ్యాపిస్తోంది.
మహాభక్తుడైన తాళ్ళపాక చిన్నయ్యగారు, వెంగమాంబ భక్తితత్వానికి జోహార్లర్పించారు. ఆ మహాభక్తురాలు పూరింట్లో ఉండడాన్ని చూసి, ఆమె కోసం శ్రీవారి కోవెలకు ఉత్తర మాడ వీథిలో ఉన్న రాతి ఇంటిని, ఆమె నివాసం కోసం ఉచితంగా ఇచ్చారు. వెంగమాంబ పూరింటిని వదలి రాతి ఇంటికి వచ్చింది. స్థలం ఏదైనా భక్తురాలి భావన ఒకటే కదా! ఆ ఇంటికి వెనుక ఒక బావి తవ్వించింది. తులసి వనాన్ని ఏర్పరిచింది. రోజూ ఆ భగవంతుని అర్చిస్తూ, దివ్యకీర్తనలను రచిస్తూ, గ్రంథ రచన చేస్తూ తరిస్తోంది వెంగమాంబ.
ఎవరైనా భక్తిమార్గంలో ప్రశాంతంగా జీవిస్తుంటే, చూసి ఓర్వలేని వారెందరో ఉంటారు. ఆ అసూయాగ్రస్తులు తమకు తోచిన రీతిలో, భక్తులనుకించపరిచే ప్రయత్నాలను చేస్తుంటారు. తామే గొప్ప భక్తులమని గర్వంతో తిరుగుతుంటారు.
