నీతికథ
మల్లెపూలంటే ఇష్టం లేనిదెవరికి? సామాన్యులు, గొప్పవాళ్ళు అన్న తేడా ఉండదు ఆ విషయంలో. మల్లెపూల మీద మనసు పెంచుకున్న రత్తిని ఆ పనికై ప్రేరేపించింది ఏమై ఉంటుంది?
రత్తి లలితమ్మ ఇంట్లో పనికి కుదిరి ఆర్నెల్లయింది. దొంగబుద్ధి లేదని, పని బాగా చేస్తుందని అందరి మెప్పూ పొందింది అప్పుడే పొద్దున్నే పనికి వచ్చి సాయంత్రం దాకా ఉండిపోతుంది రత్తి ఆ ఇంట్లో. రెండేళ్ళ బాబుని లలిత ఆఫీసు నుంచి వచ్చేవరకు జాగ్రత్తగా చూసుకోటం రత్తి చేసే ముఖ్యమైన పని ఆ ఇంట్లో.
లలితమ్మకి ఇరవై అయిదేళ్ళుంటే, రత్తికి పద్దెనిమిదేళ్ళుంటాయి. నల్లగా, సన్నగా ఉండే రత్తి ముఖంలో ఎంతో కళ ఉంది. నవ్వుతుంటే చక్కని పలువరస మెరుస్తూ ఎంతో అందాన్నిస్తుంది రత్తికి. నల్లటి పొడుగాటి జడకు ఎర్రని రిబ్బను పెట్టుకోవడం ఎప్పుడూ మరిచిపోదు రత్తి.
రత్తి మొగుడు రిక్షా లాగుతాడు. స్కూలు పిల్లల్ని రిక్షాలో దింపి సాయంత్రం ఇళ్ళకి చేర్చటం వాడి పని.
లలితమ్మ ఇంట్లో రత్తి పనిచేయాల్సిన పనుల్లో మరొకటి ఉంది. పూలవాడు వీధిలో కేక పెట్టడం ఆలస్యం, గుమ్మంలోకెళ్ళి ఆ పూల మాల తీసుకోవాలి. భద్రంగా ఫ్రిజ్ లో ఫ్లాస్టిక్ కవర్ లో చుట్టి పెట్టాలి. ఆఫీసు నుంచి ఇంటికొచ్చిన లలితమ్మ కొంచంసేపు విశ్రాంతి తీసుకొని, తల దువ్వుకుని ఆ పూలమాలను తలలో పెట్టుకుంటుంది. ఇది రోజూ జరిగేదే.
ఆ రోజ పూలవాడి కేక వినబడగానే వీధిలోకి రోజులాగే పరిగెత్తింది రత్తి. పూలమాల తీసుకుంది. ఫ్రిజ్ దగ్గరికి రాగానే రత్తి చూపు పూలమాలపైనే నిలిచింది. "చిన్న ముక్క తుంపి తలలో పెట్టుకుంటే? ఆఁ ఒద్దులే రేపు అమ్మగార్నడిగి తీసుకుంటా." పూలమాలను వాసన చూసి లోపల దాచింది రత్తి.
లలితమ్మ ఆఫీసునుంచి వచ్చేసింది. పిల్లాడిని అప్పగించింది రత్తి. వీధి గేటు దగ్గర ఆగి, ఎర్ర మందారం కోసి జడలో తురుముకొని గబగబా నడిచింది.
వేసవి వచ్చేసింది. రత్తికి వేసవి కాలం అంటే చాలా ఇష్టం.... కారణం ఒక్కటే, బోలెడు మల్లెపూలు వస్తాయి బజార్లోకి. అప్పుడప్పుడు వెంకడు పూలు కొని తెచ్చి పెడతాడు తనకి.
గదులన్నీ తుడిచి, పడగ్గదికి తుడవటానికి కొచ్చిన రత్తి క్షణం అలాగే నిలబడింది చీపురు చేత్తో పట్టుకుని.
"తల్లో పెట్టుకోవటమే కాకుండా పక్కమీద కూడా చల్లుకుంటారా?".... మూతి వంకరగా తిప్పింది రత్తి. "అంత ఎక్కువైతే నాకియ్యగూడదూ?" చీపురుతో గబగబా తుడిచింది. వాడి నేలపైన రాలిన, పక్కమీద పడున్న పూలను చూస్తుంటే భలే కోపమొచ్చింది రత్తికి.
అమ్మగారిలో ఏదో మార్పును గమనిస్తూనే ఉంది రత్తి ఈ మధ్య. ఏదో వంకని ఆఫీసుకి సెలవు పెట్టడం, ఒంట్లో బాగాలేదని పడుకోడం చూస్తున్న రత్తికి విషయం అర్థమైపోయింది. "అయినా బాబుకి రెండేళ్ళేగా? ఏమో, నాకెందుకీ గొడవ?" రత్తి బాబుకి అన్నం పెడుతూ నవ్వుకుంది తనలో తానే.
తనకీ ఓ పాప పుడితే? పెళ్ళయి మూడేళ్ళయింది. తన తర్వాత పెళ్ళయిన తన చెల్లి బంగారికి తొమ్మిదో నెల. రత్తికి ఉన్నట్టుండి వెంకడి మీద, చెల్లి బంగారి మీద, అమ్మగారి మీద, చిన్నబాబు మీద ఒక్కసారి కోపం పెల్లుబికి వచ్చింది.
"తినూ" __ ముద్ద నోట్లో కుక్కగానే, టక్కున ఉమ్మేశాడు చిన్నబాబు.
"రత్తీ"__
అమ్మగారి గొంతు విని ఉలిక్కిపడింది.
"రేపు ఇంట్లో చాలా పని ఉంటుంది. చుట్టాలొస్తారు. అమ్మ, చెల్లి, అన్న వస్తారు. నువ్వు పెందరాడే రావాలి. రాత్రి అయేవరకు ఉండాలి. ముందే చెప్తున్నా."
"సరేనమ్మా!" రత్తి తల ఊపింది.
"ఇంద." లలితమ్మ పూలమాలలోని చిన్న ముక్క తుంపి ఇచ్చింది.
"ఇంకొంచం పెద్ద ముక్క యిస్తే ఏమవుతుందో?" రత్తి లోపలే సణుక్కుంటూ, ఆ చిన్నముక్కను పెద్ద జడలో కుక్కుకుంది.
ఆ ముందురోజు చూసిన సంగతే రత్తి కళ్ళలో కదలాడుతోంది. లలితమ్మ తలలో పూలదండ పెడుతున్నాడు అయ్యగారు.
విడిపూలు మంచంపైన జల్లుతున్నారు అమ్మగారు.
గది తుడవటానికొచ్చిన రత్తి ఒక్క అడుగు వెనక్కి వేసింది.
"ఈరోజు గది తుడవనక్కర్లేదులే వెళ్ళిపో."
రత్తి గబగబా ఇంటికెళ్ళిపోయింది.
అమ్మగారెంత అదృష్టవంతురాలో!
తన వెంకడు ఒక్కనాడన్నా తన తలలో పూలు పెట్టాడా....?
అయినా, అమ్మగారికీ, తనకీ పోలికా? రత్తి పెదాలపై చిన్న నవ్వు, కళ్ళలో సన్నటి నీటిపొర ఇలా కనిపించి అలా మాయమయ్యాయి.
రాత్రంతా అమ్మగారి తలలో పూలే కనిపిస్తున్నాయి రత్తికి. పక్కకి ఒత్తిగిల్లింది.... బండలా నిద్రపోతున్న వెంకడిని మోచేత్తో ఒక పోటు పొడిచి కళ్ళు గట్టిగా మూసుకుంది రత్తి.
* * *
ఇల్లంతా సందడి.... "ఇది లోపల పెట్టు" - పెద్ద పూలదండ, ఎన్ని మూరలుంటుందో, రత్తి చేతికందించాడు లలితమ్మ భర్త. ఆ దండ అలాగే చేత్తో పట్టుకు నిలబడిపోయింది రత్తి.... ఆ పరిమళం శరీరానికి గిలిగింతలు పెట్టింది.... ఈ దండంతా తను జడకి చుట్టుకుంటే? చుట్టుకుంటే? రత్తి ముఖం వెలవెలపోయింది. ఇదెలా సాధ్యం? ముఖం నిండా చెమటలు పట్టింది. కంగారుగా అటూ ఇటూ చూసింది. అంతా ఎవరి పనులలో వారున్నారు. ఈ పూలమాల జడమీద చుట్టుకోవల్సిందే. తన కోరిక ఎలా తీరాలి మరి?- రత్తి గబగబా వీధిలో కొచ్చింది. గోడవారగా నడుస్తూ, ఇంచుమించుగా పరుగుతీసింది. చిన్న గుడిసెలో తలుపు కింద నుంచి పూలమాలతో ఉన్న పొట్లం బలవంతంగా తోసింది.
అంత పరుగులోనూ మళ్ళీ ఇల్లు చేరింది రత్తి.
అంతా ఎవరి హడావుడిలో వారున్నారు.
"రత్తీ!"
"అమ్మా!"
"ఏదది?" - లలితమ్మ సవరం పెట్టి వేసుకున్న జడ ముందుకు వేసుకుని అడిగింది.
"ఏదమ్మా?"
"అదే- ఇందాక అయ్యగారిచ్చిన పూలపొట్లం."
"అక్కడే పెట్టాగా!"
"ఎక్కడ?" లలితమ్మ చిరాగ్గా అంది.
ఇంట్లో అంతా ఆ పూలమాల ఎక్కడ ఉందో వెతకడం మొదలుపెట్టారు. రత్తి కూడా అదేపనిలో మునిగిపోయింది.
"పోన్లే - ఉంటే అదే దొరుకుతుంది. మరో పదిమూరల దండ తీసుకురండి, జడమీద చుట్టాలి."
లలితమ్మ తల్లి తొందర పెట్టింది.
పది నిముషాల్లో పూలదండ వచ్చేసింది. లలితమ్మ చిన్న జుట్టుకు పెద్ద సవరంతో వేసిన జడనిండా పూలమాల ఎక్కడ ఉందో వెతకడం మొదలుపెట్టారు. రత్తి కూడా అదేపనిలో మునిగిపోయింది.
"పోన్లే - ఉంటే అదే దొరుకుతుంది. మరో పదిమూరల దండ తీసుకురండి, జడమీద చుట్టాలి."
లలితమ్మ తల్లి తొందర పెట్టింది.
పది నిముషాల్లో పూలదండ వచ్చేసింది. లలితమ్మ చిన్న జుట్టుకు పెద్ద సవరంతో వేసిన జడనిండా పూలమాల చుట్టారు. పెద్ద పూలజడతో, పట్టుచీరతో, నిండుగా లలితమ్మ కనిపిస్తుంటే రెప్పపాటు కూడా లేకుండా చూస్తూ కూచుంది రత్తి.
శ్రీమంతం, పేరంటం అయిపోయింది.... రత్తి ఇంటికెళ్ళాలని తొందరపడింది.
బాగా చీకటిపడింది. టిఫిన్ కారియర్ లో ఎన్నో స్వీట్లు, అన్నం, కూరలు- అన్నీ పెట్టి ఇచ్చింది లలితమ్మ.
ఉత్సాహంగా ఇంటికొస్తున్న రత్తికి వెంటనే అనిపించిందీ, వెంకడు ఈ పూలదండ ఎక్కడిదీ అని అడిగితే తనేం చెబుతుంది? అమ్మగారింట్లో దొంగతనం చేసిందనా? ఛీ ఛీ! - అమ్మగారే ఇచ్చారని చెప్తే? వెంకడు నమ్మడు. గబగబా నడుస్తున్న రత్తికి ఆయాసం వచ్చింది.
గుమ్మంలోకి రాగానే గుప్పుమంది మల్లెల వాసన. చిన్న దీపం మినుకు మినుకు మంటోంది.
వెంకడికి కోపం వస్తే? రానీ! అమ్మో, వెంకడు చాలా కచ్చితం మనిషి. తనని తంతే? రత్తి పూలమాలతీసి జడపైన పెట్టుకుంది. సగం విరిగిన అద్దంలో మళ్ళా మళ్ళా చూసుకుంది.
ఎంత బావుందో! రత్తి కళ్ళనిండా వెలుగు.
మరో క్షణంలో రత్తి ముఖం వెలవెలపోయింది. వెంకడు అబద్ధం చెబితే వెంటనే గ్రహించగలడు. ఓ రోజు రిక్షా తొక్కిన డబ్బులతో పూలు తెచ్చి పెట్టమంటే తెచ్చి పెట్టడా? రత్తికి నవ్వొచ్చింది. పూలకోసం అన్ని డబ్బులే!!
వెంకడు తనని ఎంతో ప్రేమగా చూస్తాడని రత్తికి తెలుసు. కానీ నీతి తప్పితే వెంకడు తల నరికేయడానికి కూడా వెనుకాడడు! తను అమ్మగారింట్లో పూలదండ దొంగిలించి తెచ్చానని తెలిస్తే వెంకడు తనని తన్ని, ఆ పూలదండ తనతోనే అమ్మగారికి పంపిస్తాడు. రత్తి చేతులు వణికాయి. కళ్ళలో నీళ్ళు తిరిగాయి అయినా తనకెందుకీ దొంగబుద్ధి? - రత్తి మనసు చెదిరిపోయింది. - వస్తువు చిన్నదయినా, పెద్దదయినా దొంగతనం దొంగతనమే!!
రత్తి చీకట్లో గబగబా దగ్గరలో ఉన్న చెత్తకుండీలో పూలపొట్లాన్ని గబుక్కున విసిరి, వెనక్కి తిరిగి, గుడిసె చేరింది. అమ్మయ్య! మనసు తేలిక పడింది. తనకిచ్చే నెలజీతంలోంచి ఒకసారి పదిరూపాయల పూలు కొనుక్కుంటా! బుగ్గల మీద జారిన కన్నీళ్ళు తుడుచుకుంది.
బాగా పొద్దుపోయింది. రత్తి మనసు నిండా వెంకడే నిండిపోయాడు. ఇంకా రాలేదే? పొయ్యి మీద వేన్నీళ్ళు మరుగుతున్నాయి. రాగానే నీళ్ళు పోసుకోమనాలి. అమ్మగారిచ్చిన ఫలహారాలు పెట్టాలి. తన వెంకడు ఎంతో మంచివాడు. ఎంతో కష్టపడుతున్నాడు.
వెంకడి కోసం ఎదురుచూస్తూ గుమ్మంలో కూచుంది రత్తి.
* * *
పిల్లల్ని రిక్షాతో ఎవరింట్లో వాళ్ళని దింపాడు వెంకడు. చివరగా ఇంజనీరు గారింట్లో పిల్లల్ని దింపాడు.
"ఒరేయ్! ఇటు రా!!"
"అమ్మ- చెప్పండి." వెంకడు పక్కనున్న పంపులో నీళ్ళు తాగి ముఖం, కాళ్ళు చేతులు కడుక్కున్నాడు.
"ఈరోజు క్లబ్బులో ఈ దండ అయ్యగారి మెడలో వేశారు. కానీ నేనేం చేసుకుంటానిది? నువ్వు తీసికెళ్ళు - రత్తికియ్యి."
వెంకడు పరమానందంతో తీసుకున్నాడు- పెద్ద మల్లెపూల దండ. ఎంత పెద్దదండో. నా రత్తి జడనిండా నిండిపోతుంది - ఎప్పటినుండో పెద్ద పూలదండ కొనిపెట్టాలి రత్తికి అనుకుంటున్నా - ఈనాడు అయ్యగారి కేసిన దండ నాకు దక్కింది. అమ్మగారేం పెట్టుకుంటుంది జడలో? అసలు జడ ఏదీ? చెవుల వరకు కత్తిరించిన జుట్టు.
వెంకడికి నవ్వొచ్చింది. అమ్మగారు దువ్వెనతో తల దువ్వుకుంటున్నది, అయ్యగారిలాగే వెంకడి రిక్షాలో పూలదండ ఘుమఘుమలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. హుషారుగా ఈలపాట పాడుకుంటూ, వేగంగా రిక్షా తొక్కటం మొదలుపెట్టాడు వెంకడు.
పది గజాలు వెళ్ళాడో లేదో రిక్షా టక్కున ఆగింది. రిక్షాలోని పూలదండ కేసి కన్నార్పకుండా చూస్తున్నాడు వెంకడు. ఈ పూల దండ నా భార్య తలలో పెట్టడానికా? అయ్యగారి మెడలో ఎవరో వస్తే అది నా భార్య జడలో పెడతానా? థూ, నీ-నాకు నీతిలేదా? వెంకడి కళ్లు ఎర్రబడ్డాయి. అయ్యగారికి, అమ్మగారికి అక్కర్లేదు కనుక ఇంత పెద్ద దండ నా కిచ్చారు. ఏం, లలితమ్మగారైనా ఒక్కనాడైనా పెద్దదండ నా రత్తికిచ్చిందా? ఈ గొప్పోళ్ళు-నీ వెంకడు వేగంగా రిక్షా తొక్కాడు.
"నా రత్తికి ఒకరోజు రిక్షా తొక్కిన డబ్బుల్తో పూలదండ కొంటా" దగ్గరలో వున్న చెత్తకుండీ దగ్గర రిక్షా ఆగింది.
రిక్షాలోని పూలదండ ఒక్క విసురులో చెత్తకుండీలో పడింది. వెంకడు గబగబా రిక్షా తొక్కి గుడిసె చేరాడు.
"ఉడుకునీళ్ళోసుకో. ఆకలవుతోంది." గుమ్మంలో కూచున్న రత్తి మాటలు వినిపించటంలా వెంకడికి.
"రేపు రిక్షా తొక్కిన డబ్బుల్తో నీకు పూలు కొని తెస్తా." గబగబా లోపలకెళ్ళాడు వెంకడు.
రత్తి చిన్నగా నవ్వింది.
వెంకడు పకపకా నవ్వాడు.
చెత్తకుండీలో రెండు పూలదండలూ గుసగుసలు చెప్పుకుని ముసిముసిగా నవ్వుకున్నాయి, ఆ వెన్నెల రాత్రిలో.*
