Previous Page Next Page 
ముక్తేవి భారతి కథలు పేజి 16


                                                  నిద్రించిన వెన్నెల
    ఎండ కన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు లాటి శశి ఒక్కసారి ఉలిక్కిపడింది. చేతిలోవున్న నవల ఖంగారులో కిందపడింది. గబుక్కున తీసి గాడ్రెజ్ లో చీరల మధ్య దాచేసింది. నవలలు చదివి పాడయిపోతారు ఆడవాళ్ళు అనే అభిప్రాయమున్న చాలామందిలో మొదటివాడు రాజేంద్ర.
    అందుకే అతని అభిప్రాయం పొరబాటని చెప్పి ఒప్పించే ధైర్యం లేని శశి ఈ మధ్య రహస్యంగా నవలలు చదవటం మొదలెట్టింది.
                                             *    *    *
    ఆ వినిపిస్తున్న గొంతు బాగా పరిచయమున్నదే - శశి ఆ గదిలోంచి డైనింగ్ టేబులు దగ్గర కొచ్చింది. అలా ఆవిడ రావడమే ఆలస్యం. గ్లాసుతో నీళ్ళు తెచ్చి బల్లమీదుంచటం రాములు అలవాటు. అక్కడనుంచి డ్రస్సింగ్ టేబులు దగ్గర కొచ్చింది. లిప్ స్టిక్ పెదాలకు టచ్ చేసుకుంది ఒక్కసారి క్రీమ్ రాసుకుంది. అలంకరణ మళ్ళీ మళ్ళీ అద్దంలో చూసుకుంది. చెవులకున్న వజ్రాలదుద్దులు, ఒంటినున్న ఖరీదయిన చీర, ఆరోగ్యంగా నిగనిగలాడుతున్న ఒళ్ళు, శశికి ఓ నిమిషం నవ్వొచ్చింది. ఈ బెడ్ రూము, ఈ భవనం, ఆ తోట, ఓ-ఇది ఇంద్రభోగమే! అందులో తను - తను అసూర్యంపశ్య. శశి మళ్ళా ఓసారి అద్దంలోకి చూసుకుంది.
    తలుపు తోసుకుని లోపలకొచ్చాడు రాజేంద్ర.
    "నీకు తెలుసుగానే వచ్చి చాలా సేపయిందని."
    "ఆ"
    "మరి"
    "ఇంకెవరిగొంతో కూడా వినిపిస్తోంది...." నెమ్మదిగా అంది బ్రోచ్ సరిచేసుకుంటూ.
    "అందుకే-నిన్ను పరిచయం చేస్తాను."
    రాజేంద్ర ముందు నడుస్తుంటే వెనకాతలే వెళ్ళింది శశి.
    "నా మిసెస్ శశి."
    శశి నమస్కారం చేసింది. ఒక్క నిముషం మతిపోయింది. మరొక్క క్షణంలో అక్కడనుంచి కదిలింది. అది అంతే. రాజేంద్రకి రకరకాల స్నేహితులు, రకరకాల పరిచయాలు. శశి కనిపించి నమస్కారం పెట్టి లోపల కొచ్చాయాలంతే-అక్కడ నుంచోకూడదు-వెనక్కి తిరిగి చూడకూడదు - తెలుసున్నా ఆప్యాయంగా పలకరించకూడదు. ఆ తర్వాత కూడా ఎప్పుడూ పరిచయం చేసిన వాళ్ళ గురించి అడక్కూడదు, మాట్లాడకూడదు. అ ఇల్లాలిని, ఇంటిని రాజేంద్ర పాలిస్తున్న విధమది. అందులో మార్పు రాకూడదు! రాదు!!
                                                  *    *    *
    కానీ ఈ రోజు లోపలకొచ్చి మంచం మీద వాలిపోయిన శశికి కన్నీళ్ళు ఆగలేదు- ఈ రోజు ఇతను తనకి చాలా ఆత్మీయుడు. బాగున్నావా అని పలకరించడానికి, నీ భార్య, పిల్లలు ఎలా ఉన్నారూ అనడానకి కూడా స్వతంత్రంలేని తన బతుకెందుకూ?
    రాజు, శశి ఎనిమిదో క్లాసునించి బి.ఎ. దాకా చదువుకున్నారు. కాలేజీ బ్యూటీ శశి. ఎందరో ప్రేమలేఖలు రాయటం, రాయబారాలు పంపటం ఎన్నిసార్లు జరిగిందో చెప్పటం కష్టం. అవేవీ ఏనాడూ లెక్క పెట్టలేదు శశి. అన్నిటికన్నా శశి మనసుని ఆకట్టుకొన్నది ఆ రోజు నోట్సు పుస్తకంలో రాసి రాజు యిచ్చిన రెండు వాక్యాలు.
    "అందంగా వుంటే మాత్రమే చాలదు - అందంగా వుండే మనసుని అందుకోటం జీవితంలో ముఖ్యం."
    ఆ రోజు ఆ వాక్యాలు చదివి నవ్వేసి "ఏమిటి ఈ నాన్ సెన్స్" అంది.
    "అది అంతేలే" అన్నాడు రాజు నవ్వుతూనే.
    "ఎందరిలాగో నువ్వూ ఓ ప్రేమలేఖ రాయక ఏమిటిది" మది చక్రాల్లాంటి కళ్ళు వయ్యారంగా తిప్పుతూ.
    "నీతో ఎవరు మాట్లాడినా నిన్ను ప్రేమిస్తున్నారనే అనుకుంటున్నావా-నీకో విషయం చెప్పనా"- రాజు ఆ మాటంటూ సిగ్గుపడ్డాడు.
    "చెప్పు."
    "శ్రద్ధగా విను - మా శారద యింటర్ చదువుతోంది-"
    "అంటే."
    "అంటే-ఆగస్టులో నా పెళ్ళి....ఊ."
    "పెళ్ళా"-
    "అవును, పెళ్ళిచేసుకుంటాను - ఈ బి. ఎ. పాసయిపోయి ఓ గుమాస్తాగా చేరిపోతాను- ఓ ఇద్దరు పిల్లలు- నేను, శారద హాయిగా బతికేస్తాం-చాలదా...."
    రాజు ముఖంలోకి చూస్తూ "నిజంగానా" అంది శశి.
    "అ."
    శశి ముఖం ఒక్కసారి పాలిపోయింది. అయితే, రాజు తనని ప్రేమించటంలేదు. తనో మరి? ఏమో-ఎందుకో ఒక్కసారి ఎక్కడనుంచో కింద పడ్డట్టనిపించింది. 
    కాలేజీ రోజుల్లో పాట పాడాలన్నా, మాట్లాడాలన్నా, ఉపన్యాసం యివ్వాలన్నా, అన్నిటికీ తనే. తనంటే ఎందరికో ప్రేమ. ఎందరికో అభిమానం. ఏమైంది అదంతా. ఏమో.
    చెల్లాచెదరుగా వున్న ఆలోచనల్ని, రద్దుచేసే ప్రయత్నం ఎంతగానో చేసింది. ఏం చేసినా మనసు ఇటు, అటు ఊగులాడుతోంది. మంచం మీద నుంచి లేచింది - గాజు షెల్ఫులో అందంగా అమర్చిన తన ఫ్రైజు పుస్తకాలు, సిల్వర్ కప్సు, పెద్ద షీల్డు- దగ్గరగా వెళ్ళి ఒక్కొక్కటీ చూసింది- గాజు షెల్ఫులో మెరుస్తున్నాయి తనలాగే!
    అడుగుల చప్పుడుకి వెనక్కి తిరిగింది శశి.
    "ఇద్దరికీ భోజనాలు వడ్డించమన్నారు అమ్మగారూ" - రాములు గుమ్మం బయట.
    "ఊ- చూడు ఏంకావాలో" - శశి షెల్ఫు దగ్గరే నిలబడింది.
                                                 *    *    *
    ఎక్కడ చూసినా ఆధునికత, ఎక్కడ చూసినా సంపద వెదజల్లినట్లున్న ఆ ఇంటిని చూసి విస్తుపోయాడు రాజు.
    కుర్రాడు కావలసినవన్నీ చూస్తున్నాడు. ఇల్లాలు కనిపించదేం? ఏమో గొప్పింటి పద్ధతి ఇదిలాగుంది. రాజు ఆలోచిస్తున్నాడు. "అలా కనిపించి తెలియనట్టే వెళ్ళిపోయిందే" రాజు శశి గురించే అనుకుంటున్నాడు.
    "నేను. శశిగారు క్లాసుమేట్సుమి."
    రాజేంద్ర రాజు ముఖంలోకి చూశాడు. "అలాగా!" అంతే. ఆ సంభాషణ అక్కడే ఆగిపోయింది. చాలాసేపు కంపెనీ విషయాలు మాట్లాడుకున్నారు.
    "రెండు రోజుల తర్వాత కనిపించు."
    రాజేంద్ర దగ్గర సెలవుతీసుకుని వెళ్ళిపోయాడు రాజు.
                                                 *    *    *
    శశికి ఆ రోజంతా మనసు కలతగానే వుంది. అసలు ఈ పెళ్ళి జరక్కుండా వుంటే ఎంత బావుండేది! ఛ, ఛ, అదేం ఆలోచన?
    ఏం-నిజమే - గుండెలోంచి వస్తున్న మాటలే- ఎవరూ విననప్పుడు కూడా నిజం తెలుసుకుందుకు ఎందుకు భయపడుతోంది తను! శశికి నవ్వొచ్చింది-నిర్జీవమైన నవ్వు.
    గతం కళ్ళముందునుంచి కదలటంలేదు. పిల్ల అందంగా వుందని వాళ్ళే కబురంపించారు. లేకపోతే ఇంత గొప్ప సంబంధమా!
    తన భర్త పెద్ద బిజినెస్ మాగ్నెట్__
    తరతరాలుగా వస్తున్న ఆస్తి-తన ప్రసక్తి లేకుండా కుదిరిపోయిన ఈ సంబంధాన్ని గురించి ఎంతో గొప్పగా చెప్పుకున్నారంతా. తన అదృష్టాన్ని పదేపదే మెచ్చుకున్నారు.
    కానీ ఈ చీరల వెనక, నగల వెనక, భోగం వెనక వున్న నిజం బయటపడడానికి, తనకి కావలసింది ఇది మాత్రమే కాదని తెలియటానికి ఎక్కువ కాలం పట్టలేదు శశికి.
    "నేను ఎవరినయినా పరిచయం చేస్తే ఒక్క నిముషం నిలబడి వెళ్ళిపోవాలి. తెలిసిందా?" రాజేంద్ర శశిబుగ్గలు నిమురుతూ.
    "ఊ."
    తనకి మాట్లాడటం. మాట్లాడించటం, నవ్వడం, నవ్వించడం ఇలాటివన్నీ తెలుసు ఇవన్నీ మరి?
    "వింటున్నావా డియర్ - ఇప్పుడు నీవు చాలా హుందాతనం నేర్చుకోవాలి-మీ ఊర్లో వీధిగుమ్మంలో నిల్చుని మాట్లాడినట్టు ఇక్కడ మాట్లాడకూడదు. ఏం - ఎప్పుడూ చక్కగా ముస్తాబయి అందంగా బొమ్మలా వుండాలి - మా వాళ్ళందరూ నన్ను చూసి అసూయపడిపోవాలి __"
    "అంటే షోరూమ్ లో డాల్ లాగ ఉండాలి" శశి తలెత్తి రాజేంద్ర ముఖంలోకి చూసింది.
    "ఇంచుమించుగా అంతే - అందరితో కబుర్లు చెప్పటం- ఇల్లెగిరిపోయేలా నవ్వడం నాకు ఇష్టం వుండదు.
    రాజేంద్ర సడన్ గా లేచి సిగరెట్టు వెలిగించాడు.
    "స్నేహితుల ఇళ్ళ కెళ్ళడం, సినిమాలకి ఒకర్తివీ వెళ్ళిపోటం లాటివి -" రాజేంద్ర మాట పూర్తిచెయ్యలేదు. "జరక్కూడదు, అవునా?" అంది శశి. రాజేంద్ర ఇంకా మాట్లాడుతూనే వున్నాడు.
    "ఎందరెందర్నో కాదని నిన్ను అడిగి మరీ చేసుకున్నాను- నిన్ను ఈ ఇంట్లో పూజిస్తాను."
    "ఈ నాలుగు గోడల జైల్లో పడేశా...." శశి నోటినుంచి అప్రయత్నంగా వచ్చేశాయి. వెంటనే నాలుక కరుచుకుంది.... ఏమనుకున్నాడో? అంతేకాదు- తల్లి చెప్పిన మాటలు మనసులో మారుమ్రోగాయి.
    'నీ అదృష్టంకొద్దీ అడిగి చేసుకుంటున్నారు. అతను ఎలా చెప్తే అలా విను. నీ వితండ వాదన. నీ ఆదర్శాలు, ప్రోగ్రసివ్ ఉమెన్ వ్యవహారాలు అన్నీ ఆ కాలేజి వదలినప్పుడే వదిలేశాననుకో. ఇప్పుడు నువ్వు ఐశ్వర్యవంతుని భార్యవి....' తల్లి ఏదో చెప్తోంది. శశి పకపక నవ్వి "నాన్ సెన్స్, నాకో వ్యక్తిత్వం వుందని మరిచిపోయి గంగిరెద్దులా తల వూపమంటున్నావా? నాకు చేతకాదు."
    శశి తల్లి చూపుకి వెంటనే తలొంచుకుంది. "సరే" అంది. అంతే - ఆ దృశ్యం కళ్ళలో కదలాడుతుంటే రాజేంద్రకేసి చూసింది శశి. మంచి నిద్రలో ఉన్నాడు. అంతే. శశి జీవితచక్రం గాడిలో పడింది.
    రాజేంద్ర బయటికి వెళ్ళినప్పుడు టై సరిచేయడం, కారు కదులుతుంటే బై అనటం, ఇంటికొచ్చే టైముకి చక్కగా అలంకరించుకు ఎదురుచూట్టం. ఇంతే.
    ఈ భవనం దాటాక మరొక ప్రపంచం వుందనిపించినప్పుడల్లా శశి గుండెలు బద్దలవుతాయి. కళ్ళలో నీళ్ళు ఎడతెగకుండా వర్షిస్తాయి.
    ఒక్కసారి చిన్ననాటి స్నేహితురాలింటికి రిక్షాలో వెళ్ళివస్తే?
    ఒక్కసారి చదువుకున్న కాలేజీకి వెళ్ళి అందరితో కబుర్లు చెప్పి వస్తే?
    ఒక్కసారి బజారుకు వెళ్ళి కూరలు కొనుక్కువస్తే!
    ఒక్కసారి స్నేహితులతో సినిమా కెళ్ళి వొళ్ళు మరిచి నవ్వుకుని కబుర్లు చెప్పుకువస్తే! వస్తే వస్తే! ఈ కోరిక లెప్పటికీ తీరవని శశికి తెలుసు. అయినా అవే కోరుకుంటోంది మనసు.
    గాడ్రెజ్ నిండావున్న రకరకాల చీరలని చూస్తే ఒక విధమైన విసుగు, అసహ్యం.
    జూయలరీ బాక్సు తెరవాలంటే అలర్జి - తను మనిషా, వస్తువా ఒక్కోసారి సమాధానం రాని ప్రశ్న మనసుని వేధిస్తుంది.
    అర్థరాత్రి గడిచిపోయాక నౌకరు ఎప్పుడు తలుపు తీస్తాడో, ఎప్పుడు బెడ్ రూమ్ లో రాజేంద్ర పడుకుంటాడో చాలాసార్లు తెలియకుండానే రాత్రులు గడచిపోతాయి శశికి.
                                                  *    *    *
    ఆ రోజు శశికి చాలా ఉడుకుమోతుతనం వచ్చింది. ఈ బంగారు కోట తనకొద్దు - కానీ, వదలుకోటం తేలికా కాదు! భోజనాలు చేస్తుంటే నిశ్శబ్దం - కోపం - విసుగు - ఈ పెద్ద భవనం ఈ ఇంట్లో ప్రతి వస్తువు నిర్జీవంగానే కనిపిస్తుంది శశికి.
    ఎక్కడివక్కడ మెరుస్తూ తీర్చిదిద్దినట్లే వుంటాయి. అయినా -
    "రాజు నీకు తెలుసా?" రాజేంద్ర ప్రశ్న పిడుగుపాటులా వినిపించింది.
    "ఆ - నా క్లాసుమేటు, చాలా తెలివైనవాడు. ఎన్నిసార్లో మేమిద్దరం పోటీలో పాల్గొనడం- నేనే గెలవటం." శశి ఒక్క సెకను ఆగింది. వెంటనే గుర్తొచ్చింది. రాజు క్లాసుమేటని చెప్పటమే అనవసరమేమో. పైగా ఇన్ని మాటలా __
    రాజేంద్ర అన్నాడు "అతను ఓ కంపెనీలో గుమాస్తాగా వున్నాడు. చాలా చురుకైనవాడని, తెలివైనవాడని నా ఫ్రెండు పరిచయం చేశాడు. వీలయితే మన కంపెనీలోకి తీసుకుందామని."
    శశికి ఓ నిముషం సంతోష మనిపించింది.
    "ఆ గుమాస్తాగా కన్నా ఇందులో నాలుగు డబ్బులు ఎక్కువొస్తే అతను, భార్య సుఖపడతారు."
    "ఊ" రాజేంద్ర టేబిలు దగ్గరనుంచి లేచాడు.
                                                 *    *    *  
    "ఆవిణ్ని మనింటికి రమ్మనలేకపోయారా?" అంది శారద పూలు కడుతూ గుమ్మంలో కూచుని.
    "ఇంకా నయం - ఆవిడ ఒక సెకను కనిపించి, నేనెవరో ఎరగనట్టే లోపలికెళ్ళిపోయింది. ఆవిడ ఇప్పుడు గొప్పింటి యిల్లాలు. ఆ యజమాని దగ్గర నౌకరీ కోసం వెడుతున్నవాడిని నేను." సిగరెట్టు ముట్టించాడు రాజు.
    "ఏమో బాబు - నా కవన్నీ తెలియవు." పూలచెండు తలలో తురుముకుంది శారద.
    ఆ రాత్రంతా ఆలోచించాడు రాజు. కొత్త ఉద్యోగం ఇస్తానంటే చేరాలా వద్దా అని.
    అయినా ఎంత గర్వమయినా తెలిసున్న మనిషిని పలకరించకుండా వెళ్ళిపోటం ఎంతో చిత్రంగా వుంది. గొప్పవాళ్ళే కావచ్చు. అయితే బంగారం తింటారా - అందగత్తెనని మొదట్నుంచీ బలే గర్వం శశికి - రాత్రంతా ఇలాగే ఆలోచనలో మునిగిపోయాడు రాజు.
    రాజేంద్ర కూడా ఇలాగే ఆలోచనలో ఆ రాత్రి మునిగిపోయాడు. ఇతన్నీ ఉద్యోగంలో తీసుకుంటే తను కావాలనుకున్న చురుకైన కుర్రాడు దొరికినట్టే. కానీ తను భార్య స్నేహితురాళ్ళు కలిస్తేనే ఇష్టపడడు - ఇప్పుడితను - ఈ ఉద్యోగం - సరే చూద్దాం తొందరేముంది - నిద్రలో అన్నీ మరిచిపోయాడు రాజేంద్ర.
    శశికి నిద్రే పట్టలేదు. తనని ఏమనుకుంటున్నాడో రాజు. తను గొప్ప ఐశ్వర్యవంతురాలని, గర్విష్టి అని. ఇలా ఏదో ఏదో అనుకుంటూ వుంటాడు. శశి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. గుండె గొంతుకలో కొట్లాడింది.
    "రాజూ - నేను బంగారు పంజరంలో వున్న బంగారు చిలకని. చిలకకి మాటలు నేర్పింది మాట్లాడిస్తాం. కానీ నేను వచ్చిన మాటలు కూడా మరిచిపోయాను. ఈ భవనం దేవేంద్ర భవనం - నేను అసూర్యం పశ్యని - నాకు లేనివి లేవు - అయినా పరమ దరిద్రురాలిని - ఆఖరికి మనసు కూడా పోగొట్టుకున్న బీదదాన్ని - అది ఎప్పుడో చచ్చిపోయింది - నేనొక వ్యక్తినని, నిన్ను అగౌరవపరచానని అనుకుంటున్నావేమో - నేను వ్యక్తిని కాదు. వస్తువుని - నాలో చైతన్యం, వ్యక్తిత్వం ఏమీ మిగల లేదు. అందుకే ఆ రోజు నీకో కప్పు టీ యిచ్చి-నీ భార్య గురించి, పిల్లల గురించీ ఏమీ మాట్లాడకపోయిన మరమనిషిని. నన్ను క్షమించమని నేను కోరటం లేదు."
    మనసంతా పోగుచేసి నాలుగు మాటలు కాగితం మీద రాసి మడిచింది. పరుపు కింద పడేసింది.
    అటు ఇటు ఒత్తగిల్లిన రాజేంద్ర లేచి సిగరెట్ ముట్టించాడు-
    "ఆ కుర్రాడికి ఉద్యోగం ఇద్దామా?"
    "మీ యిష్టం."
    "నీ యిష్టమేమిటని...."
    "ఇయ్యండి."
    "ఊ" - రాజేంద్ర మరో సిగరెట్టు ముట్టిస్తూ ఆ నిముషంలోనే నిర్ణయించుకున్నాడు- ఆ ఉద్యోగం మరొకరి కివ్వాలని.
    ఏడుగంట లయేసరికి వీధి గదిలో కూర్చున్న రాజుకి కాఫీ పంపింది శశి. ఎనిమిది దాటితేకాని రాజేంద్ర ఏనాడూ నిద్ర లేవడు. గుండె చిక్క బట్టుకుని ముంగు గదిలో కొచ్చింది శశి. రాజు పలకరిద్దామనుకొనే లోపలే మడిచిన కాగితం రాజు చేతిలో పెట్టి "ఇంటికెళ్ళి చదువు" అంటూ నిముషంలో లోపల కెళ్ళిపోయింది శశి.
    రాజేంద్ర గంట దాటింతర్వాత ముందుగదిలో కొచ్చాడు.
    "హలో! చాలా సేపయిందా? మీరు రేపు సాయంత్రం రండి మాట్లాడదాం." రాజు ముఖం వెలవెలపోయింది. సరేకానీ అనుకుంటూ నడిచాడు ముందుకు.
                                                 *    *    *
    ఇంట్లో అడుగుపెట్టడం ఆలస్యంగా కాగితం మడతలు విప్పాడు.
    పాపం, దీర్ఘంగా నిట్టూర్చాడు.
    "ఇదిగో - చూడు" శారద చేతికిచ్చాడు. కాగితం మడిచి కళ్ళొత్తు కుంటూ "బంగారు గోడల మధ్య వుండమంటే ఎవరుంటారు? నేనయితే ఒక్క నిముషం వుండలేను బాబూ!" పిల్లాడికి పాలసీసా నోటికందిస్తూ శారద అంటుంటే 'ఊ' అన్నాడు రాజు.
    సాయంత్రం అయిదు దాటింది. రాజేంద్ర ఇంటికి బయలుదేరాడు రాజు. మనసెందుకో ప్రశాంతంగా లేదు - ఈ కొత్త ఉద్యోగం ఎందుకో రాకపోతే బావుండుననిపించింది ఓ క్షణం. గబగబా రెండడుగులు వేశాడు. ఎత్తయిన భవనం ముందు ఆగాడు.
    కొందరి బతుకులు బంగారు బతుకులు - బాంక్ లాకర్లలో భద్రపరిచే వస్తువులు - అవి అంతే, అంతే - నిద్రించిన వెన్నెలలా శశి రూపం కళ్ళముందు కనిపిస్తుంటే అడుగులు ముందుకు వెయ్యలేక పోయాడు. రెండు నిముషాలు ఆ భవనం ముందు నిలబడి, గబగబా వెనక్కి నడిచి ఇల్లు చేరుకున్నాడు రాజు.*


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS