Previous Page Next Page 
మరణ మృదంగం పేజి 16


    "అంటేనా..... అంటే ఏమీ లేదు. బిల్హణ్, అంతే. అన్నట్టు 'అనూష' అంటే ఏమిటి?"

    "జానీ వున్నాడా?" ఆమె విసుగ్గా అడిగింది.

    "ప్రోద్దున్నించీ ఇప్పటికి పన్నెండుమంది అమ్మాయిలు ఫోన్ చేశారు అదృష్టవంతుడు."

    "కెన్ ఐ స్పీక్ టు జానీ ప్లీజ్".

    "పన్నెండు మందికీ లేడని చెప్పాను. కానీ, అనూష...... పేరు బావుంది. కొత్త అమ్మాయి కాబట్టి వున్నాడు. ఫోన్ ఇచ్చేస్తాను. కానీ అనూష అంటే అర్థం ఏమిటి? అది చెప్పు-"

    "నాకు తెలీదు. జానీని పిలుస్తారా, ఫోన్ పెట్టెయ్యనా".

    "చూసేవా నువ్వెంత అజ్ఞానంలో వున్నవో. కనీసం నీ పేరుకి అర్థం నీకే తెలీదు. నా పేరుకి అర్థం అడుగుతున్నావు! అనూనము అంటే  వెలితి లేనిది. ఉష  అంటే అనిరుద్ధుని భార్య- అపురూప సౌందర్యరాసి. ఈ రెంటినీ కలిపి నీకు పేరు  పెట్టవచ్చని ఎవరికి వచ్చిందో గానీ, ఆలోచన గొప్పది. పోతే నా పేరు సంగతి అడిగావు కదూ. బిల్హణుడు! మా అమ్మ పెళ్ళికాక ముందు మా నాన్నని తెగ ప్రేమించిందట. పాపం ఆ అమాయకుడు వీధి అరుగు గదిలో వుంటూ  కూడా ఎంతో కాలానికీ ఈ విషయం గ్రహించకపోవడంతో 'బిల్హణీయము' అనే పుస్తకం బహుమతిగా పంపిందట. మనసున్న అమ్మాయి వయసులో వున్న అబ్బాయికి బిల్హణీయం పంపితే...."

    అనూష ఫోన్ పెట్టేసింది. జానీయే కంఠం మార్చి అలా మాట్లాడుతున్నాడేమో అని అనుమానం వచ్చింది కానీ, రెండు నిమిషాల తరువాత జానీ దగ్గిర్నుంచి ఫోన్ వచ్చింది.

    "ఏమిటి పిల్చి ఫోన్ పెట్టేసావుట......"

    "అవును. రాంగ్ నెంబర్- పిచ్చాసుపత్రికి వెళ్ళింది".

    జానీ నవ్వాడు. "నా అసిస్టెంట్ మానేజర్ ..... బిల్హణుడు".

    "పేరు కరక్టేనన్నమాట".

    "కరక్టే. ఎందుకు పిల్చావు?"

    అనూషకి ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. ఫోనయితే చేసింది కానీ, అతడలా అడిగేసరికి ఏదో ఇబ్బందైన భావం కలిగింది. కొంచెం కూడగట్టుకుని, 'షల్ వియ్ హావ్ డిన్నర్' అని అడిగింది తటపటాయిస్తూ.

    "అయిదు నిమిషాల్లో అక్కడవుంటాను. ఇంటి నుంచేగా".

    ఆమె తొందరగా, అదేమిటి? ఇప్పుడు నాలుగున్నరేగా అయింది. నేను చెప్పింది రాత్రి డిన్నర్ సంగతి-"

    "అయిదు నిముషాల్లో వస్తున్నాను" క్లుప్తంగా అని పెట్టేసాడు. సరీగ్గా అయిదు నిముషాల తరువాత ద్వారం దగ్గిర బెల్ మ్రోగింది. అతడు లోపలికి వస్తూ "వాతావరణం వూహించిన దానికన్నా తొందరగా వేడెక్కినట్టుందే....." అన్నాడు.

    "నేను పిల్చింది- రాత్రి- బయట హొటల్లో......"

    "కటిట్- మళ్ళీ ఏదో సమస్యలో పడ్డావ్. లేకపోతే- అప్పుడే గుడ్ బై చెప్పిన దానివి మళ్ళీ ఎందుకు పిలుస్తావ్?"

    ఆమె హర్ట్ అయింది. కానీ, అంతలో ఆమెకు బిల్హణుడిమాటలు గుర్తొచ్చినయ్!

    ఎక్కువైన అమ్మాయిలు ఇతడికి స్త్రీ మీద  గౌరవాన్ని తగ్గించి వుండవచ్చు.

    "నాకేం సమస్యలు లేవు. సాయంత్రం ఖాళీగా వున్నాను. అందుకని, నువ్వు చేసిన సాయానికి డిన్నర్ ఇద్దామనుకున్నాను" అంది ఏకవచనంలో సంబోధిస్తూ.

    "మళ్ళీ ఆత్మవంచన! అలాటి ఉద్దేశమే వున్నట్టయితే ఆ రోజే పిల్చేదానివి. ఇంతకాలం అగే దానివి కాదు..... ఈ రోజు మళ్ళీ ఏదో జరిగింది ....... ఏమిటది? వసంత్ దాదా ఏం చేసాడు?

    "వసంత్ లేడు. దాదా లేడు- పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనపడుతుందట" అంది.

    జానీ నవ్వి "కాదు బేబీ......" అన్నాడు. "నన్నునువ్వు సరిగ్గా  అర్థం చేసుకోవడం  లేదు. మనుష్యుల్ని చూడగానే  వాళ్ళ మనస్తత్వాన్ని కాస్తైనా అంచనా వేయగలననే నమ్మకం నాకుంది. అమ్మాయిల విషయంలో మరింత ఎక్కువగా! ఒకసారి పరిచయం కాగానే ఏదో ఒక మిష మీద మళ్ళీ కలుసుకుని ఆ పరిచయాన్ని పెంచుకునే 'టైపు' స్త్రీని కావు నువ్వు అని చూడగానే అనుకున్నాను. అసలు నీ లోకమే వేరు..... ఒకవేళ నీకేగానీ నాతో స్నేహం పెంచుకోవాలనివుంటే, 'ఇదిగో నాకిలా అనిపిస్తోంది. నీ కిష్టమేనా-' అని డైరక్టుగా అడుగుతావని నా వుద్దేశం. అలా అడగ్గాలిగేవాళ్ళు నూటికో కోటికో ఒకరుంటారు. వాళ్ళని లోకం బరితెగించిన వాళ్ళుగా ముద్రవేస్తుంది. అదృష్టవశాత్తు నీకలాంటి సమస్యల్లేవనుకో. కారణం నువ్వొక స్త్రీవన్న విషయం మర్చిపోయి చాలా కాలమయింది కాబట్టి!!! మనసుకొక దానికే నువ్వు జవాబుదారి అనుకునే దానివి-"

    "థాంక్స్ కాని నేను నిన్ను పిల్చింది నా మానసిక విశ్లేషణ వివరిస్తావని కాదు" ఆమె కంఠంలో రవ్వంత ఎగతాళి ధ్వనించింది. పైకి అలా అన్నదేగానీ మనసులో అతడి వివరణకి విస్మయం చెందింది. అతడు చెప్పింది నిజమే. మొదటిసారి కలుసుకున్నప్పుటి నుంచి ఇప్పటి వరకూ ఒకసారి కూడా అతడు  గుర్తు రాలేదు. కానీ, ఈ మూడ్  లేని సాయంత్రం గుర్తొచ్చిన మొట్టమొదటి వ్యక్తి అతడే. అలా అనుకోగానే, తను ఒంటరి స్త్రీ అనీ, అతడిని అలా ఆహ్వానించకూడదనీ మర్చిపోయి పిల్చేసింది. వ్యాపార సంబంధమైన విషయాల్లో ఇచ్చే పార్టీలు వేరు ...... ముక్కూ మొహం తెలియకుండా ఇలా ఆహ్వానించినందుకు, ఇంకో వ్యక్తి అయితే దీన్ని తప్పకుండా మరో అర్థంలో తీసుకునేవాడు.

    ఇలా ఆలోచించగానే ఆమెకి అతడిపట్ల గౌరవం కలిగింది. నువ్వు చెప్పింది నిజమే జానీ. ఈ రోజు నా మూడ్ బాగోలేదు. ఏం చెయ్యాలో తోచలేదు. ఇంకోలా అనుకోకు-" అంది.

    "ఏం జరిగింది అసలు-"

    అనూష అతడికి జరిగిందంతా చెప్పి "ఇంత నిర్లక్ష్యంగా నేనెలా ప్రవర్తించానో అర్థం కావడంలేదు" అంది.

    అతడు ఆలోచనలోపడి, చివరికి- "అది నీ సంతకమేనా?" అని అడిగాడు.

    "ముందు నాకూ ఇదే అనుమానం వచ్చింది. కానీ, ఆ కాగితం మొత్తం  నేను  చదివిందే. ఆ సంతకం కూడా నాదే. కానీ, ఈ ఇండియన్ ఫాస్పేట్ కంపెనీ  విషయం మాత్రం నాకెందుకు తోచలేదో అర్థం కావడంలేదు".

    అతడు కుర్చీలోంచి లేచి పచార్లు చేస్తూ ఏదో గుర్తొచ్చిన వాడిలా ఆగి, "నేనొకసారి ఆ కాగితాన్ని చూడాలి" అన్నాడు.

    ఆమె అర్థం కానట్టు "ఎందుకు" అని అడిగింది.

    "చెప్తాను. మీ ఆఫీసుకు వెళ్దాంపద-"

    "ఇప్పుడా..... ఆఫీసు కట్టేసివుంటారు".

    అతడు విసుగ్గా "నువ్వు జనరల్ మానేజర్ వి. నిన్ను చూసి వాచ్ మన్ అడ్డుపెడతాడా?" అని అడిగాడు. ఆమె నవ్వి "పద వెళ్దాం" అంది.

    ఈ సారి అతడు కారు డ్రైవ్ చేయసాగాడు. ఆమెకు కారు ఫాస్ట్ గా డ్రైవ్ చేయడం అలవాటు. ప్రతిరోజూ ఇంటినుంచి ఆఫీసుకి ఎంతసేపు పడుతుందా అని చూడడం హాబి. నాలుగు నిమిషాల ఇరవై సెకన్ల వరకూ వచ్చిఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా అంతకన్నా తక్కువ సాధ్యం కాలేదు. కానీ ఇతడు కేవలం  మూడున్నర నిమిషాల్లో తీసువెళ్ళడం ఆమెకి అత్యంత ఆశ్చర్యాన్ని కలుగజేసింది. అంతకన్నా ఎక్కువ ఏమిటంటే పక్కనున్న వారికి ఏ మాత్రం టెన్షను కలుగలేదు. బ్రేకుల కీచు చప్పుడు లేదు...... మనిషి మనస్తత్వం తెలుసుకోవటానికి డ్రైవింగ్ చూస్తే చాలు. బ్రేకు మీద కాలు వేయకుండా డ్రైవ్ చేసేవాడు సాధారణంగా అవతలివాళ్ళని క్షణాల్లో అంచనా వేయగలిగే వాడై  వుంటాడు. యాధాలాపంగా డ్రైవ్ చేస్తూ అంత తొందరంగా తీసుకువెళ్ళడం అతడి మెదడులోని కంపార్టుమెంటలిజాన్ని సూచిస్తుంది.

    ఆమెకి మొదటిసారిగా అతడిపట్ల తను ముందు అనుకున్న అంచనా తప్పేమో అనిపించింది.

    "ఏం చదువుకున్నావ్ నువ్వు ? అని అడిగింది.

    "ఎస్సెల్సీ- మూడుసార్లు ఫెయిల్ అయ్యాను".

    "నిజం చెప్పు".

    "నిజమే. కావలిస్తే మా బిల్హణుడిని అడుగు". ఆమె మరి మాట్లాడలేదు.

    ఇద్దరూ ఆఫీసు చేరుకున్నారు. తను క్రిందే వుంటాసన్నాడు అతడు. ఆమె  వెళ్ళి ఫైలు తీసుకొచ్చింది. ఇద్దరూ ఇంటికొచ్చాక అతడు ఒక్కొక్క కాగితాన్ని పరీక్షగా చూశాడు.

    పది పేజీల రిపోర్టు అది!

    దాదాపు డెబ్బై కంపెనీల షేర్ల వివరాలు - ఒక్కొక్క పేజీలో ఏడు కంపెనీల చొప్పున నీట్ గా టైపు చేసివుంది. ఆ షేర్లు కొనటం వల్ల రాబోయే లాభాలు నష్టాలు వివరంగా వున్నాయి.

    రిపోర్టు కాపీలు మొత్తం మూడు వున్నాయి. అతడు తలెత్తి- "ఇలాంటి రిపోర్టులు ఎన్ని టైప్ చేస్తారు?" అని అడిగాడు. "నాలుగు"

    "మరి నాలుగోది ఏది?"

    "ఆఫీసు కాపీ అది. ఆఫీస్ అసిస్టెంట్ దగ్గిర వుంటుంది".

    "నాలుగు కాపీలు తీస్తే చివరి మూడూ కార్బన్ కాపీలయివుండాలి కదా!"

    "మాది అధునాతనమైన పరికరాలున్న కంపెనీ. ప్రతి కాపీ మొదటిదానిలాగే వుంటుంది".

    అతడు చేతిలో కాగితాలు బల్లమీద  పడేస్తూ "ఇక్కడే మోసపోయావు నువ్వు" అన్నాడు.

    "ఎలా" అంది అర్థం కానట్టు.

    "సాధారణంగా మొదటి కాపీ చదివి మిగతావాటి మీద సంతకం చేస్తాం. ఆ ఆఫీసు కాపీ అన్నిటికన్నా పెట్టి వుంటారు. దాంట్లో అసలు ఇండియన్ ఫాస్పేట్ కంపెనీ షేర్ల తాలూకు  వివరాలు వుండి వుండవు. అది మూడో పేజీ! అంటే..... మొదటి కాపీలో మాత్రం మూడో పేజీ ఒక రకంగా  వుండి వుంటుంది. మిగతా కాపీల్లో మరో రకంగా వుండి వుంటుంది. నువ్వు పై కాపీ చదివి, మిగతావి కూడా సంతకం పెట్టేసి వుంటావు" అన్నాడు.

    అనూష దిగ్భ్రాంతితో అతడివైపు చూసింది. నిజమే. తనకా ఆలోచనరాలేదు.

    "నేను వెంటనే ఆ కాపీ తెప్పిస్తాను" అంది.

    "బహుశా ఆఫీసు ఫైళ్ళలో ఆ కాపీ దొరకదు. ఈ పాటికే అది అదృశ్యమైపోయి వుంటుంది. లేదా-  అవతలి వాడు మరింత తెలివైన వాడయితే, నీ ముందు నాలుగు బదులు అయిదు కాపీలు పెట్టివుంటాడు. ప్రతిపేజీ సంతకం పెట్టాలి కాబట్టి, నువ్వు అది గమనించి వుండవు".

    అనూష మొహం ఎర్రబడింది. స్టాక్  హొంలో చాలా పనులు నమ్మకం మీద జరుగుతాయి. ఏది ఏమైనా తాను పప్పులో కాలువేసింది. చాలా తెలివిగా ఇందులో తనని ఇరికించారు.

    "ఇదంతా ఆ రామలింగేశ్వరరావు పనే! ఇప్పుడూ పోలీసులకి ఫోన్ చేస్తాను".

    "నీకు చాలా అపురూపమైన తెలివి తేటలున్నట్టు నాకు ఒకసారి చెప్పినట్లు జ్ఞాపకం, కానీ నాకనిపిస్తున్నదేమిటంటే నీకు ప్రస్తుతం ప్రపంచంలో జరిగే వ్యవహారాలపట్ల అసలు జ్ఞానం లేనట్టుంది. వాడి పేరు ఏమన్నావ్? రామలింగేశ్వరరావు కదూ. వాడి మీద ఏమని  కంప్లెయింటు ఇస్తావు? తనకేమీ తెలీదని వాడంటే నువ్వేం చెయ్యగలవు? నీకేం సాక్ష్యం వుంది?"

    "పోలీసులు వాడిచేత  నిజం కక్కిస్తారు".

    జానీ మళ్ళీనవ్వేడు. ఆ నవ్వుకి అర్థం తెలిసి ఆమె మరింత ఇరిటేట్ అయి, "ప్రతి మనిషికీ బలమైన అంతరాత్మ వుండే మాట నిజమే. కానీ, తప్పు చేసినప్పుడు అది బలహీనమవుతుంది. రామలింగేశ్వర్రావు లాంటి వాళ్ళని అలాంటి ఇరకాట స్థితిలో పడేస్తే తప్పక తప్పుఒప్పుకుంటారు" అంది.

    "మొత్తం మన న్యాయ వ్యవస్థకే ప్రశ్న ఇది. బహుశ నువ్వు అన్నట్టు విపరీతమైన వత్తిడి పోలీసుల మీద తీసుకువచ్చి, వారిచేత రామలింగేశ్వర్రావు చేత  నిజం చెప్పించేట్టు స్టేట్ మెంట్  రికార్డు చేసావనుకో. ఎప్పుడో అర్నెల్లకి  ఈ కేసు  కోర్టుకెళుతుంది. అక్కడ డిఫెన్స్ లాయరు దీన్ని ఏముక్కకి ఆ ముక్కగా విడగొట్టేస్తాడు. కో- ఎర్షన్ క్రింద ఈ స్టేట్ మెంట్ తీసుకున్నట్టు నిరూపిస్తాడు. దాంతో అది ఆఖరు. ఈ ప్రపంచంలో- ముఖ్యంగా మన దేశపు వ్యవస్థలో నేరం చేయడం- నేరం  నిరూపించబడటం- నేరం ఒప్పుకోవడం- దానికి శిక్ష పడటం- నాలుగూ నాలుగు వేర్వేరు అంశాలు". 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS