Previous Page Next Page 
ముక్తేవి భారతి కథలు పేజి 17


                                              మమత - మానవత
    కారులో షికారు వెళ్ళొచ్చిన ఆరేళ్ళ రమవీధి గోడపక్కన మందార చెట్టు దగ్గర కొచ్చింది. ఒళ్ళో పోసుకున్న బొమ్మలన్నీ మట్టిలో దిమ్మరించి గౌను దులుపుకుంది. ఎన్నో బొమ్మలు. ఆ బొమ్మలతో ఆడుకుంటూ మధ్య మధ్య అమ్మ ఇచ్చే మందులు వేసుకుంటూ వుండటం రమకి అలవాటే. ఆరోగ్యం బాగుండదని రమని ఎవరూ ఏమీ అనరు. అంతేకాదు, పిల్లలులేని పెద్దనాన్నకి రమంటే చాలా ముద్దు.   
    చిన్న చిన్న వంట సామానులు, ప్లాస్టిక్ బొమ్మలు, చిన్న నీళ్ళ బకెట్టు.... ఎన్నో ఎన్నో వరుసలు వరుసలుగా అమర్చిన రమకి ఒక్కసారిగా గుర్తొచ్చింది బొమ్మకి నీళ్ళు పొయ్యాలని. సందులో వున్న పంపు దగ్గరకెళ్ళి చిన్న గిన్నెతో నీళ్ళు పట్టింది. ఆ నీళ్ళు ఒలికిపోకుండా అడుగులో అడుగు వేసుకుంటూ వస్తున్న రమకి గుమ్మంలో నుంచున్న ముష్టిది కనిపించింది.
    "పో_" ముసలిదానికేసి చూస్తూ కసిరింది.
    "గుప్పెడు బియ్యం....వరాల తల్లీ!"
    రమ ఆటలో మునిగిపోయింది.... స్నానం చేయిస్తే సరా-ఎన్నెన్ని పనులు తనకి-బొమ్మకి ఒళ్ళు తుడవాలి. బట్టలు కట్టాలి-అబ్బా!
    ముసల్ది గుమ్మంలోనే నుంచుంది....అలాగే చూస్తోంది-ఎంతసేపో-ఏమో!
    "ఇంకా పోలేదా?" రమ ఆట ఆపి లేచింది.
    'ఇదిగో' తాటాకు గిలక పిల్ల దగ్గరకు విసిరింది ముసల్ది. గల గలమంటూ కాళ్ళ దగ్గరొచ్చిపడింది గిలక.
    "ఛీ, ఇదేమిటిది-తాటాకుది-చూడు-ఎన్ని బొమ్మలో! ఈ కారుచూడు ఎలా పరిగెడుతుందో - ఈ బొమ్మ చూడు ఎలా నవ్వుతుందో." అటుతలెత్తి చూసింది. ఛీ- ముష్టిదానితో ఈ మాటలేమిటి-వెంటనే కసిరేసింది. ముసల్ది గిలక అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది.
    బొమ్మలన్నీ బుట్టలోకి ఎత్తుతుంటే, తాటాకు గిలకలోని గులకరాళ్ళ గలగల తమాషాగా వినిపించింది రమ చెవులకి.
    రెండు రోజులు ముసల్ది వస్తుందని ఎదురు చూసింది. బొమ్మలాట ఆడేసి వీథిలో నుంచునేది. రమకి మరీ ఆశ్చర్యాన్ని కలిగించింది గిలక లోపల గులకరాళ్ళు. అంత చిన్న చిన్న గళ్ళు గళ్ళుగా ఎలా అల్లిందో. అందులో చిన్న చిన్న రాళ్ళు ఎలా పోసి మూతవేసిందో అర్థం కాలేదు. పోనీ ఆ తాటాకులన్నీ విప్పేసి చూస్తే, - అమ్మో, తనకి చేయడం రాదుగా__ రమ అలా వీథిలో నుంచుని చూస్తుంటే వీథి చివర సందులో నడుస్తూ కనిపించింది ముసల్ది.... "ఇటురా ఇటు" - గట్టిగా కేక పెట్టింది.
    "ఎలా చేసేవ్__ నీకు డబ్బులు వద్దా మరి?" ముసల్ది నవ్వేసి ఊరుకుంది.... రమ లోపలకి పరిగెత్తి ఒళ్ళో బియ్యం పోసుకొచ్చింది.... రెండు గుప్పెళ్ళ బియ్యం గౌనులోవి ముసల్దాని గిన్నెలో గుమ్మరించి చేతులు దులుపుకుంది.
    అన్ని బొమ్మల్లోకి రమకి ఇప్పుడు బాగానచ్చింది గిలకే. పెద్దనాన్న రమని చూసి నవ్వుతుంటే కోపమొచ్చింది.
    'ఈ కారు ఇందాక కిందపడి విరిగింది. ఈ గిలక విరగదు కదూ?" రమ మాటలకి నవ్వు ఆగలేదు తల్లి, తండ్రి, పెదనాన్న అందరికీ.
    రోజు రోజూ ముసలమ్మ రావటం ఏదో ఒక తాటాకు వస్తువు ఇయ్యటం,కాసిని బియ్యం పొయ్యటం మామూలై పోయింది రమకి. పిల్ల ఆడుకుంటుందని చూసి చూడకుండా ఊరుకోవడం తల్లికి అలవాటయి పోయింది.
    వారం రోజుల తర్వాత అడుగులో అడుగేసుకుంటూ వస్తున్న ముసల్దాన్ని చూస్తే జాలేసింది రమకి.
    'జ్వరమా నీకు?'
    'ఆ_ ఇంద'_
    చిన్న తాటాకు బొమ్మ - దానికి చిన్న గౌను, మెడలో ఎర్రని పూసలు, కళ్ళకి కాటుక- అబ్బ ఎంత బావుందో! మురిసిపోయింది రమ.
    వచ్చిన ముసల్ది వెంటనే వెళ్ళిపోదు ఏ రోజూ. రమని అలా చూస్తూనే కూచుంటుంది ఎంతసేపో....
    "ఈ బొమ్మలకి డబ్బు తీసుకోవా?"
    "వద్దు."
    "ఎందుకూ-"
    "ఊరికే-" ఇదే ముక్కు.... అచ్చం ఇంతే-"
    ఏంటీ, మాట్లాడుతున్నావు-" రమ చిత్రంగా ముసలిదాని ముఖంలోకి చూస్తూ.
    "ఏంలేదులే-" లేచింది ముసల్ది. కర్ర కిందపడిపోయింది చేతిలోంచి. రమ గబుక్కున అందించింది.
    "బంగారు తల్లి!" మెటికలు విరిచి నెమ్మదిగా వెళ్ళిపోయింది.
    ఆ తర్వాత ముసల్ది నెలరోజులయినా రాలేదు. రమకి రోజూ ముసల్ది వస్తుందేమోననే అనిపిస్తుంది. ముసల్దానిమీద కోపమొస్తుంది. ఒక్కోసారి ఏడుపొస్తుంది. "అయినా దాని ఇల్లు ఎక్కడో కనుక్కోవాల్సింది"- రమకి వెంటనే భయమేసింది. ఎవరైనా ముష్టివాళ్ళ ఇల్లు కనుక్కుంటారా- వాళ్ళ ఇళ్ళకి వెడతారా- అమ్మో- ముష్టి వాళ్ళలో దొంగలు కూడా ఉంటారని అమ్మ చెప్పింది. ఎవరైనా తన్ని ఎత్తుకుపోతే- ఛీ పాపం ముసల్ది మంచిది. 
    ఆ రోజు రమ నాన్న, పెద్ద నాన్న, తల్లి అంతా హాల్లో కబుర్లు చెప్పుకుంటున్నారు. వీధి గుమ్మంలో కర్ర చప్పుడు వినిపించి పరిగెత్తింది రమ. ముసలమ్మ. రమ ముఖం ఒక్కసారి వెలిగిపోయింది.
    "ఇన్ని రోజులెక్కడి కెళ్ళావ్- మీ ఊరెళ్ళావా?" ముసలమ్మ మాట్లాడలేదు. రమ లోపలికి పరిగెత్తి బియ్యం తెచ్చి ముష్టిదాని గిన్నెలో పోసింది. ముసల్ది గోడనానుకుని కూర్చుంది. రమ ఏదో మాట్లాడుతూనే వుంది. చిన్న తాటాకుబుట్ట - "అబ్బ, ఎంత బావుందో...."
    అంతా గమనిస్తూనే వున్న తల్లి. ఒక్క ఉదుటున బయటకొచ్చింది. 'రోజూ ఈ తాటాకు ముక్కలు ఇచ్చి, ఇన్ని బియ్యం కాజేస్తోందన్నమాట - ఇంకా ఏమేమి ఎత్తుకుపోతుందో - మొన్న సందులో ఆరేసిన రెండు జాకెట్లు కనిపించలేదు - ఎవరో ఎత్తుకుపోయారనుకున్నాను.'
    "పిల్లకి మాయమాటలు చెప్పి ఏవేమి కాజేస్తున్నావ్? పో-గుమ్మంలోంచి - ఇంకోసారి గుమ్మంలోకి వచ్చావో కాళ్ళు విరక్కొడతా."
    రమ తెల్లముఖమేసింది. ముష్టిది విస్తుపోయింది. తల్లికి తెలిసే గుప్పెడు బియ్యం తెస్తోందనుకుంటోంది ఇన్ని రోజులూ-
    బొమ్మల్ని కాలితో తోసి విసవిసా వెళ్ళిపోయింది లోపలికి రమ తల్లి. ఎండ నడినెత్తికొచ్చింది. ముసల్దానికి కళ్లు తిరుగుతున్నాయనిపించింది. అలాగే ఆ పిల్లని చూస్తోంది.
    గౌనుతో కళ్ళు తుడుచుకుంటూ బొమ్మల్ని బుట్టలోకి ఎత్తుతోంది రమ.
    అడుగడుగు భారంగా వేస్తూ నడుస్తున్న ముసల్దానికి చిన్నారి గౌరి కళ్ళముందు కదుల్తోంది. పుట్టగానే తల్లిని పోగొట్టుకున్న పసిగుడ్డును చేతుల్లో పెట్టుకు పెంచింది. రెండేళ్ళు వచ్చినప్పట్నుంచీ ఇంటింటికీ తనతోబాటు తిప్పేది. వాళ్ళని వీళ్ళని అడిగిన గౌన్లు తొడిగేది. దొడ్లో పూసిన బంతి పూలు తల్లో తురిమేది. 'మనింటికిది మాలచ్చిమి' అనేవాడు తాత.
    ఆ రోజు ఎదిరింట్లో పెళ్ళి సందడి - పందిరి నిండా పిల్లలు ఆడుకుందుకు వెడతానంది గౌరి.
    రాత్రికి పెళ్ళి - అంతా సందడి - ముసలమ్మతో చెప్పి పందిట్లోకి పరిగెత్తింది గౌరి... అంతే. ఆ వెళ్ళిన పిల్ల మళ్ళా కనబడలేదు. ఏమైంది- ఏమో!
    పిల్లల్ని ఎత్తుకెళ్ళుంటారు అని ఒకరంటే బిచ్చమెత్తుకునేవాళ్ళే ఎత్తుకుపోయి కాళ్ళో, చేతులో విరక్కొట్టి అడుక్కుందుకు ఉపయోగించుకుంటారు అని వకరన్నారు. అందరి మాటలూ వింటూ, ఒళ్ళంతా కళ్ళు చేసుకుని గౌరి కోసం గాలిస్తూనే వుంది ముసల్ది. వెళ్ళిపోయేనాటికి ఆరేళ్ళది. అప్పుడే ఏడాదవుతోంది - గౌరవమ్మ బతికుందా - ఏమో? ముసలమ్మ మూగగా వెతుకుతూనే వుంది.
    మజ్జిగ అన్నం ముసలాడి నోటికందించి, మసకచీకటిలో నులక మంచం వాల్చింది ముసల్ది- ఆకాశం రంగు రంగులతో అందంగా కనిపిస్తోంది.... గౌరమ్మ తల్లి ఓ చుక్కయిందేమో - ముసల్ది ఆకాశంకేసి చూస్తోంది.... ఇంకా నక్షత్రాలు మెరవటం లేదు.
    'రాములమ్మా- రాములమ్మా' - గుడిసె బయట ఎవరిదో గొంతు.
    'రాములమ్మా'-
    'ఆ ఎవరూ'
    'నేను' దగ్గరకొచ్చింది కుంటికాలి పోచి.
    'నీ గౌరిని చూసా.'
    'ఆ' నోరు తెరిచింది ముసల్ది.
    'ఏటంటున్నావ్'
    'గౌరిని చూసా-!'
    కుంటికాలి పోచ చెప్పింది - గౌరి తండ్రి బరి తాగుబోతు ఆరాత్రి పెళ్ళి పందిట్లోంచి పిల్లని ఎత్తుకుపోయాడు. పిల్ల ఏడ్చిందట-గొంతెత్తితే నరికేస్తానన్నాడట - ఆడేమో రిక్షా తొక్కుతున్నాడట - పిల్లది ఆ కాలేజీ కుర్రాళ్ళ గదివూడ్చి కేరియర్ తెస్తుందిట - పోచి చెప్తున్న మాటలన్నీ వింటూ అలాగే వుండిపోయింది ముసల్ది.
    గౌరికి ఏడేళ్ళు నిండుతాయి-హమ్మో! ఇంకో మూడేళ్లు, నాలుగేళ్లు పోతే, తండ్రి అసలే తాగుబోతు- ఏమో దానిఖర్మ! ముసల్ది తలకొట్టుకుని పోచికేసి చూసింది.
    "పిల్ల బాగుంది రాములమ్మా.... నువ్వు బెంగపడకు."
    రాములమ్మ గొంతు తడారింది.
    "పిల్ల బాగుందా.... ఇంకేమంది - పోచీ, ఒక్కసారి నాకు చూపరాదుటే__"
    "అయ్యో నాకేటి తెలుసు__ సంతలో కనిపించి, అయ్య వస్తున్నాడంటూ పరిగెత్తింది రాములమ్మా...." దీర్ఘం తీసింది పోచి.
    "పోన్లే అది దాని అయ్య దగ్గరికి అదెళ్ళింది. అయినా కాటికి సిద్ధంగా వున్న నేనేటి చేస్తానే పోచీ"-
    ముసల్దాని దగ్గర కూచుని ఆ మాట ఈ మాట చెప్పి వెళ్ళిపోయింది పోచి.
    ఇంతకీ గౌరి ఎవరు - ముసల్ది ఎవరు - ఎవరికి ఎవరు - తన గుండెలెందుకు మండుతున్నాయి - తన కళ్ళలో నీళ్ళెందుకు - తనెవరో, అదెవరో - ఏమో?!
    తనతోబాటు అడుక్కునే మరో ముష్టిదానిపిల్ల గౌరి.... పురిటిలోనే వాతం కమ్మి తల్లి చచ్చిపోతే, తండ్రి తాగుబోతై ఊరొదిలి వెళ్ళిపోతే, ఆ పసికందును పెంచింది తను. పోన్లే- బతికుంది కదా - దానయ్య దగ్గరి అది వుంది - నేనెవరు మధ్యలో - ముసల్ది ముక్కు చీదుకుంది.
    పిల్ల బాగుందిట - ఎట్లా వుందో - ఏమో నాకెందుకు - ముసల్ది నెమ్మదిగా గుడిసెలోకి పోయింది.
    ఆ రోజు నుంచీ ముసల్ది గౌరి కోసం వెతకటం మానేసింది. ఎందుకో ఆ రోజు ఆడుకుంటున్న రమని చూస్తే పెళ్ళి పందిట్లోకి పరిగెత్తిన గౌరి కనిపించినట్టయింది. అంతే. ఆ పిల్లని చూడ్డం కోసం రోజూ ఏదో ఒకటి తయారు చేసి ఎంత దూరమో కాళ్ళీడ్చుకుంటూ రావటం మొదలెట్టింది ముసల్ది.
                                                  *    *    *
    రమ బొమ్మలాట మానేసింది.... బడికి వెడుతోంది. అయినా అప్పుడప్పుడు పెట్టెలో వున్న బొమ్మలన్నీ దిమ్మరించి చూసుకుంటుంది.... తాటాకు బొమ్మలు, గిలకలు, బుట్ట అలానే వున్నాయి. పాపం, ముసలమ్మ మళ్ళీ రాలేదు. అమ్మని చూసి భయపడిపోయింది - స్కూలుకి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు ఎక్కడైనా ముసల్ది కనిపిస్తుందేమోనని చూస్తుంది రోజూ.
    స్కూలుకి సెలవలిచ్చారు. విసుగ్గా వున్న రమ బీరువా తెరిచింది. పెద్ద నాన్న కొన్న బొమ్మలు, ముసలమ్మ ఇచ్చిన బొమ్మలు ఎన్నెన్నో వున్నాయి. అవి చూస్తే నవ్వొచ్చింది రమకి. ఎన్ని ఆటలాడుకొనేదాన్ని! అన్నీ వరసగా బల్ల మీద పేర్చింది. ఇంట్లో తల్లి, తమ్ముడు లేరు. తండ్రి ముందు గదిలో ఏదో చదువుకుంటున్నాడు.
    వీధిలో కారు హారన్ మోగడంతో గబ గబా పరిగెత్తింది రమ. తల్లి ముభావంగా ముందుకెళ్ళిపోయింది. పెద్దనాన్న ముఖం పక్కకు పెట్టుకు లోపలికి నడిచాడు. తమ్ముడు పరిగెత్తుకుంటూ వచ్చి, రమ చెవిలో ఏదో గుసగుసలాడాడు. కొయ్యబారిపోయింది రమ. బల్లమీద తలాన్చి వెక్కి వెక్కి ఏడ్చింది. చూస్తున్న తల్లికి ఒళ్లుమండిపోయింది.
    "ముసల్ది చావక బతుకుతుందా-కాకపోతే మన కారు కిందపడింది. అయినా-" తల్లి మాటలు వినిపించటం లేదు రమకి.
    "ముసల్ది మంచిదమ్మా పాపం__"
    "అయితే ఏం చేద్దాం?" విసావిసా లోపలకెళ్ళింది తల్లి.
    "ఆ బొమ్మలు అవతల పారేయ్. ఆ ఏడుపు వదులుతుంది" పడక్కుర్చీలో కూచున్న పెద్ద నాన్న తాటాకు బొమ్మల్ని చూపిస్తూ అన్నాడు.
    "వీథిలో పారేస్తే ఏరితెచ్చుకుంటుంది" - బల్లమీదున్న తాటాకు బొమ్మలన్నీ పోగుచేసింది. తల్లి....రమ చూస్తూనే వుంది ఎండిన తాటాకులు భగ్గుమన్నాయి. ఒక్క క్షణంలో వంటింటి గుమ్మంలోకి రమ పరిగెత్తింది.
    గబగబా మంటలోంచి బయటకి లాగింది ఒక్కటే. ఒక్క గిలక - ఒక్క గిలక-
                                                 *    *    *
    కాలం గబగబా నడుస్తోంది - పెట్టి అడుగున తాటాకు గిలక అలానే వుంది.... పెట్టి ఎప్పుడు సర్దినా గిలక అడుగున దాచేసేది ఒక్కసారి చూసి - 'ఎన్ని రోజులయినా ఇలానే దాచుకుంటాను. నా పెళ్ళయ్యాక మా వారికి చెప్తాను దీని కథ. నా పిల్లలకి చూపిస్తాను దీన్ని' నవ్వుకుంది.... రమ పెళ్ళయిపోయింది ఆ నెలలోనే-
    రమ గిలకని తీసింది పైకి....ఎండిన తాటాకు లోపలనుంచి సన్నని గులకరాళ్ళు మెల్లిగా చప్పుడు చేస్తున్నాయి - ముసలమ్మ నవ్వులా అనిపించింది ఒక్కసారి.
    "అయ్యో పాపం - ఒకదానికయినా తను డబ్బు లియ్యలేదు - ఒక్కసారి కూడా గిలకలకి పైసలిమ్మని అడగలేదు" - ఏదో తప్పు చేసినట్లు, ఎక్కడో గుండె పట్లు కదిలినట్టయింది రమకి.
    కాని క్షణంలో మనసు మరలించేసింది-
    "ఆ - అయినా బియ్యం పెట్టానుగా-"
    "బియ్యం బిచ్చగాళ్ళకి చాలామంది పెడతారు-"
    "మరి తను తీసుకున్న బొమ్మలకో-"
    "ఆ - ఏం బొమ్మలు - తాటాకువేగా-"
    "అయితే మాత్రం-"
    తన ప్రశ్న - సమాధానాలకి చిరాకొచ్చేసింది తనకే! గబగబా పెట్టె తీసింది.
    వస్తువులన్నీ బయట పెట్టింది - పెట్టడుగున తాటాకులు ఫెళ ఫెళ లాడాయి.
    గుమ్మంలో నుంచున్న రామం రమకేసి చూస్తున్నాడు. తాటాకులు పైకితీస్తుంటే రమకే నవ్వొచ్చింది.
    "ఏమిటా చెత్తంతా?"
    "ఆ - చెత్తే మరి - ఒట్టి చెత్త" - దులిపింది.
    వంటింట్లోంచి చీపురు తెచ్చింది. ఎండిన తాటాకు ముక్కల్ని తుడిచి, గోడవతల విసిరేసింది. ఆ ముక్కల్లో ముసల్ది ఒక క్షణం కదిలి మాయమయినట్లయింది.
    "నాన్సెన్సు - సెంటిమెంటు" - 'ఛీ' - చీరలు మడతలు పెట్టి చక్కగా సర్దుకోవటం ప్రారంభించింది రమ.*


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS